బాండ్ల ద్వారా తెచ్చిన అప్పు ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్‌కు జమ.. అయ్యయ్యో జగనన్న
posted on Oct 13, 2021 @ 10:55AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సెక్యూరిటీ బాండ్ల వేలంతో ఏపీ ప్రభుత్వం తెచ్చిన రూ. 2వేల కోట్ల అప్పును ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్‌కు జమచేసుకుంది. ఇప్పటికే ఓడీ ఉండడంతో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అప్పును రిజర్వు బ్యాంక్ వెంటనే జమ చేసుకుంది.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జగన్ ప్రభుత్వం.. వరుసగా అప్పులు చేసుకుంటూ పోతోంది, ఎన్ని అప్పులు తెచ్చినా... ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సకాలంలో అందడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పులు తీసుకువస్తే ప్రస్తుత గండం గడుస్తుందని ప్రభుత్వం భావించింది. అధిక వడ్డీకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర మంగళవారం సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 7.14 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు 20 ఏళ్లలో చెల్లించే విధంగా అప్పు చేసింది. మరో రూ. వెయ్యి కోట్లు 7.13 శాతం వడ్డీకి 15 ఏళ్లలో చెల్లించే విధంగా రుణం సేకరణ చేపట్టింది.
బాండ్ల వేలం ద్వారా సేకరించిన రూ.2వేల కోట్లతో మిగిలిన తమ పెన్షన్లు, వేతనాలు వస్తాయని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించారు. కాని తెచ్చిన అప్పుల్ని కాస్త ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్‌కు జమ చేసుకుంది. ఆర్బీఐ. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఒక్క నెలలోనే 90 శాతం అదనపు పరిమితిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా అనుమతించిన రూ.10,500 కోట్లలో.. ఇప్పటికే రూ.8వేల కోట్లు బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం సేకరించింది. వచ్చే వారంతో కేంద్రం అనుమతించిన అదనపు పరిమితి నిధులు మొత్తం వ్యయం అయ్యే అవకాశముంది. అయితే మంగళవారం కేంద్రం నుంచి రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ. 17వందల కోట్లు వచ్చాయి. వచ్చిన మొత్తాన్ని జీతాలు, పెన్షన్లు ఇచ్చే అవకాశముంది.