ఒమిక్రాన్, డెల్టా కలిస్తే సూపర్ వేరియంట్! అదే జరిగితే పెను విలయమే?
posted on Dec 19, 2021 @ 2:55PM
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలోని 89 దేశాలకు పాకేసింది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కారణంగా ఒమిక్రాన్ కేసులు 1.5 నుండి 3 రోజుల్లో రెట్టింపు అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఈ సమాచారాన్ని వెల్లడించింది. డెల్టా కంటే ఓమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోందనడానికి ఆధారాలు ఉన్నాయని సభ్య దేశాలకు ఇచ్చిన సాంకేతిక సమాచారంలో తెలిపింది. అలాగే జనాభాలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగించే అంశమని డబ్ల్యుహెచ్‌వో తెలిపింది.
ఒమిక్రాన్, డెల్టా స్ట్రెయిన్ ఎవరికైనా సోకితే, కరోనా కొత్త సూపర్-వేరియంట్ ఏర్పడుతుందని మోడర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పాల్ బర్టన్ చెప్పారు. యూకేలో డెల్టా, ఓమిక్రాన్ వ్యాప్తి వేగం సూపర్-వేరియంట్ భయాలను పెంచింది. రెండు వైరస్‌లు కలిసి జన్యువులను పంచుకోగలవని, మార్పిడి చేయగలవని ఆయన చెప్పారు. డాక్టర్ బర్టన్ మాట్లాడుతూ, సాధారణంగా మానవులకు కరోనా ఒక ఉత్పరివర్తన జాతి మాత్రమే సోకుతుందని.. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో, రోగికి ఒకేసారి రెండు జాతులు సోకుతాయని చెప్పారు. డెల్టా, ఒమిక్రాన్ రెండూ ఒకే కణానికి సోకినట్లయితే, అవి ఒకదానితో ఒకటి డీఎన్ఏ మార్పిడి చేసుకోవచ్చు. ఈ రెండూ కలిస్తే, కరోనా కొత్త సూపర్ స్ట్రెయిన్ ఏర్పడే ఆవకాశాలు ఉంటాయని డాక్టర్ బర్టన్ వివరించారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు మధ్య భారతదేశంలో మూడో వేవ్‌కు దారి తీస్తుందనే షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ ప్యానెల్ ప్రకారం, ఫిబ్రవరి నాటికి దేశంలో మూడవ కరోనా వేవ్‌ను Omicron రూపంలో చూడొచ్చని తెలుస్తోంది. ఈ నెలలో కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరిలో దేశంలో కరోనా మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ప్యానల్ హెడ్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ చెప్పారు. అయితే, ఇది రెండో వేవ్ కంటే ఎక్కువ ప్రమాదకరం మాత్రం కాదన్నారు. ఫిబ్రవరిలో కొత్త రోగులు రెండవ వేవ్ సమయంలో కంటే తక్కువగా ఉంటారని తెలిపారు.
నవంబర్ 26న ఒమిక్రాన్ ను ఆందోళనకర వైవిధ్య స్థితిగా డబ్ల్యుహెచ్ ప్రకటించింది. అయితే ఈ కొత్త వేరియంట్ ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రస్తుతానికి ఇంకా తెలియదని డబ్ల్యుహెచ్‌వో చెబుతోంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్ గురించి చాలా తక్కువ డేటా అందుబాటులో ఉందనీ, దాని ప్రకారం ఏదైనా చెప్పడం కష్టమనీ డబ్ల్యుహెచ్‌వో అంటోంది. ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్ ప్రభావానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రాలేదు. కరోనా మునుపటి వేరియంట్‌ల వలె ఒమిక్రాన్ ప్రాణాంతకం కాదనే విషయం ఒక్కటే ఏకైక ఉపశమనం అని డబ్ల్యుహెచ్‌వో తెలిపింది. అయితే ఇది వ్యాప్తి చెందుతున్న వేగాన్ని బట్టి, మాస్క్‌లు, శానిటైజేషన్ సోషల్ డిస్టెన్స్ చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉందని డబ్ల్యుహెచ్‌వో చెబుతోంది.