రోడ్లపై కార్యకర్తలు.. కనిపించని కేసీఆర్ ఫ్యామిలీ! ఇదేం డ్రామా గురూ..
posted on Dec 20, 2021 @ 11:56AM
వరి విషయంలో కేంద్రంతో పోరాటంలో తగ్గేదే లే అంటున్నారు సీఎం కేసీఆర్. మోడీ సర్కార్ తో తాడోపేడో తేల్చుకుంటామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కాని క్షేత్రస్థాయిలో అంత సీన్ కనిపించడం లేదు. దీంతో కేంద్రంతో కేసీఆర్ పోరాటం మాటల వరకే పరిమితం అనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలు అందుకు బలాన్నిస్తున్నాయి. వరి విషయంలో లేటెస్ట్‌గా హస్తినకు మంత్రుల బృందాన్ని పంపించారు కేసీఆర్. రాష్ట్రంలోనూ చావు డప్పు పేరుతో నిరసనలకు పిలుపిచ్చారు. కాని ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కేసీఆర్ కుటుంబం కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
వరి పంట కొనుగోలు విషయంలో కేంద్రంతో మాట్లాడేందుకు మంత్రుల బృందం సోమవారం ఢిల్లీ వెళ్లింది. అయితే ఆ బృందంలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీశ్‌రావు కానీ లేరు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు కేటీఆర్. ముఖ్యమంత్రి చేయాల్సిన ప్రకటనలు, ప్రారంభోత్సవాలు కూడా ఆయన చేసేస్తుంటారు. కాని తెలంగాణలో ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన వరి విషయంలో కేంద్రంతో మాట్లాడేందుకు వెళ్లిన మంత్రుల బృందంలో మాత్రం ఆయన లేరు. పదే పదే ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టే కేటీఆర్.. రైతుల కోసం ఢిల్లీ వెళ్లొచ్చుగా? ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు హస్తినకు వెళితే తప్పేంటి? కారు పార్టీకి ట్రబుల్ షూటర్‌గా ఉన్న హరీశ్.. రైతుల ట్రబుల్స్ తీర్చేందుకు ఢిల్లీ వెళ్లి తన టాలెంట్ ఏంటో చూపించాలిగా? అని జనాలు ప్రశ్నిస్తున్నారు.
ఇక సీఎం కేసీఆర్ తీరు మరింత దారుణం. వరి మీద యుద్ధం అన్నారు.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ సవాల్ చేశారు. ఇందిరా పార్క్ లో ఏకంగా ధర్నా కూడా చేశారు. తర్వాత ఢిల్లీకి వెళ్లారు. నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. కాని ఏమైనా చేశారంటే.. ఏమీ చేయలేదు. ఒక్క మంత్రిని కూడా కలవలేదు. కేసీఆర్ భార్య శోభను ఆసుపత్రిలో చూపించడానికి కొడుకు కేటీఆర్, కూతురు కవితను వెంటేసుకుని వెళ్లారు. అక్కడ ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరిపారని అంటారు. ఢిల్లీ వెళ్లింది తన పర్సనల్ పనుల మీద అయితే.. బయటకు చెప్పింది మాత్రం రైతుల తరఫున కేంద్రాన్ని నిలదీయడానికంటూ అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు మరోసారి అలానే.. నలుగురు మంత్రులను ఢిల్లీకి పంపించి.. రైతు డ్రామా రక్తి కట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఢిల్లీలో గొంతెత్తని కేసీఆర్.. హైదరాబాద్‌కు తిరుగొచ్చి మాత్రం బీజేపీ నేతలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఆయన మాటలను బట్టి.. కేసీఆర్ బాగా ఫ్రస్టేషన్‌లో ఉన్నారని ఇట్టే తెలిసిపోతోంది. బీజేపీ నేతల నుంచీ గట్టిగానే కౌంటర్లు పడుతుండటం.. కేంద్రం ఎంత కొంటున్నది.. రాష్ట్రం టార్గెట్ మేర అమ్మలేకపోతున్నది.. అంతా పూసగుచ్చినట్టు వివరించే సరికి కేసీఆర్ డిఫెన్స్‌లో పడిపోతున్నారు. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. బీజేపీనే దోషిగా చూపించేందుకు.. తాజాగా ' చావుడప్పు' పేరుతో గ్రామాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు కేసీఆర్. ఇక్కడ మరో అంశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. గతంలో ఇందిరా పార్క్ లో ధర్నా చేసిన కేసీఆర్.. ఇప్పుడు చావుడప్పు కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని విపక్షాలు, రైతు సంఘాలు నిలదీస్తున్నాయి.
ఒకప్పుడు కేసీఆర్‌ను రాజకీయ చాణక్యుడు.. ఎత్తులు, పైఎత్తులు వేయడంలో దిట్ట అంటూ గొప్పగా చెప్పేవారు. ఇప్పుడు మాత్రం కేసీఆర్‌కు అంత సీన్ లేదంటున్నారు. ఆయన పని అయిపోయిందని తేల్చేస్తున్నారు. మాస్టర్ మైండ్ కాదు.. ఉత్తుత్తి మైండ్ అంటున్నారు. ఇటీవల ఆయన చేసిన, చేస్తున్న పనులన్నీ బూమరాంగ్ కావడమే అందుకు నిదర్శనమని చూపిస్తున్నారు. దుబ్బాక నుంచి హుజురాబాద్ వరకూ.. ఎదురుదెబ్బలతో తలబొప్పి కట్టింది. ఇక, ప్రాజెక్టులు, వరి పంటపై తలనొప్పి మొదలైంది. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే.. ఒక్క ఎకరా కూడా అదనంగా తడిపింది లేదంటున్నారు. ఇక, వరి వేస్తే ఉరి అంటూ.. రైతులను ఆగమాగం చేస్తున్నారు. వరి పంటే వేయొద్దంటే.. ఇక కాళేశ్వరం ఎందుకు? లక్ష కోట్ల ఖర్చు ఎందుకు? రైతు బంధు ఇంకెందుకు? అనే ప్రశ్నలు. రైతుల నుంచి ఆగ్రహ జ్వాలలు. ఆ బద్నాం నుంచి బయటపడేందుకే అన్నట్టు.. వరి మీద తెగ వర్రీ అవుతున్నారు కేసీఆర్. అడ్డగోలు, అర్థంపర్థం లేని రాజకీయంతో మరింత ఊబిలోకి జారుతున్నారు. వరి విషయంలో బీజేపీని బలి పశువు చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారని అంటారు. పదే పదే వరి నెపాన్ని కేంద్రం మీద మోపుతూ.. బీజేపీ చేతగాని తనం అంటూ ప్రచారం చేస్తూ.. రాజకీయ పబ్బం గడుపుకునే స్కెచ్ రచించారని చెబుతున్నారు.