ఒమిక్రాన్ అంత డేంజరా! ఆనందయ్య ఏమంటున్నారు..
posted on Dec 20, 2021 @ 11:12AM
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వైరస్ ఇప్పటికే 90 దేశాలకు పాకేసింది. శరవేగంగా విస్తరిస్తూ ఆందోళన కల్గిస్తోంది, ఒమిక్రాన్ తో బ్రిటన్, ఫ్రాన్స్ అతలాకుతలం అవుతున్నాయి. డెల్టా వైరస్ కు ఒమిక్రాన్ తోడవడంతో యూకేలో ప్రస్తుతం రోజుకు 90 వేలకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్ లో 60 వేల వరకు రోజువారి కేసులు వస్తున్నాయి.
భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం వరకు ఒమిక్రాన్ కేసులు 150 దాటేశాయి. భారత్ లో జనవరి మధ్య నుంచి ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుందని, ఫిబ్రవరిలో పీక్ స్డేజీకి వెళుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ లో కొనసాగుతున్న తీవ్రతను బట్టి.. భారత్ లో ఆ స్థాయిలో వైరస్ విజృంభిస్తే రోజుకు 14 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందనే హెచ్చరికలు వైద్య సంస్థలు, సైంటిస్టుల నుంచి వస్తున్నాయి.
భారత్ తో పాటు ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఒమిక్రాన్ గురించి నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమైక్రాన్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ధన్వంతరి భారతీయులకు వరమన్నారు ఆనందయ్య. శీతాకాలంలో ముందస్తుగా ఒమిక్రాన్ తదితర వ్యాధులు సోకకుండా ఆయుర్వేద మందు తయారైందన్నారు. ఫిబ్రవరి వరకూ 15 రోజులకు ఒకసారి మందు వాడాలన్నారు. ఒమిక్రాన్‌కి క్రిష్ణపట్నంలోను, విశాఖలోను మందు పంపిణీ చేస్తానన్నారు.