జగన్ గల్లంతే.. ఆ ముగ్గురితో 20 శాతం ఓట్లు లాస్! వైసీపీ నేత సంచలనం..
posted on Dec 19, 2021 @ 10:01AM
జగన్ కు కౌంట్ డౌన్ మొదలైనట్టేనా? ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కథ ముగిసినట్టేనా? అంటే వైసీపీ నేతలే అవునని చెబుతున్నారు. ఏదో అంతర్గత సమావేశాల్లో కాదు బహిరంగ సభల్లోనే ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు సొంతపార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. వారు అసలు వైసీపీకి హితులో, శత్రువులో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. వారి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని, ఈసారి టీడీపీ అధికారంలో వస్తే కర్రలతో వెంబడించి కొడతారని అన్నారు. ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు ఏమన్నారంటే.. ‘‘మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలు వైసీపీకి మిత్రులో, శత్రువులో అర్థం కావడం లేదు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉంది. ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి తీవ్ర నష్టం ఖాయం. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద వీరుడంటారు. అప్పట్లో 35 వేలతో ఓడిపోయాడు. మొన్న జగనన్న వేవ్‌తో మళ్లీ గెలిచాడు. జనసేన పార్టీ ఆడవాళ్ల జోలికిపోయాడు. చివరకు విజయసాయిరెడ్డిని కొట్టేకాడికి జనసేన పార్టీ వాళ్లు వచ్చారంటే మనం చేసిన చెడ్డ పనులు వల్లనే. పార్టీలో ఉంటూ కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పార్టీకి మిత్రులా, శత్రువులా, కోవర్టు ఆపరేషనా అనేది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పనిచేస్తే పార్టీతో పాటు అందరికీ మేలు జరుగుతుంది. ఇదేవిధంగా వ్యవహరిస్తే తీవ్ర నష్టం ఖాయం. ఈ సారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారు' అని సుబ్బారావు అన్నారు.
" పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా నేను వాసన్న, జగనన్న అభిమానిగా ఉంటాను. నాలాగా అందరూ ఎందుకు ఉంటారు. సమర్థులకు పదవులు లేవు వాసన్నా (బాలినేని).. నీ చుట్టూ తిరుగుతూ పొగడేవాళ్లకే ఇస్తున్నారు. నీ వెంట ఉన్నవారినే నాయకులు, కార్యకర్తలుగా గుర్తిస్తున్నారు. నీకోసం కష్టపడి పనిచేసిన వారిని విస్మరిస్తే భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. పార్టీలో ఉంటూ మీకు చెప్పేందుకు భయపడుతున్నారు. నాకు ఎలాంటి భయంలేదు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటికైనా తెలుసుకొని మేల్కోవాలి. ఓడిపోతే కార్యకర్తలు ఇబ్బందులు పడతారు. ఈసారి పాదయాత్ర కూడా చేయనివ్వరు. నాయకుల మాటలతో ఓట్లు పోతాయి. ఇక పార్టీలో ఎవరూ ఉండరు. ఈ విషయాలను చెప్పేందుకు అందరూ భయపడుతున్నారు. అయినా నేను ఈ వీడియోను ముఖ్యమంత్రి పేషీకి కూడా పంపుతాను. నాపై కాకుండా, తప్పు చేసే వాళ్లపై యాక్షన్ తీసుకుంటే పార్టీ బాగుపడుతుంది. పార్టీని కాపాడుకునేందుకు ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చొరవ తీసుకొకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది’’ అని సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యల వీడియో హల్‌చల్ చేస్తోంది.