గులాబీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబుల్.. కేసీఆర్ సర్వేలో ఏముందో?
posted on Dec 19, 2021 @ 6:30PM
తెలంగాణ రాజకీయాలలో తెరాస ఆధిపత్యానికి రోజులు చెల్లాయా?పార్టీ అధినాయకత్వంలో ముందున్న ధీమా ఇప్పుడు సన్నగిల్లిందా? ఓటమి తప్పదేమో అన్న భయం తెరాస నాయకత్వాన్ని వెంటాడుతోందా? అంటే అన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా, తెరాస విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ప్రసంగంలో ఒక విధమైన బేల తనం, భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నిజానికి హుజూరాబాద్ ఓటమితోనే కేసీఆర్’లో కలవరం మొదలైంది,ఇక అక్కడి నుంచి బయటకు ఎన్ని బింకాలుపోయినా, లోపలి భయం మాత్రం గుండెలను తాకుతోందని, అదే బేలతనం, భయం తెరాస విస్తృత స్థాయి సమావేశంలో వ్యక్తమైందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు జనంలోనే ఉండాలని, ఆదేశించారని అంటున్నారు.
ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రజల్లో రోజురోజుకు ప్రభుత్వం పట్ల వ్యతిరేత పెరుగుతోందని, అన్ని వర్గాలలో అసహనం ఎక్కువ అవుతోందని, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని, ప్రజలు తమను నిలదీస్తున్నారని అంటున్నారు. దీంతో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తమ పరిస్థితి మారిందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు పోతారని వార్తల నేపధ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి, మరో వంక టికెట్ వస్తుందో రాదో అన్న సందేహం, ఈ అన్నిటినీ మించి ప్రజల్లో క్‌రమంగా వేగంగా పెరుగుతున్న వ్యతిరేకతతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులలో గుబులు చోటు చేసుకుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్, వరి పంట కొనుగోలు విషయంలోకేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం, ఢిల్లీ వెళ్లి వట్టి చేతులతో వెనక్కి రావడం,ఇప్పుడు మళ్ళీ మంత్రులనుఢిల్లీకి పంపి కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించడం, గతంలో కేంద్రంతో సంబంధం లేకుండ చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించి ఇప్పుడు కేంద్రం బాయిల్డ్ రైస్ కొనదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కిలో ఒడ్లు కూడా కొనదని ప్రకటించడం, ఇలా దొడ్లో దూడని కట్టేసి సంతలో బేరం ఆడినట్లు, పొంత లేని ప్రకటనలు చేయడంతో రైతులు రాష్ట్ర ప్రభుత్వం మీద గుర్రుగ ఉన్నారని ఎమ్మెల్యేలు అంటున్నారు.నిజానిజాలు ఎలా ఉన్నా రైతులకు సమాదానం చెప్పుకోవలసింది, రాష్ట్ర ప్రభుత్వమే కానీ, కేంద్రం కాదని ఎమ్మెల్యేలు, నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయినా ఏ కార్యక్రమం కూడా సరిగ్గా అమలు కాకపోవడం.. ముఖ్యంగా దళితబందు అమలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడి మాదిరిగానే ఉండడంతో జనాల్లో తిరిగేందుకు ఎమ్మెల్యేలు జంకుతున్నారని అంటున్నారు. మొత్తానికి, ముఖ్యమంత్రి రాజకీయ ఎత్తుగడలు, పిల్లికి చెలగాటం, ఎలుకకు ఎలుకకు ప్రాణ సంకటంగా మారిందని అంటున్నారు.