ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు.. ఉండదూ! మోడీ విధానాలపై కేసీఆర్ నిప్పులు.. 

యాసంగిలో ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోరు తెరిస్తే కేంద్ర ప్ర‌భుత్వం ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతోంద‌న్నారు. ఇంత దిగ‌జారిన, నీచ‌మైన‌టువంటి కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని ఎన్న‌డూ చూడ‌లేద‌ని.. భ‌విష్య‌త్తులో చూస్తామ‌ని కూడా అనుకోవ‌డం లేద‌న్నారు కేసీఆర్.   కేంద్ర ప్ర‌భుత్వం ఎఫ్‌సీఐ కోసం ఆహార సేక‌ర‌ణ చేస్తే.. రాష్ట్రాలు త‌మ బాధ్య‌త‌గా ధాన్యాన్ని సేక‌రించి వాటికి అప్ప‌గిస్తాయన్నారు కేసీఆర్. ఇది జ‌న‌ర‌ల్‌గా దేశ‌వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా జ‌రిగే తంతు అన్నారు. మ‌న దేశంలో తినేది ఎక్కువ‌గా అన్నం లేదంటే రొట్టె కాబ‌ట్టి ఎఫ్‌సీఐ వరి, గోధుమలనే సేక‌రిస్తుందని చెప్పారు. వీటిలో పెద్ద రాద్దాంతం సృష్టించి బీజేపీ సర్కార్ గంద‌ర‌గోళం చేస్తోందన్నారు. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ క‌లిగి ఉండి.. 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం.. ఒక చిల్ల‌ర కొట్టు వ్య‌క్తిలా మాట్లాడ‌కూడ‌దని కేసీఆర్ అన్నారు. కిరాణ షాపు వాళ్ల‌లా మాట్లాడ‌కూడ‌ని చెప్పారు. ప్ర‌తి విష‌యంలో లాభ‌న‌ష్టాలు బేరీజు వేసుకొని మాట్లాడితే ప్ర‌భుత్వం ఎలా అవుతుందని కేసీఆర్ ప్రశ్నించారు.  ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ అనేది దేశంలో సోష‌ల్ రెస్పాన్సిబిలిటీగా ఉందన్నారు.  దేశ‌ ఆహార భ‌ద్ర‌త కూడా సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. దాని నిర్వ‌హ‌ణ‌లో కేంద్ర ప్ర‌భుత్వానికి ఎప్పుడో ఒక‌సారి నిల్వ‌లు పెరిగితే దానికి ఆల్ట‌ర్నేట్ ఆలోచించే శ‌క్తి కూడా కేంద్రానికే ఉంటుందని తెలిపారు. ఆ ప్రాసెస్‌లో 30 వేల కోట్లో.. 40 వేల కోట్లో.. 50 వేల కోట్లో.. పోనీ ల‌క్ష కోట్లో న‌ష్టం వ‌స్తే కేంద్రం భ‌రించాల్సి ఉంటుందన్నారు కేసీఆర్. ఆ బాధ్య‌త నుంచి మోడీ సర్కార్ త‌ప్పుకుంటూ.. నెపాల‌ను చాలా దిక్కుమాలిన త‌నంగా ఘోరంగా రాష్ట్రాల మీద నెట్టేటువంటి ద‌రిద్ర‌పు ప్ర‌య‌త్నం జ‌రుగుతోందని విమర్శించారు.  ఇంత నీచ‌మైన‌టువంటి కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదన్నారు కేసీఆర్. భ‌విష్య‌త్తులో చూస్తామ‌ని కూడా  అనుకోవ‌డం లేదన్నారు. ఇంత దిగ‌జారిన ప్ర‌భుత్వాన్ని ఎన్న‌డూ చూడ‌లేదు. నోరు తెరిస్తే ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు అంటూ కేంద్ర ప్ర‌భుత్వం విధానాల‌ను సీఎం కేసీఆర్ ఎండ‌గ‌ట్టారు. దేశంలో ఆహార ధాన్యాల‌ను సేక‌రించ‌డం.. సేక‌రించిన ధాన్యాన్ని ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ ద్వారా పేద‌ల‌కు అందించ‌డం.. అలాగే దేశ ఆహార భ‌ద్ర‌త కోసం బ‌ఫ‌ర్ స్టాక్స్ నిలువ చేయ‌డం.. ఈ బాధ్య‌త అనేక సంవ‌త్స‌రాల నుంచి జ‌రుగుతోందన్నారు కేసీఆర్. సేక‌రించిన ధాన్యంలో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి ఆహార కొర‌త ఏర్ప‌డ‌కుండా.. ఆహార ర‌క్ష‌ణ కోసం ఫుడ్ సెక్యూరిటీ కోసం బ‌ఫ‌ర్ స్టాక్స్‌ను మెయిన్‌టెన్ చేస్తాయి. ఆ త‌ర్వాత‌ ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు ఆహార ధాన్యాల‌ను అందించి నిరుపేద‌ల‌కు అందించ‌డం జరుగుతుందన్నారు. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగ బ‌ద్ధంగా కేంద్రం మీద ఉన్న బాధ్య‌త అన్నారు కేసీఆర్. ఇది స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌రుగుతోందన్నారు. దళిత బంధు అటకెక్కినట్టేనా ? కేబినెట్ సమావేశంలో చర్చే లేదా?  బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పూర్తి స్థాయి రైతు వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్నారు కేసీఆర్. పేద‌, సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్నారని విమర్శించారు. గ్యాస్ ధ‌ర‌ల పెంపు కావ‌చ్చు.. పెట్రోల్ ధ‌ర‌ల పెంపు కావ‌చ్చు.. ఇట్లా అనేక రంగాల్లో క‌నిపిస్తున్నాయని చెప్పారు. ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి ఆహార భ‌ద్ర‌త‌ను ప‌రిర‌క్షిస్తూ ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌ను న‌డ‌పాల్సిన కేంద్రం ఈరోజు దుర‌దృష్ట‌క‌రంగా త‌న సామాజిక బాధ్య‌త‌ను విస్మ‌రించి మేం కొన‌ము.. కొన‌లేము అని చెబుతున్నారంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై విరుచుకుప‌డ్డారు.

బిగ్ బాస్ షోపై రాజకీయ రచ్చ.. రవి ఎలిమినేషన్ పై బీజేపీ ఎమ్మెల్యే గుస్సా..

