కాంగ్రెస్ రేచుక్క రేవంత్.. ‘కారు’ ప్రత్యాన్మాయం చెయ్యే..
posted on Dec 19, 2021 @ 10:54AM
రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ‘దూకుడు’ కు పర్యాయ పదంగా, బ్రాండ్ అంబాసిడర్’గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి సారధ్యంలో గడచిన ఐదారు నెలల్లో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. అందులో సందేహం లేదు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాసకు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలను తీసుకోవడంలో అయితే నేమి, జాతీయ పార్టీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అయితే నేమి, రేవంత్ రెడ్డి తమదైన ముద్రను వేశారు.
అందుకే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న చరిత్రను చూస్తే, రేవంత్ రెడ్డికి ముందు రేవంత్ రెడ్డి తర్వాత అనే విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులే కాదు, రాజకీయ ప్రత్యర్ధులు కూడా అంగీకరిస్తున్నారు. అంతకు ముందు వరకు తాబేలు నడకలా ఉన్న పార్టీ రేవంత్ వచ్చిన తర్వాత కుందేలు పరుగులా మారింది. ఒక విధంగా చూస్తే వరుస సమావేశాలు.. సభలు.. ర్యాలీలతో రేవంత్ రెడ్డి వృద్ధ కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించి దూకుడు నేర్పించారు అనవచ్చును. పార్టీలో వచ్చిన మార్పును ప్రత్యక్ష్యంగా చూస్తున్నపార్టీ నాయకులు, మీడియా విశ్లేషకులు. నిజానికి, హుజూరాబాద్ ఘోర ఓటమి తర్వాత ఎదురైన చేదు అనుభవాల నేపధ్యంలో రేవంత్ రెడ్డి కాకుండా మరొకరు అయ్యుటే, కాడి వదిలి పరిపోయే వారని కూడా కొందరు పార్టీ నాయకులు అంటున్నారు.
ఇప్పటికే ఈ ఐదారు నెలల కాలంలోనే గిరిజన దళిత దండోరా, విద్యార్ధి, నిరుద్యోగ సైరన్ మొదలు అనేక వినూత్న ఆందోళన కార్యక్రమాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి, తాజాగా నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చేపట్టిన ఒకరోజు నిరసన పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మరోమారు విశ్వరూపాన్ని చూపారు. కేంద్ర, రాష్ర్ం ప్రభుత్వాలను తూర్పార పట్టారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకుంటున్నారు, అని ధ్వజ మెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గడచిన ఎనిమిదేళ్ల పాలనలో రూ.32 లక్షల కోట్ల పన్నుల భారం మోపారని, 2014లో 60 రూపాయలు ఉన్నలీటరు పెట్రోలు ధర్ ఇప్పుడు రూ.110 దాటింది, గ్యాస్ సిలిండర్ రూ.450నుంచి వెయ్యి రూపాయలకు చేరిందని, ప్రజల కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించి, ప్రజలను ఆలోచింప చేస్తున్నారు.
మరోవంక క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా ప్రత్యేక దృష్టి నిలిపారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబరు 9 నుంచి జాతీయ స్థాయిలో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. జనవరి 26 నాటికీ 30 లక్షల సభ్యత్వం లక్ష్యంగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిచేపట్టారు. ప్రతీ బూత్‌లో 100 మందికి సభ్యత్వం అందించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. అధిష్ఠానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్న శ్రేణులు ఈ దిశగా ముందుకు కదులుతున్నాయి.పీసీసీ చీఫ్ రేవంతే స్వయంగా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నారు. పీసీసీ చీఫ్ వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతో క్రింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా సభ్యత్వ లక్ష్యాలను అధిగమించి ముందుకు సాగుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉట్నూర్ మండలం దంతన్‌పల్లికి చెందిన బూత్ ఎన్‌రోలర్ మహ్మద్ మోబిన్ తనకు కేటాయించిన బూత్‌లో 251 సభ్యత్వాలు చేయించారు. అనుకున్న దానికంటే రెండొంతులు ఎక్కువ సభ్యత్వం చేయించిన మోబిన్ కి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఉన్నాయి అంటున్నారు. అయితే అన్నీ ఉన్న అల్లుడినోట్లో శని అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తున్న అంతర్గత కుమ్ములాటలు, సీనియర్, జూనియర్ తగవులు పార్టీకి కొంత తలనొప్పిగా మారాయని పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో కొందరు అధికార పార్టీకి కోవర్టులుగా మారి పార్టీకి నష్టం చేతున్నారని, అద్దంకి దయాకర్ వంటి కొందరు నాయకులు సైతం అవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం తెరాసకు ప్రత్యాన్మాయం అంటే కాంగ్రెస్సే అన్న అభిప్రాయం స్థిరంగా ఉందని అంటున్నారు.