కేసీఆర్ వచ్చారు.. గవర్నర్ రాలేదు! ఇద్దరూ ఒకే వేదిక పంచుకోరా..?
posted on Dec 4, 2021 @ 1:01PM
తెలంగాణ గవర్నర్ తమిళి సైతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు విభేదాలు ముదిరిపోయాయా? ఒకే వేదిక పంచుకోవడానికి ఇద్దరూ ఇష్టపడటం లేదా? అంటే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ సాగుతోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో గవర్నర్, ముఖ్యమంత్రి కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఇద్దరూ కలిసి పాల్గొనడం లేదు. గవర్నర్ వచ్చిన సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొడుతున్నారు. ఇక కేసీఆర్ వస్తే .. ఆ కార్యక్రమానికి గవర్నర్ దూరంగా ఉంటున్నారు.
తాజగా శనివారం హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గవర్నర్ తమిళి సై మాత్రం హాజరు కాలేదు.
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ చాలా ముఖ్యమైన అంశం. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఏర్పాటైంది. సీజేఐ జస్టిస్ రమణ కృషితో ఇది సాధ్యమైంది. ఇటీవలే జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీజేఐ హాజరయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆధ్వర్యంలోనే శనివారం సదస్సు నిర్వహించారు. ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి గవర్నర్ ఎందురు రాలేదన్నది ఇప్పుడు చర్చగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ వచ్చారు కాబట్టే గవర్నర్ రాలేదని కొందరు చెబుతున్నారు. కొంత కాలంగా గవర్నర్ తో కేసీఆర్ కు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండగా.. తాజాగా జరిగిన ఘటన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆ వేడుకలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ పాల్గొన్నారు. కాని సీఎం కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. రాజ్ భవన్ లో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నట్లు సీఎంవో నుంచి రాజ్ భవన్ వర్గాలకు ముందు సమాచారం వచ్చింది. కాని చివరి నిమిషంలో కేసీఆర్ హాజరుకాలేదు. గవర్నర్ తో విభేదాల వల్లే రాజ్ భవన్ కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లలేదనే ప్రచారం జరిగింది. అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ దినోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి హాజరుకాకపోవడంపై విమర్శలు వచ్చాయి.
గతంలో నరసింహన్ గవర్నర్ కు ఉన్నప్పుడు తరుచూ రాజ్ భవన్ వెళ్లేవారు కేసీఆర్. వారం వారం వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. పండుగలు, ముఖ్యమైన రోజులు ఏమొచ్చినా రాజ్ భవన్ వెళ్లి నరసింహన్ కు కేసీఆర్ విషెస్ చెప్పేవారు. ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ నరసింహన్ ను ఆహ్వానించేవారు. అయితే తమిళి సై గవర్నర్ గా వచ్చిన కొన్ని రోజులకే సీన్ మారిపోయింది. రాజ్ భవన్ వైపే వెళ్లడం లేదు కేసీఆర్. పండుగల సమయంలోనూ ఆమెకు విషెస్ చెప్పడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదు. మహాత్మ గాంధీ జయంతి రోజున ప్రతి ఏటా బాపుఘాట్ లో గవర్నర్ తో కలిసి సీఎం నివాళి అర్పిస్తారు. కాని ఈసారి గాంధీ జయంతి రోజున బాపుఘాట్ వెళ్లలేదు కేసీఆర్. గవర్నర్ తో విభేదాల కారణంగానే ఆయన గాంధీకి నివాళి అర్పించేందుకు వెళ్లలేదనే ప్రచారం జరిగింది.
మరోవైపు గవర్నర్ తమిళి సై కూడా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పలు సార్లు ప్రకటనలు చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసింది. యూనివర్శిటీ వీసీల నియామకంలోనూ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించి.. కేసీఆర్ సర్కార్ వార్నింగ్ సిగ్నల్ పంపించిందనే చర్చ ఉంది. పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసినా.. గవర్నర్ తమిళి సై ఆమోదించ లేదు. రెండు నెలల పాటు ఆ పైల్ ను పెండింగులో పెట్టారు. అయినా గవర్నర్ ను వెళ్లి కలవలేదు కేసీఆర్. చివరకు పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపించారు. ఇలా వరుసగా జరుగుతున్న పరిణమాలతో గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందని, అందుకే ఇద్దరూ ఒకే వేదిక పంచుకోవడం లేదనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.