మోడీ వేస్ట్.. మమత గ్రేట్! బీజేపీ ఎంపీ సంచలనం..
posted on Nov 25, 2021 @ 2:44PM
ఆయన బీజేపీ ఎంపీ. కాని రాజకీయ అంశాల్లో తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తుంటారు. విపక్షాలను పొగుడుతుంటారు. కొన్నిసార్లు విపక్షాలను ఏకి పారేస్తారు. ఏ విషయంలోనైనా ఆయన రియాక్షన్ మిగితా వాళ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇప్పటిదాకా చెబుతున్న ఆ నేత ఎవరో కనుక్కున్నారా.. ఆయన ఎవరో కాదు.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి.
వివాదాస్పద, సంచలన ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలిచే సుబ్రమణ్యస్యామి తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీఅయి ఉండి ఈసారి ఆయన ఏకేంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే టార్గెట్ చేశారు. మోదీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇది, అది అని కాదని, అన్నింటిలోనూ మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సుబ్రమణ్యస్వామి. ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, విదేశీ వ్యవహారాలు, అంతర్గత భద్రత వంటి విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందన్న సుబ్రహ్మణ్యస్వామి.. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును ‘అపజయం’గా అభివర్ణించారు. పెగాసస్ డేటా భద్రతా ఉల్లంఘన విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసిన తర్వాతి రోజే సుబ్రమణ్యస్వామి.. ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అంతేకాదు మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించారు. ఆమెను జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు వంటి రాజకీయ దిగ్గజాలతో పోల్చారు. ఆమె చెప్పిందే చేస్తారని, చేసేదే చెబుతారంటూ పొగడ్తలు కురిపించారు. రాజకీయాల్లో ఇలాంటి గుణం చాలా అరుదని మమతను కీర్తించారు బీజేపీ ఎంపీ.
సుబ్రహ్మణ్యస్వామి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘మన అణ్వాయుధానికి చైనా భయపడకపోతే, వారి అణ్వాయుధానికి మనం ఎందుకు భయపడుతున్నాం?’’ అంటూ ఈ నెల 23న ట్వీట్ చేశారు. అంతకుముందు ధరల పెరుగుదలపై ఓ ట్విట్టర్ యూజర్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రధానికి ఆర్థికశాస్త్రం తెలియదని అన్నారు. మోదీ ప్రభుత్వం పట్టనట్టుగా ఉందని, విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత విషయంలో భారతదేశ పరిస్థితి ఏమంత బాగోలేదన్నారు. చైనా మన భూభాగాన్ని దోచుకుంటున్నప్పుడు ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. భారతమాతను అణగదొక్కిన ఈ వ్యక్తులు చైనాను దురాక్రమణదారు అని పిలవడానికి ఇష్టపడడం లేదని సుబ్రమణ్య స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ తో మాకేం సంబంధం.. కొడాలి నాని హాట్ కామెంట్స్
తాజాగా తమకు కొరకరాని కొయ్యగా మారిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గ్రేట్ అంటూ.. ప్రధాని నరేంద్రమోడీ వేస్ట్ అనే అర్ధం వచ్చేలా సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీలో కాక రేపుతున్నాయి. స్వామి తీరుపై కొందరు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. అయితే స్వామిపై యాక్షన్ తీసుకునే చర్యలు మాత్రం ఉండకపోవచ్చని, అలాంటి సాహసం బీజేపీ చేయకపోవచ్చనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.