దివ్యాంగురాలికి అంగరంగ వైభవంగా వివాహం ఎరితోనో తెలుసా?

దివ్యాంగురాలైన తన కుమార్తెకు తండ్రి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశాడు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగూ అని వివాహ వైభవం గురించి చెప్పుకుంటూ ఉంటాము. కానీ గ్వాలియర్ కు చెందిన శివపాల్ అనే వ్యాపార వేత్త మాత్రం తన కుమార్తె వివాహానికి అంతకు మించి అన్నట్లుగా ఏర్పాట్లు చేశారు. ఒక వివాహం గురించి ఇంత ఉపోద్ఘాతమెందు కంటారా? ఇలాంటి వివాహం ఇలలో ఎవరికీ జరిగి ఉండదు. జరిగి ఉండదు కాదు. జరగలేదు. ఇంతకీ ఈ దివ్యాంగురాలికి ఎవరితో వివాహం జరిగిందో తెలుసుకుంటే... ఈ ఉపోద్ఘాతం చాలదని అందరూ అంగీకరించి తీరుతారు. గ్వాలియర్ కు చెందిన శివపాల్ ఒక వ్యాపార వేత్త. ఆయన కుమార్తె వయస్సు 26 ఏళ్లు. ఆమె దివ్యాంగురాలు. వినలేదు, మాట్లాడలేదు. అంతే కాదు గత 21ఏళ్లుగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమై ఉంది. కుమార్తెను అత్యంత ఆప్యాయంగా, ప్రేమగా పెంచుకునే శివలాల్ తన కుమార్తె వివాహం చేయలేనేమోనని బెంగపడ్డారు. అయితే ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉన్న ఆయనకు కుబ్జ కథ గుర్తుకు వచ్చింద. అంతే తన కుమార్తెకు శ్రీకృష్ణుడే తగిన వరుడని నిర్ణయించుకున్నాడు. అంతే ఆఘ మేఘాల మీద శ్రీ కృష్ణ భగవానుడితో తన కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసేశాడు. ఓ అమ్మాయికి శ్రీకృష్ణుడి వేష ధారణతో అలంకరణ చేశాడు. మొత్తం మీద అనుకున్న విధంగా తన కుమార్తెను కృష్ణ భగవానుడికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశాడు. ఈ వివాహానికి సంబంధించిన వార్తలు, ఫొటోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. వికలాంగురాలైన తన కుమార్తెపై శివపాల్ కు ఉన్న ప్రేమానురాగల పట్ల నెటిజన్లు ముగ్ధులౌతున్నారు. 

బార్ లో కాల్పుల కలకలం.. మెక్సికోలో 9మంది దుర్మరణం

మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక బార్ లో సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం 9 మంది మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. ఈ ఘటన గ్వానాజువాటోలోని ఓక బారులో జరిగింది. మారో గ్యాంగ్ సభ్యులు ఈ కాల్పులకు తెగబడ్డారని చెబుతున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో బార్ లోకి చొరబడ్డ సాయుధులు అక్కడి సిబ్బందిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మహిళా వెయిటర్లు సహా తొమ్మిది మంది బార్ సిబ్బంది మరణించారు. ఈ కాల్పులకు గ్యాంగ్ ల మధ్యా విభేదాలే కారణమని పోలీసులు తెలుపుతున్నారు. మారో గ్యాంగ్ కు ప్రత్యర్థి గ్యాంగ్ కు బార్ యాజమాన్యం మద్దతు ఇస్తుండటమే ఈ దాడికి వెనుక ఉన్న కారణంగా భావిస్తున్నారు. అయితే దాడికి పాల్పడిన సాయుధులను ఇంకా గుర్తించలేదని చెప్పారు. మెక్సికోలో గ్యాంగ్ వార్ ల కారణంగా అమాయకులు చనిపోవడం ఇదే మొదటి సారి కాదు. గత నెలలో కూడా ఇలాగే బార్ పై సాయుధులు జరిపిన దాడిలో 12 మంది మరణించారు. అంతకు ముందు నెలలో కూడా ఇలాంటి కాల్పుల ఘటనలో 10 మంది చనిపోయారు. 

టీ కప్పులో తుపానేనా?

విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఏర్పాటు చేసిన ఉమ్మడి నియామకాల బోర్డు విషయంలో తెలంగాణ సర్కార్, రాజ్ భవన్ ల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం టీ కప్పులో తుపానులా తేలిపోయిందా? ఉమ్మిడి నియామక బోర్డు విషయంలో గవర్నర్ సందేహాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేసినట్లు చేస్తే.. తన సందేహాలన్నీ దూది పింజెల్లా తేలిపోయాయని గవర్నర్ తమిళి సై వివాదానికి ముగింపు పలికేశారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వర్సిటీల్లో ఖాళీల భర్తీ సజావుగా పూర్తి చేసేందుకు మాత్రమే బోర్డు ఏర్పాటు చేశామని గవర్నర్ తమిళిసైకు మంత్రి సబితా వివరించారు. ఈ విషయంలో గవర్నర్ సందేహాలను నివృత్తి చేసేందుకు మంత్రి సబిత గురువారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదనీ, వర్సిటీల నియామకం బిల్లుపై తన సందేహాలను నివృత్తి చేయాలని, రాజ్ భవన్ కు వచ్చి చర్చించాల్సిందిగా సందేశం పంపినా స్పందన లేదనీ తమిళిసై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ ను ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఇరికించాలని చూశారనీ, తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానాలు ఉన్నాయనీ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గవర్నర్ లతో  ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విభేదాలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య గత కొంత కాలం నుంచీ కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం ముదిరి పాకాన పడిందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే గత కొద్ది కాలంగా గవర్నర్, కేసీఆర్ మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతోందన్న అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను వెనక్కు పంపకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా గవర్నర్ తన వద్దే పెండింగ్ లో ఉంచుకోవడంతో ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తమిళిసై మీడియా సమావేశంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలతో ఇక ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య విభేదాలు తెగేదాకా వెళ్లిపోయాయా? ఇక అమీ తుమీకే రాజ్ భవన్, ప్రగతి భవన్ లు సిద్ధమైపోయాయా అన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే ఈ హడావుడీ, ఉద్రిక్త వాతావరణం అంతా ఒక సారి సబిత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సందేహాలు నివృత్తి చేస్తామని చేసిన ప్రకటనతో చప్పున చల్లారిపోయింది. సుదీర్ఘ అధ్యయనం అనంతరమే, అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని యూజీసీ నిబంధనలకు అధిగమించకుండా, న్యాయపరమైన చిక్కుల తలెత్తకుండా అన్ని విధాలుగా పరిశీలించిన అనంతరమే ఉమ్మడి రిక్రూట్ మెంట్ బోర్డును ఏర్పాటు చేశామని సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ కు రాజ్ భవన్ కు వెళ్లి మరీ వివరించారు. ఆమె వివరణలో సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై సంతృప్తి చెందారు. వర్సిటీల్లో ఖాళీల ప్రక్రియను వీలైనంత సత్వరంగా నష్పాక్షికంగా, పాదర్శకంగా భర్తీ చేయాలని సూచించారు. గవర్నర్ భేటీలో సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు.  తెలంగాణలో ఇప్పటికే  వైద్యఆరోగ్య శాఖ, పోలీసు తదితర శాఖలు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టాయన్నారు. ఆ నియమకాలన్నీ పాదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగాయని వారు గవర్నర్ వివరించారు.  ఈ వివరణతో సంతృప్తి చెందినట్లు గవర్నర్ తెలిపారు. దీంతో పెండింగ్ లో ఉన్న బిల్లులకు ఆమెదం తెలపాల్సిందిగా మంత్రి సబిత గవర్నర్ ను కోరారు. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపడతామన్నారు.  

లాలూకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్.. దాత కుమార్తే!

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి జరగనుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు రెండు కిడ్నీలూ ఫెయిలయ్యాయి. దీంతో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్థితిలో ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య తన తండ్రికి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె సింగపూర్ లో నివసిస్తున్నారు. చాలా కాలం నుంచీ మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పినప్పటికీ సెకండ్ ఒపీనియన్ కోసం అన్నట్లుగా ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తన తండ్రిని సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చూపించి పరీక్షలు చేయించారు. అక్కడి వైద్యులు  కిడ్నీ మార్పిడి చేయించుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించేందుకే ఆయన కుటుంబ సభ్యలు నిర్ణయించారు. కిడ్నీ దానం చేయడానికి ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య ముందుకు వచ్చారు. తన తండ్రికి తన  ఇవ్వగలుగుతున్నందుకు తనకెంతో గర్వంగా ఉందని ఆమె అన్నారు. బహుశా ఈ నెలాఖరులోగా లాలూప్రసాద్ యాదవ్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగుతుంది.  పశుగ్రాస కుంభకోణం కేసులో జైలు పాలైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చిన సంగతి విదితమే. 

సామూహిక అత్యాచారం కేసులో ప్రభుత్వ మాజీ సీఎస్ అరెస్టు

మృగళ్ల మగ దాష్టీకం సమాజంలో అంతకంతకూ పెరిగిపోతున్నది. మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో ఉన్నత విద్యావంతులూ, ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్లో ఉన్నవారూ కూడా ఉండటం విద్య వారికి నేర్పిన సంస్కారం ఏమిటన్న అనుమానాలకు తావిస్తోంది. అండమాన్ నికోబార్ మాజీ సీఎస్ జితేంద్ర నారాయణ్ సామూహిక అత్యాచారం కేసులో అరెస్టు కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభ పెట్టి తనను ఇంటికి పిలిపించుకున్న నారాయణ్, మరి కొందరు ఉన్నతాధికారులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ మూడు సార్లు మాజీ సీఎష్ నారాయణ్ ను ప్రశ్నించింది. అరెస్టు అనివార్యమని తెలుసుకున్న నారాయణ్ ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయతే సర్వోన్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టులోనే బెయిలు పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో ట్రయల్ కోర్టును బెయిల్ కోసం ఆశ్రయించిన నారాయణ్ కు అక్కడ చుక్కెదురైంది. 

గుజరాత్ బరిలో జడేజా భార్య.. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ పాట్లు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. యాంటీ ఇన్ కంబెన్సీ ఆ రాష్ట్రంలో బీజేపీకి పెను సవాల్ గా మారింది. దీంతో ఎన్నికలలో విజయంతో గట్టేక్కేదుకు బీజేపీ అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై భారీ కసరత్తు చేసింది. పాత ముఖాలకు చాలా వరకూ టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది. కొత్త ముఖాలను బరిలోకి దింపడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను ఏదో మేరకు తగ్గించుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందు కోసం వివిధ రంగాలలో పేరున్న, గుర్తింపు పొందిన వ్యక్తులకుటికెట్లు కేటాయించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో పలువురు కొత్తవారే ఉన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 38కి శూన్యహస్తం చూపింది. అంటే బీజేపీ వంద మంది అభ్యర్థులతో విడుదల చేసిన జాబితాలో 38 మంది ఇప్పటి వరకూ ఎన్నికల బరిలో నిలబడని వారే. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఎంతగా కసరత్తు చేసిదో తెలుసుకోవాలంటే ఆ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్నకొత్తు ముఖాలను చూస్తే అర్ధమౌతుంది. క్రికెట్ లో తన ఆల్ రౌండ్ ప్రతిభతో ఎంతో మందికి అభిమాన క్రీడాకారుడిగా మారిన జడేజా భార్యను ఈ సారి బీజేపీ తన  అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దింపేందుకు నిర్ణయించింది. జడేజా భార్య రావాబా జడేజాను నార్త్ జామ్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగారంగంలోకి దింపుతోంది. అలాగే కాంగ్రెస్ గూటి నుంచి వచ్చి చేరిన పలువురికి బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఇక రివాబా విషయానికి వస్తే 2016లో ఆమెకు  జడేజాతో వివాహంజరిగింది. ఆమె మూడేళ్ల కిందటే బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు.   అలాగే ఇటీవలే బీజేపీలో చేరిన హార్థిక్ పటేల్ కు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది.ఇప్పటికే ఐదు సార్లు వరుసగా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ  ఆరో సారి గెలిచి.. అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. అయతే ఆప్ రంగంలో ఉండటం, పంజాబ్ లాగే ఇక్కడ కూడా అధికార పగ్గాలను అందుకోగలమన్న ధీమాతో ఆ పార్టీ ఇప్పటికే జోరుగా ప్రచార రంగంలో ఉండటం బీజేపీని  ఒకింత కలవర పరుస్తోంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవలే ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి కూడా పలు స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించడమే కాకుండా.. గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంపై ప్రత్యేక గురి పెట్టింది.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేంత బలంగా లేకపోయినా.. ఆ పార్టీ ప్రభావాన్ని కూడా తక్కువ అంచనా వేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు వస్తున్న అశేష జనస్పందన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఏదో ఒక మేరకు ప్రభావం చూపుతుందంటున్నారు. ఆ మేరకు బీజేపీకి భారీ నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. 

డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ తొలగింపు.. కేరళ సీఎం సంచలనం

 వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ ఆ విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. మూడు దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు గవర్నర్, ఆ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య విభేదాలు ఘర్షణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శల స్థాయికి దిగజారాయి.   గవర్నర్ వ్యవస్థను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలు రోజు రోజుకూ తీవ్రమౌతున్న సంగతి విదతమే. పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి బీజేపీ యేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షాణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణలలో గవర్నర్ల తీరు పట్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో అయితే గవర్నర్ తమిళిసై, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. గవర్నర్ తమిళి సై విలేకరుల సమావేశాలు నిర్వహించి మరీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక తమిళనాడులో స్టాలిన్ సర్కార్ అయితే ఆ రాష్ట్ర గవర్నర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. కేరళ ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం వర్సటీ నియమనిబంధనలను కూడా మార్చింది. కేరళ గవర్నర్ మహ్మద్ ఆరిఫ్ ఖాన్ కొద్ది రోజుల కిందట రాష్ట్రంలోని వైస్ చాన్సలర్ లందరూ రాజీనామా చేయాలంటూ వర్సిటీల చాన్సలర్ హోదాలో ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని వర్సిటీలపై గవర్నర్ పెత్తనం అవసరం లేదని చెబుతూ వస్తోంది.  అలాగే  తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపిన యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బిల్లుపై సంతకం చేయకుండా తన వద్దే పెండింగ్ ఉంచుకుని ఈ బిల్లుపై క్లారిఫికేషన్ ఇవ్వాలనీ, రాజ్ భవన్ కు వచ్చి తనతో చర్చించాలని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై ప్రభుత్వానికి హుకుం జారీ చేశారు.    బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్ లు బీజేపీ ప్రతినిథులుగా పని చేస్తున్నారనీ, రాజ్ భవన్ లను కాషాయ కార్యాలయాలుగా మార్చేస్తున్నారనీ విమరలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  కేరళ సీఎం పినరయ్ విజయన్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ నిబంధనలను ప్రభుత్వం మార్చింది.  వర్సటీ చాన్సలర్ గా గవర్నర్ ను తొలగిస్తున్నట్లు గురువారం ప్రభుత్వ ప్రకటన వెలువడింది. చాలా కాలంగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్,  పినయర్ సర్కార్ మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రభుత్వం, గవర్నర్ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. బుధవారం ఈ విమర్శలు ఒకింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అంతే కేరళ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ను డీమ్డ్ వర్సిటీ పదవి నుంచి తొలగిస్తు గురువారం కేరళ సర్కార్ ప్రకటించింది.  తాజాగా డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తొలగిస్తూ కేరళ సీఎం పినరయ్ విజయన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇదే ఒరవడిని అనుసరించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  

మోడీ వల్లే టి20లో టీమ్ ఇండియా ఓటమా..ఇవేం విమర్శలు.. ఆపండ్రా!

మోడీ వల్లే టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా కప్ గెలుచుకోలేదట. అసలు మోడీ అధికారంలోకి వచ్చాకా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిందే లేదట. అదే కాంగ్రెస్ హయాంలో అయితే 1983,2007, 2011 లలో వరల్డ్ కప్, 2103లో చాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇండియా గెలిచిందంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  మోకాలికీ, బోడి గుండుకీ ముడిపెట్టి విమర్శలు చేయడం రాజకీయాలలో కొత్తేం కాదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చంద్రబాబు అధికారంలో ఉండగా వర్షాలు పడలేదనీ, వరుస కరువుతో రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయనీ విమర్శించడమే కాకుండా తమ ప్రభుత్వం రావడంతోనే పుష్కలంగా వర్షాలు పడుతున్నాయనీ వరుణ దేముడికి తమపై ప్రేమ ఉందనీ వ్యాఖ్యలు చేస్తూ కరువుకూ, చంద్రబాబు సర్కార్ కూ ముడి పెట్టి విమర్శలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా అయిన దానికీ కాని దానికీ తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఆడ లేక మద్దలు ఓడు అన్నట్లు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఈ ఆర్థిక సంక్షోభానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకాల వల్లే ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తోందంటూ ఎదురుదాడికి దిగుతున్న సంగతీ విదితమే. అయితే క్రీడల్లో జయాపజయాలకూ రాజకీయాలకూ ముడిపెట్టి విమర్శలకు దిగడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో అన్ని ఐసీసీ టోర్నీలలో విజేతగా నిలిచిన టీమ్ ఇండియా మోడీ హయాంలో మాత్రం ఒక్క ట్రోఫీని గెలవలేదంటూ మోకాలికీ బోడి గుండుకీ ముడిపెట్టి విమర్శలు చేస్తున్నారు.  

