బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఈటల?.. హస్తిన పిలుపు వెనుక కారణం అదేనా?

ఈటలకు బీజేపీ అనూహ్య ప్రమోషన్ ఇస్తోందా? తెలంగాణ పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ బీజేపీ బాధ్యతలను పార్టీ అధినాయకత్వం ఈటలకు అప్పగింనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఈటల సారథ్యంలో వచ్చే ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి పదవి కూడా ఈటలకే అప్పగించనున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. అందు కోసంమే  ఈటలకు హస్తిన నుంచి పిలుపు వచ్చిందంటున్నాయి. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక ఓటమి పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ఖాతాలో పడితే.. అదే సమయంలో ఇదే ఉప ఎన్నికలో తెరాసకు దీటుగా బీజేపీ పోటీ  ఇచ్చిందనీ.. ఆ క్రెడిట్ ఈటల ఖాతాలోనూ పడిందని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరకు ఈటల రాజేందర్ హుటాహుటిన మంగళవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. చాలా కాలం నుంచీ ఈటల బీజేపీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తితో  వార్తలొస్తున్నాయి. తెరాస సర్కార్ లో మంత్రిగా పనిచేసిన ఆయనకు చేరికల కమిటీ ఛైర్మన్‌ పదవితో సరిపెట్టారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఈటల బీజేపీకి గణనీయంగా ఓట్లు రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పలుకుబడి కారణంగానే బీజేపీ మునుగోడులో తెరాసకు దీటుగా పోటీ ఇవ్వగలిగిందని బీజేపీ అధిష్ఠానం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు కీలక పదవి కట్టబెట్టాలన్న నిర్ణయానికి వచ్చిందంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించనున్నారు. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా ఈటలకు చెప్పారంటున్నారు. అంతే కాకుండా చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనీ, పార్టీలో చేరికల విషయంలో ఈటల ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదనీ, చివరకు అధిష్ఠానం అనుమతి కోసం కూడా వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా ఈటలకు విస్పష్టంగా చెప్పారని అంటున్నారు. ఇప్పటి వరకూ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ.. సొంతగా నిర్ణయం తీసుకోలేని బంధనాలు ఆయనకు సంకెళ్లుగా ఉన్నాయని ఈటల వాపోయిన సందర్బాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెప్పారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి ఈటలకు ప్రజలలో ఉన్న పలుకుబడి పూర్తిగా అర్దం కావడంతో వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టాలన్న లక్ష్యం నెరవేరాలంటే రాష్ట్ర పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించడమే మార్గమని బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చిందంటున్నారు. కాగా తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నట్లు స్వయంగా అమిత్ షా ఈటలకు చెప్పారని తెలుస్తోంది. ఈ సందర్బంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా తమతో ఏమైనా సంప్రదించాలనుకుంటే స్వయంగా హస్తినకు వచ్చి మాట్లాడాలే తప్ప.. ఎవరి ద్వారాను సమాచారం చేరవేయవద్దనీ, అలాగే ఫోన్ లో కూడా సంప్రదించొద్దనీ చెప్పినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యే అవకాశం ఉందన్న భావనతోనే అమిత్ షా ఈటలకు ఈ సూచనలు చేశారంటున్నారు. గతంలో కూడా తెలంగాణ వ్యవహారాలను చర్చించేందుకు అమిత్ షా స్వయంగా ఈటలను హస్తినకు పిలిపించుకున్న సందర్బాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటలకు ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికీ పలువురు తెరాస నేతలు ఈటలతో టచ్ లో ఉన్నారని చెబుతారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారు తరచూ ఈటలను కలిసి మాట్లాడుతారని చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే అది కచ్చితంగా బీజేపీకి మేలు చేస్తుందన్న అభిప్రాయం బీజేపీ అధిష్ఠానంలో బలంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటలను హస్తినకు పిలిపించుకుని మరీ తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించనున్నట్ల సమాచారం ఇచ్చారని అంటున్నారు. ఈటలతో పాటు పార్టీ సీనియర్ నాయకురాలు డీకే ఆరుణ, పార్టీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కూడా అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. వారిరువురికీ కూడా ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలిపి పూర్తి సహకారం అందించాలని సూచించిట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈటలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.   ఇలా ఉండగా టీఆర్ఎస్ కూడా ఈటలకు ఆహ్వానం పలికిందనీ, స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి మరీ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారనీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరితో ఈటలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఆఫర్ చేశారని కూడా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే గతంలో టీఆర్ఎస్ విడిచి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రక్రియకు కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటి నేతలకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం తెలిసిందే. అదే విధంగా ఈటలకు కూడా ఆహ్వానం అందినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఆహ్వానాన్నీ, ఆఫర్ ను ఈటల నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు.   కాగా ఒక వైపు ఈటలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ప్రలోభ పెడుతూనే మరో వైపు దేవర్ యాంజాల్ లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జా అంటూ తెరాస సర్కార్ బెదరింపులకు దిగుతోందని, భూ కబ్జా ఆరోపణలను తెరమీదకు తెస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోందనీ బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దేవరయాంజాల్‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జాపై విచారణ జరిపిన ఐఏఎస్‌ అధికారుల కమిటీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన సంగతి విదితమే.  ఒక వైపు ప్రలోభాలు, మరో వైపు బెదరింపులతో ఎలాగైనా ఈటలను తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టకండా నిలువరించాలన ప్రయత్నిస్తోందని  ఆ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటల చేతికి అప్పగిస్తే రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందన్న ధీమా అయితే బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది.

దక్షిణాది పై పట్టు కోసం కమల వ్యూహం

భారతీయ జనతా పార్టీ, 2024 ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి విజయం సాధించి, హ్యాట్రిక్ సొంతం చేసుకునేందుకు,   పావులు కదుపుతోంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాది రాష్రా లకే పరిమితమైన పార్టీ, ఇప్పుడు  దేశం అంతటా ప్రాబల్యం పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల నాటికి  దక్షిణాదిలో పాగా వేసేందుకు, వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బీజేపీ సౌత్ మిషన్ అంటూ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసిందని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. ఇందు భాగంగానే, కమల దళం ఉభయ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో పాగాకు బీజేపీ  గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటికే బలోపేతమైందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. మునుగోడులు టీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ గట్టి పోటీ ఇవ్వడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. వాస్తవానికి 2014లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే కమలం పార్టీ  ఇప్పటి వరకూ అందని ద్రాక్షలా ఉన్న దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో అధికారమే లక్ష్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ లక్ష్యం దిశగా బీజేపీ వేసిన అడుగులలో భాగంగానే  అస్సాంతో సహా పలు  ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేసింది.  కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది.  అయితే, మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం బీజేపీ వ్యూహాలు  ఫలించలేదు.  ఇతర పార్టీల నుండి పేరొందిన నాయకులను దిగుమతి చేసుకోవడం, ఇతర రాష్ట్రాల నుండి సొంత నాయకులను తీసుకు రావడం, ప్రముఖ సినీ తారలను ఆకట్టుకోవడం, ప్రాంతీయ  పార్టీలలో చీలికలను ప్రోత్సహించడం వంటి అనేక ప్రణాళికలతో దూకుడు ప్రదర్శించినా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా రాలేదు.  అయితే ఇప్పుడు  2024 ఎన్నికలలో దక్షిణాదిలో పాగాయే లక్ష్యంగా   కీలక మార్పులతో సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతోంది. దక్షిణాదిన పాగా వేయాలంటే కొత్త ఎత్తులు, వ్యూహాలు అవసరమని పార్టీ అగ్ర నాయకత్వం గ్రహించింది.  ఉత్తరాదిలో మంచి ఫలితాలు ఇస్తున్న హిందుత్వ రాజకీయాలకు భిన్నమైన రీతిలో, సైద్ధాంతిక అంశాలకు, సంక్షేమ కార్యక్రమాలకు  మధ్య గల సరిహద్దులను అధిగమించి దక్షిణాది ప్రజలకు ఆమోదయోగ్యమైన పార్టీగా నిలబడే కృషి ప్రారంభించారు. ఐదు దక్షిణాది రాష్ట్రాలలో మూడింటిలో ప్రాంతీయ పార్టీలు రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నందున, ఈ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడానికి బిజెపి వారసత్వ రాజకీయాలపై పోరాటం ఆయుధాన్ని ఎంచుకొంది.  కాంగ్రెస్-ముక్త్ భారత్, అవినీతి రహిత భారతదేశంఅన్నవే 2014 నుండి  బీజేపీ నమ్ముకున్న నినాదాలు. వాటికి తోడుగా  2024లో `వారసత్వ ముక్త - భారత్’ నినాదాన్ని జోడించాలని నిర్ణయానికి వచ్చింది. ఆ నినాదంతో  యువతను టార్గెట్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కేడర్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభించి ప్రధాని మోడీ  అప్పటి నుంచి తన ప్రతి ప్రసంగంలోనూ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ , బీజేపీకి కుటుంబ పాలన వ్యతిరేక సెంటిమెంట్  రాజకీయంగా మంచి ఫలితాలు ఇస్తుందని వివ్వసిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా, ఎన్నికలలో ఇప్పటికీ ప్రాబల్యం చూపించలేక  పోతున్న  రాష్ట్రాల్లో పార్టీ సరికొత్త విధానాన్ని ఆవలంభించ వలసిన అవసరాన్ని గుర్తించింది. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో బీజేపీ పటిష్టంగా లేదన్నది వాస్తవం. కాబట్టి ఆయా రాష్ట్రాలలో కొన్ని నియోజకవర్గాలను కైవసం కోవడంపై దృష్టి సారిస్తూ, ఆ బాధ్యతలను కేంద్ర మంత్రులకు  అప్పచెప్పి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అక్కడ పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఉదాహరణకు, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సాపేక్షంగా మెరుగైన పనితీరు కనబరిచిన కేరళలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణలో నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.  ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలో పార్టీ అధికారాన్ని దక్కించుకునేంతగా బలోపేతం కష్టమన్న విషయాన్ని గ్రహించిన కమలనాథులు.. ఆయా రాష్ట్రాలలోని కొన్ని నియోజకవర్గాలలోనైనా బలోపేతం కావాలన్న ప్రయత్నాలకు పరిమితమౌతున్నారు. అయితే  తెలంగాణలో మాత్రం బీజేపీకి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశాలున్నాయని భావిస్తోంది. అందుకే ఆ రాష్ట్రంపైనే ప్రధానంగా దృష్టి సారించింది.   ప్రముఖ క్రీడాకారిణి పి టి ఉష (కేరళ), సంగీత మాంత్రికుడు ఇళయరాజా (తమిళనాడు), వితరణశీలి వీరేంద్ర హెగ్డే, సినీ రచయిత కె వి విజయేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)లను రాజ్యసభకు నామినేట్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న  నిరణయం దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలన్న వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   2024లో కేంద్రంలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యానికి చెక్ పెట్టడమన్న వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తోందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. 

