125 ఏళ్లలో రెండో అత్యల్ప టెంపరేచర్.. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా
posted on Dec 22, 2021 9:20AM
తెలుగు రాష్ట్రాల్లో చలిపులి వణికిస్తోంది. పొగమంచుకు చల్లటి గాలులు కూడా తోడు కావడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాత్రిపూట, ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఏపీ ఏజెన్సీలోని పాడేరు, అరకులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మినుములూరులో 8 డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్ లో లంబసింగిలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
125 ఏళ్లలో రెండో అత్యల్ప టెంపరేచర్..
తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు కాగా.. ఆ జిల్లాలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున కుమురం భీం జిల్లా గిన్నెధరిలో 3.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గత 125 ఏళ్ల వాతావరణ చరిత్రలో ఇంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి మాత్రమే.
1897 నుంచి ఇప్పటివరకూ ఉష్ణోగ్రతల రికార్డులను పరిశీలిస్తే.. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 2017 డిసెంబరు 27న 3.5, అంతకుముందు నిజామాబాద్‌లో 1897 డిసెంబరు 17న 4.4, హైదరాబాద్‌లో 1946 జనవరి 8న 6.1 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు నుంచి నాలుగు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డిలో 8.4, హైదరాబాద్‌లో 9.5 కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. రాబోయే మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎందుకింత చలి...?
ఇరాన్, ఇరాక్ ప్రాంత వాతావరణంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉత్తర భారతంపై గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉత్తర భారతంలో హిమాలయ సానువుల్లో బాగా మంచు కురుస్తోంది. అక్కడి నుంచి దక్షిణ భారతం వైపు శీతల గాలులు వీస్తున్నందున వాటి ప్రభావంతో తెలంగాణ అంతటా చలిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 3.5 నుంచి 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత ఉంటోందని, ఈ నెల 27 వరకూ చలి తీవ్రత కొనసాగుతుందని స్పష్టం చేశారు. చలికన్నా గాలులతో శీతల వాతావరణం ఏర్పడుతోందని వెల్లడించారు.