కొవిషీల్డ్ టీకా తీసుకున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్..
posted on Dec 22, 2021 @ 10:37AM
ప్రపంచ దేశాలను ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. సౌతాఫ్రికాలో మొదటగా వెలుగు చూసిన కొత్త వైరస్... ఇప్పటికే 100 దేశాలకు పాకేసింది. ఒమిక్రాన్ తో ఐరోపా దేశాలు అల్లాడిపోతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ లో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. యూఎస్ లో వారంలోనే ఒమిక్రాన్ కేసులు 70 శాతం పెరగడం ఆందోళన కల్గిస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు డబుల్ సెంచరీ దాటేశాయి. రోజు రోజుకు వైరస్ తీవ్రత పెరిగిపోతోంది. ఒమిక్రాన్ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్లపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలకు ఒమిక్రాన్ ను నిరోధించే శక్తి ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో బూస్టర్ కోసం డిమాండ్లు వస్తున్నాయి.
ఒమిక్రాన్ ఆందోళనలు ఉన్న నేపథ్యంలో భారత్ కు సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోనికి వచ్చింది. భారత్ లో ఎక్కువగా వినియోగించిన కొవిషీల్డ్ టీకాపై ఆసక్తికర పరిశోధనా ఫలితాలు వచ్చాయి. కొవిషీల్డ్‌గా పిలుస్తున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకా పనితీరుపై ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఓ అధ్యయనం సాగించారు. రెండు డోసులు తీసుకున్న 3 నెలల తర్వాత.. ఈ టీకా కారణంగా లభించే రక్షణ క్రమంగా క్షీణిస్తున్నట్టు గుర్తించారు. బూస్టర్ డోసు ద్వారా ప్రమాదకర వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.
పరిశోధకులు కేవలం ఒక్క ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్నవారినే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ వివరాలను ‘ద లాన్సెట్’ పత్రిక వెల్లడించింది. స్కాట్లాండ్, బ్రెజిల్‌కు చెందిన మొత్తం 4.4 కోట్ల మందిలో టీకా కారణంగా ఏర్పడిన యాంటీబాడీలస్థాయికి సంబంధించిన డేటాను విశ్లేషించినట్లు గ్లాస్గో వర్సిటీ ఆచార్యుడు కటికిరెడ్డి శ్రీనివాస విఠల్ వెల్లడించారు. తాజా పరిశోధనతో కోవిషీల్డ్ టీకా తీసుకున్న వాళ్లు మూడు నెలలు పూర్తయితే... బూస్టర్ డోస్ గా తీసుకోవాలనే చర్చ సాగుతోంది.