పరీక్షలు రాసిన ఇంటర్ విద్యార్థులంతా పాస్!
posted on Dec 20, 2021 @ 9:35AM
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలపై తెలంగాణలో దుమారం రేపుతోంది. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా గత సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు తెలంగాణ సర్కార్. అందరిని పాస్ చేస్తామని ప్రకటించింది. అయితే గత సెప్టెంబర్ లో మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. దీంతో స్టూడెంట్స్ షాకయ్యారు. క్లాసులు వినకుండా ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియక ఆందోళన పడ్డారు. సిలబస్ తగ్గించామని, అందరూ పాసయ్యేలా చూస్తామని బోర్డు అధికారులు చెబుతూ వచ్చారు. అయితే ఇటీలల విడుదల చేసిన ఫలితాల్లో 49 శాతం మంది మాత్రమే పాసయ్యారు.
ఇంటర్ ఫలితాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో కొందరు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడ్డారు. మరికొందరు సూసైడ్ ప్రయత్నాలు చేసి హాస్పిటల్స్ లో చేరారు. అందరిని పాస్ చేస్తామని చెప్పి.. ఫెయిల్ చేయడమేంటని విద్యార్థులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర రోజూ ఆందోళనలు జరుగుతుండటంతో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆటలు ఆడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పరీక్ష రాసిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని యోచిస్తోంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ 35 శాతం కనీస మార్కులు వేసి, పాస్ చేసే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఈ పరీక్షలను మొత్తం 4,59,242 మంది విద్యార్థులు రాయగా, వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,35,230 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పాసైన వారిలో 25 శాతం మంది విద్యార్థులు.. 75 శాతానికి పైగా మార్కులు సాధించారు. కనీస మార్కులు 35-50 శాతం మధ్య సాధించిన విద్యార్థులు 3 శాతం మంది మాత్రమే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఎక్కువ మందికి 5-10 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు సరైన బోధన జరగకపోవడం, 10వ తరగతిలో పరీక్ష రద్దు చేసి అందరినీ పాస్ చేయడమేనని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేయడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కూడా ఫలితాలపై అధ్యయనం చేస్తోంది.