డిసెంబర్ 28 నుంచి రైతు బంధు.. దళిత బంధుకు నో ఫండ్స్!
posted on Dec 18, 2021 @ 6:53PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈనెల 28 నుంచి రైతు బంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతుబంధు పథకం ప్రారంభించిన పది రోజుల్లోనే అందరికీ నగదు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో డిసెంబర్ 28 నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమకానున్నాయి. గతంలో మాదిరిగానే భూమి ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ నగదు జమచేయనున్నారు. ఇప్పటికే అధికారులు ఆయా జిల్లాల డేటాను ప్రభుత్వానికి అందజేశాయి.
మంత్రులు, కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన ఉండాలన్నారు. నూతన జోనల్ వ్యవస్థతో ఇది అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ స్పష్టంచేశారు. వెనకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. భార్యాభర్తల ఉద్యోగులు (స్పౌస్ కేస్) ఒకే చోట పనిచేస్తెనే వారు ప్రశాంతంగా పనిచేయగలుగుతారని,ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
అయితే రైతు బంధు నిధులు జమ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ... దళిత బంధుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధును ప్రవేశపెట్టారు. ఉప ఎన్నిక కోసమే తీసుకొచ్చారనే విమర్శలు రావడంతో రాష్ట్రమంతా అమలు చేస్తామని ప్రకటించారు. ఉప ఎన్నిక ముగియగానే నవంబర్ 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. కాని ఆరు వారాలు గడిచినా దళిత బంధు ఊసే ఎత్తడం లేదు. దీంతో కేసీఆర్ సర్కార్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముందు నుంచి అనుకున్నట్లే జరుగుతోందని, హుజురాబాద్ ఎన్నిక కోసమే దళిత బంధు ప్రకటించారని చెబుతున్నాయి. దళిత ఉప ముఖ్యమంత్రి, మూడు ఎకరాల భూ పంపిణి లాగే దళిత బంధు కూడా అటకెక్కుతుందనే ప్రచారం జరిగింది.
ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయని గ్రహించారో ఏమో కలెక్టర్ల సమావేశంలో దళిత బంధుపై మాట్లాడారు సీఎం కేసీఆర్. రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని కేసీఆర్ చెప్పారు.10 లక్షల సాయం, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తుందన్నారు. దళితబంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే నిధుల విషయం మాత్రం చెప్పలేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా వెల్లడించలేదు. దీంతో నిధులు లేకుండా దళిత బంధును ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.