పొత్తులే సార్వత్రిక ఫలితాన్ని నిర్ణయిస్తాయా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులు ఉండరు... ఇది ఎవరంగీకరించినా అంగీకరించకున్నా యూనివర్సల్ ట్రూత్.. అందుకే  పార్టీల మధ్య స్నేహ సంబంధాలు అటూ ఇటూ కావడం తరచూ జరుగుతుంటుంది. పొత్తులు, కూటములు విచ్చిన్నం కావడం.. అలాగే పాత పొత్తులు వాడి,  కొత్త పొత్తులు చిగురించడం రివాజు. ఇటీవల బీహార్ లో ఏం జరిగిందో చూశాం. మహారాష్ట్రలో శివసేన ఎలా చీలిపోయిందో చూశాం. ఇలా చీలిక వర్గం చిటికెలో కమలంతో ఎలా జట్టు కట్టిందో చూశాం.  బీహార్ లో అయితే రెండేళ్ళ క్రితం 2020 అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ (యు) పార్టీలు పొత్తు పెట్టుకుని, ఒకే కూటమిగా (ఎన్డీఎ) పోటీ చేశాయి. కూటమి విజయం సాధించింది. ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది. జేడీయు కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా, మిత్ర ధర్మం మేరకు  జేడీయు నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ మిత్రధర్మాన్ని బీజేపీ జేడీయూలు రెండేళ్లు కూడా పూర్తిగా పాటించలేకపోయారు.   నితీష్ కుమార్  బీజేపీని వదిలించుకుని ఆర్జేడీ చేయి పట్టుకున్నారు. మళ్లీ బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.  నితీష్ కుమార్ మనసు మళ్ళీ ఎప్పుడు మారుతుంది, ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే ప్రశ్నలను పక్కన పెడితే..  రాజకీయ ఎన్నికల పొత్తులకు సంబంధించి  ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఈ ఉదంతం రుజువు చేసింది. ఔను నిజమే ఎందుకంటే.. ఇంతకు ముందు ఇదే బీహారులో ఇదే తరహ పొత్తులు కుడి ఎడమలు అయిన సందర్భాలున్నాయి. మహారాష్ట్రలోనూ కొంచెం అటూ ఇటుగా అదే జరిగింది. ఇతర రాష్ట్రలలోనూ, చివరకు జాతీయ స్థాయిలోనూ ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. కూటమిలో వచ్చిన కుమ్ములాటల కారణంగా ఒకే ఒక్క ఓటు తేడాతో  అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూలి పోయింది. అదలా ఉంచితే, ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు పొత్తులు, ఎత్తులకు సంబంధించిన చర్చలే జోరుగా జరుగుతన్నాయి. టీవీ డిబేట్స్ మొదలు రచ్చబండ రాజకీయ చర్చల  వరకు పొత్తుల  సెంట్రిక్ గానే జరిగాయి. ఎవరితో ఎవరు జట్టు కడతారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతారు ఎవరు ఎవరితో చేతులు కలిపితే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయి అనే లెక్కల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి.       ఆంద్ర ప్రదేశ్’ లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తుపొడుపు కథ రోజుకో మలుపు తిరుగుతోంది.  ఆ మధ్య కేంద్రం ఆహ్వానం మేరకు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లిన చంద్రబాబుతో.. మడీ ఆప్యాయంగా మాట్లాడటం.. తనంత తానే స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి మరీ మాట్లాటం, మరో మారు కలుద్దామంటూ ఆహ్వానించడంతో ఏపీ నేతపై మరోసారి కమలం సైకిల్ కలిసి నడుస్తాయన్న చర్చ విస్తృతంగా నడిచింది. అయితే ఆ తరువాత ఆ దిశగా ఎలాంటి పురోగతీ కనిపించలేదు.  అసలు అంత కంటే ముందుగానే పొత్తు పొడుపుల చర్చకు జనసేనాని పవన్ కల్యాణ్ తెరలేపారు. రాష్ట్రంలో ప్రబుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నీయను అంటూ.. పొత్తుల ఊహాగాన సభలకు తెర తీశారు. అదలా ఉంచితే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా  ఏపీ అభివృద్ది కోసం అవసరాన్ని బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ద్వారా పొత్తు ఊహలను సజీవంగా ఉంచడానికి తన వంతు దోహదం తాను చేశారు.  నిజం, గతంలోనూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రత్యేక  హోదా కోసమే  పెట్టుకున్న పొత్తును తుంచేసుకుంది.   ఇప్పుడు కూడా అదే పద్దతిలో, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి రాజకీయ పరిస్థితి, రాజకీయ అవసరాలు, అన్నిటినీ  మించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడమే సరైన నిర్ణయం అవుతుందని టీడీపీ భావిస్తోంది.చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే. నిజానికి ఇప్పడు కాదు, మొదటి నుంచి చంద్ర బాబు నాయుడు పొత్తుల చర్చలకు ఇంకా సమయం రాలేదనే అభిప్రాయం తోనే ఉన్నారు. అయితే పొత్తుల ఊసును పూర్తిగా కొట్టిపారేయకండా చర్చలో ఉండేలా మాట్లాడారు. అదలా ఉంటే తెలంగాణలో   మునుగోడులో అధికార తెరాసకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ జాతీయ పార్టీకి అండగా ఒక ప్లాట్ ఫామ్ కు క్రియేట్ చేశారని చెప్పాలి.   అంతే కాకుండా కొత్త పొత్తులకు పాత తగవులు అడ్డు రావని, లెఫ్ట్ పార్టీలు ఈ పొత్తు ద్వారా నిరూపించారు. ఇక ఇప్పుడు ఆ పార్టీలకు బీజేపీ తెలుగుదేశం పార్టీల పొత్తు.. ఒక వేళ  భవిష్యత్ లో కుదిరితే.. మాట్లాడే నైతికత లేనట్లేనని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇక్కడ నైతిక విలువలు అవీ ఇవీ అని మాట్లాడవలసిన అవసరం లేదు.   సిపిఐ, సిపిఎం పార్టీలు బీజేపీని ఓడించేందుకు తెరాసకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకోవడం తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే ... ఆవుదూడ మేతకు అన్నట్లు ఉందని కొందరు అంటున్నారు , అందుకు కారణం, గతంలో కేసేఆర్ లెఫ్ట్ పార్టీలను, ఆ పార్టీ నాయకులను ఎంతగా చులకన చేశారు, ఎంతగా అవహేళన చేశారు, అలాగే లెఫ్ట్ నేతలు కేసీఆర్ ను  ఏ భాషలో దూషించారు, అనేది అందరికీ తెలిసినదే. ఇక దేశ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్నది ఏపీలో పొత్తులు ఎటు తిరిగి ఎటు కుదురుతాయి అన్న అంశంపైనే. విశాఖలో జనసేనాని పర్యటనను అధికార పార్టీ అడ్డుకున్న తరువాత ఆవేశంతో ఆయన చేసిన ప్రసంగం, చంద్రబాబు స్వయంగా కదిలి వచ్చి మరీ తెలిపిస సంఘీ భావం తరువాత తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు పొడిచేసిందనే విశ్లేషణలు వెల్లు వెత్తాయి. చంద్రబాబు, పవన్ సంయుక్తంగా అప్పట్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా పవన్ కల్యాణ్ రాష్ట్రంలో బీజేపీ నేతలతో కలిసి ముందుకు నడవలేని పరిస్థితి ఉందన్న నిర్వేదం వ్యక్తం చేశారు. దీంతో తెలుగుదేశంతోనే ఆయన అడుగులు వేయనున్నారన్న నిర్ధారణకు రాజకీయ వర్గాలు వచ్చేశాయి. అయితే తాజాగా విశాఖలో మోడీతో భేటీ తరువాత పవన్ స్వరంలో మార్పు కనిపించింది. ఒంటరి పోరుపై సంకేతాలిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో పొత్తు పొడుపులే సార్వత్రిక ఫలితాన్ని నిర్ణయిస్తాయన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో విస్తృతంగా జరుగుతోంది.