మోడీతో పవన్ భేటీ.. కలిసి ర్యాలీ.. దేనికి సంకేతం?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక కొలిక్కి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీల మధ్య గత కొంత కాలంగా అగాధం ఏర్పడిందన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా మోడీ, పవన్ ల భేటీ విశాఖలో జరగనుంది. అదే సమయంలో ఈ రెండు పార్టీల పొత్తుకు తోడు జనసేన తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్న సంకేతాలు విస్పష్టంగా కనిపిస్తుండటంతో వచ్చే ఎన్నికలలో ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేసే అవకాశాలు మెరుగయ్యాయని పరిశీలకులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ మోడీ విశాఖ పర్యటనకు సంబంధించి అధికార పార్టీకి తప్ప బీజేపీ రాష్ట్ర నాయకులకు కూడా స్పష్టమైన సమాచారం  లేదంటూ వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. బీజేపీ ఆధ్వర్యంలో రోడ్ షో జరుగుతుందన్న స్పష్టత వచ్చింది. అన్నిటికీ మించి మోడీ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన వైసీపీ ఎంపీ విజయసాయి అత్యుత్సాహం బీజేపీనే కాదు.. ఏకంగా కేంద్రాన్ని ఇరుకున పడేసింది. మోడీ విశాఖ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తారంటే తన ట్విట్టర్ హ్యాండిల్ లో విజయసాయి చేసిన పోస్టు వైరల్ అవ్వడంతో బీజేపీ ఇరుకున పడింది. దీంతో ఆఘమేఘాల మీద నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఆ పార్టీ నాయకుడు జీవీఎల్ రంగంలోకి దిగారు. మోడీ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమం లేదని విస్పష్టంగా చెప్పారు. ఆయన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొంటారనీ, అవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలనీ వివరించిన ఆయన మోడీ బీజేపీ శ్రేణులలో ఉత్సాహం నింపే విధంగా రోడ్ షోలో పాల్గొంటారని చెప్పారు. కాగా మోడీ విశాఖ పర్యటన సందర్భంగా మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారనీ, ఇరువురూ కలిసే రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందనీ జీవీఎల్ పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకూ మోడీ పర్యటనను పూర్తిగా వైసీపీ హైజాక్ చేసేసిందనీ, రాజకీయాలకు సంబంధం లేకుండా  వైసీపీ పార్టీ రంగులతో వేసిన ఫ్లెక్సీలలో మోడీ ఫొటోను ప్రముఖంగా ఉంచడం ద్వారా ఏదో మోడీ వైసీపీ గూటికి చేరారా అన్నంతగా ప్రచారం చేసుకుంది. ఇది సహజంగానే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికీ రుచించలేదు. దీంతో బీజేపీ చురుగ్గా స్పందించి అప్పటి కప్పుడు మోడీ రోడ్ షోను ప్లాన్ చేసింది. ఏపీలో బీజేపీకి భారీ జనసమీకరణ చేసే బలం లేని కారణంగా మిత్ర పక్షం జనసేన అధినేతను ర్యాలీలో పాల్గొనేలా వ్యూహం పన్నింది. ఇటీవలి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో అంటకాగుతున్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ తీరును కూడా ఒకటి రెండు సందర్భాలలో ఎండగట్టారు. మోడీ అంటే అపారమైన గౌరవం ఉందని చెబుతూనే బీజేపీ ఏపీ నాయకత్వం తీరుపై తీవ్రు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బీజేపీ మాత్రం పవన్ విమర్శలపై ఇసుమంతైనా స్పందించకుండా జనసేన తమ మిత్రపక్షమే అని చెప్పుకుంటూ వస్తోంది. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ ఆగ్రనేతలెవరూ పవన్ తో భేటీ అవ్వలేదు. కానీ ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానం వెళ్లింది. మోడీతో భేటీకి అప్పాయింట్ మెంట్ కూడా లభించింది. అంతే కాకుండా మోడీతో కలిసి రోడ్ షోలో పవన్ కూడా పాల్గొనేలా ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు తెలుగుదేశం అధినేతతో కూడా ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ సఖ్యతగా ఉండటం.. తొలి నుంచీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనంటూ గతంలో పవన్ చేసిన ప్రకటన బేరీజు వేసుకుని చూస్తే ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీలో జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని పర్యటనను పూర్తిగా హైజాక్ చేసి.. తాము బీజేపీకి పూర్తి అనుకూలం అని చాటేందుకు శతథా ప్రయత్నించిన వైసీపీకి మోడీ పర్యటకు జనసేనానికి ఆహ్వానం పలకడం, మోడీతో పవన్ ప్రత్యేకంగా భేటీ అవుతుండటం, అలాగే మోడీతో కలిసి రోడ్ షోలో పాల్గొనే అవకాశాలుండటం కచ్చితంగా మింగుడు పడదని పరిశీలకులు అంటున్నారు. మోడీ పర్యటన సందర్భంగా పవన్ కు ఆహ్వానం ద్వారా వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చాటడమే బీజేపీ వ్యూహంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా మోడీ, పవన్ భేటీ రాష్ట్ర రాజకీయాలలో మార్పునకు తొలి అడుగుగా భావించవచ్చని అంటున్నారు.  

బాణసంచా గోడౌన్ లో పేలుడు.. నలుగురు సజీవదహనం

బాణ సంచా గోడౌన్ లో గురువారం (నవంబర్ 10)సాయంత్రం సంభవించిన భారీ పేలుడులో కనీసం నలుగురు మరణించారు. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.   తాడేపల్లి గూడెం సమీపంలోని కడియుద్ద వద్ద ఈ దారుణ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు అనంతరం గోడౌన్ మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని తాడేపల్లి గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పేలుడు శబ్దాలు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించాయని చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. బాణసంచా గోడౌన్ ఊరికి దూరంగా ఉండటంతో ఫైరింజన్ సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమైందని చెబుతున్నారు.  తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.పది లక్లు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏలూరు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, డీఐజీ పాల్ రాజ్ సందర్శించారు. 

బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురు మృతి

తమిళనాడులోని ఓ బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మధురైూ సమీపంలోని తిరుమంగళంలో జరిగిన ఈ సంఘటనలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నారు.   మదురైలోని తిరుమంగళంలో ఓ క్రాకర్స్‌ తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  తిరుమంగళా పురంలోని అగు జైలు గ్రామంలోని ఓ ప్రైవేట్‌ బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. దుర్ఘటన జరిగిన సమయంలో కర్మాగారంలో . 15 మందికి పైగా కార్మికులు ఉన్నారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన సంభవించిన ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, మాంసంముద్దలుగా మారిన శరీర భాగాలతో భీతావహంగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.  

తెరాసకు తుమ్మల గుడ్ బై? తెలుగుదేశం గూటికేనా?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెరాసకు గుడ్ బై చెప్పనున్నారా? అంటే పరిశీలకులు ఔనంటూ విశ్లేషిస్తున్నారు. ములుగు జిల్లాలో తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ఆయన ఆ సమావేశానికి హాజరయ్యేందుకు గురువారం (నవంబర్ 10) దాదాపు 350 కార్లలో వాజేడుకు బయలుదేరారు. అంతకు ముందు ఉదయం ఆయన భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా భారీ ర్యాలీతో వాజేడు కు బయలు దేరారు. కాగా ఆయన ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశం, లక్ష్యం పార్టీ మార్పుపై చర్చించేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తుమ్మల ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, మద్దతు దారులు, అనుచరులు పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో ఆయన తెరాసను వీడటంపై చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా ఉండటం కూడా తుమ్మల పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. అయితే తుమ్మల తెరాసను వీడుతారన్న ఊహాగానాలు గత కొంత కాలంగా రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నాయి. తెరాసలో ఇటీవలి కాలంలో తుమ్మల ప్రాధాన్యత తగ్గింది. తగ్గిందనే దాని కంటే ఆయనే పార్టీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనడం లేదనీ, తనంత తానుగానే పార్టీకి దూరంగా ఉంటున్నారనీ ఆయన మద్దతు దారులు అంటున్నారు.  ఇటీవలి కాలంలో తుమ్మల కాంగ్రెస్, బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని కూడా ప్రచారం జరిగింది. అలాగే ఆయన తెలుగుదేశంకు చేరువ అవుతున్నారన్న చర్చా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే వాజేడులో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  తెలంగాణలో పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా తెలుగు దేశం కూడా తన వ్యూహాలకు పదును పెడుతుండటం, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా బలమైన బీసీ నేత కాసాని జ్ణానేశ్వర్ కు పార్టీ అధినేత చంద్రబాబు పగ్గాలు అప్పగించడంతో ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పుంజుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెరాసను వీడి తుమ్మల హోం కమింగ్ అంటూ తెలుగుదేశం పంచన చేరు అవకాశాలు లేకపోలేదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. 2014లో తెరాస గూటికి చేరిన తుమ్మల అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తరువాత కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించి తన కేబినెట్ లో పదవి కూడా ఇచ్చారు. అయితే గత ఎన్నికలలో ఓటమి తరువాత తుమ్మలకు తెరాసలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. మరో సారి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇస్తారని తుమ్మల ఆశించారు. అయితే కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. ఆయన బీజేపీ గూటికి చేరుతారని గతంలో బలంగా వినిపించినా తుమ్మల ఖండించారు. అలాగే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారనీ వదంతులు వినిపించాయి. అయితే తుమ్మల వాటిపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆత్మీయ సమ్మేళనం అంటూ పెద్ద సంఖ్యలో మద్దతు దారులను సమీకరించి సమావేశం పెట్టడంతో ఆయన తెరాసను వీడటం ఖాయమేనని అంటున్నారు. అయతే అయన ఏ పార్టీలోకి వెళతారన్నది మాత్రం ఇతమిథ్ధంతా తెలియరాలేదు. ఇంకో వైపు ఇదేరోజు (నవంబర్10) తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాసాని జ్ణానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయడం, అదే రోజు తుమ్మల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం కాకతాళీయమేనా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. 

