విజయసాయిని సైడ్ చేస్తున్నారా? ఢిల్లీలో ప్రాధాన్యత తగ్గించేశారా?
posted on Dec 4, 2021 @ 11:58AM
ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియా సమావేశం పెట్టారు. రొటీన్‌గానే టీడీపీపై, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏపీకి ఏం ఒరగబెట్టిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా 4 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. బీజేపీతో అంటకాగినప్పుడు టీడీపీకి ఏపీ ప్రయోజనాలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అంతా బాగానే ఉంది. వైసీపీ ఎంపీలు స్క్రిప్ట్‌ను బట్టీపట్టి బాగానే అప్పజెప్పారు. కానీ, ఢిల్లీలో ఈ విమర్శలన్నీ చేయాల్సింది ఫస్ట్‌టైమ్ ఎంపీ అయిన మార్గాని భరత్ కాదుగా..? వైసీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయిరెడ్డి కదా ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నలు సంధించాల్సింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. విజయసాయికి వ్యతిరేఖంగా సంథింగ్ సంథింగ్ అనే చర్చ.
అవును, ఉత్తరాంధ్రకైనా, ఢిల్లీకైనా.. జగన్‌రెడ్డికి సామంతరాజు విజయసాయిరెడ్డినే అంటారు. విజయసాయికి ఉత్తరాంధ్ర జిల్లాలను ధారదత్తం చేసేశారనే ప్రచారం ఉంది. ఢిల్లీ పాలిటిక్స్‌ను కూడా ఆయన చేతిలోనే పెట్టేశారు. అయితే విజయసాయి తానే సొంతంగా ఎదిగే ప్రయత్నం చేశారంటారు. ఢిల్లీలో బీజేపీకి, మోదీకి సన్నిహితుడిగా మారాడు. పర్సనల్ ఇమేజ్ పెంచుకున్నారు. స్వయానా.. ప్రధాని మోదీనే.. హౌ ఆర్ యూ సాయిరెడ్డి అని పిలిచేంత చనువు సంపాదించారు. అందుకే, విజయసాయిరెడ్డి ఎదుగుదల జగన్‌లో అనుమానం పెరిగిందని అంటారు. రఘురామ కేసులో జగన్ బెయిల్ రద్దై.. జైలుకు వెళ్లాల్సి వస్తే.. తమిళనాడు తరహాలో జగన్ ప్లేస్‌లో విజయసాయిరెడ్డితో బీజేపీ గేమ్ ప్లాన్ చేసిందనే ప్రచారమూ జరిగింది. అందుకే ఎప్పటినుంచో విజయసాయిపై జగన్‌రెడ్డి ఓ కన్నేసి ఉంచారంటారు. అటు, ఉత్తరాంధ్ర జిల్లాలో విజయసాయి అరాచకాలపై ముఖ్యమంత్రి జగన్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతూనే ఉన్నాయని చెబుతారు.
ఇలా చాలా కారణాలు, అంతకుమించి అనుమానాలతో క్రమక్రమంగా విజయసాయిరెడ్డి ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తున్నారు జగన్‌రెడ్డి. ఢిల్లీలో విజయసాయి ఇప్పటివరకు చూస్తున్న బాధ్యతలు.. కొత్తగా సలహాదారుగా నియమించిన వ్యక్తికి కట్టబెట్టారు. ఇటీవల రెండేళ్ల పాలన సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగిన వేడుకలకూ విజయసాయికి ఎంట్రీ దక్కలేదు. తాజాగా, ఢిల్లీలో సైతం కేవలం పార్లమెంట్ హౌజ్ లోపలి వరకే ఆయన పవర్‌ను పరిమితం చేశారని చెబుతున్నారు. అందుకే, విజయసాయిరెడ్డితో కాకుండా.. ఎంపీ భరత్‌తో వైసీపీ తరఫున ఎంపీల ప్రెస్‌మీట్ పెట్టించారని.. కావాలనే విజయసాయిరెడ్డిని తప్పించారని అంటున్నారు. క్రమక్రమంగా ఎన్నికల నాటికి విజయసాయిరెడ్డి ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేసి.. పక్కనపెట్టేయాలనేది జగన్ భావనలా కనిపిస్తోంది.