ఎందరు ఛీ అన్నా మోడీ ప్రభ వెలిగిపోతోంది?! కారణమిదేనా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో, దేశానికి పనికొచ్చే ఒక్క మంచి పనిచేసింది, లేదు. ఏ వర్గాన్ని సంతృప్తి పరిచిందీ లేదు. మోడీ వట్టి పనికిమాలిన  ప్రధాని. ఇంత పనికి మాలిన ప్రదానిని నేను నా 40 సంవత్సరాల  రాజకీయ జీవితంలో చూడలేదు. తెలంగాణ గడ్డపై నుంచే మోడీ పతనానికి పోరు మొదలౌతుంది. ఈడీ దాడులకు భయపడవద్దు.. ఈ మాటలు ఎవరివో వేరే చెప్పనక్కరలేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచు మోడీ లక్ష్యంగా కేంద్రంపైనా, బీజేపీపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క కేసీఆర్ అనే కాదు..  , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ, మోడీని విమర్శించడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇలా బీజేపీయేతర పార్టీల నాయకులందరూ మోడీని విమర్శించడమే కాదు.. ఆయన విధానాలు దేశాన్ని ఎంతగా భ్రష్టు పట్టించాయో సమయం, సందర్భం లేకుండా ఉద్ఘాటించేస్తుంటారు. అయితే విపక్షాలు ఎంతగా విమర్శించినా జాతీయంగా, అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ట మసకబారుతున్న పరిస్థితి అయితే కనిపించడంలేదు.   రాహుల్ గాంధీ సహా ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరి కంటే,ఇప్పటికీ  మోడీయే ఫస్ట్ ప్లేస్’లో ఉన్నారు. ఇండియా టుడే  నిర్వహించిన  మూడ్ ఆఫ్ డి నేషన్ సర్వే ఇదే తేల్చి చెప్పింది.   53 శాతం మంది ప్రజలు మరోమారు  మోడీయే ప ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితం పేర్కొంది. అయితే మోడీ తరువాత అత్యధికులు రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయతే రెండో స్థానంలో ఉన్న రాహుల్ కు మద్దతు ఇచ్చిన వారు   కేవలం 9 శాతం మంది మాత్రమే.  ఆ తరువాతి స్థానం కేజ్రీవాల్ ది. ఆయనను పీఎంగా చూడాలనుకుంటున్న వారి శాతం   జస్ట్   7 శాతం మంది.   సో, రాహుల్ గాంధీ, కేసీఆర్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు మోడీని  పనికిమాలిన ప్రధాని అని ఎద్దేవా చేసినా దేశ ప్రజలు మాత్రం  మోడీకే జై కొడుతున్నారన్నమాట.  సర్వేలే కాదు. వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. అలాగే దేశీయంగానే కాదు, అంత‌ర్జాతీయంగా కూడా  ప్రధాని మోడీ ఛ‌రిష్మా పెరుగుతూనే ఉంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న మోడీకి జాతీయంగా, అంత‌ర్జాతీయంగా కూడా ప్రతిభ మసకబారడం లేదంటే అందుకు కారణం.. దేశంలో మోడీని వ్యతిరేకించే శక్తుల అనైన్యత అని అనుకోవచ్చు. మరి అంతర్జాతీయంగా ఛరిష్మా ఇసుమంతైనా తగ్గక పోవడానికి కారణమేమిటి?  ఇండోనేషియాలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోడీకి జో బైడెన్ సెల్యూట్ చేయడం... బ్రిటిష్ ప్రధాని మోడీతో భేటీకి అత్యుత్సాహం చూపడం, మోడీతో భేటీ అయిన గంటల వ్యవధిలోనే భారత్ అనుకూలంగా బ్రిటిస్ విసా విధానాన్ని ప్రకటించడం ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి? ఇటీవల అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ప్ర‌పంచ అత్యుత్త‌మ నేత  ఎవరనేఅంశంపై నిర్వహించిన స‌ర్వేలో కూడా  మోడీ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 22 మంది అంతర్జాతీయ నేత‌ల‌పై నిర్వహించిన సర్వేలో  అత్యధికంగా 75 శాతం రేటింగ్ మోడీకే దక్కింది. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా.. అమెరికా ఆంక్షల హెచ్చరికలు చేసినా భారత్ రష్యా నుంచి అయిల్ కొనుగోలు విషయంలో వెనక్కు తగ్గలేదు. ఈ నిర్ణయంతో మోడీ గ్రాఫ్ అంతర్జాతీయంగా పడిపోతుందని అంతా భావించారు. అయితే పరిస్థితి అంతకు భిన్నంగా ఉంది. కారణం? అంతర్జాతీయంగా భారత్ మార్కెట్ విస్తరిస్తుండటం. అదే సమయంలో చైనా విధానాలపై ప్రపంచ దేశాలలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ట ఇనుమడించడానికి కారణమంటున్నారు. ఇక దేశీయంగా విపక్షాలలో రాజకీయ అనైక్యత మోడీ ప్రతిభ మసకబారకుండా ఉండటానికి కారణమంటున్నారు. దేశీయంగా బీజేపీయేతర పక్షాలు ఐక్యంగా ముందుకు సాగే పరిస్థితులు నెలకొని ఉంటే ఈ సర్వేల ఫరితాలు పూర్తిగా ఇప్పుడున్న వాటికి భిన్నంగా ఉండేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సమీక్షల ప్రహసనం.. జగన్ మాటలపై నమ్మకం కోల్పోయిన క్యాడర్!?

 రాజుగారి దేవతా వస్త్రాల కథలా తయారైంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. ఎంత రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ.. భుజ కీర్తులతో తమ అధినేతను ఆకాశానికి ఎత్తేసే వంది మాగధులు ఉన్నా.. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి పై సమీక్షలు నిర్వహించక తప్పని పరిస్థితి. అందుకే అనివార్యంగా నియోజకవర్గ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గుర్తుకు వచ్చినప్పుడు నచ్చిన నియోజకవర్గం నుంచి తను మెచ్చిన ఓ 50 మందిని తాడేపల్లికి పిలిపించుకుని ప్రసంగాలిచ్చేసి పంపించేస్తున్నారు. అయితే  ఎన్నికల కసరత్తులంటూ జగన్ చేస్తున్న నియోజకవర్గాల సమీక్షలపై పార్టీ కేడర్ ఆసక్తి కోల్పోయింది. ఆయన మాటలు వారిలో విశ్వాసం నింపడం లేదా? అసలు సమీక్ష అంటేనా.. వారు ఎందుకొచ్చిన గొడవరా బాబూ అనుకుంటున్నారా? అయినా వైసీపీ అధినేత జగన్ దృష్టిలో నియోజకవర్గ సమీక్ష అంటే ఆ నియోజకవర్గం మొత్తం నుంచి తనకు నచ్చిన, తనకు సమస్యల చిట్టా విప్పరన్న నమ్మకం ఉన్న ఓ 50 మందిని ఎంపిక చేసి తాడేపల్లి ప్యాలస్ కు పిలిపించుకుని తాను చెప్పదలుచుకున్నది చెప్పేయడమే. సమీక్షలో మరో కండీషన్ కూడా ఉంది. ఎవరూ మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. చెప్పింది వినాలి అంతే. అందుకే వైసీపీ శ్రేణులే జగన్ నిర్వహిస్తున్న సమీక్షలపై జోకులు వేసుకునే పరిస్థితి. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాం.. మరొక్క చాన్స్ అంటూ జనంలోకి వెళ్లండి. ఈ సారి అధికారం అందుకుంటే.. ఇక అంతే మనల్ని ఎవరూ కదపలేరు. మూడు దశాబ్దాల పాటు మనదే అధికారం అంటే ఆ వచ్చిన వారిలో ఉత్సాహం నింపడానికి జగన్ నానా ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. బటన్ నొక్కి కోట్లకు కోట్ల రూపాయలు పందేరం చేస్తున్నా.. మనకు ఓట్లు ఎందుకు రావు.. 175కు 175 అసెంబ్లీ స్థానాల్లోనే మనం ఎందుకు గెలవం.. మీరు నియోజకవర్గంలో పని చేయండి చాలు మిగతాదంతా (బటన్ నొక్కడం) నేను చూసుకుంటాను అంటూ భరోసా నింపేస్తున్నారు. అయితే ఈ ప్రసంగాలేవీ క్యాడర్ లో అసంతృప్తిని చల్లార్చడం లేదు. నియోజకవర్గ సమీక్షలకు వచ్చిన వారంతా జగన్ కు వీర విధేయులే అయినా.. వారు కూడా మధ్య మధ్యలో జగన్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలను ఏకరవు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే జగన్ కు నచ్చడం లేదు. నేను చెబుతున్నాను కదా అన్నట్లు ఓ లుక్కేసి సమస్యలేమైనా ఉంటే పరిష్కరించడం అంటూ సీఎంవో అధికారులను ఆదేశించేస్తున్నారే తప్ప ఆ సమస్య ఏమిటన్నది కూడా వినిపించుకోవడం లేదు. ఎన్నో ఫిల్టర్ల తరువాతే జగన్ నియోజకవర్గ సమీక్షలకు వచ్చే క్యాడర్ ను ఎంపిక చేస్తున్నారు. వారెవరూ కచ్చితంగా నోరెత్తరని నిర్ధారణ చేసుకునే.. అందుకు అనుగుణంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి మరీ వారిని జగన్ సుముఖానికి అంటే సమీక్షకు పిలుస్తున్నారు. అయినా కూడా ఈ సమీక్షల్లో అంత ఫిల్టరై వచ్చిన వారు కూడా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే విజయం కష్టం అన్నసూచనలూ  ఇస్తున్నారు. అయితే జగన్ మాత్రం అవన్నీ మీరు పట్టించుకోవద్దు.. సమస్యలు పరిష్కారమౌతాయి.. పందేరాలు కొనసాగుతాయి.. మనదే విజయం.. అందుకు మీరు చేయాల్సింది ఐక్యంగా పని చేయడం అంటూ వారి నోరు మూయిస్తున్నారు. జగన్ ఈ వైఖరి కారణంగానే క్యాడర్ లో కూడా పని చేసే ఉత్సాహం అడుగంటి పోయిందంటున్నారు. ఆయన ఎలాగూ బటన్ నొక్కుతున్నారుగా.. ఇక మనం పని చేసేదేముంది  అంటూ సరదా వ్యాఖ్యలు చేసుకుంటున్న పరిస్థితి దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ నెలకొని ఉందని వైసీపీ వర్గాలే అంతర్గత  సంభాషణల్లో చెబుతున్నాయి. జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పగటి కలో, ఆత్మ విశ్వాసమో తెలియదు కానీ విజయంపై తనకున్న ధీమాను క్యాడర్ లోనూ కలిగించేందుకు సమీక్షల పేర ఉద్బోధలు మాత్రం నిరాటంకంగా చేసుకుంటూ పోతున్నారు. కానీ పార్టీలో మాత్రం సమీక్షల తీరు మారాలనీ, పెద్ద సంఖ్యలో క్యాడర్ ను సమీక్షలకు పిలిచి వారి అభిప్రాయాలను తీసుకోవాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే పిల్ల మెడలో గంట ఎవరు కడతారు? జగన్ మాటలు దేవతావస్త్రాల్లా ఉన్నాయని ఎవరు చెబుతారు? ఈ ప్రశ్నకు పార్టీ నేతలు ఎవరి నుంచీ సమాధానం ఉండదు. అంతా గప్ చిప్

