కమలం తీర్థం కోసం గులాబి నేతల క్యూ

ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇకపై ఒక లెక్కా అంటున్నాయి కమలం శ్రేణులు. బీజేపీపై విమర్శలు గుప్పించే జోరులో తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ చేసిన ఒక ప్రకటన తమకు కొత్త బలాన్ని తీసుకువస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ చేసిన ప్రకటన ఏమిటి? అది బీజేపీకి ఎందుకు బలం అవుతుంది? కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ సిట్టింగులెవరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, సిట్టింగులందరికీ టికెట్లు గ్యారంటీ అని ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటనే తమ నెత్తిన పాలు పోసిందంటున్నాయి కమల నాథుల. ఔను నిజంగానే సిట్టింగులకే మళ్లీ సీట్లిస్తామన్న తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విస్పష్టమైన హామీ బీజేపీకి వరంలా పరిణమించనుంది. సిట్టింగులపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే స్థాయి నేతలు ‘కారు’ దిగి కమలం గూటికి వరస కడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కించుకోవడం వల్ల టీఆర్ఎస్ పూర్తిగా నిండిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో వర్గ పోరు నడుస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించడంతో ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత సిట్టింగ్ చేతిలో పరాజయం పాలైన వారందిరలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. కచ్చితంగా వారందరి చూపు బీజేపీ వైపే మళ్లుతుందని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికలలో విజయం మాదేనని ఎంత ధీమాగా చెబుతున్నా.. రాష్ట్రంలోని 119 స్థానాలలోనే నిలబెట్టేందుకు ఆ పార్టీకి గెలుపు ధీమ ఉన్న అభ్యర్థుల కొరత ఉందన్నది కాదనలేని వాస్తవం. అర్బన్ ప్రాంతాలలో ఒకింత ఫరవాలేదనుకున్న గ్రామీణ ప్రాంతాలలో మాత్రం బీజేపీని అభ్యర్థుల కొరత వేధిస్తోందన్నది సత్యం. ఇప్పుడు కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు అన్న ప్రకటన బీజేపీ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా వచ్చే వారికి కమల పుష్పాలతో స్వాగతం పలకడానికి చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ లో పలువురు నేతలతో ఇప్పటికీ ఈటలకు సత్సంబంధాలున్నాయి. అక్కడ అసంతృప్తితో ఉన్న నాయకులంతా ఇప్పటికే ఈటల టచ్ లోకి వచ్చారనీ అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ పార్టీ మారకుండా టీఆర్ఎస్ నే వారు అంటిపెట్టుకుని ఉండటం పార్టీ టికెట్ వస్తుందన్న ఆశేనంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా సిట్టింగులకు టికెట్ గ్యారంటీ అని చెప్పడంతో ఆశావహులలో అత్యధికులు ఇక కారులో ప్రయాణం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. అందుకే కేసీఆర్ సిట్టింగులకే టికెట్టన్న ప్రకటన బీజేపీకి నెత్తిన పాలు పోసినట్లుగా అయ్యిందంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న ఆశావహులకు టీఆర్ఎస్ ప్రకటన తీవ్ర నిరాశను మిగిల్చింది.  ఇప్పటికే టీడీపీ- కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల, తమ అవకాశాలు దెబ్బతిన్నాయని  అసంతృప్తితో రగిలిపోతున్నవారంతా.. ఇక తమ దారి తాము చూసుకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఈ పరిస్థితినే బీజేపీ రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతోంది. సిట్టింగులకే సీటు అంటూ కేసీఆర్ ఇలా ప్రకటించారో లేదో.. అలా రాష్ట్ర సీనియర్ నాయకులకు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలను గుర్తించాల్సిందిగా పార్టీ హైకమాండ్ రాష్ట్ర నాయకులను ఆదేశించిందంటున్నారు. సిట్టింగులను మారిస్తే తప్ప గెలుపు అవకాశాలు లేవంటూ పీకే చెప్పిన  దాదాపు 67 నియేజకవర్గాలలోని క్రియాశల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను గుర్తించి వారిని కమలం పార్టీలోకి ఆహ్వానించాలని కూడా హై కమాండ్ ఆదేశించినట్లు చెబుతున్నారు. అలాగే పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలి అన్న విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈటలకు చెప్పినట్లు తెలుస్తోంది.టికెట్లపై ఆశలు పెట్టుకుని, కేసీఆర్‌ ప్రకటనతో నిరాశకు గురయిన టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో మాట్లాడే బాధ్యతను మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి బీజేపీ హై కమాండ్ అప్పగించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో చేరే వారికి ఎమ్మెల్యే సీట్ల హామీ ఇవ్వడం ద్వారా, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని తిరుగులేనిశక్తిగా మార్చాలన్నదే బీజేపీ వ్యూహంగా పరిశీలకులు తాజా పరిణామాలను విశ్లేషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోని అన్ని నియోజకవర్గ నాయకులతో సత్సంబంధాలున్న ఈటల ద్వారా, వారిని బీజేపీలోకి తీసుకురావాలన్నలక్ష్యంతో బీజేపీ అడుగులు కదుపుతోందంటున్నారు.

రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీంలో కేంద్రం సవాల్

 రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు ఆరుగురినీ విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం సవాల్ చేసింది.  ఈ మేరకు దోషుల విడుదలకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేస్తూ తగిన వాదనలు వినిపించే అవకాశం లేకుండా ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనే అవుతుందని కేంద్రం తన పిటిషన్ లో పేర్కొంది. రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు- నళిని, మురుగన్, సంథాను, రాబర్డ్ పయాస్, జయకుమార్‌లకు జైలు నుంచి విముక్తి కల్పిస్తూ   సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఏ ఇతర   కేసులూ లేకుంటే దోషులందరినీ విడుదల చేయవచ్చునని పేర్కొంది.ఈ తీర్పుతో దాదాపు మూడు దశాబ్దాల  తర్వాత దోషులంతా జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. 

కేసినో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని విచారించిన ఈడీ

కేసీనో వ్యవహారంలో ఈడీ వైసీపీ నేతలపైకి తన దృష్టి సారించింది. చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారం కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఉన్నారన్న ఆరోపణలు అప్పట్లోనే వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి ఈడీ అధికారులు బుధవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సోదరులు ఇద్దరిని సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణకు కూడా నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. అదలా ఉంటే.. ఇదే కేసినో కేసులో ఏపీ రాజకీయ నేతలనూ ఈడీ విచారించనుంది. తాజాగా ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే   గుర్నాథ్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.కేసినో కేసుకు సంబంధించి ఏపీకి చెందిన పలువురు రాజకీయ నాయకులకు కూడా ఈడీ విచారణకు రావలసిందిగా నోటీసులు పంపే అవకాశం ఉందని చెబుతున్నారు.  నగదు ఇక్కడ ఇచ్చి వాటిని కాయిన్లుగా మార్చుకుని విదేశాలలో క్యాసినోల్లో మార్చుకుని ఆడతారు. ఇలా వందల మంది ఆడారని అంటున్నారు.   చీకోటి ప్రవీణ్‌ను విచారించినప్పుడు ఈడీ సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ కేసినో కేసులో పలువురికి వరుసగా నోటీసులు జారీ చేసి విచారిస్తోంది.  గురువారం ఈ కేసులో విచారణకు గుర్నాథరెడ్డితో పాటు  వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ కూడా హాజరయ్యారు వీరిద్దరూ చీకోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినోల్లో పాల్గొనడానికి ఇతర దేశాలకు వెళ్లేందుకు హవాలా మార్గం ద్వారా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై ఈడీ ప్రశ్నిస్తోందంటున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ వంద మందికి ఈడీ నోటీసులు జారీ నట్టు చెబుతున్నారు. 