ఇండియా ఇంటికి ... టి20 ఫైనల్లో పాక్ ప్రత్యర్థి ఇంగ్లాండ్

క్రికెట్ ప్రపంచం కలల మ్యాచ్ కల్ల అయిపోయింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థులు పాక్, భారత్ మధ్య మ్యాచ్ జరిగితే చూడాలని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా కోరుకున్నారు. అదే జరుగుతుందని ఆ  క్రికెట్ ఫీస్ట్ కు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ వేదిక ఔతుందని విశ్లేషణలు కూడా సో కాల్డ్ క్రీడా పండితులు చేసేశారు. కానీ గురువారం జరిగిన సెమీ ఫైనల్ లో కనీస పోటీ కూడా ఇవ్వకుండా భారత్ చేతులెత్తేసింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్కవికెట్ కూడా నష్టపోకుండానే ఉఫ్ మని ఊదేసింది.  తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయకుండా భారత్ ను నిర్దేశించింది. హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించినా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  168 పరుగులకే పరిమితమైంది.  స్కిప్పర్ రోహిత్ శర్మ మరో సారి విఫలమయ్యాడు. ఫామ్ లోకి వచ్చాడనుకున్న రాహుల్ సైతం  నిరాశ పరిచాడు. 360 డిగ్రీల బ్యాటర్ అంటూ ఆశలు పెట్టుకున్న  సూర్య కుమార్ యదవ్ కూడా విఫలమవ్వడంతో భారత్ ఓ మోస్తరు  లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. అయితే ఆ లక్ష్యాన్నికాపాడుకోవడంలో భారత్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ పది వికెట్ల ఆధిక్యతతో సెమీస్ లో భారత్ ను చిత్తు చేసి ఘనంగా ఫైనల్ కు చేరుకుంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా కేవలం 16 ఓవర్లలోనే అంటే ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో ఫైనల్ లో ఇంగ్లాండ్.. పాకిస్థాన్ లు తలపడనున్నాయి. భారత బౌలర్లు సమష్టిగా విఫలమైన వేళ ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బట్లర్ 49 బంతుల్లో  9 ఫోర్లు, 3సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఓపెనర్ హేల్స్ 47 బంతుల్లో 7 సిక్స్ లు 4 ఫోర్లతో 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్16 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా 160 పరుగులు చేసింది. 

ఏపీలో సైతాన్ ప్రభుత్వం.. పంచుమర్తి అనూరాధ

ఏపీలో ఉన్నది సైతాన్ సర్కార్ గా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ అభివర్ణించారు. దేశంలో ఎక్కడ ఏ అవినీతి జరిగినా ఆ మూలాలూ  లింకులూ ఏపీలోని వైసీపీ నేతలతో ముడిపడి ఉంటాయనీ, అందుకు తాజా నిదర్శనమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చం ద్రారెడ్డి అరెస్టు అని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో   వైసీపీ లింకులు బయటపడ్డాయా అంటే తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాథ ఔననే అంటున్నారు.  ఈ స్కాములో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి స్వయానా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న అని పంచుమర్తి అనురాధ అన్నారు. గురువారం(నవంబర్ 10)న మీడియాతో మాట్లాడిన ఆమె  ఇసుక, మద్యం, మైన్, బియ్యం, అంబులెన్సులు ఇలా అన్ని మాఫియాలూ జగన్ హయాంలోనే ఏపీలో విజృంభించాయని అన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు ఎయిమ్స్ ఆసపత్రికి గుక్కుడు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితే నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రభుత్వాసుపత్రులే అత్యాచార కేంద్రాలుగా మారిన దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ దిగజారిందని ధ్వజమెత్తారు.  చంద్రబాబు గారి పాలనా సామర్థ్యం, దార్శనికతకు మెడ్ టెక్ జోన్, జెనోమ్ వ్యాలీ నిదర్శనం అయితే.. జగన్ దౌర్బాగ్య పాలనకు కూల్చివేతలు, విధ్వంసాలు నిదర్శనమని పంచుమర్తి అనూరాధ ధ్వజమెత్తారు.  హైదరాబాద్ లాంటి కర్ఫ్యూ సిటీని కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. అదే జగన్ పాలనలో  కంటి వెలుగు అంటూ కళ్ల జోళ్లు కూడా ఇవ్వని నిర్వాకాలు రోజు కళ్లెదుట సాక్షాత్కరిస్తున్నాయని విమర్శించారు.  కొవిడ్ సమయంలో రోగులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని జగన్ రెడ్డి ప్రజారోగ్యం ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఫోన్ చేయగానే కుయ్ కుయ్ మంటూ వస్తాయన్న అంబులెన్స్ ల జాడ లేక బిడ్డల శవాలను భుజాలపై వేసుకెళుతున్న ఘటనలు జగన్ రెడ్డి పాలనా వైఫల్యాలకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.    జగన్ రెడ్డిది దేవుడి ప్రభుత్వం కాదు..సైతాన్ ప్రభుత్వమని అభివర్ణించారు. 

ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 169 పరుగులు.. ఫైనల్ కు చేరేనా?

ఇంగ్లాండ్ సెమీస్ గండం దాటి ఫైనల్ కు చేరాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేయాలి. అదే బిగ్ ఫైనల్ మ్యాచ్ చూడాలంటే మాత్రం భారత్ ఇంగ్లాండ్ ను  లక్ష్య ఛేదన చేయకుండా నిరోధించాలి. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారత్ పరుగుల వరద పారించకుండా అడ్డుకుంది. కీ బౌలర్లు గాయాలతో అందుబాటులో లేకున్నా.. భారత్ ను నియంత్రించగలిగింది. కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మినహాయిస్తే రాహుల్, రోహిత్, పంత్, ఆఖరికి సూర్యకుమార్ యాదవ్ కూడా స్వేచ్ఛగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. ముందు విరాట్ కోహ్లీ తన కింగ్ లైక్ ఇన్నింగ్స్ తో 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ స్కోరులో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లు ఉన్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ టి20 వరల్డ్ కప్ లో రెండు చేతులా పరుగులను పిండుకుంటున్నాడు. సూపర్ 12 మ్యాచ్ లో పాకిస్థాన్ పై చెలరేగిన తరువాత వెనక్కు తిరిగి చూడటం లేదనే చెప్పాలి. ఫామ్ పై విమర్శలు చేసిన నోళ్లే ఇప్పడు పొగడ్తల వర్షం కురిపించేలా కోహ్లీ ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. ఇంగ్లాండ్ తో టి20 సెమీఫైనల్ మ్యాచ్ లో ఒక వైపు వికెట్లు టపటపా పడుతున్నా.. ఎక్కడా తగ్గకుండా హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఒక వరల్డ్ రికార్డు కోహ్లీ ఖాతాలోకి వచ్చి చేరింది. టి20ల్లో నాలుగు వేల పరుగుల మైలు రాయిని దాటిన ఏకైక బ్యాటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 50 పరుగులు చేసిన కోహ్లీ జోర్డాన్ బౌలింగ్ లో షార్ట్ థర్డ్ మ్యాన్ లో ఉన్న రషిద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత హార్ధిక్ పాండ్యా పరుగుల ప్రభంజనం చూపాడు. ఎడాపెడా సిక్సర్లు బాది స్కోరును పరుగులెత్తించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కనీసం 150 పరుగులైనా చేయగలుగుతుందా అన్న దశ నుంచి చివరి ఓవర్ చివరి బంతికి ఔటయ్యే వరకూ హార్దిక్ పాండ్యా పరుగుల వదర పారించారు. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 190 స్ట్రైక్ రేట్ తో 63 పరుగులు చేశాడు. చివరి ఓవర్ చివరి బంతిని కూడా స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీకి తరలించినప్పటికీ.. స్టాన్స్ నియంత్రించుకోవడంలో విఫలమై హిట్ వికెట్ అయ్యాడు. మొత్తం మీద ఇంగ్లాండ్ కు టీమ్ ఇండియా చాలెంజింగ్ టార్గెట్ నే ఇచ్చింది. బంతి కొద్దిగా ఎక్స్ ట్రా బౌన్స్ ఔతున్న పిచ్ పై భారత్ చేసిన స్కోరు మరీ తీసిపారేయాల్సింది కాదు. బౌలర్లు క్రమశిక్షణతో రాణిస్తే ఇంగ్లాండ్ కు ఈ టార్గెట్ ఛేజ్ చేయడం అంత సులువు కాదు. మొత్తానికి ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ లో ఇరు జట్లకూ సమాన విజయావకాశాలున్నాయని చెప్పాలి. చూద్దాం ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏం చేస్తారో? నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ గెలవాలంటే  ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 169 పరుగులు చేయలి.

వైసీపీ నేతల్లో ఓటమి భయం.. మునుగోడు ఫలితం చూసి మన పరిస్థితేంటన్న జంకు

గత ఎన్నికల్లో 151 సీట్లు కైవసం చేసుకున్నాం... వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో 175కి 175 సీట్లలో మన పార్టీ వారే కూర్చోవాలనే ఆసాధ్య లక్ష్యన్ని ఏర్పరుచుకుని వైసీపీ అధినేత జగన్  అడుగులు వేస్తున్నారని.. ఆ క్రమంలో పార్టీలోని కీలక నేతలను సైతం ఆ దిశగా పరుగులు పెట్టించేస్తున్నారనే ఓ టాక్  పార్టీలో వైరల్ అవుతోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో మన పార్టీని మన పథకాలే గెలిపిస్తాయంటూ.. వివిధ సమీక్షా సమావేశాల్లో సీఎం జగన్.. నేతలకు చెబుతున్నారని  అయితే ఆయనకున్న ధీమా మాత్రం పార్టీ నేతలలో ఇసుమంతైనా కనిపించడం లేదనీ వైసీపీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.  అయితే తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చూశాక.. వచ్చే ఎన్నికల్లో గెలుపు  జగన్ భావిస్తున్నంత తేలిక ఎంత మాత్రం కాదన్న అభిప్రాయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. గెలుపు ధీమా కోల్పోయి ఓ విధమైన అలజడి వైసీపీ  మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న అభ్యర్థుల్లో మొదలైయిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫోరైడ్ సమస్యను నిర్మూలించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గతంలో కోట్లాది రూపాయిలు వెచ్చించి.. మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిందని... దీంతో గత నాలుగైదేళ్లుగా ఆ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని.. అలాగే దళిత బంధు, కల్యాణ లక్ష్మీ, రైతు బంధు తదితర పథకాలను కొట్లాది రూపాయిలు అప్పుగా తీసుకొచ్చి మరీ ఆ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోందని.. ఇన్ని పథకాలు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్నా.. మునుగోడులో విజయం కోసం గులాబీ పార్టీ చెమటోడ్చాల్సి వచ్చింది. అంత కష్టపడ్డా చచ్చీ చెడీ పది వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గట్టెక్కింది. అది కూడా   వందల కోట్ల రూపాయిలు వ్యయం చేస్తేనే వచ్చింది.  సొమ్ముల పందేరంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆ విషయంలో టీఆర్ఎస్ తో పోటీ పడలేకపోవడంతోనే టీఆర్ఎస్ విజయం సాధ్యమైందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. చెప్పుకోవడానికీ, చూపించుకోవడానికీ ఎంతో కొంత చేసిన టీఆర్ఎస్ పరిస్థితే అలా ఉంటే.. ప్రగతి ఊసే పట్టించుకోని వైసీపీ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఏమౌతుందో ఊహించుకోవాలంటేనే భయంగా ఉందన్న భావన వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది.    ఇలాంటి నేపథ్యంలో జగన్ వివిథ పథకాల పేరుతో లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్న నగదు వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే గ్యారంటీ అయితే తమకు లేదని వైసీపీ నాయకులే అంతర్గతసంభాషణల్లో ఒకరితో  ఒకరు చెప్పుకుంటున్నపరిస్థితి కనిపిస్తోంది.   ఆ క్రమంలోనే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన వివిధ జిల్లాల అధ్యక్షులు.. వరుసగా ఎవరికి వారు.. రాజీనామాల బాట పట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు చూసుకునే కంటే.. ఆ పదవికీ రాజీనామా చేయడం వల్ల తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయడం ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లి.. వారి చిన్నా చితక సమస్యలు పరిష్కరించడం వల్ల.. మన ఎమ్మెల్యే గారు మనతోనే ఉన్నారంటూ.. ఓ విధమైన కలరింగ్ ఇవ్వడం వల్ల కొంతలో కొంత వారికి మేలు చేయడమే కాకుండా.. మనకు మేలు జరుగుతోందనే భావనతోపాటు... ఎన్నికల వేళ అప్పటి పరిస్థితిని బట్టి ఓటర్ల నాడిని అంచనా వేసి.. నోట్లు పంచితే అదే తమకు పదివేలు అనుకునే స్థితికి ఫ్యాన్ పార్టీలోని ప్రజా ప్రతినిధులంతా వచ్చేశారని.. అలా కాకుంటే... మన పరిస్థితి మునుగుడే అనే ఓ టాక్ అయితే ఫ్యాన్ పార్టీలో వాడి వేడిగా సాగుతోందని సమాచారం. ఏదీ ఏమైనా.. ఓటు వేసే ఓటరు నాడీ.. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి నాడి..ఇద్దరిది ఓటుకు నోటుతో పెనవేసుకుపోయి ఉందని.. జగన్ పార్టీలోని ప్రజాప్రతినిధుల్లో ఓ టాక్ అయితే ఆ పార్టీ గుర్తు ఫ్యాన్ సాక్షిగా గింగరాలు తిరుగుతూ హల్‌చల్ చేస్తోందని చెబుతున్నారు.

