కరకట్టలు తవ్వేశారు.. జగన్ సర్కార్ కు నోటీసులు.. గలాబీకి షాక్.. మళ్లీ గండం.. టాప్ న్యూస్@7PM
posted on Nov 25, 2021 @ 6:31PM
నెల్లూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. గంగపట్నం గ్రామాన్ని సందర్శించారు. ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి వాటర్ మ్యానేజ్మెంట్ తెలియదని మండిపడ్డారు. పక్కజిల్లాల్లో 60 మంది చనిపోయారని, పెద్ద హుదూద్ తుఫాన్‌లో 20 మంది మాత్రమే చనిపోయారని గుర్తు చేశారు. ఇది కేవలం మానవ తప్పిదమేనని, ఇసుక దోపిడీకి పాల్పడి జేబులు నింపుకోవడానికి కరకట్టలు తొవ్వేశారని విమర్శించారు.
----
ఎయిడెడ్ ఆస్తులపై కన్నేసి తెచ్చిన జీఓలు రద్దు చేసే వరకూ పోరాడుతామని టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పేద విద్యార్థుల పాలిట వరమన్నారు. ప్రభుత్వాలు విద్య కోసం ఎంత ఖర్చు చేసినా తక్కువేనన్నారు. శాసనసభ, మండలి, బయట కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నామని ఆయన పేర్కన్నారు
--------
రాష్ట్రంలోని మూడు పార్టీలు కూడబలుక్కుని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు మానవ తప్పిదం అనడం దారుణమన్నారు. వరదల వల్ల ప్రాణనష్టం కలుగకుండా కాపాడగలిగామన్నారు. రెండు ఘటనల్లో మినహా ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదన్నారు.
--------
ఏపీ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడి కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక కోరుతూ తెలుగు రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులిచ్చింది.ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. 6 వారాల్లో సమాధానమివ్వాలని ఏపీకి మరోసారి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులిచ్చింది. నివేదిక ఇవ్వకపోతే చట్టబద్ధంగా తీసుకునే చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించింది.
-------
ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. రైతులకు మద్దతు ధర రావాలని ఐకేపీ సెంటర్లను మొదట ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని శ్రీధర్ బాబు చెప్పారు.
-----
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని, సాగు, తాగు అవసరాల్లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేశారని కేఆర్‌ఎంబీ పేర్కొంది. సముద్రంలోకి వృధాగా 55.966 టీఎంసీల కృష్ణా జలాలు పోతున్నాయని, శ్రీశైలం జలాశయం నిల్వ 94.910 టీఎంసీలకు పడిపోయిందని కేఆర్‌ఎంబీ తెలిపింది. సాగర్, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ లేఖలో ఆదేశించింది.
-------
తమిళనాడులో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.తూత్తుకుడి, తేన్ కాశి, తిరునల్వేలి, చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర సర్కారు ఆ నాలుగు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాల ధాటికి తూత్తుకుడి ఎయిర్ పోర్టులో రన్ పైకి భారీగా నీరు చేరింది. దాంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలను దారి మళ్లించారు.
------
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈ నెల 26 నుంచి వర్షాలు మొదలవుతాయని, 27న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. గుంటూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.దీంతో ఇటీవల వర్షాలకు అల్లాడిపోయిన జనాలు.. ఇప్పడు ఏమవుతుందోనని భయపడుతున్నారు.
----
సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో నొప్పితో ఆయన పూణెలోని రూబీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ల పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని రూబీహాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవ్‌ధూత్ తెలిపారు. అన్నాహజారేకు ప్రస్తుతం 84 సంవత్సరాలు.
-----
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడు. 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27 సాయంత్రం హైదరాబాదు శిల్పకళా వేదికలో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఒకే వేదికపై బాలయ్య, బన్నీ కనువిందు చేయనుండడం పట్ల అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.