డేవిడ్ వార్నర్ మళ్లీ చేసేశాడు

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్..సామాజిక మాధ్యమంలో చాలా చాలా యాక్టివ్ గా ఉంటారు. అంతకు మించి తెలుగు రాష్ట్రాల క్రీడాభిమానులు, సినీ అభిమానులకు డేవిడ్ వార్నర్ చాలా చాలా దగ్గరైపోయాడు. ఐపీఎల్ లో గతంలో హైదరాబాద్ జట్టుకు కేప్టెన్ అయినందుకే కాదు.. వార్నర్ తెలుగు సినీ నటుల పాపులర్ పాటలు, డైలాగ్స్  స్కూఫ్ చేసి వాటిని సామాజిక మాధ్యమంలో ఉంచడం ద్వారా కూడా తెలుగు ప్రజలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా డేవిడ్ వార్నర్ మరో స్కూఫ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టాడు. వెంటనే అది తెగ వైరల్ అయిపోయింది. నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు. అయితే ఈ సారి షేన్ వార్న్ నటి రష్మికకు సారీ చెప్పి మరీ స్కూఫ్ చేశాడు. ఇంతకీ సారీ ఎందుకంటే షేర్ వార్న్ స్కూఫ్ చేసిన పాట బీష్మ చిత్రంలో రష్మిక చేసినది. అందుకే అలా స్కూఫ్ చేసినందుకు క్షమించాలంటూ డేవిడ్ వార్న్ ముందుగా రష్మికకు క్షమాపణలు చెప్పారు. అయితే డేవిడ్ వార్న్ యాక్ట్ రష్మిని కించపరిచేదిగా ఎంత మాత్రం లేదని నెటిజన్లు అంటున్నారు. విపరీతంగా లైకులు కొడుతున్నారు. ఇలా ఉంటే.. క్రికెట్ తెలిసిన వారికి వార్న్ పరిచయం అక్కర్లేని పేరే. అలాగే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా కూడా వ్యవహరించడంతో టాలీవుడ్ సినిమాలూ, హీరోలపై చక్కటి అవగాహన సైతం ఉందనడానికి గతంలో ఆయన తెలుగు హీరోలను నటులను అనుకరిస్తూ చేసిన స్కూపులే నిదర్శనం. బాహుబలిలో ప్రభాస్ డైలాగ్ నుంచి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టెప్‌ల వరకు డేవిడ్ వార్నర్ చేసిన స్కూపులన్నీ నెటిజన్ల మన్ననలు పొందాయి. ఇన్నాళ్లు హీరోల ముఖాలని మార్ఫింగ్ చేసి నెటిజన్లని అలరిస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్.. తాజాగా తొలిసారిగా హీరోయిన్ రష్మిక   స్ఫూఫ్ చేశాడు.   

ఈడీ విచారణకు పూరి జగన్నాథ్, ఛార్మి

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ ను, నటి, నిర్మాత చార్మిని వివాదాల్లోకి లాగింది. సినిమా చిత్రీకరణ నుంచి ప్రచారం, విడుదల, ఆ తరువాత ఫలితం, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్స్ ఇలా ఆ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయమూ, ప్రతి అంశమూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. తాజాగా ఇప్పుడా చిత్రానికి పెట్టుబడులు ఎలా వచ్చాయన్న విషయంపై ఈడీ కూపీలాగుతోంది. ఇందు కోసం పూరీ జగన్నాథ్ ను, నటి ఛార్మీని విచారణకు పిలిచింది. ఈడీ పిలుపు మేరకు పూరి జగన్నాథ్, ఛార్మీలు గురువారం హైదరాబాద్ లోకి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మిలు గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఒక సారి ఎక్సైజ్ అధికారుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఇరువురికీ కూడా క్లీన్ చిట్ లభించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు లైగర్ సినిమాలో పెట్టుబడులు ఎక్కడ నుంచి  వీరిద్దరు కలిసి ఇటీవల విజయ్ దేవర కొండ హీరోగా  ‘లైగర్’ మూవీ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం పూరి జగన్నాథే.   పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినీమా విడుదలైన తరువాత ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.  అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సినిమా కోసం జరిగిన నగదు లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు, ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు సేకరించారని చెబుతున్నారు. అంతే కాకుండా  ఈ సినిమాలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు.   మొత్తంగా ఈడీ పూరి జగన్నాథ్, ఛార్మీలను విచారించడం సంచలనం సృష్టించింది. ఈ విషయంపై సినీ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

