దమ్ములేని ఎంపీలు.. తుగ్లక్ ఇన్ లైవ్.. రోజా రచ్చ.. గ్రామాల్లో చావు డప్పు.. టాప్ న్యూస్@1PM
posted on Dec 20, 2021 @ 11:51AM
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ఎంపీలు కనీసం ప్లకార్డులు కూడా పట్టుకోవట్లేదని విమర్శించారు. కార్పోరేషన్ ఎన్నికల సమయంలో 'వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం' అని చెప్పారు.. అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు అని పవన్ కల్యాణ్ అన్నారు.
-----
ఓటీఎస్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. పటమట తహశీల్దారుకు వినతి పత్రం అందచేసింది. జగన్ పరిపాలన తుగ్లక్ చర్యలకు మించి సాగుతోందన్నారు. పన్నుల భారాలతో ప్రజలను దోచుకుంటున్నారని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ఆరోపించారు. తుగ్లక్ ఉదంతం చరిత్రలో చదివితే.. జగన్ లైవ్‌లో చూపిస్తున్నారన్నారు. కేంద్రం సహకారంతో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టమనడం ఏమిటి? అని ప్రశ్నించారు.
---
విశాఖ నగరానికి పులివెందుల కల్చర్ వచ్చేసిందని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హయ గ్రీవ జగదీష్ సెల్ఫీ వీడియోనే ఇందుకు ఉదాహరణ అని... ఇలాంటి బాధితులు ఎంతోమంది విశాఖలో ఉన్నారని అన్నారు. పారిశ్రామికవేత్తలను వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురిచేసి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు
--
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కుమ్మలాటలు మరోసారి బయటపడ్డాయి. మంగళవారం సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా పుత్తూరులో ఆ పార్టీకి చెందిన రెబల్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించివేశారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేయడంతో కలకలంరేగింది.
---
కృష్ణా జిల్లా నందిగామ 16వ వార్డులో గతంలో టీడీపీ హయంలో నిర్మించిన శిలా ఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టీడీపీ నిర్మించిన ప్రాంతంలో వైసీపీ శిలాఫలకాన్ని వేసింది. వైసీపీ శిలాఫలకం వేయడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరసనకు దిగారు. టీడీపీ వేసిన శిలా ఫలకాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.
-------
ఖరీఫ్ సీజన్‌లో పండే ప్రతిగంజా కొనుగోలు చేస్తామని.. కేంద్రమంత్రులు చెబుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అయితే ప్రకటనలు కాకుండా లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కోటి 30 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ను పెంచాలని గతంలోనే కోరామని తెలిపారు. తెలంగాణలో వరి ధాన్యం కోసం 6 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
----
ప్రభుత్వం, ఇంటర్ బోర్డు తీరుకు నిరసనగా వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నారాయణగూడా ఫ్లై ఓవర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకూ విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. క్వాలిటీ విద్యతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఒక్క రూపాయి కూడా కట్టబోమన్నారు
-------
ఒమిక్రాన్ గురించి నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమైక్రాన్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ధన్వంతరి భారతీయులకు వరమన్నారు ఆనందయ్య. శీతాకాలంలో ముందస్తుగా ఒమిక్రాన్ తదితర వ్యాధులు సోకకుండా ఆయుర్వేద మందు తయారైందన్నారు. ఫిబ్రవరి వరకూ 15 రోజులకు ఒకసారి మందు వాడాలన్నారు.
------
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం హిందుత్వను ఉద్దవ్ థాకరే తాకట్టు పెట్టారని షా విమర్శించారు. పూణెలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు
----
పనామా పత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రముఖ సినీ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయి. ఈ రోజు ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వచ్చి, తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అయితే, తాను ఈ రోజు విచారణకు రాలేనని, విచారణను మరో తేదీకి మార్చాలని ఐశ్వర్యా రాయ్ ఈడీని కోరినట్లు తెలిసింది. దీనిపై ఈడీ స్పందించాల్సి ఉంది.
---