కేసీఆర్ కు డబుల్ షాక్.. గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ హీట్
posted on Nov 25, 2021 @ 8:28PM
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని తలనొప్పులు వస్తున్నాయి. శాసనమండలి ఎన్నికల సెగ అధికార పార్టీకి భారీగానే తగులుతోంది. అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఇద్దరు ముఖ్య నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ రాజీనామా చేశారు. స్థానిక సంస్థల కోటా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రవీందర్ సింగ్.. రెండు రోజులుగా పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ బయటికి వచ్చారు రవీందర్ సింగ్. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటైన పదాలతో ఆయన లేఖ రాశారు.
తనకు అనేక సార్లు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి సీఎం కేసీఆర్ మాట తప్పారని రాజీనామా లేఖలో గుర్తు చేశారు రవీందర్ సింగ్. ఉద్యమకారులను పక్కన పెట్టి.. పార్టీ చేరిందే తడవుగా పదవులిచ్చి ఉద్యమకారులను అవమానించారని అన్నారు. ఉద్యమకారుల పరిస్థితి చూసి కన్నీళ్లు వచ్చినా.. తెలంగాణ అభివృద్ధి పేరిట అన్ని భరిస్తూ వచ్చామన్నారు రవీందర్ సింగ్. ఉద్యమ ద్రోహులకు అందలమెక్కిస్తూ.. ఉద్యమకారులకు అవమానాలు చేస్తుంటే బాదేస్తోందని అన్నారు. కరీంనగర్ జిల్లాలో కొందరి చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయినా పట్టించుకోవడం లేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమకారులకు స్థానం, గౌరవం లేదని గుర్తించి పార్టీకి రాజీనామా చేస్తున్నానని తన లేఖలో స్పష్టం చేశారు రవీందర్ సింగ్.
ఇక ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి షాక్ తగిలింది. సీనియర్ నేత గట్టు రామచందర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. మీరు ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానన్నారు. అందుకే టీఆర్‌ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు గట్టు రామచంద్రరావు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తారని గట్టు రామచంద్రరావు ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో క్రియాశీలకంగా గట్టు పనిచేశారు. తరువాత వైసీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. పార్టీ వాయిస్ ను మీడియా ముందు బలంగా వినిపించారు.