హిమాచల్ లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా

హిమాచల్​ ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో ఒకే విడతలో పోలింగ్ శనివారం ముగిసిన సంగతి తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీకి  డిసెంబర్ మొదటి వారంలో రెండు విడతలుగా  పోలింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే డిసెంబర్ 5న వెలువడతాయి. కాగా హిమాచాల్ ప్రదేశ్ లోని 68 నియోజకవర్గాలలోనూ ఓకే విడతలో పోలింగ్ పూర్తయ్యింది. రంగంలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.  రాష్ట్రంలో ఇంత కాలం కాంగ్రెస్, బీజేపీల మధ్య ద్విముఖ పోరే ఉండేది. అయితే అందుకు భిన్నంగా ఈ సారి ఆప్ కూడా పోటీలో ఉండటంతో త్రిముఖ పోరు జరిగిందని పరిశీలకులు అంటున్నారు. అదలా ఉంచితే ఎన్నికలకు ముందు హిమాచల్ ప్రదేశ్ లో సర్వేలన్నీ ఆప్ ది నామమాత్రపు పోటీయే అని పేర్కొన్నాయి. అదే సమయంలో ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని తేల్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో   ఏ పార్టీ ఇంత వరకూ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు. ఆ ఆనవాయితీ ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ విపక్షానికి పరిమితమవ్వక తప్పదనీ, కాంగ్రెస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం తధ్యమని పరిశీలకులు అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ సారి ఆ ఆనవాయితీని బద్దలు కొట్టి తాము రెండో సారి అధికారాన్ని చేపడతామన్న ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తున్నది.   2017 హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 43 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్​ 22 చోట్ల గెలిచింది. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక సీపీఎం ఎమ్మెల్యే  విజయం సాధించారు. కాగా గత ఎన్నికలలో కనీసం 20స్థానాల్లో గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో సుమారు 3వేల ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. ఈ 20 స్థానాల్లోని 6 సీట్లలో మెజారిటీ 1000, అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక 34 నియోజకవర్గాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 5000, అంతకన్నా తక్కువగా ఉంది. దీని బట్టి.. హిమాచల్​ ప్రదేశ్​లో ఎన్నికల వేడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉండటంతో ఆప్ వల్ల ఏ పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్న విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆప్ ఉనికి వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ లాభపడుతుందని కొందరు చెబుతుంటే.. ప్రభుత్వ అనుకూల ఓటునే ఆప్ చీలుస్తుందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే   శ్రీ ఆత్మసాక్షి ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో చేసిన సర్వే మేరకు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు అనివార్యమని తేలింది. సర్వే అంచనా ప్రకారం బీజేపీ రాష్ట్రంలో 31 నుంచి 35 స్థానాలలోనూ, కాంగ్రెస్ 33 నంచి 36 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆప్ ఒక స్థానం, ఇతరులు ఒక స్థానం గెలుచుకునే అవకాశాలున్నాయి, ముఖ్యంగా కంగ్రా ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఇక్కడ యాపిల్ రైతులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తమౌతోంది.నిరుద్యోగయువత, ప్రభుత్వోద్యోగులు కూడా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇక మహిళల ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోనున్నాయని సర్వే తేల్చింది. ఇక పోతే ఆప్ పోటీ కారణంగా కనీసం పది స్థానాలలో బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని సర్వే తేల్చింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా బీజేపీపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఆదోనిలో బాబుకు బ్రహ్మరథం.. జన సంద్రంగా మారిన పట్టణం