టీవీ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ షోపై రాజకీయ రచ్చ రాజుకుంది. తెలుగు బిగ్ బాస్ షోలో యాంకర్ రవి ఎలిమినేషన్ తీవ్ర వివాదాస్పదమవుతోంది. తెలుగు ఐదవ సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన 12వ ఎపిసోడ్ లో ఎవరూ ఊహించని రీతిలో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. టాప్ కంటెస్ట్ గా ఉన్న రవి ఎలిమినేషన్ అందరికి షాకిచ్చింది. అదే సమయంలో వివాదానికి కారణమైంది. యాంకర్ రవి అభిమానులు ఏకంగా  అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నిరసన తెలపడం ఉద్రిక్తతకు దారి తీసింది.  మొదటి నుండి టాప్ 5 కంటెస్టెంట్ అని అందరూ భావించిన రవి, మూడు వారాల ముందుగా ఎలిమినేట్ అయ్యారు.  ప్రియాంక , సిరి , కాజల్ ల కంటే రవికి ఉన్న ఓటింగ్ చాలా ఎక్కువ అని అనధికార ఓటమి వెబ్సైట్స్ చెబుతున్నాయి. ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ కూడా వీరు ముగ్గురు తో పోలిస్తే రవికి ఎక్కువే. ‌ అయినా రవి ఎలిమినేట్ అయ్యారు. దీంతో  బిగ్ బాస్ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగానే రవిని ఎలిమినేట్ చేశారన్న అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. రవి అభిమానులు ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అనే రవిని కావాలనే తప్పించారని మండిపడుతున్నారు.  బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారమే నిర్వాహకులు రవిని తప్పించారని, టాప్ 5 లో కనీసం ఇద్దరు అమ్మాయిలు ఉండేలా ప్లాన్ చేశారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  శ్రీరామ్ చంద్రకి మేలు చేయడం కోసం నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా రవిని ఎలిమినేట్ చేశారని మరికొందరు చెబుతున్నారు. రవికి మిగతా వారితో పోలిస్తే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని, ఇప్పటికే దాదాపు కోటి రూపాయల దాకా పారితోషికం రవికి అందిందని, అదే ఆయన ఎలిమినేషన్ కు కారమణని మరికొందరు అంటున్నారు. బిగ్ బాస్ ఎలిమినేషన్ లో ఆడియెన్స్ ఓటింగ్ తోపాటు బడ్జెటింగ్ కూడా కీలకంగా ఉంటుందని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. గత సీజన్ లో  కుమార్ సాయి ని కూడా ఇదే విధంగా ఎలిమినేట్ చేశారన్న విమర్శలు వచ్చాయి.  యాంకర్ రవి కి మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలిచారు‌. ఉద్దేశపూర్వకంగానే నిర్వాహకులు యాంకర్ రవిని ఎలిమినేట్ చేశారని ఆయన ఆరోపించారు. అసలు బిగ్ బాస్ షో ని బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్.  తన ఎలిమేషన్ పై వస్తున్న వివాదంపై యాంకర్ రవి కూడా స్పందించారు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోలేక పోయినప్పటికీ ప్రేక్షకుల స్పందన చూస్తూ ఉంటే తాను గెలిచినట్లు భావిస్తున్నానని అంటూ రవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

జగన్,బాబు వార్.. వివేకా కేసులో ట్విస్ట్.. సభలో రచ్చ.. బౌలర్లు ఫెయిల్.. టాప్ న్యూస్@7PM

వరదలతో చనిపోయిన వారివి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం చేతగానితనమేనని విమర్శించారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో ఘోరంగా విఫలమయ్యారని, దీనిపై న్యాయ విచారణ జరగాలన్నారు.  ------ టీడీపీ అధినేత చంద్రబాబువి బురద రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు. వరద బాధితులను ఆదుకునేందుకు శరవేగంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గతంలో బాధితులను ఆదుకునేందుకు కనీసం నెల పట్టేదన్నారు. ఇప్పుడు వారం రోజుల్లోనే బాధితులకు ఆదుకోగలిగామని చెప్పారు. నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి.. సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నామని జగన్ తెలిపారు. ----- మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ను కలిశాడు గంగాధర్ రెడ్డి. సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ని కోరాడు గంగాధర్ రెడ్డి. ఈ కేసులో తాము చెప్పినట్లే వాంగూల్మం ఇస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు గంగాధర్ రెడ్డి.  ----- కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగువ అహోబిలం రహదారిలో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలంకు వస్తుండగా  ఈ  ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ------- శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి పట్ల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. శేషాద్రి మృతి శ్రీవారి ఆలయానికి, భక్తకోటికి తీరని లోటని పేర్కొన్నారు. ఆలయ వ్యవహారాలపై శేషాద్రి చెరగని ముద్ర వేశారని సీజేఐ కొనియాడారు. శ్రీవారి సేవలపై శేషాద్రికి ఉన్న అవగాహన అనన్యసామాన్యమన్నారు. ఆలయ ఆచారాలపై శేషాద్రికి ఎంతో అవగాహన పరిజ్ఞానం ఉందని తెలిపారు. డాలర్‌ శేషాద్రి కుటుంబసభ్యులకు ఎన్వీ రమణ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ---- సాగు చట్టాల రద్దు బిల్లు- 2021కి లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. బిల్లుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్ను తిరస్కరించిన స్పీకర్ ఓం బిర్లా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు. -- ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న తెరాస ఎంపీలు  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజే రభస సృష్టించారు. తెరాస పార్లమెంట్ సభ్యులు సభలో అదే విషయంపై చర్చకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు.  ------- గత ఒప్పందాల ప్రకారమే రాష్ట్రం నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని  కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రైతులకు వరి విత్తనాలు అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటన్నారు. ------- సంగారెడ్డి జిల్లా  పఠాన్ చెరు మండలం, ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను అధికారులు వైద జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపారు.  --- భారత్, న్యూజీలాండ్ తొలి టెస్టు నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసింది. చివరి ఎనిమిది ఓవర్లలో విజయానికి వికెట్ తీయాల్సి ఉండగా.. భారత బౌలర్లు విఫలమయ్యారు. తీవ్ర ఉత్కంఠగా సాగిన చివరి 8 ఓవర్లను కివీస్ బ్యాట్స్ మెన్ అజాజ్ పటేల్, రవీంద్ర అద్భుతంగా ఎదుర్కొన్నారు. భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా వికెట్ పడకపోవడంతో కాన్పూర్ టెస్టుగా డ్రాగా ముగిసింది. 

బ్యాంకుల్లో డిపాజిట్ చేయవద్దని శాఖలకు ఆర్డర్.. నిధుల కోసం జగనన్న మరో స్కెచ్

ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏం చేస్తోందో తెలుస్తోందా..? ఖజానాలో నిధులన్నీ నిండుకోవడంతో ఏ ప్రభుత్వ విభాగాన్నీ విడిచిపెట్టకుండా వడికేస్తోంది. చేతికి దొరికిన చోటల్లా అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఆపై ఓవర్ డ్రాఫ్ట్ కోసం దేబిరిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో ఎత్తు వేసింది జగన్ రెడ్డి సర్కార్.. అందేంటంటే.. ఏపీలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు తమ వద్ద ఉన్న ప్రజాధనాన్ని ఏ బ్యాంకుల్లోనూ డిపాజిట్ చేయకూడదని హుకుం జారీ చేసింది. కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్లో మాత్రమే ఆయా శాఖలు డిపాజిట్లు చేయాలని స్పష్టంగా ఆదేశించింది. పైగా ప్రజా ధనాన్ని రక్షణ కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ తాజా ఉత్తర్వులతో ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు తమ వద్ద ఉన్న ధనాన్ని ఇక నుంచి ఏ బ్యాంకులోనూ డిపాజిట్ చేసే వీలు ఉండదు. ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులు, ట్రస్టులు, సంస్థలు, యూనివర్శిటీలు, ప్రత్యేక ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన ఇతర సంస్థలన్నీ తమ వద్ద ఉన్న మిగులు నిధులను ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్లో మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే.. టీటీడీ, రాష్ట్రంలోని ఇతర దేవాలయ సంస్థలను ఈ తాజా ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చింది జగన్రెడ్డి సర్కార్. బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీగా ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్ను భారతీయ రిజర్వు బ్యాంక్ వద్ద ప్రభుత్వం నమోదు చేసింది. ఈ కార్పొరేషన్లో ప్రభుత్వ సంస్థలు కూడా తమ నిధులను డిపాజిట్ చేయొచ్చని 2020 మార్చి నెలలో ఉత్తర్వులు ఇచ్చింది. ఇతర వాణిజ్య బ్యాంకుల్లో అయినా ప్రభుత్వ సంస్థలు తమ వద్ద ఉన్న నిధులను డిపాజిట్ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఏపీ సర్కార్ ఇచ్చిన తాజా ఉత్తర్వులతో ఇప్పుడు ఆ సదుపాయం నుంచి ప్రభుత్వ సంస్థలను జగన్రెడ్డి సర్కార్ దూరం చేసినట్లయింది. ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో అయితేనే ప్రజా ధనానికి రక్షణ ఉంటుందని వైసీసీ సర్కార్ తన ఆర్డర్లో ఓ ముక్తాయింపు కూడా ఇచ్చింది. ప్రభుత్వ కార్పొరేషన్లలోని నిధులను ఈ మధ్య కాలంలో అక్రమంగా మళ్లించిన అంశాన్ని కూడా ఏపీ సర్కార్ జీవోలో ప్రస్తావించడం గమనార్హం. ఆంధ్రప్రదేవ్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్లోని రూ.9.60 కోట్లలో కొంత మొత్తం ప్రైవేట్ అకౌంట్కు మళ్లించిన విషయం పేర్కొంది. ఏపీ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ నుంచి రూ.5 కోట్లను సంస్థకు తెలియకుండా మళ్లించిన వైనం ప్రస్తావించింది ఏపీ ప్రభుత్వం. ఈ మాదిరి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిరోధించేందుకే తాజా ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వుల్లో వివరించారు. నిధులను ఏపీ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్కు మళ్లించాలని జగన్రెడ్డి సర్కార్ ఇటీవల వత్తిడి చేసినా పలు సంస్థలు పెడచెవిన పెట్టడంతోనే తాజా ఆదేశాలు జారీ చేసినట్లు పలు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వ్యవసాయ చట్టాల రద్దు ఇలాగా.. మోడీకి భయమెందుకు ? 

