టీ కప్పులో తుపానేనా?
posted on Nov 11, 2022 @ 10:01AM
విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఏర్పాటు చేసిన ఉమ్మడి నియామకాల బోర్డు విషయంలో తెలంగాణ సర్కార్, రాజ్ భవన్ ల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం టీ కప్పులో తుపానులా తేలిపోయిందా? ఉమ్మిడి నియామక బోర్డు విషయంలో గవర్నర్ సందేహాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేసినట్లు చేస్తే.. తన సందేహాలన్నీ దూది పింజెల్లా తేలిపోయాయని గవర్నర్ తమిళి సై వివాదానికి ముగింపు పలికేశారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
వర్సిటీల్లో ఖాళీల భర్తీ సజావుగా పూర్తి చేసేందుకు మాత్రమే బోర్డు ఏర్పాటు చేశామని గవర్నర్ తమిళిసైకు మంత్రి సబితా వివరించారు. ఈ విషయంలో గవర్నర్ సందేహాలను నివృత్తి చేసేందుకు మంత్రి సబిత గురువారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదనీ, వర్సిటీల నియామకం బిల్లుపై తన సందేహాలను నివృత్తి చేయాలని, రాజ్ భవన్ కు వచ్చి చర్చించాల్సిందిగా సందేశం పంపినా స్పందన లేదనీ తమిళిసై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ ను ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఇరికించాలని చూశారనీ, తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానాలు ఉన్నాయనీ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గవర్నర్ లతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విభేదాలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య గత కొంత కాలం నుంచీ కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం ముదిరి పాకాన పడిందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పటికే గత కొద్ది కాలంగా గవర్నర్, కేసీఆర్ మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతోందన్న అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను వెనక్కు పంపకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా గవర్నర్ తన వద్దే పెండింగ్ లో ఉంచుకోవడంతో ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తమిళిసై మీడియా సమావేశంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలతో ఇక ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య విభేదాలు తెగేదాకా వెళ్లిపోయాయా? ఇక అమీ తుమీకే రాజ్ భవన్, ప్రగతి భవన్ లు సిద్ధమైపోయాయా అన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే ఈ హడావుడీ, ఉద్రిక్త వాతావరణం అంతా ఒక సారి సబిత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సందేహాలు నివృత్తి చేస్తామని చేసిన ప్రకటనతో చప్పున చల్లారిపోయింది. సుదీర్ఘ అధ్యయనం అనంతరమే, అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని యూజీసీ నిబంధనలకు అధిగమించకుండా, న్యాయపరమైన చిక్కుల తలెత్తకుండా అన్ని విధాలుగా పరిశీలించిన అనంతరమే ఉమ్మడి రిక్రూట్ మెంట్ బోర్డును ఏర్పాటు చేశామని సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ కు రాజ్ భవన్ కు వెళ్లి మరీ వివరించారు. ఆమె వివరణలో సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై సంతృప్తి చెందారు.
వర్సిటీల్లో ఖాళీల ప్రక్రియను వీలైనంత సత్వరంగా నష్పాక్షికంగా, పాదర్శకంగా భర్తీ చేయాలని సూచించారు. గవర్నర్ భేటీలో సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే వైద్యఆరోగ్య శాఖ, పోలీసు తదితర శాఖలు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టాయన్నారు. ఆ నియమకాలన్నీ పాదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగాయని వారు గవర్నర్ వివరించారు. ఈ వివరణతో సంతృప్తి చెందినట్లు గవర్నర్ తెలిపారు. దీంతో పెండింగ్ లో ఉన్న బిల్లులకు ఆమెదం తెలపాల్సిందిగా మంత్రి సబిత గవర్నర్ ను కోరారు. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపడతామన్నారు.