చంద్రబాబు కర్నూలు పర్యటనకు జనం బ్రహ్మరథం పట్టారు. మూడు రోజుల పర్యటలో చంద్రబాబు మాటల పదును పెరిగింది. సుత్తి లేకుండా సూటిగా విషయాన్ని జనం హృదయాలకు హత్తుకునేలా చెప్పారు. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే.. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది స్పష్టంగా చెబుతూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. గతంలోలో జగన్ సర్కార్ పై విమర్శలకే పరిమితం కాకుండా...జగన్ పాలన వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. జగన్ పాలనా వైఫల్యాలతో రాష్ట్రానికి జరిగిన నష్టాలను చంద్రబాబు ఏకరవు పెడుతుంటే జనంలో మంచి స్పందన కనిపించింది. చంద్రబాబు పర్యటనకు జనం నుంచి వచ్చిన స్పందన తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నింపింది. జగన్ ను సాగనంపితే తప్ప రాష్ట్రానికి మోక్షం లేదు. ప్రజలకు సంతోషం లేదు అంటూ నిప్పులు చెరిగారు. గడపగడపకూ వస్తున్న వైసీపీ దొంగల్ని ఎక్కడికక్కడ నిలదీయండి అంటూ పిలుపు నిచ్చారు. నాలుగు సార్లు తిరిగితే అన్ని మర్చిపోయి ఓట్లేస్తారన్నది వారి ఆశ.. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మనం మరచిపోతామా? లక్షల రేషన్ కార్డులు తొలగించారు, పేదల పొట్టగొట్టిన ఘనడు జగన్.. పేదల ఆకలి మంటలే శాపంగా మారతాయి అవునా కాదా అంటూ జనాలను ప్రశ్నించి వారిలో ఆవేశాన్ని రగిలించారు. తెలుగుదేశం అధికారంలోకివ వస్తే సంక్షేమం ఉండదంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నదుష్ప్రచారాన్ని ఖండించారు. గతంలోనే తెలుగుదేశం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పటి కంటే మెరుగైన సంక్షేమంఅందించి చూపుతానని వాగ్దానం చేశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఆర్థిక దన్నుగా నిలిచి వారు ధనవంతులు కావడానికి ఉపయోగపడాలన్నారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంగా జగన్ వంటి అసమర్ధ సీఎంను చూడలేదన్నారు. జగన్ రాయలసీమ ద్రోహిగా అభివర్ణించిన చంద్రబాబు.. సీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశమే అని ఉద్ఘాటించారు.   కడపలో స్టీల్ ప్లాంటు నిర్మించలేని ఈ పెద్ద మనిషి మూడు రాజధానులు నిర్మిస్తారంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టుకు నేను అడ్డుపడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. నేను అడ్డుపడడం లేదు. మీకు 151 సీట్లు ఇచ్చారు. ఎంపీలను ఇచ్చారు.  నువ్వు చేసిందేమిటి?అని ప్రశ్నించారు. తన వయస్సుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కూడా చంద్రబాబు దీటుగా సమాధానం చెప్పారు. తనదీ ప్రధాని మోడీదీ ఒకటే వయస్సని గుర్తు చేశారు.   70 ఏళ్లకు బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. నేను శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నా. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్లకుఅప్పగిస్తాను తప్ప..   మీ పేటీఎం బ్యాచ్ కు వదిలిపెట్టనని స్పష్టంగా చెప్పారు. రాష్ట్రం భవిష్యత్ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం ప్రజలారా నన్ను ఆశీర్వదించండి అని చంద్రబాబు విజ్ణప్తి చేశారు. గతంలో వ్యవసాయ కూలీల పిలలు తాను అమలు చేసిన విద్యావిధానం వల్ల  ఐటీ ఉద్యోగాలు సాధించారుచ అదే జగన్‌రెడ్డి అధ్వాన విధానాల కారణంగా  మటన్ కొట్టులో ఉద్యోగాలకు పరిమితమై పోయారని విమర్శించారు.  రాష్ట్ర సంపద పెంచే మార్గం నాకు తెలుసు.. ఆస్తులు తాకట్టు పెట్టడం మాత్రమే జగన్ కు తెలుసు అంటూ విమర్శలు గుప్పించారు.   జగన్ ఓ పిల్ల కుంక. తెలివిగా ఆలోచిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు. పేదవాడు పేదవాడుగా ఉండటానికి వీల్లేదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ సిద్ధం. నిండు మనసుతో ఆశీర్వాదించి అసెంబ్లీకి పంపండి. మీ రుణం తీర్చుకుంటాను’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆదోని పట్టణం పసుపువనంగా మారిపోయింది. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనసందోహాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వశం కాలేదు. ఆదోని పట్టణంలో చంద్రబాబు రోడ్ షోకు జనం పోటెత్తారు. రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. రోడ్డుకిరువైపులా జనం నిలబడి చంద్రబాబుకు అభివాదం చేశారు. భవనాలపై నుంచి పూలవర్షం కురిపించారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రోడ్ షో చాలా నెమ్మదిగా సాగింది. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలడమే కష్టంగా మారిన పరిస్థితి కనిపించింది. జనం స్పందనతో చంద్రబాబులో కూడా ఉత్సాహం కనిపించింది. జగన్ పాలనపై జనం ఎంతగా విసుగెత్తి ఉన్నారో చెప్పడానికి ఈ జనసందోహమే నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

విపక్షాల మోడీ టార్గెట్ గురి తప్పుతోందా?