ఈ పాడు చట్టాలు మాకొద్దు బాబో  అని సంవత్సరం నుంచి రైతులు మొత్తుకున్నరు,  ఆందోళన చేస్తున్నా, పట్టించుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఒక్క  సారిగా కళ్ళు తెరిచింది. వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసింది. ఈరోజు, (సోమవారం) ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజునే పార్లమెంట్ ఉభయ సభలు, వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదముద్ర వేశాయి. నిజమే, ఇది స్వాగతించ వలిసిన పరిణామమే, ఆరు నూరైనా,ఏది ఏమైనా సాగు చట్టాల విషయంలో భీష్మించుకు కూర్చున్న ప్రభుత్వం. ఏడాది పోరాటంలో 750 రైతులు ప్రాణాలు పోయినా, ఈ చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాలు చేసిన ఆందోళన కారణంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలే తుడిచి పెట్టుకు పోయినా, చివరకు జాతీయ జెండాకు అవమానమే జరిగినా, చలించని మోడీ సర్కార్, ఇప్పటికైనా కళ్ళు తెరవడం కొంత వరకు సంతోషించవలసిన పరిణామమే.  అయితే సాగు చట్టాలను తెచ్చినతీరు ఎంత సుందర ముదనష్టంగా ఉందో ... ఇప్పుడు చట్టాలను వెనక్కి తీసుకున్న తీరుకూడా అంతే, వికారంగా, వికృతంగా ఉందని రాజకీయ పరిశీలకులు, రాజ్యాంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలను పరిహసించే విధంగా ఉందని అంటున్నారు. నిజానికి, ఈ చట్టాలు తెచ్చేముందు, ప్రభుత్వం  ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదు. రైతు సంఘాలతో చర్చించలేదు. ఇంకా సిగ్గు చేటైన వ్యవహారం ఏమంటే, మంత్రి వర్గంలో కూడా సమగ్ర చర్చ జరగలేదని, సంఘ్ పరివార్ సంస్థలే ఆరోపించాయి. పార్లమెంట్’లోనూ అదే పరిస్థితి. విపక్షాల అభ్యంతారాలు అన్నీ అధికార పక్షం మందబలంలోకొట్టుకు పోయాయి. ప్రధాని  మోడీ ముచ్చట తీరింది. అందుకు చెల్లించిన మూల్యం 750 నిండు ప్రాణాలు. అలా ... రాజరిక అవలక్షణ అవశేషంగా మిగిలిన వ్యక్తిస్వామ్యానికి ప్రతీకగా పుట్టిన సాగు చట్టాల రద్దులోనూ అవే వక్ర లక్షణాలు పునరావృతం అయ్యాయి.  చట్టాల రద్దు నిర్ణయం విషయంలో కూడా ప్రధాని మోడీ ఒంటరిగానే నిర్ణయం తీసుకున్నారో. ఆయన మంత్రి వర్గంలో కాదు, రద్దు నిర్ణయానికి ముందు  కనీసం వ్యవసాయ శాఖ మంత్రితో అయినా చర్చించారో లేదో అనుమానమే. అయినా నిర్ణయమే అందరికీ శిరోధార్యం అయింది. కేవలం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలను దృష్టిలో ఉంచుకుని మోడీ తీసుకున్న ఒంటరి నిర్నయంగానే పరిశీలకులు అంటున్నారు. అందుకే మంత్రివర్గంలో చర్చించిన దాఖాలాలు లేవు. ప్రదానిని నోట వెంట వచ్చే వరకు సాగు చట్టాల రద్దు నిర్ణయం జరిగిన వాసన కూడా ఎక్కడా రాలేదు.ఆలాంటి సంకేతాలు అయినా అందలేదు. గురునానక్ జయంతి సందర్భంగా గుట్టు చప్పుడు కాకుండా, ప్రధాని ఏకంగా ఒకే సారి రద్దు నిర్ణయం ప్రకటించారు. ఇక ఇప్పుడు, పార్లమెంట్ చట్టాల రద్దు ప్రక్రియ కూడా అలాగే కానిచ్చేశారు. ఒక చర్చ లేదు ... ఒక వవరణ లేదు .. చట్టాలు చేయ్దం .. చేసిన చట్టాలను రద్దు చేయడం ... అయితే  ఆయన ప్రధాని కావచ్చును ,.. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఇష్టాఇష్టాల మీద ఆధారపడి జరగడం ప్రజాస్వామ్య పరిహాసం తాప మరొకటి కాదని అంటున్నారు.    ఎందుకలా... అంత తొందర ఏమొచ్చింది? చట్టాలు ఎందుకు తెచ్చారు..? ఎందుకు ఉపసంహరించుకున్నారు?  అలాగే, ఒకప్పుడు  తాము అధికారంలో ఉన్నప్పుడు ఇవే చట్టాలు చేసేందుకు ప్రయత్నించిన విపక్షాలు, ఇప్పడు అవే చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అన్ని విషయాలు చర్చిస్తే పోయేదేముంది.. సందేహలు తప్ప అంటున్నారు విశ్లేషకులు.అలాగే, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన  చేసిన రైతులకు, ఖలిస్థాన్’ ఉగ్ర వాదులుగా ముద్ర వేశారు... మరి ఇప్పుడు ఏమంటారు ? అలాగే, రద్దు నిర్ణయం ప్రకటించిన సమయంలో ప్రధాని రైతులకు చెప్పిన క్షమాపణల అర్థమేమిటి? ఈ అన్నిటికీ సమాధానం రావాలంటే, పార్లమెంట్ లో చర్చ జరగటం ఒక్కటే మార్గం .. కానీ, మోడీ ప్రభుత్వం చర్చకు అవకాశం లేకుండా పలాయనం చిత్త గించింది.అంతే కాదు, ఇంతజరిగిన తర్వాత సశేషంగ మిగిలిన కనీస మద్దతు ధర (ఎంఎస్..పీ), రద్దయిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, జరిగిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని కోరడం తప్పు కాదు .. ఆ డిమాండ్లు కూడా అంగీకరించే వరకు ఆందోళన కొనసాగించడం నేరం అనిపించుకోదు. అందుకే పార్లమెంట్ లో చర్చ ఇంకా మిగిలే వుంది .. అంటున్నారు.