ఆల్ ఇండియన్స్ ఆర్ హిందూస్: మోహన్ భగవత్

భారత దేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు  అన్నట్లుగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు  భారతీయులందరూ హిందువులే (ఆల్ ఇండియన్స్ ఆర్ హిందూస్) అంటున్నారు. కులం, మతం, ఆహారపుటలవాట్లు వీటి వేటితోనూ సంబంధం లేకుండా భారత్ లో నివసించే వారంతా హిందువులే అని ఉద్ఘాటిస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మొదటి నుంచీ ఇదే చెబుతోందన్నారు. ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందుత్వ సిద్ధాంతమని మోహన్ భగవత్ సెలవిచ్చారు. అఖండ భారత్ లో భాగమైన అందరి డీఎన్ఏ ఒక్కటేనన్నారు. మత సామరస్యం, పరస్పర గౌరవం నేటి అవసరాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంస్కృతీ సంప్రదాయలను పాటిస్తూ, గౌరవిస్తూనే.. ఇతరుల సంస్కృతీ సంప్రదాయాలను కూడా గౌరవించాలన్నారు. సొంత లబ్ధి కోసం, లక్ష్యాల సాధన కోసం దేశంలో మత సామరస్యానికి భంగం కలిగేలా ద్వేషపూరిత వాతావరణానికి కారణం అవ్వడం ఎంతమాత్రం సరి కాదని మోహన్ భగవత్ చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం భాతర ఆత్మ అని గుర్తు చేశారు. కరోనా మహమ్మరి విజృంభిస్తున్న కాలంలో దేశంలో కనిపించిన ఐక్యత ఎల్లకాలం కనిపించాలన్నారు. 

ఏపీ సర్కార్ కు ఎన్జీటీ ఫైన్..రూ.5 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టుల్లో మొట్టికాయలు, హరిత ట్రైబ్యునల్ జరిమానాలు ఒక అలవాటుగా మారిపోయాయా. పర్యావరణ పరిరక్షణ, నిబంధనలు, కోర్టు ఉత్తర్వులు అంటే ఖాతరీ లేని తీరే ఇందుకు కారణమా అంటే పరిశీలకులు క్షణం ఆలస్యం చేయకుండా ఔనని బదులిచ్చేస్తున్నారు. తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏపీ సర్కార్ కు రూ.5 కోట్లు జరిమానా విధించింది. పేదలకు ఇళ్ల పేర ఏపీ సర్కార్ మడ అడవులను ధ్వంసం చేసేసిందని పేర్కొంటూ ఈ జరిమానా విధించింది. కాకిడాన శివారు దమ్మాల పేటలోని మడ అడవులను జగన్ ప్రభుత్వం ద్వంసం చేసేసిందని పేర్కొంది.  సీఆర్‌జడ్ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని జగన్ సర్కార్  ఉల్లంఘించిందంటూ అందిన ఫిర్యాదు మేరకు విచారించిన ట్రిబ్యునల్ పర్యావరణ విధ్వంసం వాస్తవమేనన్న నిర్ణయానికి వచ్చి ఈ మేరకు జరిమానా విధించింది.   ఇళ్ల స్థలాల పేరుతో అడవులను ధ్వంసం చేయడాన్ని ఎన్జీటీ తీవ్రంగా తప్పుబట్టింది. సీఆర్ జడ్-1ఏ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాల ప్రాజెక్టు చేపట్టొద్దని విస్పష్టంగా ఆదేశించింది. మడ అడవుల సంరక్షణపై ప్రభావం పడేలా భూ వినియోగ మార్పిడి కోసం అధికార యంత్రాంగం ప్రయత్నించడం తగదని హెచ్చరించింది.  ఇప్పటికే అక్కడ జరిగిన విధ్వంసానికి మధ్యంతర పరిహారం కింద ఆరు నెలల్లోగా రూ. 5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.   ఈ జరిమానా మొత్తాన్ని మడ అడవుల సంరక్షణకు వ్యయం చేయాలని ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. అలాగే అడవుల విధ్వంసం ఏ మేరకు జరిగింది, ధ్వంసమైన మేర అడవులను పునరుద్ధరించేందుకు ఎంత వ్యయం అవుతుంది అన్న అంశాలపై అధ్యయనం కోసం  ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.

తెలంగాణపై చలి పులి పంజా!

తెలంగాణ చలిపులి పంజా దెబ్బకు విలవిలలాడుతోంది. ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఉదయం పది గంటల వరకూ బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొని ఉంది. విపరీతమైన చలి కారణంగా ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  మంగళవారం(నవంబర్15)న రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 0.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 20వ తేదీ వరకూ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల వరకూ పడిపోవచ్చని పేర్కొన్నారు. విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్వాస సంబంధిత రుగ్మతలు ఉన్న వారు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొగ మంచు కారణంగా వాయుకాలుష్యం కూడా హెచ్చుగా ఉంటుందని హెచ్చరించారు. మాస్కుల వాడకం ద్వారా కాలుష్యం ముప్పును కొంత వరకూ అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాను వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రంగా ఉంటోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  

ధర ఎక్కువ.. మరి నాణ్యత?.. ఏపీలో అందుబాటులోకి మరో 10 మద్యం బ్రాండులు

ఆంధ్ర ప్రదేశ్ లో మద్య నిషేధం సంగతేమో కానీ.. ఎక్కడా కనీ వినీ ఎరుగని బ్రాండ్లు మాత్రం తెగ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో పది కొత్త మద్యం బ్రాండులు ఏపీలో అందుబాటులోకి రానున్నాయి. వీటినిక ఏపీ ఎబీసీఎల్ అనుమతులు ఇచ్చేసింది. వీటి ప్రత్యేకత ఏమిటంటే అదే కేటగిరిలో ఇప్పటికే అందుబాటులో ఉన్న బ్రాండ్ల మద్యం కంటీ వీటి ధర ఎక్కువ. ప్రస్తుతం  ఏపీలో అందుబాటులో ఉన్న కొన్ని కేటగిరిల బీరు ధర రెండు వందల రూపాయలు అయితే.. ఇప్పుడు అ అదే కుటగిరిలో కొత్తగా అనుమతి వచ్చిన బ్రాండ్ బీరు ధర అంతకంటే ఎక్కువ. కొత్త బ్రాండ్ ధరను 220 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే క్వార్టర్ మద్యం ధర రూ.110లు కాగా కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ ల మద్యం క్వార్టర్ ధర 130 రూపాయలుగా నిర్ణయించారు.  తమిళనాడుకు చెందిన ఎస్ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు చెందిన కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కాగా, కొత్తగా అనుమతులు పొందిన బ్రాండ్లు, వాటికి నిర్ణయించిన ధరల విషయంలో ఏపీఎస్‌బీసీఎల్ అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. మందుబాబులు మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరీ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తూ ఉంటారు. మన దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలే ఆయా ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తమకు ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పింది. చెబుతోంది. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రంలో పూర్తిగా మద్య నిషేధం చేస్తామని అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు స్వయంగా జగనే ప్రకటించారు. కానీ, ప్రభుత్వం చెప్పిన దానికి రాష్ట్రంలోజరుగుతున్న దానికి పొంతనే లేకుండా పోయింది. మద్యం మీద ప్రభుత్వం ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. సరికదా ప్రభుత్వం ఒప్పుకోకపోయినా ఆదాయం విపరీతంగా పెరిగిందన్నది మాత్రం సత్యం. ఇక ప్రభుత్వమే చేస్తున్న మద్యం వ్యాపారంలో నాణ్యత లేని బ్రాండ్లను సరఫరా చేస్తూ, వాటిని కూడా గతంలో కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల జేబులనే కాకుండా ఆరోగ్యాన్ని కూడా గుల్ల చేస్తోంది.    మద్యం ధరలు పెంచి మద్యం ప్రియులను దానికి దూరం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దుకాణాలు మూతపడి, తెరిచిన తర్వాత.. లిక్కర్‌ పై మొత్తం 75 శాతం పన్నులను పెంచింది. మద్యం అందుబాటు ధరలో లేకపోవడంతో శానిటైజర్లు తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  దీంతో తీవ్ర విమర్శలు రావడంతో మద్యం ధరలను స్వల్పంగా తగ్గించింది. అలాగే ప్రభుత్వం వింత వింత పేర్లున్న బ్రాండ్లను తీసుకురావడంతో.. నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో, జీవితాలతో ఆటలాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, పొరుగు రాష్ట్రాల నుండి భారీగా అక్రమ మద్య రవాణా జరుగుతోంది. దీనికితోడు నాటుసారా తయారీ, అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి.  ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని.. ఏటా 20 శాతం చొప్పున మద్యం దుకాణాలు తగ్గించి, ఐదేళ్ల నాటికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే విధంగా చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ   జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మద్య నిషేధం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేట్ల పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ లోటు లేదు.. కేవలం రేట్లు పెంచితే చాలు మద్యం ప్రియులు మందుకు దూరమవుతారంటూ ధరలను పెంచేసుకుంటూ పోవడమే కాకుండా.. ఏకంగా వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకున్న ప్రభుత్వ నిర్వాకం చూస్తుంటే మద్య నిషేధం అన్న మాటను సర్కార్ అటకెక్కించేసిందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

ఆ సిక్సర్ ఆల్ టైమ్ గ్రేట్.. కొట్టిందెవరో తెలుసా?

