200 కోట్ల మోసం!.. సీబీఐ తరహా ఎంక్వైరీ.. శిల్పాచౌదరి ఉక్కిరిబిక్కిరి..
posted on Dec 4, 2021 @ 10:41AM
శిల్పాచౌదరి పక్క ప్రొఫెషనల్ క్రిమినల్‌లా సమాధానాలు చెబుతోంది. పోలీసులు పక్కా సమాచారంతో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆమె మాత్రం పొంతనలేని ఆన్సర్స్ చెబుతున్నారు. ఏమో.. తెలీదు.. గుర్తులేదు.. ఇలా పొడిపొడిగా మాట్లాడుతున్నారు. పోలీసులు ఊరుకుంటారా? ఎంతమంది క్రిమినల్స్‌ను చూసుంటారు. అందుకే, ఆధారాలను ఆమె ముందు ఉంచి.. సీబీఐ తరహాలో గుచ్చి గుచ్చి విచారిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నార్సింగిలోని ఎస్‌వోటీ కార్యాలయంలో మహిళా పోలీసు అధికారి సమక్షంలో విచారణ జరిపారు. కళ్ల ముందే సాక్షాలు ఉంచి.. సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా, మొండిఘటం అంత ఈజీగా దారికి రావట్లేదట. ముందు తనకేం తెలీదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినా.. ఆ తర్వాత కాస్త ఎమోషనల్ అయ్యారట. మధ్యలో ఓసారి ఏడ్చారు కూడా. అయినా, తమ విచారణలో శిల్పాచౌదరి చాలా కన్నింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారని పోలీసులు అంటున్నారు.
బాధితులు శిల్పాకు డబ్బులు ఇచ్చినట్టు.. ఆమె తీసుకున్నట్టు.. ఎక్కడా పక్కా కాగితాలు రాసుకోకపోవడంతో కేసు క్లిష్టతరంగా మారింది. బాధితులంతా బాగా సంపన్నులు కావడం.. అదంతా బ్లాక్‌మనీ కావడంతో.. ఎలాంటి పత్రాలు లేకుండానే డబ్బులు చేతులు మారాయి. అదే ఇప్పుడు శిల్పాచౌదరికి అనుకూలంగా మారాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం వారి నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేశానని పోలీసులతో శిల్పా చెబుతున్నారు. వారి నుంచి డబ్బు తీసుకున్నట్టు.. మళ్లీ ఇచ్చినట్టు ఎలాంటి ఆధారాల్లేవని తేల్చేశారు. ఆ వివరాలను నార్సింగి పోలీసులు రికార్డ్ చేసుకున్నారు.
వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరిని రెండురోజులు పోలీసు కస్టడీకు తీసుకున్నారు. గండిపేట సిగ్నేచర్ విల్లాస్‌లో ఉంటున్న శిల్పాచౌదరి దంపతులు కిట్టీ పార్టీలతో ప్రముఖ కుటుంబాలకు చెందిన మహిళలతో స్నేహం చేశారు. భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్, సినీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలిస్తామంటూ బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు మూడు కేసులు నమోదు చేసి శిల్పా దంపతులను అరెస్టు చేశారు. కస్టడీలో సమగ్ర వివరాలు రాబడుతున్నారు.
శిల్పా చౌదరి నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు ఎస్వోటీ పోలీసులు. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందిన మహిళల నుంచి రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్టు భావిస్తున్నారు. ఆ నగదంతా ఎక్కడ దాచారో పోలీసులకే అంతు చిక్కడం లేదు. బ్యాంక్ ట్రాన్జాక్షన్స్‌తో కాకుండా అంతా బ్లాక్‌మనీ కావడంతో నగదు లావాదేవీల గుట్టు వీడటం లేదు. రియల్ ఎస్టేట్, సినిమా పెట్టుబడుల పేరుతో శిల్పా చౌదరినే మోసం చేశారా? లేక, బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునేందుకు బాధితులు ప్రయత్నించారా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు.
బాధితుల నుంచి శిల్పాచౌదరి దంపతులు తీసుకున్న భారీ మొత్తంతో కొనుగోలు చేసిన భూములను కూడా పోలీసు అధికారులు పరిశీలించినట్టు సమాచారం. భూ లావాదేవీలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ నుంచి తీసుకోనున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏడాది కాలంలో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. హవాలా మార్గంలో విదేశాలకూ భారీ మొత్తాన్ని తరలించినట్టు కూడా అనుమానాలు ఉన్నాయి. పోలీసులకు కేవలం ముగ్గురు మాత్రమే ఫిర్యాదు చేయగా.. శిల్పా చౌదరి బాధితుల సంఖ్య భారీగానే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.