జగన్ సర్కార్ ను వదిలించుకున్న ఎల్ఐసీ.. ఏపీ విశ్వసనీయత మటాష్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా సాగిస్తున్న అరాచక పాలనకు, అనాలోచిత నిర్ణయాలకు, చేసిన, చేస్తున్న... అప్పులు. తప్పులకు మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైందా? అంటే, అవునననే అంటున్నారు, రాజకీయ ఆర్థిక రంగ నిపుణులు. జగన్ ప్రభుత్వం కొత్త అప్పులకు కేంద్ర సర్కార్ బ్రేకులు వేయడం మొదలు, తాజాగా, జీవిత బీమా సంస్థ, (ఎల్ ఐ సీ), అభయ హస్తం పధకంతో తెగతెంపులు చేసుకోవడం వరకు,ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన ఇతర  పరిణామాలు  రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను భయంకరంగా దెబ్బ తీశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అభయహస్తం పథకం ఈ ప్రభుత్వం తెచ్చిన పథకం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు వృధ్యాప్యంలో అక్కరకొచ్చేందుకు వీలుగా రూపొందించిన పథకం అభయహస్తం పథకం.18–59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులు రోజుకు ఒక్క రూపాయి చొప్పున ఏడాదికి రూ.365లు చెల్లిస్తే అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అలా క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత రూ.500 నుంచి రూ.3వేల వరకు ప్రతి నెలా పింఛన్‌ రూపంలో అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.ఈ ఉద్దేశంతోనే అభయహస్తం పథకం కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థతో 27 అక్టోబరు 2009లో ఎల్ఐసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ఒప్పందం 3 నవంబరు 2021న రద్దయినట్టు ఎల్ఐసీ తాజా  ప్రకటనలో తెలిపింది.  అదేమీ తప్పు కాదు. తలదించుకునే వ్యవహారం కాదు, కానీ, ఇకపై అభయహస్తం పథకంతో ఎల్ఐసీకి ఎటువంటి సంబంధం లేదు..  ఇకపై లబ్దిదారుల గత క్లైయిమ్‌లు, పెండింగ్‌లో ఉన్న క్లైయిమ్‌లు, భవిష్యత్తులో క్లైయిమ్‌లన్నింటినీ పరిష్కరించే బాధ్యత గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థదే’ అంటూ బహిరంగ ప్రకటన చేయడం అనేక అనుమానలకు తావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణపై విశ్వాసం లేకనే ఎల్ఐసీ, ఒప్పంద పొడిగింపుకు అవకాశం ఉన్నా, చేతులు కడిగేసుకుని పక్కకు తప్పుకుందని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే, ఎల్ఐసీ, ‘‘అవగాహన ఒప్పందం రద్దుకావడంతో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న నిధులను అభయహస్తం పథకం నోడల్ ఏజెన్సీ ఎస్ఈఆర్సీకి బదిలీ చేశాం..మాస్టర్ పాలసీ నెంబరు 514888, అభయహస్తం పథకం కింద మా అన్ని కర్తవ్యాలు, బాధ్యతలు నుంచి వైదొలగాం.. ఇకపై అభయహస్తం పథకంతో ఎల్ఐసీకి ఎటువంటి సంబంధం లేదు..” అంటూ బహిరంగ ప్రకటనలో  వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంఫై విశ్వాసం లేకనే ఎల్ఐసీ ఇలాంటి ప్రకటన ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిందని అంటున్నారు.  ఇదలా ఉంటే, ఎల్ఐసీ ప్రకటనపై స్పందించిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు ఎల్‌ఐసీలో పొదుపు చేసుకున్న రూ.2,200 కోట్లను జగన్ రెడ్డి ప్రభుత్వం స్వాహా చేసిందని ఆరోపించారు. జగన్‌ విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతింటోందనని చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తపరిచారు. నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం  అరాచక పాలన, అస్తవ్యస్థ ఆర్థిక విధానాల వలన, చంద్రబాబు అన్నట్లుగా  ఇప్పటికే రాష్ట్రం బ్రాండ్ ఇమేజి బాగా దెబ్బతింది, చివరకు ప్రభుత్వ రంగ సంస్థలు  కూడా, వామ్మో ఏపీ .. అనే పరిస్థితి వచ్చిందంటే, ఇక ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వాన్ని ఎలా .. విశ్వసిస్తారు... ఎలా పెట్టుబడులు పెడతారని ప్రశ్నిస్తున్నారు.

8 ఓవర్లున్నా చివరి వికెట్ తీయని బౌలర్లు..  కాన్పూర్ టెస్ట్ డ్రా 

భారత్, న్యూజీలాండ్ తొలి టెస్టు నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసింది. చివరి ఎనిమిది ఓవర్లలో విజయానికి వికెట్ తీయాల్సి ఉండగా.. భారత బౌలర్లు విఫలమయ్యారు. తీవ్ర ఉత్కంఠగా సాగిన చివరి 8 ఓవర్లను కివీస్ బ్యాట్స్ మెన్ అజాజ్ పటేల్, రవీంద్ర అద్భుతంగా ఎదుర్కొన్నారు. భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా వికెట్ పడకపోవడంతో కాన్పూర్ టెస్టుగా డ్రాగా ముగిసింది.  న్యూజీలాండ్ కు విజయానికి చివరి రోజు 280 పరుగుల అవసరం ఉండే. వికెట్ నష్టానికి 4 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ తొలి సెషన్ లో మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడింది. దీంతో మ్యాచ్ డ్రా అవుతుందని అంతా భావించారు. కాని సెకండ్ సెషన్ లో భారత బౌలర్లు ప్రతాపం చూపించారు. 79/1తో రెండో  సెషన్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌.. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన తొలి బంతికే సోమర్‌ విలే (36) ఔటయ్యాడు. ఆపై లాథమ్‌ (52), విలియమ్సన్‌ (24*) నిలకడగా ఆడి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే  లాథమ్‌ అర్ధశతకం తర్వాత అశ్విన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 118/3. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్‌ టేలర్‌ (2) పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆడిన 23వ బంతికి రెండు పరుగులు తీశాడు. అయితే, టీ బ్రేక్‌కు ముందు అతడు జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్‌ 125 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది ఇక  చివరి సెషన్‌లో భారత్‌ విజయం సాధించాలంటే ఆరు వికెట్లు పడగొట్టాల్సి ఉండగా.. . అదే న్యూజిలాండ్‌ గెలుపొందాలంటే 159 పరుగులు సాధించాలి. అయితే బౌలర్లు అద్భుతంగా రాణించి వరుసగా వికెట్లు పడగొట్టారు. అశ్విన్ ఓవర్ లో బ్లెండల్ రెండు పరుగుల దగ్గర ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. తర్వాత ఎనిమిదో వికెట్ కాస్త ఆలస్యమైంది. రవీంద్ర జడేజా వేసిన 86 ఓవర్ లో ఐదు పరుగులు చేసిన జమీసన్ అవుటయ్యాడు. దీంతో మ్యాచ్ పై భారత్ పట్టు సాధించింది. మరో నాలుగు పరుగులు జోడించాకా 155 పరుగుల దగ్గర 90 ఓవర్ లో టీమ్ సౌధీ తొమ్మిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ విజయానికి చివరి ఎనిమిది ఓవర్లలో భారత్ కు మరో వికెట్ అవసరం పడింది. అయితే అజాజ్ పటేల్, రవీంద్ర జాగ్రత్తగా చివరి ఎనిమిది ఓవర్లు ఆడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

రూ. 10 కోట్ల ఆఫర్ ఇచ్చారన్న గంగాధర్ రెడ్డి.. వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ను కలిశాడు గంగాధర్ రెడ్డి. సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ని కోరాడు గంగాధర్ రెడ్డి.  ఈ కేసులో తాము చెప్పినట్లే వాంగూల్మం ఇస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు గంగాధర్ రెడ్డి. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ తనపై ఒత్తిడి చేసిందని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు గంగాధర్ రెడ్డి. వారి ఒత్తిడి తో తానే వివేకాను చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు బెదిరింపులు చేశారని వాపోయాడు. వివేకా హత్య కేసులో తనకు సంబంధం లేదన్నారు గంగాధర్ రెడ్డి. లేని విషయాన్ని ఉన్నట్లు చెప్పేది లేదన్నారు.   గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప స్పందించారు. వైఎస్ వివేకా హత్య కేసులో బెదిరింపులపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడని చెప్పారు. గంగాధర్ రెడ్డి కి రక్షణ కల్పిస్తామన్నారు ఎస్పీ.సీబీఐ, వివేకా అనుచరులు, సీఐ శ్రీరాంపై ఫిర్యాదు చేశాడని తెలిపారు. గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని ఎస్పీ వెల్లడించారు.. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్  చెబుతున్నారని, ఆయన చెప్పిన అన్ని అంశాలపై విచారణ చేస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.