టీ20 ప్రపంచకప్ లో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీ20 షాట్ ఎవరు కొట్టారో తెలుసా? అసలు టీ20లో ఆల్ టైమ్ గ్రెటెస్ట్ షాట్ ఏమిటి? అది ఎవరు కొట్టారు? అన్న విషయాన్ని ఐసీసీ వెల్లడించింది. ఇప్పటి వరకూ ఎందరో ప్లేయర్లు టి20లలో సత్తా చాటారు. బంతి బంతికీ విజయం సమీకరణాలు మార్చేసే అద్భుత ఫార్మాట్ లో అత్యద్భుత షాట్లతో తమ జట్లకు  విజయాలను అందించిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా టి20లంటే  చెలరేగి ఆడే క్రిస్ గెయిల్, డివిలియర్స్, తాజాగా సూర్యకుమార్ యాదవ్ ఇలా ఎందరో ఉన్నారు. నాన్ క్రికెటింగ్ షాట్లతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో దిట్టలుగా పేరొందిన వారెంత మందో ఉన్నారు. అంతెందుకు క్రికెట్ లో టి20 ఫార్మాట్ వచ్చిన తరువాత ఆ ఫార్మట్ కోసమే స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ లు తయారయ్యారు. అయితే వారెవరికీ సాధ్యం కానిది మన కింగ్ కోహ్లీ చేసి చుపించాడు. ఇప్పటికే ఫార్మట్లతో సంబంధం లేకుండా తనను తాను ప్రూవ్ చేసుకున్న కింగ్ కోహ్లీ  క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పటివరకూ క్రికెట్ చరిత్రలో  . ఎవ్వరూ కొట్టనిచ కొట్టలేని అద్భుత షాట్ ఆడాడు.   క్రికెట్ హిస్టరీలోనే అదో రికార్డ్.  పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో రికార్డ్ ఛేదన చేసిన విరాట్ కోహ్లీ ఫైనల్ ఓవర్లలో పాక్ బౌలర్ అసద్ రౌవూఫ్ బౌలింగ్ లో కొట్టిన రెండు సిక్సులలో ఒక సిక్స్ అద్భుతమని అప్పుడే అందరూ పొగిడారు. ఇప్పుడు ఐసీసీ కూడా దానికి గుర్తింపునిచ్చింది. గౌరవించింది. టి20లలో అదే అద్భుత సిక్సర్ అని ప్రకటించింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐసీసీ విడుదల చేసిన బెస్ట్ షాట్ కేటగిరిలో కింగ్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో హరీస్ రవూఫ్ బౌలింగ్ లో బౌన్సర్ బాల్ ను  బౌలర్ తలమీదుగా సిక్సర్ గా మలిచిన షాట్ ను ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీ20 షాట్ గా’ పేర్కొంది. ఇలాంటి షాట్ ఏ క్రీడాకారుడు కొట్టలేదని.. పేర్కొంది. ఆ ఘనత కోహ్లీదేనని ప్రకటించింది.  

పార్టీ ఎమ్మెల్యేల కదలికలపై కేసీఆర్ నిఘా?

కేసీఆర్ స్వరం మారింది. మునుగోడు ఉపఎన్నికలో విజయం ఇచ్చిన ధీమా ఎక్కడా కనిపించలేదు. ఎమ్మెల్యేలు కట్టుతప్పుతున్నారన్న బెరుకు, ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత వ్యక్తమౌతోందన్నఆందోళన ఆయన గొంతులో ప్రస్ఫుటమైంది. మంగళవారం(నవంబర్15)న జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంవలో కేసీఆర్ ప్రసంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ లు ఇవ్వడానికే ఎక్కువ సమయం కేటాయించారు. అదే సమయంలో తన బిడ్డ కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలకు కారణం ఆమె బీజేపీలో చేరడానికి నిరాకరించడమే అని చెప్పడానికి ప్రయత్నించారు. ఇక బీజేపీపై యుద్ధమేనంటూ పార్టీ క్యాడర్ కు పిలుపు నిస్తూనే.. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగిపోతున్నారన్న భయాన్నీ వ్యక్తం చేశారు. ఎవరేం చేస్తున్నారో తనకు తెలుసుననీ, ఏం చేసినా తనకు తెలిసిపోతుందనీ హెచ్చరించారు. అందరి కదలికలపైనా నిఘా ఉందని చెప్పకనే చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించినా అనుకున్నంత మెజారిటీ రాలేదన్న ఆవేదన, మంత్రులు సరిగా పని చేయలేదన్న ఆగ్రహం ఆయన గొంతులో వినిపించింది.విస్తృత స్థాయి సమావేశంలో  కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రలోభాలకు లొంగొద్దని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండమని సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో కేసీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారనీ, ఇక బీఆర్ఎస్ విస్తరణపైనే దృష్టి కేంద్రీకరిస్తారనీ అంతా ఊహించారు. అందుకే మంగళవారం(నవంబర్ 15) టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారని మీడియాలో ప్రచారమైంది. అయితే ఆ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు హెచ్చరికలు జారీ చేయడానికే ఎక్కువ సమయం కేటాయించారు. ఎవరేం చేస్తున్నారో తన వద్ద సమాచారం ఉందని, ఎవరేం చేసినా తనకు తెలిసిపోతుందని హెచ్చరించారు. ఒక వైపు భవిష్యత్ దిశా నిర్దేశం చేస్తూనే మరో వైపు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తం చేశారు. ప్రలోభాలకు లొంగి భవిష్యత్ నాశనం చేసుకోవద్దంటూ హితవూ పలికారు. అదే సమయంలో బీజేపీపై విమర్శల వర్షం కురింపించారు.  అదే సమయంలో బీజేపీపై సమరశంఖం పూరించారు. బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందనీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల విసురుతోందనీ, ఆ వలలో పడకపోతే.. కేసులు, దాడులంటూ వేధిస్తుందనీ కేసీఆర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను అప్రమత్తం చేశారు. కేసులూ, దాడులకు భయపడొద్దని ధైర్యం చెప్పారు. బీజేపీ వారు స్వయంగా తన కుమార్తె కవితనే బీజేపీలో చేరాల్సిందిగా ఒత్తిడి తెచ్చారనీ, ఇంతకంటే దారుణం ఉంటుందా అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఆమె బీజేపీ గూటికి చేరడానికి నిరాకరించడం వల్లనే ఇరికించారని అన్యాపదేశంగా చెప్పారు. ఎమ్మెల్యేలపై కూడా ఈడీ దాడులు జరగొచ్చని, భయపడొద్దన్నారు. ఏపీలో జగన్ సర్కార్ బీజేపీకి, కేంద్రంలోని మోడీ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తుతున్నా అక్కడా సర్కార్ ను కూల్చేందుకు కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ బీజేపీ కుట్రలను ఎదుర్కొని గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్న భరోసా ఇచ్చారు.  మునుగోడు ఉప ఎన్నికలో మంత్రులు ఇన్ చార్జ్ లుగా ఉన్న చోట్ల బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి మెజారిటీ వచ్చిందంటూ, మునుగోడులో టీఆర్ఎస్ మెజారిటీ తక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికల విషయంలో కూడా ఆయన ఈ సమావేశం వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ముందస్తు ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, సిట్టింగులందరికీ పార్టీ టికెట్ లు గ్యారంటీ అని విస్పష్టంగా చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారం చేపడతామన్న ధీమా వ్యక్తం చేశారు.   పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుంచే ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌నిన్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేదన్న కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ పరంగా ఉన్న లోటుపాట్లను తన దృష్టికి తీసుకురావాలన్నారు.  వంద ఓటర్లకు ఒక ఇంఛార్జిని నియమించాలనీ,. 10 రోజుల్లో ఇంఛార్జుల నియామకం పూర్తి కావాలని నిర్దేశించారు. 

ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎర ? గులాబి గూటికి చేరకుండా జాగ్రత్తేనా?

