మూడుతో కొత్త వ్యూహం.. అందుకేనా రద్దు నాటకం!
posted on Dec 22, 2021 @ 1:38PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని, దానితో పాటుగా సీఆర్డీఎ చట్టం రద్దు బిల్లును ఉపసంహరించుకుంది.అయితే,ఏపీ అసెంబ్లీలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈ రద్దు రద్దు కాదని, ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరింత పటిష్ట చట్టం తీసుకొస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రద్దు వెనక ఉన్న రహస్యం ఏమిటో, ఎందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారో, ఇప్పుడు అందరికి అర్థమై పోయింది. కోర్టులో కేసు నిలబడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. అది రాజకీయంగా తెలుగు దేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే, జగన్ రెడ్డి వ్యూహాత్మకంగా వెనకడుగు వేశారు. ఇది అందరికీ తెలిసిన నిజం. అంటే, మూడు రాజదానులు లేదా ముఖ్యమంత్రి ముద్దుగా పిలుచుకునే వికేంద్రీకరణ నుంచి ‘మడమ’ తిప్పలేదని చెప్పకనే చెప్పారు.అంతే కాదు, ఆ రోజు నుంచి ఈరోజు వరకు, మంత్రులు, అధికారపార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా,మూడు రాజధానుల మంత్ర జపం చేస్తూనే ఉన్నారు.
అయితే నిజంగా రేపటి బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మళ్ళీ తెస్తారా, లేదా అనేది పక్కన పెడితే, మూడు రాజదానుల వివాదాన్ని, ఎన్నికల వరకు సజీవంగా ఉంచేందుకు జగన్ రెడ్డి ఎత్తులు వేస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగానే ఉంది. అంతే కాదు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, ప్రాంతీయ విబేధాల పొగరాజేసి, సెంటిమెంట్స్ రెచ్చగొట్టి, ప్రభుత్వ వైఫల్యాలను మరుగున పరిచి ఎన్నికలలో ప్రయోజనం పొందేందుకు జగన్ రెడ్డి కొత్త వ్యూహం పన్నుతున్నారని రాజకీయ, మీడియా వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్ రెడ్డి ... మూడు రాజధానుల చట్టం రద్దు ప్రకటనతో పాటుగానే, 2019 ఎన్నికల ఫలితాలు, అదే విధంగా తదనంతరం జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా వికేద్రీకరణ (మూడు రాజదానుల) కు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా పేర్కొన్నారు. ప్రజలు హైదరాబాద్ వంటి సూపర్ కాపిటల్,(ఒకే రాజధాని) కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని అన్నారు.
అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని, సమతుల్య అభివృద్ధి సాధ్యమంవుతుందని చెప్పు కొచ్చారు. అంటే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, రాజధాని వివాదాన్ని ఎన్నికల అంశంగ చేసుకునేందుకు జగన్ రెడ్డి ఎన్నికల వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ప్రజల జ్ఞాపక శక్తి కొంచెం తక్కువే కావచ్చును కానీ, అయినా అందరినీ అన్ని సందర్భాలలో మోసం చేయడం జగన్ రెడ్డి సహా ఎవరికైనా అయ్యే పని కాదాని అంటున్నారు.