సాగు చట్టాలు రద్దు బిల్లుకు లోక్ సభ ఆమోదం..

అనుకున్నట్లుగానే, పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రగడ మొదలైంది. ఉభయసభల్లో రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్సభలో సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఇక్కడితో ఒక పనైపోయింది. సంవత్సర కాలానికి పైగా, రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్నఆందోళనకు ప్రభుత్వం తెరదించింది. సాగు చట్టాల రద్దు బిల్లు- 2021కి లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లును స్పీకర్ ఆమోదించారు. అనంతరం సభ మధ్యాహ్నం 2గంటలకు మరోసారి వాయిదాపడింది.అంతకు ముందు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ నిరసనలు చేపట్టారు. దీంతో తొలిరోజే ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మొదట సభలు ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన సభ్యులకు నివాళి అర్పించారు. లోక్సభలో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్ ఓం బిర్లా. దానిని విపక్షాలు అడ్డుకున్నాయి. రైతు సమస్యలు సహా ఇతర ప్రజాసంక్షేమ అంశాలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. సహకరించాలని విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గకపోవటం వల్ల సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్షాలు ఆందోళనలు కొనసాగించారు. ఈ క్రమంలో కొత్త సాగు చట్టాల రద్దు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. బిల్లుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్ను తిరస్కరించిన స్పీకర్ ఓం బిర్లా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు. విపక్షాల ఆందోళనలు కొనసాగటం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా పడింది రాజ్యసభలోనూ తొలుత గంట సేపు వాయిదా పండింది. విపక్షాల ఆందోళనలు సహా ఇటీవల మృతి చెందిన ప్రస్తుత సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్పై గౌరవ సూచకంగా ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 12.20 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. దీంతో సభను మరోసారి మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.కాంగ్రెస్ ఆందోళన..పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగింది కాంగ్రెస్. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాసేపు నిరసన తెలిపారు ఆ పార్టీ ఎంపీలు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా కీలక నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. స్వాతంత్ర్యం, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తికి అనుగుణంగా పార్లమెంట్లో చర్చలు జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతు బలంగా ఉన్నా.. అది పార్లమెంట్, సభాపతుల గౌరవాన్ని కాపాడేలా ఉండాలని సూచించారు.సమావేశాల ప్రారంభానికి కొద్ద సమయం ముందు సీనియర్ కేబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు మోదీ. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పాల్గొన్నారు.మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు మోదీ. గరీబ్ కల్యాణ్ యోజనను 2022, మార్చి వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందించిన్నట్లు చెప్పారు. 2.6 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

చేతగాని సీఎం వల్లే వరద చావులు! 

రాయలసీమ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా దుర్భర పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇంకా వందలాది గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. వరద బాధితులకు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.  వరద సహాయక చర్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరదలతో చనిపోయిన వారివి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం చేతగానితనమేనని విమర్శించారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో ఘోరంగా విఫలమయ్యారని, దీనిపై న్యాయ విచారణ జరగాలన్నారు.  బాధితులకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదన్నారు చంద్రబాబు. ఆయా పంటలకు టీడీపీ హయాంలో చెల్లించిన ఇన్ పుట్ సబ్సీడీని తగ్గించారని విమర్శించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారి మళ్లించారన్నారు. వరి వేయవద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని, పంట బీమా ప్రీమియం కట్టకుండా జగన్ రెడ్డి మోసం చేస్తున్నారన్నారు.  రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్ర సాయం కూడా అందని పరిస్థితి నెలకొందన్నారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందడంలేదన్నారు. 2020లోనూ పంట బీమా ప్రీమియం కట్టకుండా అసెంబ్లీలో కట్టామని అబద్ధం చెప్పారన్నారు.  ఓటీఎస్ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు ఏ ఒక్కరు కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి.. మహిళల పట్ల వైసీపీ వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజా సమస్యలు చర్చిస్తామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమచేయకుండా ఆ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని చంద్రబాబు విమర్శించారు. అభయ హస్తం పథకాన్ని జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని, డ్వాక్రా మహిళలు ఎల్‌ఐసీలో పొదుపు చేసుకున్న రూ. 2,200 కోట్లను స్వాహా చేశారని మండిపడ్డారు. ఎల్‌ఐసీని తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గపు చర్య అన్నారు.  ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి టీడీపీ సంఘీభావం తెలుపుతుందన్నారు చంద్రబాబు. జగన్ రెడ్డి విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతిందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. 20 ఏళ్లయినా ఈ సమస్యల నుంచి బయటపడే పరిస్థితి లేదని, ఉన్మాదంతో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కాలరాస్తున్నారని టీడీపీ అధినేత మండిపడ్డారు. వైసీపీ బూతులతో టీడీపీ పోటీ పడదని చంద్రబాబు స్పష్టం చేశారు.

టికాయత్ అసలు లక్ష్యం చట్టాల రద్దు కాదా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రైతులకు ఇచ్చిన హామీ మేరకు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల తోలి రోజునే, కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద నూతన సాగు చట్టాల రద్దు శ్రీకారం చుట్టింది. విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రభుత్వం నూతన సాగు చట్టాల రద్దు బిల్లు-2021 ను  లోక్సభలో ప్రవేశ పెట్టింది. బిల్లుకు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం కోసం ముందుగానే, బీజేపే తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. సంవత్సర కాలం పైగా ససేమిరా అన్న చివరకు, రైతుల ఆందోళనలకు తలొగ్గి, ఇచ్చిన మాట ప్రకారం సాగు చట్టాల రద్దు ప్రక్రియలో ముందడుగు వేసింది.  అయితే, ఇంతకాలంగా, మూడు వివాదస్పద సాగు చట్టాల రద్దును మాత్రమే డిమాండ్ చేస్తూ వచ్చిన, భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ కొత్త మెలిక డిమాండ్లను  తెరమీదకు తెచ్చారు.లోక్ సభలో బిల్లు మోదం పొందిన నేపధ్యంలోనూ రాకేశ్ టికాయిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సాగిన తమ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు ఇది నివాళి అని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర సహా వివిధ అశాలపై చర్చ జరిగేవరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని స్పష్టం చేశారు.ఆలాగే, నిన్న (ఆదివారం) ముంబైలో  ఆయన,గత సంవత్సరం  జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలు మరో సారి పునరావృతం అవుతాయంటూ చేసిన హేచరికలు, దేశంలో అలజడి,అశాంతి, సృష్టించడమే టికాయత్ అసలు లక్ష్యంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.   పార్లమెంట్ లోపల ప్రతిపక్షాల ధోరణి కూడా అదే విధంగా ఉందని, చట్టాల రద్దు కంటే ఆందోళన కొనసాగించడం పైనే, ప్రతిపక్షాలు దృష్టి పెట్టాయనిపించేలా వారి ప్రవర్తన ఉందని  పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే, పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే సభ లోపలా, వెలుపల కూడా విపక్షాలు  గందరగోళ పరిస్థితులు సృష్టించాయని అంటున్నారు. ముఖ్యంగా, లోక్ సభలో రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టి, సాగు చట్టాల రద్దు బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే లోక్ సభలో సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. కేంద్రం గతేడాది తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు దాదాపు ఏడాది కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 19న గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని సంచలన ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను ఈ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకనుగణంగా నేడు 'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'ని కేంద్రం ప్రవేశపెట్టగా లోక్సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగువ అహోబిలం రహదారిలో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలంకు వస్తుండగా  ఈ  ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో లోయలో పడిపోగానే ప్రయాణికులు కేకలు వేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సులో నుంచి ప్రయాణికులను బయటికి తీశారు. క్షతగాత్రులు స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.వాళ్లను మెరుగైన చికిత్స కోసం కర్నూల్ హాస్పిటల్ కు తరలించారు.   

