ప్రభుత్వ వైఫల్యంతో వరద నష్టం!.. ఎన్టీఆర్ ట్రస్ట్ 48 లక్షలు సాయం..
posted on Dec 20, 2021 @ 12:07PM
రాయలసీమను వర్షాలు ముంచెత్తాయి. పైనుంచి వరద వెల్లువెత్తినా.. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఫలితం.. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. వరద కిందకు పోటెత్తి.. ఊళ్లకు ఊళ్లను తుడిచిపెట్టేసింది. గ్రామాలు చెరువులయ్యాయి. ఏకంగా ఆర్టీసీ బస్సే వరద పాలైంది. అనేక మంది మృత్యువాత పడ్డారు. తీరని ప్రాణ నష్టం.. అంతకు మించి ఆస్థి నష్టం.
వరద విపత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబు చలించిపోయారు. వెంటనే వరద బాధిత ప్రాంతాల్లో వాలిపోయారు. హెలికాప్టర్‌లో పైపైన చక్కర్లు కొట్టి.. సెల్ఫీలు దిగి వెళ్లిపోలేదు. చంద్రబాబు వరద నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున లక్ష రూపాయలు పరిహారం ప్రకటించారు. తెలుగు తమ్ముళ్లు సైతం ఎక్కడికక్కడ వరద సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొన్నారు.
మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా.. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు.. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. లక్ష రూపాయల చెక్‌లు పంపిణీ చేశారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో రూ. 48 లక్షలను మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి చెక్‌లు పంపిణీ చేశారు. అసెంబ్లీలో ఏ భువనేశ్వరి టార్గెట్‌గానైతే వైసీపీ నాయకులు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారో.. ఇప్పుడు ఆ భువనేశ్వరినే వైసీపీ పాలకుల వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వరద బాధితులకు ఆసరాగా నిలిచారు.
ఇంతటి ప్రాణనష్టానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే కారణమనే విమర్శలు ఉన్నాయి. అధికారులు సకాలంలో గేట్లు పైకి ఎత్తకపోవడం వల్లే ఇంతటి విపత్తు దాపురించిందని అంటున్నారు. ఇసుల లారీల కోసం పాలకులు అధికారులపై ఒత్తిడి తేవడం వల్లే ఇంతటి దారుణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది.. విఫలం చెందారని విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వమే.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించింది. ప్రభుత్వమే 5 లక్షలు ఇస్తే.. ఇక స్వచ్ఛంద సంస్థ అయిన ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష ఇవ్వడమంటే మామూలు విషయం కాదంటున్నారు. వరద సాయంలోనే కాదు.. గతంలో కరోనా కల్లోల సమయంలోనూ ఎన్టీఆర్ ట్రస్టు పెద్ద ఎత్తున సాయం చేసి.. ప్రజల అభిమానం చూరగొంది. దశాబ్దాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలా ప్రజా సేవలో నిమగ్నమై ఉంది.