మళ్లీ పోరాటం.. టికెట్లు అలా... కిల్లర్ పాలిటిక్స్.. టాప్ న్యూస్@7PM
posted on Dec 19, 2021 @ 6:30PM
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏసీబీ కేసులకు బయపడేది లేదని తేల్చి చెప్పారు. ఏ క్షణమైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాను కోట్లు సంపాదించలేదని... ఉద్యోగులు తమను నమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
---
సినిమా టికెట్ల విక్రయాల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కంపెనీ ద్వారానే ఆన్‌లైన్ సినిమా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం జీవో 142ని ఆదివారం జారీ చేసింది. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ ప్రకారం ఈ జీవోని అమల్లోకి తీసుకొస్తునట్లు చెప్పింది. ఇప్పటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాల బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు ప్రభుత్వం అప్పగించింది.
---------
ఏపీలో రోడ్ల పరిస్ధితి అధ్వానంగా మారిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. రెండున్నరేళ్లలో ఏపీలో ఒక్క కిలో మీటరు రహాదారి కూడా వేయని దుస్ధితి ఉందన్నారు. రోడ్ల నిర్మాణానికి టెండర్లు వేయడానికే కాంట్రాక్టర్లు వెనకాడుతున్నారని చెప్పారు.కాంట్రాక్టర్లు ఎందుకు కోర్టుకు వెళ్తున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 420 ప్రభుత్వాన్ని చూసి బ్యాంకులు సైతం భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.
----------
విశాఖ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం హాట్ హాట్ గా సాగింది. వైస్ చైర్మన్లను వేదికపైకి ఆహ్వానించడంపై ఎమ్మెల్యే కన్నబాబు రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇష్టం లేకపోతే వెళ్లి పోతామని ఎమ్మెల్యే కన్నబాబు అవంతిపై ఫైర్ అయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీటీసీలకు ప్రత్యేక చా౦బర్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
---------
భవిష్యత్ అవసరాలకు విద్యుత్ కొరత రాకుండా ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విద్యుత్ పొదుపు అన్నది ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలన్నారు. విద్యుత్ ను వేస్ట్ చేయడం అంటే భవిష్యత్ లో విద్యుత్ కొరతకు కారణమవుతున్నట్టేనని అన్నారు
-----------
తెలంగాణలో మరోసారి పరీక్ష ఫలితాల కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2019లో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని, అందుకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.గతంలో చేసిన తప్పిదాల నుంచి ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదన్న విషయం తాజా ఫలితాలతో నిరూపితమైందని పేర్కొన్నారు.
---
వరంగల్ ప్రాంతంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వరంగల్ లో 3 సాహిత్య పాఠశాలలకు హాజరయ్యానని తెలిపారు. ఈ క్రమంలో వరంగల్ గొప్పతనాన్ని చాటుతూ ఓ కవిత చదివి వినిపించారు. అద్భుత కట్టడాలు, ఆలయాలకు నెలవు ఓరుగల్లు అని వివరించారు. ఈ ప్రాంతం గొప్పదనాన్ని యునెస్కో కూడా గుర్తించిందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
---------
కేరళలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలు అళప్పుజ జిల్లాలోనే జరిగాయి. తొలుత ఎస్డీపీఐ కేరళ విభాగం కార్యదర్శి కేఎస్ షాన్ శనివారం రాత్రి హత్యకు గురికాగా... ఆదివారం ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ విభాగం కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్ ను చంపేశారు. హత్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
--------
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 40,000 సంవత్సరాల కిందట భారతీయుల డీఎన్ఏ ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉందని పేర్కొన్నారు. మనందరి పూర్వీకులు ఒక్కరేనని వ్యాఖ్యానించారు. పూర్వీకుల వారసత్వంగా భారతదేశం వికసించిందని, సంస్కృతి కొనసాగుతోందని వివరించారు. ఈ విషయంలో తానేమీ ఆడంబరాలు పలకడంలేదని స్పష్టం చేశారు.
---------
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సూపర్ టైఫూన్ రాయ్ ఫిలిప్పీన్స్ ఛిన్నాభిన్నం చేసింది. ఈ ఏడాది ఫిలిప్సీన్స్ ను తాకిన అత్యంత శక్తిమంతమైన టైఫూన్ ఇదే. దీని ధాటికి 112 మంది మరణించారు. 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 8 లక్షల మంది ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వం నేడు వివరాలు వెల్లడించింది.ఫిలిప్పీన్స్ లో ఎక్కడ చూసినా రాయ్ విధ్వంసం తాలూకు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి.