ఏపీలో సైతాన్ ప్రభుత్వం.. పంచుమర్తి అనూరాధ
posted on Nov 10, 2022 @ 2:56PM
ఏపీలో ఉన్నది సైతాన్ సర్కార్ గా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ అభివర్ణించారు. దేశంలో ఎక్కడ ఏ అవినీతి జరిగినా ఆ మూలాలూ లింకులూ ఏపీలోని వైసీపీ నేతలతో ముడిపడి ఉంటాయనీ, అందుకు తాజా నిదర్శనమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చం ద్రారెడ్డి అరెస్టు అని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో వైసీపీ లింకులు బయటపడ్డాయా అంటే తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాథ ఔననే అంటున్నారు.
ఈ స్కాములో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి స్వయానా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న అని పంచుమర్తి అనురాధ అన్నారు. గురువారం(నవంబర్ 10)న మీడియాతో మాట్లాడిన ఆమె ఇసుక, మద్యం, మైన్, బియ్యం, అంబులెన్సులు ఇలా అన్ని మాఫియాలూ జగన్ హయాంలోనే ఏపీలో విజృంభించాయని అన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు ఎయిమ్స్ ఆసపత్రికి గుక్కుడు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితే నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రభుత్వాసుపత్రులే అత్యాచార కేంద్రాలుగా మారిన దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ దిగజారిందని ధ్వజమెత్తారు.
చంద్రబాబు గారి పాలనా సామర్థ్యం, దార్శనికతకు మెడ్ టెక్ జోన్, జెనోమ్ వ్యాలీ నిదర్శనం అయితే.. జగన్ దౌర్బాగ్య పాలనకు కూల్చివేతలు, విధ్వంసాలు నిదర్శనమని పంచుమర్తి అనూరాధ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లాంటి కర్ఫ్యూ సిటీని కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. అదే జగన్ పాలనలో కంటి వెలుగు అంటూ కళ్ల జోళ్లు కూడా ఇవ్వని నిర్వాకాలు రోజు కళ్లెదుట సాక్షాత్కరిస్తున్నాయని విమర్శించారు.
కొవిడ్ సమయంలో రోగులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని జగన్ రెడ్డి ప్రజారోగ్యం ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఫోన్ చేయగానే కుయ్ కుయ్ మంటూ వస్తాయన్న అంబులెన్స్ ల జాడ లేక బిడ్డల శవాలను భుజాలపై వేసుకెళుతున్న ఘటనలు జగన్ రెడ్డి పాలనా వైఫల్యాలకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డిది దేవుడి ప్రభుత్వం కాదు..సైతాన్ ప్రభుత్వమని అభివర్ణించారు.