 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి అన్నదే బీజేపీయేతర పార్టీల లక్ష్యం.  గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి మొదలు ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేస్తున్న   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు, బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులందరిదీ అదే మాట. అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,  భారత్ జోడో  యాత్ర చేస్తున్నారు. అందుకోసమే  కమ్యూనిస్టులు ముందు వెనుకలు చూసుకోకుండా పొత్తులకు సిద్ధమౌతున్నారు. కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అన్న కేసీఆర్ పంచన చేరడానికి  కూడా వారు ఒక్క క్షణం వెనుకాడలేదు. ఇక మరాఠా యోధుడు శరద్ పవార్, బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ, ఆప్ అరవింద్ కేజ్రివాల్ ఎవరి శక్తి మేరకు వారు వారి వారి దారిలో నడుస్తూ మోడీ పరాజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఇందుకోసం ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు. మరోవంక, బీజీపే వ్యతిరేక పార్టీల నేతలు అందరికీ తానే తలలోని నాలుక అంటూ హడావుడి చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  ఇప్పుడు  అదే లక్ష్యంతో సొంత కుంపటి పెట్టుకుని బీహార్ లో పాద యాత్ర చేస్తున్నారు.   ఇక విషయానికి వస్తే  2024 సార్వత్రిక ఎన్నికలకు ఎంత లేదన్నా ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆ సార్వత్రిక ఎన్నికలకు ముందు  గుజరాత్, హిమాచల్, తెలంగాణ సహా  ఐదారు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలున్నాయి, ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గానో లేదా సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు లిట్మస్ టెస్టుగానూ అంతా భావిస్తున్నారు.  అందులోనూ ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముందు వరసలో ఉన్నాయి.  ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా అధికారంలో ఉన్నది బీజేపీయే. ఈ రెండు రాష్ట్ర్రాలలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా, అడ్డుకోగలిగితే అప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలోమోడీ టార్గెట్ రీచ్ కావడంపై విపక్షాలు ఆశలు పెట్టుకోవచ్చని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించే స్థితిలో ప్రతిపక్ష పార్టీలున్నాయా? అంటే, పరిశీలకులు, సర్వేలూ కూడా పెదవి విరుస్తున్నాయి. గుజరాత్,  హిమాచల్ ప్రదేశ్‌లలో మరో సారి బీజేపీ విజయం సునాయాసమేనని సర్వేలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో వరుసగా ఆరుసార్లు అధికారాన్ని నిలబెటగ్టుకున్న బీజేపీపై తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటగికీ.. బీజేపీని నిలువరించి అక్కడ అధికారం దక్కించుకునే విషయంలో విపక్షాల అనైక్యతే అడ్డుగా నిలుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. అందుకే అక్కడ వరుసా ఏడో సారి కూడా కమలమే అధికార పగ్గాలను అందుకుంటుందని చెబుతున్నాయి.   ఒక సర్వే అయితే గుజరాత్‌ అసెంబ్లీలో ఎన్నికలలో బీజేపే అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాదు, గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. గత ఎన్నికలలో బీజేపీ, అతికష్టం మీద, మొత్తం  182 స్థానాలకు గానూ 99 స్థానాలు గెలుచుకుని పరవు నిలుపుకుంది. అయితే, ఈసారి 135 నుంచి 143 వరకు స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఆ ఒపీనియన్  పోల్‌ పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 వరకు సీట్లు దక్కవచ్చని  సర్వే అంచనా వేసింది. గుజరాత్ లో గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ బలంగా పుంజుకున్నప్పటికీ గెలుపునకు దూరంగా నిలిచిపోవడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆ రాష్ట్రంలో పోటీ చేస్తున్న ఆప్ చీల్చడమేనని ఆత్మసాక్షి తాజా సర్వే పేర్కొంది.   అలాగే 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 37-45 సీట్లలో విజయం సాధించి మరో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు ఘంటాపథంగా చెప్పాయి.  ముఖ్యంగా గుజరాత్ విషయాన్ని తీసుకుంటే అక్కడి పరిణామాలను విశ్లేషిస్తే ఆ రాష్ట్రంలో మరో సారి బీజేపీకి అధికారపగ్గాలు అందడానికి విపక్షాల అనైక్యతే కారణమని స్పష్టంగా అర్ధమౌతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఆ తరువాత గడచిన ఈ ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ స్వయం తప్పిదాలతో వెనుకబడింది.   పటేదార్ ఆందోళనతో పాపులర్ అయిన యువనేత,  హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పి, బీజేపీలో చేరారు. అలాగే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లోనూ కాంగ్రెస్ ఓటుకు భారీగా గండి కొడుతుందని పరిశీలకులు అంటున్నారు.  వరసగా ఆరు పర్యాయాలు అధికారంలో ఉన్న, బీజేపీకి సహజంగానే రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది, అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్,  ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య చీలిపోయి బీజేపీ లబ్ధి పొందుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గుజరాత్ లో సాగితే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రయోజనం ఉంటుందని స్థానిక నాయలు ఆశించారు. అయితే, రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ లో  గుజరాత్’, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాలను చేర్చలేదు. ఇది గుజరాత్,హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు వదులుకుందనే సంకేతాన్ని ఇచ్చింది. దీంతో, రాహుల్ యాత్ర వలన అంతో ఇంతో వస్తుందనుకున్న మైలేజి రాకపోగా, నెగటివ్ ప్రచారానికి అవకాశం ఇచ్చింది. పోటీకి ముందే పరాజయాన్ని అంగీకరించేసిదన్న చర్చకు తావిచ్చింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు, అరవింద్ కేజ్రీవాల్ వారంలో రెండు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడో స్థానానికి పరిమితమైనా  ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ అదే పరిస్థితి, కని పిస్తోంది. అందుకే, బీజేపీ వ్యతిరేక పార్టీలు వేటికి అవిగా మోడీ టార్గెట్ నిర్దేశించుకుని 2024 ఎన్నిక సమరంలో దిగితే ఆ టార్గెట్ రీచ్ కావడం సాధ్యం కాదనే పరిశీలకులు అంటున్నారు. అనైక్యత వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి ముచ్చటగా మూడో సారి కూడా కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుతీరే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. అందుకే విపక్షాల మోడీ టార్గెట్ గురి తప్పిందని ఇప్పటి నుంచే విశ్లేషణలు వస్తున్నాయి.