ఉద్యోగుల ఉద్యమ భేరీ.. జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి!

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నెత్తిన మరో పిడుగు పడబోతోంది. అసలే ఖజానా దివాలా తీసి, దొరికిన చోటల్లా అప్పులు చేసి దినదిన గండంగా నెట్టుకొస్తున్న జగన్రెడ్డి సర్కార్పై ఉద్యోగ సంఘాలు వజ్రాయుధాన్ని ప్రయోగించబోతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ఉద్యమ భేరి మోగించాయి. రాష్ట్ర సర్కార్తో ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అయ్యాయి. పీఆర్సీ నివేదికకు అతీగతీ లేదని, డీఏ బకాయిలకు దిక్కు లేకుండా పోయిందని, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ డబ్బులు ఏమయ్యాయని, ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి లేకుండా పోయిందని ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి సంఘాలు ఉద్యమ నగారా మోగించాయి. డిసెంబర్ 1 నుంచి జనవరి 6 వరకు తొలిదశ ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి డిసెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉద్యమంలో భాగంగా డిసెంబర్ 7-10 తేదీల మధ్య నల్ల బ్యాడ్జీలతో అన్ని ఆఫీసులు, స్కూళ్లు, తాలూకా పరిధిలోని ఆఫీసులు, డివిజన్, జిల్లాస్థాయి ఆఫీసులు, ఉన్నతాధికారుల ఆఫీసులు, ఆర్టీసీ డిపోల్లో ప్రభుత్వానికి నిరసనలు తెలపాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. 13న అన్ని మండలాలు, డివిజన్లలో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, కాన్ఫరెన్స్లు నిర్వహిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. డిసెంబర్ 16న తాలూకా, డివిజన్ అధికారుల ఆఫీసులు, ఆర్టీసీ డిపోల్లో ఉదయం 9 నుంచి, మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాలు చేయాలని డిసైడ్ అయ్యాయి. డిసెంబర్ 21న జిల్లా స్థాయిలో మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు. డిసెంబర్ 27 సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నంలో, 30న తిరుపతిలో, జనవరి 3న ఏలూరులో, 6న ఒంగోలు నగరాల్లో సభలు నిర్వహించే కార్యాచరణను ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు. ఉద్యోగులను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అవమానకరంగా మాట్లాడుతున్నారని, ఏ సమస్య గురించి అడిగినా రేపు మాపు అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న సర్కార్ తీరుపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎవరి శక్తి ఏంటో చూపిస్తామంటూ సవాల్ చేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉద్యోగులతో తాము మాట్లాడామని, వారి భరోసాతోనే ఉద్యమించేందుకు ముందుకు పోతున్నామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో ఉద్యోగులు, పలు శాఖల ఉద్యోగ నాయకులతో సమావేశాలు నిర్వహించినట్లు బొప్పరాజు వెల్లడించారు. అనుభవిస్తున్న అవమానాలు చాలని, వెంటనే ఉద్యమానికి సిద్ధం కావాలని వారంతా డిమాండ్ చేసినట్లు ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి నేతలు పేర్కొన్నారు. 

పార్లమెంట్ లో తెరాస లొల్లి.. వరి కొనుగోళ్లపై రచ్చ

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న తెరాస ఎంపీలు  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజే, తడాఖా చూపించారు వాయిదా తీర్మానంతో లోక్ సభలో రభస సృష్టించారు. హైదరాబాద్ లో మహా ధర్నా చేసినా, ఢిల్లీ యాత్రలు సాగించినా, ఫలితం లేక పోవడంతో, తెరాస పార్లమెంట్ సభ్యులు ఈ రోజు సభలో అదే విషయంపై చర్చకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే లోక్ సభలో స్పీకర్ తెరాస సభ్యుల వాయిదా తీర్మానం నోటీసుకు తిరస్కరించడంతో, ర‌భ‌స మొద‌లైంది. ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు.లోక్ సభలో తెరాస పక్ష నేత నామ నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో తెరాస స‌భ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను కొద్దిసేపు వాయిదా వేశారు. ధాన్యం సేకరణపై స్పష్టత కోసం పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షడు కేసీఆర్ నిన్న జరిగిన పార్లమెంటరీ పార్టీ సమవేశంలో  ఇచ్చిన పిలుపు మేరకు.తెరాస సభ్యులు తొలిరోజే లోక్సభలో ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.  అయోమయ, అస్పష్టత విధానానాలతో తెలంగాణ రైతులతో పాటు దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని ఆక్షేపించారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యహ్నం వరకు వాయిదా వేశారు.  అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ధన్యం కొనుగోలుకు సంబంధించి స్పష్టత ఇచ్చినా, తెరాస ఎంపీలు అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నారని, బీజీపీ ఎంపీలు సభ వెలుపల ఎదురు దాడి చేశారు. వానాకాలం పంటకొనకుండా, రైతులను గోస పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం కాదా, అని బీజేపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.ఇందుకు సంబందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన లిఖిత్ పూర్వక ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా తెరాస ఎంపీలు పార్లమెంట్’ను అడ్డుకోవడం ఏమిటని బీజేపీ ఎంపీలు అంటున్నారు.

స్వామీజీ సూచనతోనే ముఖ్యమంత్రి గోపూజలు? 

ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాల గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు.ఆయనే కాదు, ఆయన కుటుంబం, తాత రాజారెడ్డి కాలంనుంచి కూడా క్రైస్తవ మత ఆచారాలనే పాటిస్తున్నారు. ఇదేమి రహస్యం కాదు. ప్రతి సంవత్సరం వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో కార్యక్రమాలన్నీ క్రైస్తవ సంప్రదాయాలు, ఆచారా ప్రకారమే  నిర్వహించడం కొత్త విషయం కాదు. క్రైస్తవ సంప్రదాయాల ప్రకారమే  ప్రకారమే కుటుంబ సభ్యులు, అభిమానులు బైబిల్ పట్టుకొని ప్రార్ధనలు చేయడం,  నివాళులు అర్పించడం అందరికీ తెలిసిందే. చివరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి, స్వర్ణలత రెడ్డి కూడా, హిందువే (?) అయినా వైఎస్ జయంతి సందర్భంగా బైబిల్ పట్టుకొని ఏసుక్రీస్తు ప్రార్ధన చేశారు. వీడియో క్లిప్పింగ్ అప్పట్లో వైరల్ అయింది. చివరకు ‘పవిత్ర’ హిందువు సుబ్బారెడ్డి మత విశ్వాసాలు ఆయన నిజ నామం (యహోవా విన్సెట్ సుబ్బారెడ్డి) విషయంలో కూడా కొంత వివాదం జరిగింది .. ఆయన వివరణలు ఇచ్చుకున్నారు అనుకోండి ఆది వేరే విషయం.  అయితే ఇప్పుడు తాడేపల్లి ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలో గోశాల ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెచ్చిన ఆరు గోవులతో రాత్రికి రాత్రి గోశాలవెలిసింది. ఇదేమిటి, ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి  ఇష్టంగానో, అయిష్టంగానో, లేక ఆయన తల్లిగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా రాజకీయాల కోసమో, హిందూ దేవాలయకు వెళ్ళడం, ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం చేసినా అదొక పద్దతి. కానీ, ఏకంగా ముఖ్యమంత్రి నివాసంలో రాత్రికి రాత్రి గోశాలను ఏర్పాటు  చేయడం ఏమిటీ? ఇంతవరకు ప్రోటోకాల్ కోసమే అయినా ఏడుకొండల గడప అయిన తొక్కని, ఆయన సతీమణి భారతి గోవులకు పూజ చేయడం ఏమిటి? ఇలా అకస్మాత్తుగా ముఖ్యమంత్రి దంపతులలో, హిందువులు పూజించే గోమాత పాతాళ  భక్తి పొంగిపొరలడం ఏమిటి? దీనిపై ఇప్పుడు  వైసీపీ నాయకుల్లో, ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఇందుకు కారణం ఉందని, స్వామీజీ సూచనల మేరకే ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలో గోశాల ఏర్పాటు జరిగిందని అనటున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీలు, ఎంపీ ల్యాడ్స్‌ నిధులను చర్చిల నిర్మాణానికి కేటాయించడంపై, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వావాన్ని సీరియస్’గా హెచ్చరించింది. ఈ  నేపధ్యలో, అసలు భాగోతం ఎక్కడ బయటకు వస్తుందో, హిందువులలో ఇప్పటికే వ్యక్తమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ భగ్గుమంటుందో అనే ముందు చూపుతో .. గోశాల వేలిసిందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి, శారద శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిసూచన మేరకు హిందూ మతంస్వీకరించారనే ప్రచారం జరిగింది. అలాగే, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆలయాలపై జరిగిన వరస దాడుల హిందువుల మనోభావాలను దెబ్బతీసి వ్యతిరేకత పెరుగుతున్న సమయంలోనూ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచన మేరకే హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసినట్లు చెపుతున్నారు. ఇప్పుడు కూడా,స్వామీజీ సూచన మేరకే గోశాలఏర్పాటు చేశారని అంటున్నారు

గురుకులంలో కరోనా కలకలం.. థర్డ్ వేవ్ వచ్చేసిందా? 

దేశంలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం కలకలం రేపుతుండగానే.. తెలంగాణలో కోవిడ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. విద్యా సంస్థల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్సిటీలో కొవిడ్ పంజా విసరగా.. తాజాగా గురుకుల పాఠశాలలో వైరస్ విజృంభించింది. పదుల సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది వైరస్ భారీన పడ్డారు.  సంగారెడ్డి జిల్లా  పఠాన్ చెరు మండలం, ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను అధికారులు వైద జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపారు. పాజిటీవ్ వచ్చిన విద్యార్థులను వసతి గృహంలోనే క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  

గూడు చెదిరి.. గుండె పగిలి! ఈ పాపం ఎవరిది? జగనన్న సాయమేది? 

ఎటు చూసినా నీటిలో మునిగిన ఇళ్లు.. గుప్పెడు మెతుకుల కోసం ఎదురు ఆశగా ఎదురుచూసే జనం.. కళ్ళ ముందే కూలిపోతున్న నివాసాలు.. వరదలో కొట్టుకుపోతున్న శవాలు.. ఏ కంట చూసినా కన్నీరే... ఇది ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతం దుర్భర పరిస్థితి.. వరుణ దేవుడి ఆగ్రహానికి వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. కళ్లముందే కలల సౌధాలు నేల కూలినా.. సాయం కోసం ఎదురు చూడటమే తప్ప ఏమీ చేయలేని ఆ అభాగ్యుల బాధ అంతా ఇంతా కాదు. రాయలసీమ ప్రాంతం రతనాల సీమగా పేరుగాంచింది. అలాంటి ప్రాంతం ఇప్పుడు వరద దెబ్బతో సహాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తోంది. వరసగా వచ్చిన మూడు తుఫాన్లతో సామాన్య ప్రజల జీవనం శాపంగా మారింది. పెన్నా పరీవాహక ప్రాంతాలలోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకులు ఈడ్చుకొస్తున్నారు. పది రోజులుగా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కళ్ల ముందే వరదలో ఎన్నో ఇళ్లు కూలిపోయాయి. వేలాది ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ఎంతోమంది వరద నీటిలో కొట్టుకుపోయారు. ఇవన్నీ కళ్ల ముందే జరుగుతున్నా ఏమీ చేయలేని దీనస్థితి రాయలసీమ ప్రాంత వాసులది. ఆస్తులు సహా అన్నీ కోల్పోయిన వారు తమ ఆకలి కాస్త ఎవరైనా తీరిస్తే చాలంటూ సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. రాయలసీమలో ఎప్పుడో.. 1991 లో ఇలాంటి వరదలు వచ్చాయి.  ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఇంత బీభత్సం సృష్టించాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం అంచనాలకే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమయం సరిపోతోంది. తాత్కాలిక ఉపశమనానికి కూడా ప్రభుత్వ సాయం పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో వరద బాధితులకు స్వచ్ఛందంగా సాయం అందించేందుకు కొందరు ముందుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితుల పట్ల రియల్ హీరో సొనూ సూద్  తన వంతు సాయం అందిస్తున్నారు. వరద బాధితులకు తక్షణం ఆర్థిక సాయం అందించాల్సిన కేంద్రంగా నష్ట పరిహారం అంచనాలు వేస్తూ కాలయాపన చేస్తోంది. రాష్ట్ర మంత్రులు, అధికారుల పర్యటనలు వరద బాధితులకు ఏమాత్రం ఊరట ఇవ్వడం లేదు. పట్టెడన్నం కోసం ఇంకా చాలా మంది వరద బాధితులు ఎదురు చూపులు చూస్తున్నారు. వరద ముంచుకొచ్చి ఇప్పటికే పది రోజులకు  పైగా గడిచింది.. ఇంకా ఎన్నాళ్ళు వానకు తడిసి.. వరదలను తట్టుకుని ఉండాలో అర్ధం కాని పరిస్థితి బాధితులది. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి పూర్తిగా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి రావడంతో ఆగ్రహంతో వర్షంలో కూడా బాధితులు నిరసనలకు దిగుతున్నారు. రాయలసీమ ప్రాంతంలోని కడప, చిత్తూరు, అనంతరం జిల్లాలతో పాటు కోస్తా ఆంధ్రలోని నెల్లూరులో ఎక్కువగా వరద ప్రభావం పడింది. ఆయా జిల్లాల్లో జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్థం చేసింది. కడప, నెల్లూరు జిల్లాల్లోనే సుమారు నాలుగు వేల కోట్లకు పైగా ఆస్తి, పంట, రోడ్లు, రైల్వే లైన్లకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ అధికారులు ఇంత వరకు వరద నష్టాన్ని అంచనా వేయలేకపోవడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరద విపత్తు కింద కొన్ని నిధులు తక్షణ మే కేటాయించి ఆదుకోక పొతే ఇప్పటి వరకు జరిగిన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా  అదే స్థాయిలో జరిగిందని చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందని జనం భయపడుతున్నారు.  ఈ పాపం ఎవరిది? వర్షాలు వస్తాయని, ఊహించని స్థాయిలో భారీ నుండి అతి భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా అధికారులు ఆదమరిచారు. మొదట తుపాన్ వచ్చినప్పుడు శ్రీశైలం, సోమశిల, కండలేరు జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. అప్పటికే వాగులు, వంకలు, చెరువులు, పిల్లకాల్వలతో సహా నిండిపోయాయి. రెండో తుపాన్ ఇంకా బలంగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. కానీ నీటిపారుదల శాఖ అధికారుల మొద్దు నిద్ర, పేద ప్రజలకు శాపంగా మారింది. అప్పటికే జలాశయాలలో ఉన్న నీటిని విడుదల చేసి ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదని పలువురు విమర్శిస్తున్నారు. అనుకున్నట్టుగానే రెండో తుఫాన్ ప్రజల తలరాతలను మార్చేసింది. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో జలాశయాల గేట్లు ఎత్తేశారు. దీంతో పెన్నానది పోటెత్తింది. రాత్రికి రాత్రే పెన్నా పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. తెల్లారే సరికి నిస్సహాయ స్థితిలో నీట మునిగిన ఇళ్లను ప్రజలు వదిలి పోవాల్సి వచ్చింది. రహదారులు తెగిపోయాయి. రైళ్ల రాక పోకలు ఆగిపోయాయి. లక్షలాది మంది వీధిన పడ్డారు. ఇదంతా ఎవరు చేసిన పాపం? సీమ వాసులకు ఇది శాపంగా మారింది. ఇలా ఉండగానే మరో గండం వచ్చింది.. మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇంకా ఎంత కాలం ఈ దుర్భర పరిస్థితులను భరించాలో అని ప్రజలు దిక్కుతోచని స్థితిలో భయపడుతున్నారు.

