జగన్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ.. ఉద్యోగుల వార్నింగుతో గడబిడ..
posted on Oct 12, 2021 @ 7:41PM
ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ కు అన్ని షాకులే తగులుతున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడంతో ఏ పని చేయలేని పరిస్థితి ఉంది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా మరమత్తులు చేయడం లేదు. ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదు. పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్ని ఉండగానే కొత్తగా కరెంట్ సంక్షోభం వైసీపీ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. కరెంట్ కొరతతో రెండు, మూడు రోజుల్లో ఏపీలో కోతలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా జగన్ సర్కార్ కు మరో గండం ముంచుకొస్తోంది. ఉద్యోగ సంఘాలు డెడ్ లైన్ విధించాయి. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు, సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ సహా వివిధ అంశాలపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సమస్యలపై రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని సజ్జల హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేయాలని సంఘాలు కోరారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
దసరా కానుకగా పీఆర్‌సీ ఇస్తారని ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాలు తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఆందోళనకు దిగడం తప్ప మరో మార్గం లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణతో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. అయితే సజ్జలతో సమావేశంలో సానుకూల ఫలితం రాకపోవడం వల్లే వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వేతనాలు ఎప్పుడో వస్తాయో తెలియని పరిస్థితి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీఆర్సీ సహా ఇతర సమస్యల పరిష్కారానికి ఎన్నో రోజులుగా పోరాడుతున్న ఫలితం రావడం లేదు. దీంతోనే ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.