ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 169 పరుగులు.. ఫైనల్ కు చేరేనా?
posted on Nov 10, 2022 @ 2:18PM
ఇంగ్లాండ్ సెమీస్ గండం దాటి ఫైనల్ కు చేరాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేయాలి. అదే బిగ్ ఫైనల్ మ్యాచ్ చూడాలంటే మాత్రం భారత్ ఇంగ్లాండ్ ను లక్ష్య ఛేదన చేయకుండా నిరోధించాలి. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారత్ పరుగుల వరద పారించకుండా అడ్డుకుంది. కీ బౌలర్లు గాయాలతో అందుబాటులో లేకున్నా.. భారత్ ను నియంత్రించగలిగింది. కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మినహాయిస్తే రాహుల్, రోహిత్, పంత్, ఆఖరికి సూర్యకుమార్ యాదవ్ కూడా స్వేచ్ఛగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.
ముందు విరాట్ కోహ్లీ తన కింగ్ లైక్ ఇన్నింగ్స్ తో 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ స్కోరులో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లు ఉన్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ టి20 వరల్డ్ కప్ లో రెండు చేతులా పరుగులను పిండుకుంటున్నాడు. సూపర్ 12 మ్యాచ్ లో పాకిస్థాన్ పై చెలరేగిన తరువాత వెనక్కు తిరిగి చూడటం లేదనే చెప్పాలి. ఫామ్ పై విమర్శలు చేసిన నోళ్లే ఇప్పడు పొగడ్తల వర్షం కురిపించేలా కోహ్లీ ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు.
ఇంగ్లాండ్ తో టి20 సెమీఫైనల్ మ్యాచ్ లో ఒక వైపు వికెట్లు టపటపా పడుతున్నా.. ఎక్కడా తగ్గకుండా హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఒక వరల్డ్ రికార్డు కోహ్లీ ఖాతాలోకి వచ్చి చేరింది. టి20ల్లో నాలుగు వేల పరుగుల మైలు రాయిని దాటిన ఏకైక బ్యాటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 50 పరుగులు చేసిన కోహ్లీ జోర్డాన్ బౌలింగ్ లో షార్ట్ థర్డ్ మ్యాన్ లో ఉన్న రషిద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తరువాత హార్ధిక్ పాండ్యా పరుగుల ప్రభంజనం చూపాడు. ఎడాపెడా సిక్సర్లు బాది స్కోరును పరుగులెత్తించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కనీసం 150 పరుగులైనా చేయగలుగుతుందా అన్న దశ నుంచి చివరి ఓవర్ చివరి బంతికి ఔటయ్యే వరకూ హార్దిక్ పాండ్యా పరుగుల వదర పారించారు. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 190 స్ట్రైక్ రేట్ తో 63 పరుగులు చేశాడు. చివరి ఓవర్ చివరి బంతిని కూడా స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీకి తరలించినప్పటికీ.. స్టాన్స్ నియంత్రించుకోవడంలో విఫలమై హిట్ వికెట్ అయ్యాడు.
మొత్తం మీద ఇంగ్లాండ్ కు టీమ్ ఇండియా చాలెంజింగ్ టార్గెట్ నే ఇచ్చింది. బంతి కొద్దిగా ఎక్స్ ట్రా బౌన్స్ ఔతున్న పిచ్ పై భారత్ చేసిన స్కోరు మరీ తీసిపారేయాల్సింది కాదు. బౌలర్లు క్రమశిక్షణతో రాణిస్తే ఇంగ్లాండ్ కు ఈ టార్గెట్ ఛేజ్ చేయడం అంత సులువు కాదు. మొత్తానికి ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ లో ఇరు జట్లకూ సమాన విజయావకాశాలున్నాయని చెప్పాలి. చూద్దాం ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏం చేస్తారో? నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 169 పరుగులు చేయలి.