రామతీర్థంలో హైటెన్షన్.. అశోక్ గజపతిరాజును తోసేసిన అధికారులు..
posted on Dec 22, 2021 @ 11:14AM
రామతీర్థం. ఈ పేరు వింటేనే ఏపీలో అదోరకమైన టెన్షన్. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహ శిరస్సును ధ్వంసం చేసిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తాజాగా, అదే రామతీర్థం.. అదే కోదండరామాలయంలో.. మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అసలేం జరిగిందంటే...
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. శంకుస్థాపన విషయం ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన పూజలను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స, వెల్లంపల్లి నిర్వహించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేవాలయ నిర్మాణ కార్యక్రమాలు పూర్వం నుంచి రాజవంశీయులే చేసేవారని.. దీనికి విరుద్ధంగా మంత్రులు నిర్వహించడంపై అశోక్ గజపతిరాజు మండిపడ్డారు.
పునర్నిర్మాణ, శంకుస్థాపన ఫలకాలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడాన్ని అశోక్ గజపతిరాజు వ్యతిరేకించారు. ఆగ్రహంతో ఆయన ఆ ఫలకాలను తోసేశారు. ఈ క్రమంలో అధికారులు, అశోక్ మధ్య స్వల్ప తోపుతాట జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది.
పూజల అనంతరం స్వామివారిని దర్శించుకుని రామతీర్థం నుంచి అసంతృప్తిగా వెళ్లిపోయారు అశోక్ గజపతిరాజు. ప్రభుత్వం, మంత్రులు, అధికారుల తీరుపై భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.