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాల రాజకీయం నడుస్తోంది. సీబీఐ, ఐటీ, ఈడీల వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో తెరాస నేతలు లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తుంటే.. సీట్, తెలంగాణ జీఎస్టీ వంటివి బీజేపీ నేతలు లక్ష్యంగా దూకుడుగా కదులుతున్నాయి. వాస్తవానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు రాజకీయాలకు సంబంధం లేకుండా స్వతంత్రం గా వ్యవహరించాల్సిన వ్యవస్థలు. అయితే అవి ఆ ప్రత్యేకతను కోల్పోయాయని రాజకీయ పరిశీలకులే కాదు.. సామాన్య జనం సైతం భావిస్తున్నారు. అందుకు అవి వ్యవహరిస్తున్న తీరే, అధికార పార్టీ కనుసన్నలలో పని చేస్తున్నట్లుగా కనిపిస్తున్న వైనమే కారణమనడంలో సందేహం లేదు. సరే ఆ సంగతి పక్కన పెడితే   ఇరు పార్టీలూ కూడా ఆపరేషన్ ఆకర్ష్ విషయంలోనూ పోటీలు పడుతున్నాయి. నువ్వొకరిని చేర్చుకుంటే.. నా కోటాకు ఇద్దరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ముందు ఈ పోటీ ప్రస్ఫుటంగా కనిపించింది. సరే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తరువాత.. విజయం సాధించిన టీఆర్ఎస్, పరాజయం పాలైన బీజేపీ కూడా ఫలితంపై ఆత్మావలోకనం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఆత్మావలోకనంలో రెండు పార్టీలకూ కూడా ఈటల రాజేందరే సెంట్రిక్ గా నిలిచారు. తెరాస అయితే మునుగోడులో మెజారిటీ అనుకున్నంతగా రాకపోవడానికి ఈటల వంటి నేత పార్టీకి దూరమవ్వడమే కారణమని తెరాస భావిస్తుంటే.. మునుగోడు బైపోల్ లో ఇంత గట్టి పోటీ ఇవ్వడానికి ఈటలే కారణమని బీజేపీ నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ తన స్వభావానికి విరుద్ధంగా ఈటలను పార్టీ నుంచి బహిష్కరించడం సరైన నిర్ణయం కాదన్న భావనతో పార్టీలోకి ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తుంటే.. ఇంత కాలం ఈటలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా పొరపాటు చేశామన్న భావనతో బీజేపీ ఉంది. దీంతో మునుగోడు వైఫల్యానికి బండిని బాధ్యుడిని చేసి ఆయన స్థానంలో ఈటల రాజేందర్ కు అధ్యక్ష పగ్గాలు అప్పగించాలన్న భావనతో బీజేపీ ఉంది. తెలంగాణలో మరోసారి అధికారం నిలుపుకోవడమే లక్ష్యంగా తెరాస అడుగులు వేస్తుంటే.. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే ధ్యేయంగా బీజేపీ పావులు కదుపుతోంది. మామూలుగా తనను ధిక్కరించిన వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడని కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మరీ ఈటలను తెరాసలోకి ఆహ్వానించారని తెరాస శ్రేణుల నుంచే వస్తున్న సమాచారం పరిశీలకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. బీజేపీ చేరికల కమిటీ సారథిగా ఈటల తెరాస కు గట్టి సవాల్ విసిరారనీ, ఆయన వల్లనే పలువురు కమలం వైపు మళ్లారనీ తెరాస శ్రేణులే కాదు స్వయంగా కేసీఆర్ కూడా భావించడం వల్లనే ఈటలకు తెరాస గూటికి మళ్లీ ఆహ్వానం అందిందనీ, అదీ స్వయంగా కేసీఆర్ నుంచి అందడమంటే మామూలు విషయం కాదనీ పరిశీలకులు అంటున్నారు. అలాగే కేవలం ఈటల వల్లే మునుగోడు ఉప ఎన్నికలలో తెరాసకు దీటుగా పోటీ ఇవ్వగలిగామన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చి ఆయనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవ్వడం ఇందుకోసం ఆయనను హస్తినకు పిలిపించుకోవడం బట్టి చూస్తే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఒక్క సారిగా రెండు పార్టీలలోనూ ఈటల ప్రాముఖ్యతను పెంచేసిందని అంటున్నారు.   అసలు బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి గతంలో ఎన్నడూ ఇవ్వనంత ప్రాధాన్యత ఇప్పటికే ఈటలకు దక్కింది. అది చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర పార్టీ పగ్గాలే అప్పగించడానికి సిద్ధమైందంటే తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఈటల వల్లే సాధ్యమన్న భావనకు వచ్చినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవలి తీరు వల్ల పార్టీకి మేలు కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్న భావనకు రావడం కూడా ఒక కారణమంటున్నారు. అమిత్ షా చెప్పులు మోయడం దగ్గర నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో బండి సంజయ్ ఓవర్ యాక్షన్ పార్టీకి బూమరాంగ్ అయ్యిందని అగ్రనాయకత్వం భావిస్తోందని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. అదే సమయంలో బండి రాష్ట్ర పార్టీలోని ఇతర నాయకులను పెద్దగా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై కూడా బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉందంటున్నారు.   అదంతా పక్కన పెడితే బీజేపీలో ఇమడ లేక ఇంత కాలం ఉక్కపోతతోనే నెట్టుకొచ్చిన ఈటలకు ఇప్పుడు తెరాస నుంచీ, బీజేపీ నుంచీ కూడా బంపరాఫర్లు వస్తున్న నేపథ్యంలో ఎటో అటు తేల్చుకోవలసిన సమయం వచ్చింది.  అత్యంత అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపి ఇప్పుడు త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా ఆహ్వానిస్తే మారు మాట్లాడకుండా వెళ్లిపోవడమా.. పార్టీ పగ్గాలే అప్పగిస్తాం అంటున్న బీజేపీ ఆఫర్ ను అంగీకరించి.. సిద్ధాంత వైరుధ్యమున్నా పదవి ఇస్తున్నారు కనుక ఉండిపోవడమా తేల్చుకోవలసింది ఈటలేనని పరిశీలకులు అంటున్నారు. 

ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్.. రాజకీయాల్లో ట్రెండీ డైలాగ్

దేశ రాజకీయాల్లోకి కొత్త ట్రెండ్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఈ ట్రెండ్ మరింత బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. అదేంటంటే.. ‘ఒక్క ఛాన్స్’. ‘అధికారంలోకి రావడానికి ఒక్క అవకాశం ఇవ్వండి.. నేనేంటో, నా పరిపాలనా విధానం ఏంటో చూపిస్తా..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటర్లను కోరడంతో ఈ ‘ఒక్క ఛాన్స్’ రాజకీయంగా ఇప్పడు విస్తృత చర్చకు దారి తీస్తోంది. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో ప్రధాని మోడీతో భేటీ అయిన తర్వాతి రోజు విజయనగరం జిల్లా టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పొలిటికల్ ఎరీనా మీద ‘ఒక్క ఛాన్స్’ను మళ్లీ తెర మీదకు తీసుకొచ్చాయి. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసి, ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కు ఈ సారి ఎన్నికల్లో ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ మంత్రంతో ఏమైనా ప్రయోజనం కలుగుతుందా?! అనుకుంటున్నారు.  నిజానికి ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో నిరూపించుకుంటా..‘ ఇది సూపర్ హిట్ మూవీ ‘ఖడ్గం’లో నటి సంగీత చెప్పిన డైలాగ్.. అప్పట్లో అది బాగా ప్రాచుర్యం పొందింది. అదే డైలాగ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా హల్ చల్ చేస్తోంది. గతంలో 2014 ఎన్నికల్లో వెంట్రుకవాసిలో అధికారం అధికారం అందకుండా పోయి, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఇచ్చిన నినాదం ‘ఒక్క ఛాన్స్’. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జనంలోకి వెళ్లిన జగన్ ఏపీలో పాదయాత్ర చేస్తూ.. దారి పొడవునా.. ప్రతిచోటా ‘ఒక్క ఛాన్స్’ అంటూ అందరినీ అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ ‘ఒక్క అవకాశం.. ఒకే ఒక్క అవకాశం’ అని జగన్ అర్థించడం ఏపీ ప్రజల మైండ్ పై బాగా పనిచేసిందనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో జగన్ ను ఏపీ జనం అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రధాన కారణాల్లో ఒకే ఒక్క ఛాన్స్ కూడా ఒకటని చొప్పొచ్చు. అయితే.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గడిచిన ఈ మూడున్నరేళ్లలోనూ ‘భస్మాసుర హస్తం’ మాదిరి జనం నెత్తిన చెయ్యిపెట్టారని ప్రతిపక్ష నేతలు ప్రధానంగా టీడీపీ నేతలు దెప్పిపొడుస్తూనే ఉంటారు. చంద్రబాబు కేబినెట్ లో ఐటీ, పంచాయతీరాజ్  మంత్రిగా.. ప్రభుత్వంలో కీలకనేతగా వ్యవహరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఒక్క ఛాన్స్ నినాదమే వినిపించారు. ‘ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏమిటో మీకు చూపిస్తా.. నన్ను నమ్మండి..’ అంటూ ఓటర్లను ఆకట్టుకోడానికి యత్నించారు. అయితే.. ఆయనకు మాత్రం ఈ ఒక్క ఛాన్స్ మంత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. ఓటమి చవి చూసినప్పటికీ కూడా లోకేశ్ మంగళగిరిలోనే తిష్ట వేసి, ‘ఒక్క ఛాన్స్’ నినాదాన్ని నియోజకవర్గం ప్రజలకు వినిపిస్తూనే ఉండడం విశేషం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ‘ఒక్క ఛాన్స్’ నినాదాన్ని ఓ నిండు బహిరంగ సభలో దద్దరిల్లిపోయేలా రిక్వెస్ట్ చేయడం విశేషం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. ఒకే ఒక్కసారి.. అంటూ సంజయ్ ఓ రేంజ్ లో చేసిన విజ్ఞప్తిపై ప్రత్యర్థుల నుంచి వ్యంగ్యాస్త్రాలు కూడా పడ్డాయి. అయితే.. బండి సంజయ్ విజ్ఞప్తి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందో లేదో వెయిట్ చేయాల్సి ఉంది. దేశంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి నుంచి కశ్మీర్ ‘భారత్ జోడో’ పాదయాత్రలో కూడా ఆయన ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వండని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. నిజానికి రాహుల్ కు, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. దశాబ్దాల పాటు దేశంలో అధికారం చెలాయించిన పార్టీ కాంగ్రెస్. ఈ సారి తనకు ప్రధానమంత్రిగా ఛాన్స్ ఇవ్వాలని రాహుల్ దేశ వాసులకు రిక్వెస్ట్ చేస్తుండడం గమనార్హం. రాహుల్ వినతికి ప్రజలు ఎలా స్పందిస్తారో.. 2024 ఎన్నికల తర్వాతే స్పష్టం అవుతుంది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ‘ఒక్క ఛాన్స్’ ప్లీజ్ అని జనానికి విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. ‘ఒక్క ఛాన్స్’ సినిమా డైలాగ్ రాజకీయ వర్గాల్లో ఓ పవర్ ఫుల్ నినాదంలా మారిపోయింది. రాజకీయ నేతలకు ఇప్పుడది సెంటిమెంట్ అస్త్రంగా మారిందనడంలో సందేహం లేదు.

