మంచుకు మెగా పంచ్.. సజ్జలకు ఉద్యోగుల వార్నింగ్.. టాప్ న్యూస్ @ 7pm
posted on Oct 12, 2021 @ 7:08PM
1. ‘‘మా’’ లో ముసలం ముదిరింది. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి కారణాలు వివరించారు ప్రకాశ్‌రాజ్. ‘‘మా ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయి. బెనర్జీపై చేయి చేసుకున్నారు. పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు చాలా బాధ కలిగించాయి. అందుకే రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై అందరం కూర్చుని చర్చించాం. ‘మా’ ఎన్నికలలో గెలిచిన విష్ణుకి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు మా ప్యానల్‌లో గెలిచిన వారందరం రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. విష్ణు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.
2. మోహన్‌బాబు తనని అందరి ముందు దారుణంగా బూతులు తిట్టటం బాధ కలిగించిందని నటుడు బెనర్జీ కంటతడి పెట్టారు. మంచు కుటుంబంతో తనకు ఎన్నో దశాబ్దాల అనుబంధం ఉందని.. అటువంటి తనని మోహన్‌బాబు తీవ్రమైన పదజాలంతో దూషించటం తీవ్రంగా బాధించిందని బెనర్జీ మీడియా ముందు కంటతడి పెట్టారు. మా ఎన్నికల రోజు మంచు విష్ణు, మంచు మనోజ్ లేకుంటే.. మోహన్‌బాబు చేష్టలకు తమ మధ్య పెద్ద గొడవే జరిగేదన్నారు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు.
3. పిల్లలకు 'కొవాగ్జిన్' టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. 2 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో పిల్లలపై రెండు, మూడు దశల్లో ప్రయోగాలు చేసి.. ఆ వివరాలను భారత్ బయోటిక్ సంస్థ డీసీజీఐకి తెలియజేస్తూ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. సమాచారం పరిశీలించిన డీసీజీఐ.. పిల్లలకు కొవాగ్జిన్ వేసేందుకు అనుమతి ఇచ్చింది.
4. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు.. తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోసేవా, నవనీత సేవలపై సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు అధికారులు.
5. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. అనంతరం భేటీ వివరాలను ఏపీజేఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు తెలిపారు. ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటోన్న సమస్యలను సజ్జల దృష్టికి తెచ్చాం. దసరా కానుకగా ప్రభుత్వం పీఆర్సీ ఇస్తుందని ఆశిస్తున్నాం. 12వ తేదీ వచ్చినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు రావడం లేదు. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బులు రావడం లేదు. ప్రతి నెలా ఒకటవ తారీఖున వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాం.. అని బండి శ్రీనివాసులు అన్నారు.
6. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తున్నట్టు కేఆర్ఎంబీ ప్రకటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్టు తెలిపింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇందుకు తెలుగురాష్ట్రాలు సహకరించాలని కేఆర్ఎంబీ విజ్ఞప్తి చేసింది.
7. ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 7.14 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు 20 ఏళ్లలో చెల్లించే విధంగా అప్పు చేసింది. మరో రూ. వెయ్యి కోట్లు 7.13 శాతం వడ్డీకి 15 ఏళ్లలో చెల్లించే విధంగా రుణం సేకరణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా అనుమతించిన రూ.10,500 కోట్లలో.. ఇప్పటికే రూ.8వేల కోట్లు బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం సేకరించింది. వచ్చే వారంతో కేంద్రం అనుమతించిన అదనపు పరిమితి నిధులు మొత్తం వ్యయం అయ్యే అవకాశముంది. బాండ్ల వేలం ద్వారా సేకరించిన రూ.2వేల కోట్లతో మిగిలిన తమ పెన్షన్లు, వేతనాలు వస్తాయని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు.
8. ఎంపీ విజయసాయిరెడ్డిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని రఘురామ కృష్ణరాజు అన్నారు. విజయసాయి సేవలను ఢిల్లీలో ఉపయోగించుకునేందుకే.. ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను, విజయసాయి కలిసి ఢిల్లీలో పని చేస్తామని రఘురామ తెలిపారు. జగనన్న ట్రూ చార్జ్‌తో ప్రజలకు కష్టాలు వస్తే.. ఇప్పుడు జగనన్న కరెంట్ కోత పేరుతో కొత్త పథకం అమలు మొదలైందంటూ దుయ్యబట్టారు ఎంపీ రఘురామ.
9. హెటిరోలో తవ్విన కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. 16 లాకర్లను ఐటీ అధికారులు ఓపెన్ చేసి.. భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క లాకర్‌లో రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల నగదు ఉంది. లాకర్లలోని రూ.30 కోట్ల క్యాష్‌ను ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే రూ.142 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.550 కోట్ల అనుమానిత లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. 20లోపు తమ ఎదుట హాజరవ్వాలని హెటిరో యాజమాన్యానికి ఐటీ నోటీసులు జారీ చేసింది.
10. మానవ హక్కులను నచ్చినట్లుగా వివరిస్తున్నవారిపై ప్రధాని మోదీ మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను రాజకీయ లాభ, నష్టాల దృష్టితో చూసే వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. వీరి వైఖరి మానవ హక్కులకు మాత్రమే కాకుండా దేశానికి కూడా హానికరమన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా మోదీ మాట్లాడారు.