వైసీపీ నేతల్లో నైరాశ్యం.. పక్క చూపులు చూస్తున్న వైనం

విధ్వంసాలు, కూల్చివేతలు, దశాబ్దాలుగా కొనసాగుతున్న సంస్థలు, వ్యవస్థల పేర్ల మార్పిడి, విగ్రహాల కూల్చివేతలు, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం, అభివృద్ది ఆమడదూరం, ప్రాజెక్టుల నిర్మాణంలో చెప్పలేనంత జాప్యం, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయించే చేవ లేకపోవడం, ఉన్న పరిశ్రమలు, సంస్థలు భయంతో పారిపోయేలా చేసే విధానాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పేచీలు, రాజధాని లేకుండా చేసిన వైనం, మూడు రాజధానుల జపంతో మూడు ముక్కలాట. రోడ్లు లేని దుస్థితి. కనీసం మరమ్మతులైనా చేయని తీరు. జనం మధ్యకు రాకుండా ముఖం చాటేస్తున్న వైనం.. వచ్చినా.. అడ్డు తెరలు, సామాన్యులు దరి చేరనివ్వకుండా భద్రతా వలయం.. కనీసం ఎమ్మెల్యేలకైనా ముఖ్య నేత అపాయింట్ మెంట్ దొరకని విధానం.. నవరత్నాల పేరుతో నవ విధాల ద్రోహం.. ఎవరినీ లెక్కచేయనితనం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.. ఘనత వహించిన ఏపీ సీఎం తీరుతో ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ గ్రాఫ్ రోజు రోజుకూ దిగజారిపోతోందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అని 2019 ఎన్నికల ముందు.. ఊరూరా తిరిగి అర్థించిన వైసీపీ అధినేత తీరా అధికార పీఠం ఎక్కిన తర్వాత చేస్తున్న పనులతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి, జగన్ కు పల్లెల్లో అధికశాతం జైకొట్టాయి. పట్టణ ప్రజల్లోనూ ఎక్కువ మంది ఆయనకే ఓటు వేశారు. యువకుడైన జగన్ ఏపీ అభివృద్ధికి, తమ బాగు కోసం ఏదో చేస్తారనే ఆశతో ఓట్లు వేసి భారీ విజయం కట్టబెట్టారు. నిజానికి పట్టణ ఓటర్ల మద్దతు ఎప్పుడూ చంద్రబాబుకే ఉండేది. చంద్రబాబు హయాంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పట్టణ యువకుకు ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఆర్థికంగా వారు ఎదగారు. బాబు చేసిన అభివృద్ధి ఫలాలు అందరికి పూర్తిగా అందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఏపీగా మారిన తర్వాత తొలిసారి 2014లో వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు దార్శనికతను, కార్యదక్షతను గుర్తించి గెలిపించారు. హైదరాబాద్ కన్నా దీటైన రాజధానిని నిర్మిస్తారని భావించారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో అభివృద్ధి ఆకాశమే హద్దు అవుతుందని ఆశించారు. అయితే.. విభజన గాయాలు, ప్రత్యేక హోదాను చంద్రబాబు సాధించలేకపోయారనే బాధతో జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఏపీలోని 25 పార్లమెంటరీ స్థానాల్లోనూ వైసీపీని గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ తీరా ఎన్నికలయ్యాక మాట మార్చడం జనానికి నచ్చలేదు. 22 ఎంపీ స్థానాల్లో వైసీపీని గెలిపించిన తర్వాత బీజేపీ సర్కార్ కు మన అవసరం లేదు. ప్రత్యేక హోదా సాధించడం కష్టం అని మడమ తిప్పేయడంతో జనంలో వ్యతిరేకత మొదలైంది. పాలన ప్రారంభించిన తొలినాళ్లలో ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా విధ్వంస పాలనకు తెరలేపడం రాష్ట్ర జనానికి నచ్చలేదు. చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ‘రివర్స్ టెండరింగ్’ నెపంతో నిలిపేయడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామంటూ.. అభివృద్ధిని అస్సలు పట్టించుకోకపోవడంతో వైసీపీ సర్కార్ పై వ్యతిరేక భావనలు మరింత పెరిగాయి. పథకాల పేరు చెప్పి రాష్ట్ర ఖజానాలోని నిధుల్ని ఇష్టారీతిన ఖర్చుపెట్టేసి, చివరికి ఏపీకి, ఏపీ ప్రజల నెత్తిన మోయలేని అప్పుల భారం పెట్టిన జగన్ తీరుపై జనంలో ఆగ్రహం ఎక్కువైంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటే.. వారంతా రోడ్లపైకి వచ్చి పోరాటాలు, ఉద్యమాలు చేసే దాకా పరిస్థితి వెళ్లింది. మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధానే లేకుండా చేసిన జగన్ ను, ఆయన పాలనను, వైసీపీ సర్కార్ ను జనం దుమ్మెత్తి పోస్తున్నారు. నిరు పేదలకు గత ప్రభుత్వాలు దశాబ్దాల క్రితమే ఇచ్చిన ఉచిత ఇళ్లకు క్రమబద్ధీకరణ పేరుతో ఇప్పుడు డబ్బులు కట్టాలన్న వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో జనంలో వైసీపీకి బాగా గ్రాఫ్ తగ్గిపోయిందంటున్నారు. మరీ ముఖ్యంగా అక్షర జ్ఞానం ఉన్న పట్టణ ప్రజల్లో వైసీపీ సర్కార్ తప్పిదాలపై వ్యతిరేకత మరింత తీవ్రంగా ఉందంటున్నారు. అంతే కాదు.. జగనే స్వయంగా చేయించుకున్న సర్వేలు, ఎన్నికల వ్యూహాలు రచించే ఐప్యాక్ బృందం సర్వేల్లోనూ జనం నుంచి వ్యతిరేకతే స్పష్టమైందని తేలింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులపై జగన్ చీటికి మాటికి ఫైర్ అవుతున్నారనే వార్తలు బయటికి వస్తున్నాయి. ఒక పక్కన అభివృద్ధి లేదు.. పైగా తామేదో గొప్ప పనులు చేసినట్లు జనాన్ని ఊదరగొట్టాలంటూ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో తమను జగన్ పంపుతుంటే.. ఏం చేయాలో తెలియక ప్రజా ప్రతినిధులు కుమిలిపోతున్నారంటున్నారు. చేయని అభివృద్ధి గురించి ఏమి చెప్పాలి?.. సమస్యలపై స్థానికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక నిలువునా వారు జావగారిపోతున్న ఘటనలు ఉన్నాయి. ఇక.. వైసీపీలో కొత్త ముసలం పుట్టింది. పార్టీ జిల్లాల అధ్యక్ష పదవుల నుంచి సీనియర్లు ఒక్కొక్కరూ తప్పుకుంటున్నారు. ముందుగా తానేటి వనిత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని వదిలేశారు. తాజాగా కాపు రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇదే బాటలో మరికొందరు నేతలు కూడా పయనించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు వచ్చే అవకాశం లేదకుంటున్న కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని, ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం జగన్ చెప్పిందే విన్న వారంతా తమ అధినేతపై అసంతృప్తి పెంచుకున్నారంటున్నారు. పార్టీ బాస్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశమే రాజీనామాలు చేస్తున్న వారిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

