గుజరాత్ లో మరోసారి భారీగా డ్రగ్స్ సీజ్.. ఏపీకి లింకులు ఉన్నాయా?
posted on Dec 20, 2021 8:12AM
గుజరాత్‌లో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. ఈసారి ఏకంగా రూ. 400 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ పడవపై దాడి చేసిన భారత తీర రక్షణ దళం (ఐసీజీ), గుజరాత్ ఏటీఎస్ 77 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. వీటి విలువ రూ. 400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు వంటి విషయాలను ఆరా తీస్తున్నారు.
గత సెప్టెంబర్ లోనూ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడింది. దాని విలువ రూ.9వేల కోట్ల వరకు ఉంటుంది. పట్టుబడిన హెరాయిన్ కు ఏపీతో లింకులు బయటపడ్డాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంటైనర్లలో వచ్చిన ఆ హెరాయిన్ సంచులు.. గుజరాత్ మీదుగా ఏపీలోని విజయవాడకు వెళ్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గుర్తించారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టు లో రెండు కంటైయినర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. అందులో బ్యాగుల్లో నింపిన పౌడర్ లాంటి పదార్థం కనిపించింది. ఏంటని ఆరా తీస్తే.. టాల్కమ్ పౌడర్ అని దాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు చెప్పారు. ఐనా అధికారులకు అనుమానం తొలగలేదు. శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తే అది హెరాయిన్ అని తేలింది. అంత భారీ మొత్తంలో హెరాయిన్ ఉండడంతో అధికారులు షాక్ తిన్నారు.
ఒక కంటైనర్‌లో 1999.579 కిలోల హెరాయిన్ దొరికింది. రెండో కంటైనర్‌లో 988.64 కేజీలు పట్టుబడింది. మొత్తంగా 2988.219 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అప్ఘాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేసే హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి డ్రగ్స్ కన్‌సైన్‌మెంట్స్ ఇరాక్‌లోని బందర్ అబ్బాస్ పోర్టుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి కంటైనర్లలో ముంద్రా పోర్టుకు తరలించారు. ముంద్రా నుంచి విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు. ఆ డ్రగ్స్ కన్‌సైన్‌మెంట్స్ విజయవాడలో ఉన్న ఆషీ ట్రేడింగ్ సంస్థ(కు వెళ్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, గుజరాత్‌లోని గాంధీ ధామ్, మాంద్వీలో అధికారులు సోదాలు చేశారు.
ఆషీ ట్రేడింగ్ కంపెనీ.. విజయవాడలోని సత్యనారాయణపురంలోని గడియారంవారి వీధి అడ్రెస్‌తో 2020 ఆగస్టు 18న రిజిస్టరయింది. దుర్గా పూర్ణ వైశాలి గోవిందరాజు పేరిట ఈ కంపెనీని స్థాపించారు. బియ్యం, పప్పులు, పండ్లు, కూరగాయలు టోకు వ్యాపారం కోసం స్థాపించినట్లు పేర్కొన్నారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ మూలాలు.. కాకినాడ నుంచి విజయవాడ, చెన్నై వరకు విస్తరించి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన ఫోన్ నెంబర్ మాత్రం ఎం.సుధాకర్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. చెన్నై కేంద్రంగా ఈ కంపెనీని సుధాకర్ నెలకొల్పినట్లు తెలిసింది.