2022లో కరోనాకు ముగింపు!.. అప్రమత్తంగా ఉండాలన్న బిల్‌గేట్స్
posted on Dec 22, 2021 @ 2:01PM
ఒమిక్రాన్ విజృంభిస్తోంది. డెల్టాకంటే డేంజరస్‌గా.. అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్రికాలో మొదలై.. అంతలోనే ప్రపంచ దేశాలన్నిటినీ కమ్మేసింది. యూఎస్‌లో ఒక్కరోజులోనే లక్షా 80వేల కొవిడ్ కేసులు నమోదవడం.. అందులో ఒమిక్రాన్ కేసులే అధికంగా ఉండటం కలవరం రేపుతోంది. బ్రిటన్, ఫ్రాన్స్‌లతో ఒమిక్రాన్ ఓ ఆటాడుకుంటోంది. ఇక, ఇండియాలో 200లకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. తాజాగా, ఒమిక్రాన్ వర్రీపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ స్పందించారు. వ్యాక్సిన్ల పంపిణీ, వ్యాధుల నివారణపై గేట్స్ ఫౌండేషన్ తరఫున విస్తృతంగా పని చేస్తున్న బిల్‌గేట్స్.. కరోనాపై తనదైన విశ్లేషణ చేశారు. ఒమిక్రాన్‌పై హెచ్చరించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....
'ఒమిక్రాన్ వేరియంట్ ప్రతి ఇంటికీ వ్యాపిస్తోంది. చరిత్రలో ఏ వైరస్ ప్రబలనంత వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. డెల్టాతో పోల్చితే.. ఒమిక్రాన్‌తో వ్యాధి తీవ్రత సగం మాత్రమే ఉన్నా.. వేగంగా ప్రబలే లక్షణం వల్ల ఉద్ధృతి భారీ స్థాయిలో ఉండొచ్చు. ప్రజలంతా తప్పకుండా కొవిడ్ టీకాలు తీసుకోవాలి. బూస్టర్ తీసుకుంటే రక్షణ మరింత మెరుగవుతుంది. వ్యాక్సిన్‌లు ప్రజలు తీవ్ర ఆనారోగ్యం బారినపడకుండా, మరణించకుండా ఉండేలా అవి మెరుగ్గా పనిచేస్తున్నాయి' అని బిల్‌గేట్స్ ట్వీట్లు చేశారు.
'ఒక దేశంలో ఒమిక్రాన్ డామినెంట్‌గా మారిన తర్వాత.. ఆ వేవ్ అక్కడ మూడు నెలల కంటే తక్కువ సమయమే ఉంటుంది. ఆ కొన్ని నెలలు మనకు చెడు రోజులుగా మారొచ్చు. కానీ మనం సరైన చర్యలు తీసుకుంటే.. ఈ మహమ్మారి 2022లో ముగిసిపోవచ్చు. ఏదోఒక రోజు కరోనా ముగిసిపోతుంది.' అని బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు.