కొత్త పొత్తులతో ఎస్పీ మహా కూటమి! యూపీ సీన్ మారుతోందా?
posted on Nov 25, 2021 @ 3:28PM
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు విపక్ష పార్టీలు శక్తియుక్తులన్నీ ధారపోసి,కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇంతవరకు వచ్చిన సర్వేలు అన్నీ బీజేపీకి కొంత అనుకూలంగా ఉన్నా, అధికార పార్టీ యూపీ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడంలేదు. గత ఎన్నికల్లో సాధించైనా 300 ప్లస్ స్థానాలతో మళ్ళీ విజయం సాధించి, 2024 ఎన్నికల నాటికి విపక్షాల నైతిక్ స్థైర్యాన్ని మరింతగా దెబ్బ తీసేందుకు వ్యుహాత్మకంగా పవులు కదుపుతోంది.
రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాద్ సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్’ లు ఒక్కొక ప్రాంతం బాధ్యతలు తీసుకున్నారు.మరో వంక ప్రధాని నరేంద్ర మోడీ, వారంలో కనీసం ఒక సారైనా యూపీలో కాలు పెడుతున్నారు. శంఖుస్థాపనలు, ప్ర్రారంభోత్సవాలలో పాల్గొని ఎన్నికల ప్రసంగాలతో, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో పాటుగా, తాజాగా కొవిడ్ ఫ్రీ రేషన్ మరో ఆరు నెలలు పొడిగించింది. ఇంకా అనేక చర్యలు తీసుకుంటోంది.
ఇదిలా ఉంటే,ఇంతాకాలం ఒంటరిగా పోటీ చేస్తామని, ఒంటరిగానే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తపరిచిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఇప్పుడు పొత్తుల కోసం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే వివిధ పార్టీలతో ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై సంప్రదింపులు జరుపుతోంది. గతంలో 2017లో విఫలమైన మహా ఘటబంధన్’ వైపుగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఉత్తర్ప్రదేశ్ ఇన్ఛార్జ్ సంజయ్ సింగ్తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ లఖ్నవూలో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం ఎస్పీతో పొత్తుపై సంప్రదింపులు జరుగుతున్నాయని సంజయ్ సింగ్ వెల్లడించారు.
“ఉత్తర్ ప్రదేశ్ అవినీతి రహితంగా మార్చడానికి, శాంతి భద్రతలను కాలరాసిన ప్రభుత్వాన్ని తొలగించడానికి చేపట్టాల్సిన ఉమ్మడి ఎజెండాపై వ్యూహాత్మక చర్చ జరిగింది. ఎస్పీతో పొత్తుకు సంబంధించి ఇప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. నేడు జరిగిన భేటీలో ఓ అర్థవంతమైన చర్చ జరిగింది. త్వరలోనే దీని గురించి ప్రకటిస్తాం”అని, సంజయ్ సింగ్, చెప్పారు.
మరోవంక అప్నా దళ్(కె) పార్టీ అధ్యక్షురాలు కృష్ణ పటేల్తోనూ అఖిలేశ్ యాదవ్సమావేశమయ్యారు. తాము ఎస్పీతో కలిసి పోటీ చేయనున్నట్లు ఈ సమావేశం అనంతరం కృష్ణ పటేల్ ప్రకటించారు. సీట్ల పంపకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. భావ సారుప్యత ఉన్న ఇతర పార్టీలను తమతో కలుపుకునేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు.రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు జయంత్ చౌదరీతోనూ సమావేశమైన అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు.
అదలా ఉంటే వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్’లో పోటీకి సిద్దమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ-ఆప్, పంజాబ్, గోవా తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌పై గట్టిగా దృష్తి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే ఎస్పీతో పొత్తుకు సముఖతతో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్, బీస్పీలతో పాటుగా ఎం ఐ ఎం కూడా యూపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఎంఐఎం ఏకంగా వంద స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మరోవంక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా గట్టిగా శ్రమిస్తున్నారు. అయినా, కురువృద్ధ పార్టీకి కాలం అంతగా కలిసోస్తున్నట్టు లేదు. ప్రియంకా వాద్రా సొంత సోదరిగా భావించే రాయి బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే, ఆమెతో పాటుగా బీఎస్పీ ఎమ్మెల్యే వందనా సింగ్ కూడా కమలం గూటికి చేరారు. మరో వంక గత వారం పదిరోజులుగా ఎస్పీ, బీస్పీ,కాంగ్రెస్ తదితర పార్టీల కీలక నేతల బీజేపీలో చేరేందుకు బారులు తీరుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఎస్పీ, బీఎస్పీకి చెందిన ముగ్గురేసి ఎమ్మెల్సీలు బీజేపీలో చేరారు.ఈ నేపధ్యంలోనే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న బాబాయ్ శివపాల్ యాదవ్ తో సయోధ్య కుదుర్చుకోవడంతో పాటుగా ఇంకొన్ని చిన్నా చితక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్, బీఎస్పీ వంటి పెద్ద పార్టీలతో మాత్రం పొత్తు ఉండదని అంటున్నారు.
అయితే, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కడుపుతున్న అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలతో కలిసి మరోమారు మహా కూటమి ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు అంటున్నారు.