వైఎస్ దగ్గర కేసీఆర్ గులాంగిరీ! రేవంత్ రెడ్డి కామెంట్లతో రచ్చ..
posted on Oct 12, 2021 @ 8:59PM
కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళిత గిరిజన దండోరా సభలతో హోరెత్తించిన రేవంత్.. నిరుద్యోగ సమస్యలపై జంగ్ సైరన్ మోగిస్తున్నారు. విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. పాలమూరు గడ్డపై నిరుద్యోగ విద్యార్థి జంగ్ సైరన్ మోగించామన్న రేవంత్.. కాంగ్రెస్ సభను చూసి టీఆర్‌ఎస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు.
పాలమూరు వలస బిడ్డల గురించి ఏనాడు పార్లమెంట్‌లో కేసీఆర్ మాట్లాడలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు బిడ్డలు వలస కూలీలుగానే బతకాల్సిందేనా అని ప్రశ్నించారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయినా వైఎస్ దగ్గర కేసీఆర్ గులాంగిరీ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమం ముసుగులో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ విస్తరించుకున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రజలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. సురవరం ప్రతాపరెడ్డి.. బూర్గుల రామకృష్ణారావు.. జైపాల్ రెడ్డి లాంటి అతిరథ మహారథులు పుట్టిన గడ్డ మన పాలమూరు అని రేవంత్ పేర్కొన్నారు. ఇప్పటి పాలమూర్ టీఆరెఎస్ ఎమ్మెల్యేలు.. మన పాలమూరు పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఊసే లేదన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పారు. కొందరు పోలీసులు టీఆర్ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.