టి20 వరల్డ్ కప్ సెమీస్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ ల మధ్య టి20 సెమీ ఫైనల్ మ్యాచ్ మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టే పాకిస్థాన్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడుతుంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో టాస్ ఇంగ్లాండ్ ను వరించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కి వేదిక అయిన అడిలైడ్ లో భారత్ కు ఇంగ్లాండ్ తో పోలిస్తే మెరుగైన రికార్డు ఉంది. అలాగే పొట్టి కప్ ప్రపంచ కప్ లో కూడా ఇంగ్లాండ్ కంటే బారత్ దే పై చేయి. ఈ రికార్డులన్నీ భారత్ కే అనుకూలంగా ఉన్నాయి. దీంతో భారత్ అభిమానుల్లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఫైనల్ లో  చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడుతుందన్న ధీమా వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా ఈ రోజు ఏ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ఆ జట్టుదే విజయం. ఇరు జట్లూ సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు తప్పదని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. 

సానియామీర్జా..షోయెబ్ అక్తర్ డైవోర్స్?!

'స్పోర్ట్స్ ప్రపంచంలో అత్యంత పాపులర్ జంట విడాకులకు సిద్ధమైంది. భారత్ కు చెందిన సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ లు పుష్కర కాలం  కిందట వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడా జంట విడాకులకు రెడీ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇండియన్ టెన్నీస్ స్టార్ సానియామీర్జా విడాకులు తీసుకోబోతున్నారా? పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ అక్తర్ తో ఆమె వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పడబోతోందా అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. పరస్పర అంగీకారంతో విడాకుల నిర్ణయానికి వచ్చామని సానియా మీర్జా భర్త షోయేబ్ అక్తర్ చెప్పేశారు. ఈ విషయాన్ని అక్తర్ సన్నిహితుడొకరు మీడియాకు వెల్లడించారు. సానియా, షోయెబ్ అక్తర్ లు ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారనీ, విడాకులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందనీ, అది పూర్తయిన వెంటనే వారిరువురూ తాము విడిపోయిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారనీ పాక్ మీడియా సంస్థ పేర్కొంది. సానియా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. షోయెబ్ అక్తర్ అయితే టి20 ప్రపంచ కప్ అనలిస్ట్ గా పాకిస్థాన్ లోనే ఉన్నాడు. అసలు వీరిద్దరూ విడాకులు తీసుకొంటారన్న వార్తకు ఆధారం ఇటీవల సానియా మీర్జా చేసిన ఒక పోస్టు. సానియా తన కుమారుడు ఇజాన్ బర్త్ డే సందర్భంగా జరిగిన వేడుకల్లో షోయెబ్ ఉన్నప్పటికీ.. సానియా మీర్జా మాత్రం ఆ వేడుకలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన ఫొటోలలో ఎక్కడా షోయెబ్ అక్తర్ కనబడకుండా జాగ్రత్త పడ్డారు. ఇదే వారిరువురి మధ్యా సఖ్యత లేదనడానికి నిదర్శనంగా నెటిజన్లు చెబుతున్నారు. సానియా ఆ పోస్టు పెట్టినప్పటి నుంచీ వీరిరువురూ విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు సామాజిక మాధ్యమంలో తెగ కనిపించాయి. ఇప్పుడా వార్తలే వాస్తవమని షోయెబ్ అక్తర్ సన్నిహిత మిత్రుడొకరు ధృవీకరించారు. షోయెబ్ సానియాలు 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్ లో వివాహం చేసుకున్న సంగతి విదితమే.