సీబీఐ ఎందుకు? సిట్ చాలు.. ఎమ్మెల్యేల కొనుగోలుబేరసారాల కేసుపై హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు దర్యాప్తునకు సిట్ చాలని హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.  రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విచారణ సీబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తికి అప్పగించాలన్న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సరిపోతుందని హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో సిట్ దర్యాప్తు పైన హైకోర్టు ఆంక్షలు విధించింది.  దర్యాప్తు పూర్తయ్యే వరకూ వివరాలు బయటకు పొక్కకుండా చర్యలు తీసుకోవాలని సిట్ కు సూచించింది.  ఈ దర్యాప్తు వివరాలు మీడియా, రాజకీయ నాయకులు సహా ఎవరికీ లీక్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తి కాగానే నివేదికను హైకోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశించింది. అదే సమయంలో దర్యాప్తు పారదర్శకంగా జరగాలని పేర్కొంది. అలాగే దర్యాప్తును ఈ నెల 29 లోగా పూర్తి చేయాలని నిర్ణీత కాల వ్యవధిని నిర్దేశించింది. 

కృష్ణ భౌతిక కాయానికి చంద్రబాబు నివాళి

ఈ తెల్లవారు జామున కన్నుమూసీని సూపర్ స్టార్ కృష్ణ బౌతిక కాయానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. నానక్ మామ్ గూడలోని కృష్ణ నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించన వారిలో ఉన్నారు. అలాగే చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్,  కల్యాణ్ రామ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, మంచు విష్ణు తదితరులు కూడా కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.  ఇలా ఉండగా కృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో బుధవారం (అక్టోబర్ 16) మహాప్రస్థానంలో జరగనున్నాయ. కృష్ణ భౌతిక దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు రేపు మహాప్రస్థానంలో జరగనున్నాయి. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వెల్లడించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమర్ ను ఆదేశించారని తెలిపింది.  మరోవైపు కృష్ణ మృతి పట్ల కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సొంత సినిమా సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత కృష్ణదేనని అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా జనాదరణ పొందారని కొనియాడారు. మరోవైపు నానక్ రామ్ గూడలోని నివాసం వద్దకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు. కృష్ణను కడసారి చూసుకుని, నివాళి అర్పిస్తున్నారు.

గులాబి గూటికి ఈటల.. ఘర్ వాపసీయేనా?

ఈటల రాజేందర్ విషయంలో పొరపాటు చేశానని కేసీఆర్ ఫీలౌతున్నారా? మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత కేసీఆర్ ఈటల విషయంలో పనురాలోచనలో పడ్డారా? అంటే తెరాస శ్రేణులు ఔననే అంటున్నాయి. మునుగోడులో బీజేపీ తెరాసకు అంత గట్టి పోటీ ఇవ్వగలిగిందంటే అందుకు ఈటలే కారణమని కేసీఆర్ భావిస్తున్నారని తెరాస శ్రేణులు చెబుతున్నాయి. అందుకే కేసీఆర్ ఈటలను తెరాసలోకి ఆహ్వానించారని చెబుతున్నాయి. ఈ విషయంలో నిజానిజాల సంగతి అలా ఉంచితే తెరాసలో మాత్రం ఈటల తెరాస గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. మరో వైపు ఈటల కూడా కమలం గూటిలో ఇరుకుగా ఫీల్ అవుతున్నారనీ, తన కష్టానికి తగ్గ గుర్తింపు కాషాయం పార్టీలో రావడం లేదన్న భావనలో ఉన్నారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల మళ్లీ గులాబి గూటికి చేరుతారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ స్వయంగా ఈటలకు ఫోన్ చేసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారనీ, మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారనీ కూడా చెబుతున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికల ఫలితం కేసీఆర్ ఈటల విషయంలో పునరాలోచనలో పడేలా చేసిందన్నది మాత్రం వాస్తవమేననీ, జాతీయ రాజకీయాలపై తాను పూర్తిగా దృష్టి కేంద్రీకరించే ముందు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఈటల వంటి నాయకుడి అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారంటున్నారు. మరో వైపు ఈటల వైపు నుంచి చూస్తే.. ఆయన గురించి తెలిసిన వారెవరూ కమలం గూటిలో ఈటల స్వేచ్చగా ఉన్నారని కలలో కూడా భావించరు. అసలు ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చ కమలం తీర్థం పుచ్చున్నప్పుడే ఆయన రాజకీయ నేపథ్యం తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల కమలం పార్టీలో చేరడమేమిటి? చేరినా అక్కడ ఇమడగలుగుతారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. వారి అనుమానాలకు తగ్గట్టుగానే ఈటల కమలంలో చేరిన అనతి కాలంలోనే ఆయన అక్కడ ఇమడ లేకపోతున్నారనీ, ఉక్కపోతకు గురౌతున్నారన్న వార్తలు వినవచ్చాయి. అప్పట్లోనే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టనున్నారన్న ప్రచారమూ జోరుగా సాగింది. అప్పట్లో ఈటల సన్నిహితులు ఈ ప్రచారాన్ని కొట్టిపారేసినా ఈటల కమలం పార్టీలో ఇబ్బందిగానే కదులుతున్నారన్న ప్రచారానికి మాత్రం ఎప్పుడూ ఫుల్ స్టాప్ పడలేదు. బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల ఘన విజయం సాధించినా.. అది బీజేపీ ఖాతాలో కాకుండా ఈటల వ్యక్తిగత ఖాతాలోనే పడింది. నియోజకవర్గ ప్రజలే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ హుజూరాబాద్ లో ఈటల విజయం వెనుక ఉన్నది బీజేపీ అని భావించలేదు. ఈటల వ్యక్తిగత విజయంగానే దానిని అభివర్ణించారు.  టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో  విభేదించి, బహిష్కృతుడై బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. ఆ విజయంలో బీజేపీ పాత్ర దాదాపుగా శూన్యం అనే పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు.  ఈటల చేరిక వల్లే బీజేపీకి తెలంగాణ అసెంబ్లీలో మరోక స్థానం వచ్చి చేరిందన్నది వారి విశ్లేషణల సారాంశం. అయితే  ఆ విజయం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అసూయకు, భయానికి దారి తీసిందనీ, దీంతో ఈటల టాలెంట్ ను, పలుకుబడిని అండర్ ప్లే చేయడం మొదలైందని అప్పట్లోనే పలువురు సోదాహరణంగా చెప్పారు.  ఆ నేపథ్యంలోనే ఈటల కమలం పార్టీలో ఇమడ లేకపోతున్నారని పెద్ద చర్చ కూడా జరిగింది.  వ్యూహాత్మకంగానే  కమలం పార్టీలో ఈటలను ఏకాకిని చేశారనీ, అందుకే అప్పట్లోనే  గుర్తింపు లేని చోట  మౌనంగా సర్దుపోవడం ఎదుకన్నభావనతో పార్టీకి గుడ్ బై చెప్పేయాలన్న యోచనను  ఈటల తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారనీ కూడా చెబుతారు.   సరే ఇమడ లేక పోయినా సర్దుకు పోతూ కాషాయం గూటిలో కొనసాగుతున్న ఈటలకు ఇప్పుడు గులాబీ గూటి నుంచే ఆహ్వానం వచ్చిందంటున్నారు. అదీ స్వయంగా కేసీఆర్ నుంచే ఫోన్ వచ్చిందన్న సమాచారం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న తెరాస ఇప్పుడు ఈటలను గూలాబీ గూటిలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీకి తేరుకోలేని దెబ్బ కొట్టాలని భావిస్తోందంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో బీజేపీ ఒకింత డిఫెన్స్ లో ఉంది. ఈటలను గులాబి గూటికి చేర్చుకుంటే ఆ పార్టీని మరింత డిఫెన్స్ లో పడేయడమే కాకుండా ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని కూడా దెబ్బ తీయడమే తెరాస వ్యూహంగా కనిపిస్తోంది.   

సాహసానికి బ్రాండ్ అంబాసిడర్.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ హీరో కృష్ణ

కృష్ణ ఈ పేరు సాహసానికి బ్రాండ్ అంబాసిడర్. సంచలనాలకు మరో పేరు. అందరూ ఇప్పటికీ, ఎప్పటికీ ఆయనను సూపర్ స్టార్ అనే పిలుస్తారు. ఆయన నటుడిగా సాధించిన విజయాలకూ, తీసుకున్నసంచలన నిర్ణయాలకు జనం ఇచ్చిన బిరుదు. హీరో కృష్ణ తెలుగు చలన చిత్ర సీమకు, భారతీయ సినిమాకు చేసిన సేవలను పరిగణనలోనికి తీసుకుంటే.. ఆయన సినిమా నటుడు, నిర్మాత, స్టూడియో అధినేత, దర్శకుడు మాత్రమే కాదు.. అంతకు మించి అనిపించక మానదు. కృష్ణ సినీ రంగాన్ని సాంకేతికంగా పరిపుష్టం చేశారు. పరిశ్రమ పచ్చగా ఉండాలంటే సినిమాల షూటింగ్ లు నిర్విరామంగా సాగుతూనే ఉండాలని భావించారు. సినిమాల సంఖ్య పెరిగితేనే పరిశ్రమలో అందరికీ పుష్కలంగా పని దొరుకుతుందని విశ్వసించారు. ఆ విశ్వాసాన్నిఆచరణలో పెట్టి ఫలితం చూపించారు. అందు కోసం తాను స్వయంగా రోజుకు మూడు షిఫ్టులు పని చేసి పరిశ్రమ నిత్య కల్యాణం పచ్చ తోరణంగా పరిఢవిల్లేందుకు దోహదం చేశారు. సినీ పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణ. కౌబాయ్ చిత్రాలు, జేమ్స్ బాండ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది కృష్ణ. తొలి సినిమా స్కోప్ సినిమా నిర్మాత హీరో కృష్ణ, తొలి 70ఎంఎం సినిమా దర్శకుడు కృష్ణ. సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణ. రాజకీయంగా ఎన్టీఆర్ తో విభేదించి రాజకీయాలలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు.  ఒక కొత్త ప్రయోగం చేద్దామంటే ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ కృష్ణ మాత్రం అలా కాదు.. ఏదైనా అనుకున్నారంటే చేసి చూపించే వారు. ఆ విషయంలో ఎన్నికష్ట నష్టాలున్నా భరించేవారు. నిర్మాతల శ్రేయస్సే పరిశ్రమకు శ్రీరామరక్ష అని భావించిన కృష్ణ తనతో సినిమా చేసిన ఏ నిర్మాత అయినా నష్టపోతే.. ఆయనకు మరో సినిమాను ఉచితంగా చేసి ఆదుకున్న మంచి మనిషి.   తేనెమనసులు సినిమాతో తనతో పాటు చిత్ర పరిశ్రమకు పరిచయమైన  రామ్మోహన్ ను చివరి వరకూ ఆదుకున్న మంచి స్నేహితుడు ఆయన. కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అనడంలో సందేహం లేదు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతోంది తెలుగువన్.