వైసీపీ పిలిచింది.. రానని చెప్పా! జగన్ కేసులపై జేడీ లక్ష్మినారాయణ సంచలనం.. 

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా సంచనాలకు కేరాఫ్ గా నిలిచారు లక్ష్మీనారాయణ. ఆయన పర్యవేక్షణలో సాగిన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరువాత  రాజకీయాల్లోకి వచ్చారు లక్ష్మినారాయణ. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ హవాలో జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చారు లక్ష్మినారాయణ. ఆయన తిరిగి రాజకీయాల్లో వస్తున్నారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ మీడియా ఇంటర్వూలో తన రాజకీయ కార్యాచరణపై కీలక విషయాలు చెప్పారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.  తనకు జగన్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చిందని చెప్పారు లక్ష్మినారాయణ.  వైసీపీ ఎంపీతో పాటు మరికొందరు నాయకులు తనను కలిసి.. తమ పార్టీలోకి రావాలని కోరారని చెప్పారు. అయితే తాము వైసీపీలోకి రాలేనని చెప్పానని లక్ష్మినారాయణ వెల్లడించారు. తాను జగన్ కేసును అంత సీరియస్ గా తీసుకున్నా ప్రజలు మాత్రం బ్రహ్మరథం పట్టారని అలాంటప్పుడు ఆయన పార్టీలో చేరొచ్చుగా అన్న ప్రశ్నకు .. ‘ఒక వ్యక్తి మీద కేసులు వేరు.. ఆయన చెప్పిన విధానం వేరు. ఆయన చెప్పిన కొన్ని విధానాలతో ప్రజలు ఆదరించారు. దీంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు’ అని సీబీఐ మాజీ జేడీ సమాధానమిచ్చారు. జనసేనలోకి మళ్లీ వెళతారా అన్న ప్రశ్నకు జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర సమాధానం చెప్పారు. జనసేనతో మళ్లీ చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు. మళ్లీ వారు పిలిస్తే వెళుతాను.. జనసేన పార్టీ విధానాలు నచ్చడం వల్లే అందులో చేరానని తెలిపారు. కొంతకాలం దూరంగా ఉన్నా మళ్లీ చేరే అవకాశం ఉంటుంది.. అయితే ఏ సమయం అనేది చెప్పలేను అని జనసేన రీ ఎంట్రీకి సంబంధించి జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు గతంలో జరిగిన ప్రచారంపైనా స్పందించారు లక్ష్మినారాయణ.  తాను ‘జనధ్వని’ అనే పార్టీ కోసం రిజిస్టర్ చేసుకున్నానే ప్రచారం జరిగిందని.. కానీ అది వేరే వాళ్ల పార్టీ అని చెప్పారు. ఆ పార్టీని తనకిస్తానని ఆఫర్ వచ్చింది నిజమేనని అంగీకరించారు. కానీ సొంతంగా తాను పార్టీకి రిజిస్టర్ చేయలేదని చెప్పారు లక్ష్మినారాయణ. లోక్ సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ కూడా ఆయన పార్టీని నడిపించాల్సిందిగా తనను కోరారని సీబీఐ మాజీ జేడీ వెల్లడించారు.  

రేవంత్ రెడ్డితో  ఈటల రాజేందర్ డీల్? కేసీఆర్ టార్గెట్ రాజకీయం..

తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాకిచ్చారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. తనకు ఎదురులేదని భావించే సీఎం కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ కొట్టారు. హుజురాబాద్ ఫలితాన్ని గులాబీ బాస్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. అయితే హుజురాబాద్ ఫలితం కాంగ్రెస్ లోనూ చిచ్చు రేపింది. రాజేందర్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి సాయం చేశారని కొందరు పీసీసీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టారనే ఆరోపణలు రేవంత్ రెడ్డిపై వచ్చాయి. హుజురాబాద్ కాంగ్రెస్ పంచాయితీ ఢిల్లీ వరకు చేరింది. ఏఐసీసీ వార్ రూమ్ సమావేశంలో పీసీసీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందనే ప్రచారం జరిగింది.  హుజురాబాద్ మంటలు కాంగ్రెస్ లో అలా ఉండగానే తాజాగా మరో ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లోనూ ఈటల రాజేందర్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రహస్య     ఒప్పందం చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎలాగైనా షాకివ్వాలనుకుంటున్న ఈటల రాజేందర్ ప్రయత్నాలకు కాంగ్రెస్ సాయం చేస్తుందని అంటున్నారు. మొత్తం తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో కరీంనగర్ లో 2, ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ లో ఒక్కో స్థానం ఉన్నాయి.  అయితే ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుండగా. రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది కాంగ్రెస్. ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు.  దీంతో  మిగిలిన ఆరు చోట్ల ఇండిపెండెంట్లకు చాన్సివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. కరీంనగర్‌లో ఈటల రాజేందర్ మద్దతుతో మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం ఈటల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రవీందర్ సింగ్ ను గెలిపించుకుని కేసీఆర్ మరో షాక్ ఇవ్వాలని చూస్తున్న ఈటల.. కాంగ్రెస్ మద్దతు కోరారని తెలుస్తోంది. కరీంనగర్ పై రేవంత్ రెడ్డితోనూ రాజేందర్ మాట్లాడారని అంటున్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కూడా సై అన్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి, రాజేందర్ సూచన మేరకే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి రవీందర్ సింగ్ మద్దతు కోరారని చెబుతున్నారు. కరీంనగర్ లో ఈటల నిలబెట్టిన రవీందర్ సింగ్ కు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్‌లో ఆదివాసీ నేతగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని పుష్పారాణికి అధికారికంగానే కాంగ్రెస్‌ మద్దతిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అభ్యర్థికే బీజేపీ మద్దతు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. నల్లగొండలో బరిలో ఉన్న ఆరుగురు స్వతంత్రుల్లో ఇద్దరు కాంగ్రెస్‌ జెడ్పీటీసీలే ఉన్నారు. దీంతో అక్కడ నిర్ణయాన్ని ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి వదిలేశారు. ఎన్నికలు జరిగే నాటికి ప్రతి చోటా ఒక అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాము పోటీ చేస్తున్న చోట అయినా.. లేకపోతే ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చి అయినా ఒకటి రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ , బీజేపీ నేతలు ఉన్నారు. మొత్తంగా హుజురాబాద్ తరహాలోనే రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.