మంత్రి గంగులకు కొవిడ్.. హుజురాబాద్ లో టెన్షన్
posted on Oct 12, 2021 @ 10:27PM
తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గినట్లు కనిపిస్తున్నా కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు కరీంనగర్ జిల్లాలో కేసులు వస్తూనే ఉన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక జరగనుండటంతో అక్కడ వైరస్ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్నట్లే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ కు కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది. రెండు ,మూడు రోజులుగా గంగుల జ్వరం, జలుబుతో బాధ పడుతున్నారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలో ఆయన కొవిడ్ నిర్దారణ అయింది.
తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని మంత్రి గంగుల కమలాకర్ ట్వీట్ చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. కొన్ని రోజులుగా తనతో టచ్ లో ఉన్న వాళ్లంతా కొవిడ్ టెస్టు చేయించుకోవాలని గంగుల సూచించారు. గంగుల కమలాకర్ గత రెండు నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు. మంత్రి హరీష్ రావుతో పాటు గంగులకు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించడంతో.. ఆయన వరుసగా సభలు. ర్యాలీలు తీశారు. గంగుల డైరెక్షన్ లోనే టీఆర్ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాియి. ఇప్పుడు గంగులకు కొవిడ్ సోకడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఆందోశన నెలకొంది. ఎన్నికల ప్రచారంలోభాగంగా గంగులతో కలిసి తిరిగిన నేతలు, కార్యకర్తలంతా కలవరపడుతున్నారు.
మరోవైపు తెలంగాణలో గడచిన 24 గంటలలో 44,310 కరోనా పరీక్షలు నిర్వహించగా, 196 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 59 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 15, నల్గొండ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, మెదక్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.201 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,266 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,60,143 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,190 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,933కి పెరిగింది.