జగన్ కు మోడీ అంటే వణుకు.. తెలంగాణ మంత్రి హేళన

సాధారణంగా పక్క రాష్ట్రం ప్రభుత్వంపై మరో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయదు. కానీ ఏపీ విషయంలో అలాంటి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణ మంత్రులకు తమ అభివృద్ధిని ఘనంగా చాటుకోవడానికి ఏపీ వైఫల్యాలను ఎత్తి చూపడం ఒక  అలవాటుగా మారిపోయింది. ఏపీలో జగన్ సర్కార్ నిష్క్రియాపరత్వం, పాలనా వైఫల్యాలపై వ్యాఖ్యలు చేయడంలో తెలంగాణ మంత్రులు పోటీలు పడుతున్నారు. ఎక్కడ లేని ఉత్సాహం చూపుతున్నారు.   ఇందుకు కారణం ఏపీ సర్కార్ పాలనా తీరు పట్ల వారికి ఉన్న చులకన భావనే కారణమని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ మంత్రులను విమర్శలకు దీటుగా సమాధానం చెబుదామంటే.. రోడ్ల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇక్కడ తమ ఘనతను చాటుకోవడానికి ఏమీ లేకపోవడం.. అదే సమయంలో పొరుగు రాష్ట్రం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలన్నీ వాస్తవాలు కావడంతో నోరెత్తడానికే ముందు వెనుకలాడే పరిస్థితి ఏపీ మంత్రులది పేర్కొంటున్నారు. అందుకే  తెలంగాణ మంత్రులకు ఏపీ అన్నా.. ఏపీ ప్రభుత్వమన్నా చులకనగా మాట్లడడానికి ఎక్కడ లేని ఉత్సాహం చూపుతున్నారు.    అయితే తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఏపీ పట్ల అత్యంత చులకన భావంతో వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఏపీ సీఎం జగన్ కు వణుకు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  .   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీకి వరుస షాకులు ఇస్తుంటే.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం మోడీకి భయపడి ఆయనక సాగిల పడుతున్నారని వ్యాఖ్యానించారు. మోడీ విశాఖలో పర్యటించినా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అదే మోడీ తెలంగాణ పర్యటనలో సింగరేణిని ప్రైవేటీకరించేది లేదన్నమాట అనాల్సిన పరిస్థితిని కేసీఆర్ తీసుకువచ్చారన్నారు.   సింగరేణి ప్రైవేటీకరణను మొదట్నుంచి వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో కేంద్రాన్ని ఎదుర్కొ న్నారని అందుకే ప్రధాని మోడీ తలొగ్గారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏపీలో అభివృద్ధి లేమి, ప్రజల కష్టాలను సర్కార్ పట్టించుకోకపోవడం, రోడ్ల దుస్థితి, పోలవరం నిర్మాణం వంటి పలు అంశాలపై తెలంగాణ మంత్రులు పలు సందర్భాలలో ఎగతాళి చేస్తూ మాట్లాడిన సంగతి విదితమే. అయితే ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలపైనా, నెలకొన్న సమస్యలపైనా హేళన చేస్తూ మాట్లాడటం తెలంగాణ మంత్రులకు ఇదే మొదటి సారి కాదు ఏపీలో రోడ్ల దుస్థితిపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు బదులు చెప్పలేక ఏపీ మంత్రులు నానా తంటాలూ పడ్డారు. అలాగే ఇటీవల హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తే.. ఏపీలో మాత్రం పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో.. అసలు పూర్తవుతుందో లేదో అన్న పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పొరుగున ఉన్న ఏపీ అన్ని రంగాలలోనూ తిరోగమనంలో పయనిస్తుంటే.. కొత్త రాష్ట్రం తెలంగాణ మాత్రం అన్ని రంగాలలోనూ పురోగమిస్తోందని తెరాస మంత్రులు పదే పదే చెబుతున్నారు. ఈ సారి అయితే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ నే టార్గెట్ చేస్తూ ఆయన వైఫల్యాలను ఎండగట్టారు. మోడీ అడుగులకు మడుగులొత్తుతూ రైతుల మెడకు ఉరితాళ్లు బిగించే లాంటి నిర్ణయం అయిన వ్యవసాయ మీటర్లకు మోటార్లను బిగించడానికి జగన్ సై అన్నారని వ్యాఖ్యనించారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడంలో కేసీఆర్ నిలువెత్తు ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటే మాత్రం జగన్ మోడీ అంటే వణికిపోతూ ఆయన ప్రజా వ్యతిరేక విధానాలకు వత్తాసు పలుకుతున్నారన్నారు.  తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకుండా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామనీ, అదే ఏపీలో  పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితి జగన్ సర్కార్ మోడీకి భయపడి  వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించిందని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు చకచక ఏర్పాట్లు జరుగుతుంటే అక్కడి జగన్ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుంటే.. తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకోవడమే కాకుండా ప్రైవేటీకరణ ప్రశక్తే లేదని మోడీ నోటితోనే అనిపించగలిగామని ధర్మాన చెప్పుకున్నారు. ఏపీలో ప్రభుత్వానికి కేంద్రం విధానాలను నిలదీసే దమ్ము లేదు కాబట్టే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మోడీ సర్కార్ ముందుకు వెళుతోందనీ, అదే తెలంగాణలో అయితే పార్లమెంటులో కేంద్ర బొగ్గు మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనకు భిన్నంగా సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని స్వయంగా మోడీ ప్రకటించాల్సి రావడమే.. కేంద్రం మెడలు వంచే తెరాస సర్కార్ సత్తాకు నిదర్శనమన్నారు.  

30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్?

 తలుపులు మూసి కొడితే.. పిల్లి కూడా తిరగబడుతుంది  అంటారు. ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేలు పరిస్థితి కూడా  అదే మాదిరిగా మారిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిన ప్రతిసారీ   జగన్ వారిపట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, వారినే తప్పుపడుతుండడం, వారి పనితీరుపై వ్యతిరేక సర్వే నివేదికలతో భవిష్యత్తులో సీట్లు ఇచ్చేది లేదని బెదిరింపులకు దిగుతుండడంపై వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల్లో తీవ్ర అసహనం వ్యక్తమౌతోందని అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తమకు   జగన్ సీటు ఇచ్చే ఛాన్స్ లేదని గట్టిగా భావిస్తున్న సిటింగ్ లు, ఒకవేళ వైసీపీ నుంచి సీటు వచ్చినా.. జగన్ సర్కార్ పై ఏపీ వ్యాప్తంగా పెల్లుబుకుతున్న వ్యతిరేకత కారణంగా ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు కనిపించని వారు గోడ దూకేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. తద్వారా అయినా తమ రాజకీయ భవిష్యత్తును సజీవంగా ఉంచుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు ప్రణాళికలు వేసుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే వారు వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. ఏ పార్టీలో చేరితే తమ భవిష్యత్తు బాగుంటుంది.. విజయావకాశాలు మెరుగవుతాయి అనే లెక్కలు   వేసుకుంటున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే.. వచ్చే డిసెంబర్ లో జరిగే వైసీపీ శిబిరంలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేల భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో టికెట్లు రావనుకుంటున్న వారు, ఒకవేళ టికెట్ వచ్చినా గెలిచే ఛాన్స్ లు తక్కువని భయపడుతున్నవారు, వైసీపీలో కంటే ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్నాయనుకుంటున్నవారు వైసీపీ బంధనం నుంచి ఎలా బయట పడాలా అని దిక్కులు చూస్తున్నారని తెలుస్తోంది. అలా పక్కదార్లు వెతుక్కుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 25 నుంచి 30  వరకు ఉంటుందంటున్నారు. దాంతో పాటు టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు పొడిస్తే.. ఇక తమ ఉనికికి గండం తప్పదని భయపడుతున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారంటున్నారు. అయితే.. ఏయే ఎమ్మెల్యేలు వైసీపీని వదిలిపెట్టేస్తారు..? అలాంటి వారి కోసం ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేసే పార్టీలు ఏవి అనే అంశాలపై వైసీపీ అధినాయకత్వం గట్టి నిఘాయే పెట్టిందంటున్నారు.  వైసీపీ నుంచి ఎవరెవరు పార్టీ ఫిరాయిస్తారు అనే దానిపై జగన్ రెడ్డి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా కీలక సమాచారం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ గోడ దూకి బయటి పార్టీల వైపు చూసే ఎమ్మెల్యేలు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా ఉంటారని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఆ జిల్లాల్లో టీడీపీ, జనసేన పార్టీ దేనికదే బలంగా ఉండడమే కారణం అంటున్నారు. ఈ రెండు పార్టీ మధ్య పొత్తు కుదిరితే వచ్చే ఎలక్షన్ వార్ లో విజయం వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దాంతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి కూడా పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు ప్రత్యర్థి పార్టీలతో నిరంతరం టచ్ లో ఉంటున్నారని, వైసీపీని వదిలిపెట్టేసినా తమ స్థానానికి భంగం కలగకుండా చూసుకుంటున్నారంటున్నారు. మొత్తం మీద ఏపీలో రాజకీయాలు రసవత్తర ఘట్టానికి చేరుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.