ఔనంటే కాదనిలే.. కాదంటే ఔననిలే!..కేసీఆర్ తీరే వేరులే

ఏదో సినిమాలో ఇలాంటి పాట ఒకటి ఉంది. అది ఆ సినిమాలో ఏ సందర్భానికి సంబంధించిన పాట అన్నది పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీరు మాత్రం చెప్పింది చేయం.. చేసేది చెప్పం అన్నట్లుగానే ఉందన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కూడా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినా అప్పుడే తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రగులుతోంది. ఇందుకు కారణం ప్రతిపక్షాలు కాదు.. అధికారంలో ఉన్న పార్టీలే. కారణం ఏదైనా తెలంగాణలో అధకారంలో ఉన్న తెరాసలోనూ, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోనూ కూడా ఇహనో, ఇప్పుడో ఎన్నికల ప్రకటన వెలువడనుందా అన్నంత హడావుడి కనిపిస్తోంది. తెరాస సీఎం ఇప్పటి నుంచే ఎన్నికలలో ఎలా పని చేయాలన్న దిశానిర్దేశాన్ని పార్టీ శ్రేణులకు నిర్దేశిస్తున్నారు. ఫిరాయింపులపై అప్రమత్తం  చేస్తున్నారు. పార్టీ నుంచి పక్క చూపులు చూస్తున్నవారెవరో తనకు తెలుసనీ, ఎవరేం చేస్తున్నారో, ఎవరెవరు ఎవరెవరి టచ్ లోకి వెళుతున్నారో సమాచార మంతా తన దగ్గరు ఉదని హెచ్చరిస్తున్నారు. ప్రలోభాలకు లొంగి రాజకీయ భవిష్యత్ పాడు చేసుకోవద్దని హితవూ చెబుతున్నారు. సిట్టింగులందరికీ టికెట్లిస్తానని హామీ ఇచ్చేసి నియోజకవర్గాలలో పని చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ముందస్తు ముచ్చటే లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలని చెబుతున్నారు. ఆయన చెబుతున్న మాటలకూ, చేస్తున్న పనులకూ సంబంధమే లేదు. ముందస్తు లేదంటూనే.. ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించేశారు. ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలన్నదానిపై కార్యాచరణ మొదలెట్టేశారు. గతంలో అంటే 2018లో ముందస్తుకు వెళ్లినప్పుడు కూడా ఆయన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వెళదాం అంటూ క్యాడర్ కు చెబుతూనే ఉరుము లేని పిడుగులా ఆరు నెలలకు ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల శంఖారావం పూరించేశారు. ఇప్పుడూ అదే చేస్తారని, అందుకే ముందస్తు ముచ్చట లేదంటూనే.. ఎన్నికల సన్నాహాలు చేసేస్తున్నారని పార్టీ శ్రేణులే భావిస్తున్నపరిస్థితి. అయితే రాజకీయ వర్గాలలో మాత్రం కేసీఆర్ ముందస్తు లేదంటే ఉందనే అర్ధమని ఇందుకు 2018 ముందస్తు ఎన్నికలే నిదర్శనమనీ అంటున్నారు. సంటిమెంట్లను విపరీతంగా ఫాలో అయ్యే కేసీఆర్ కలిసి వచ్చిన ముందస్తును కాదని షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లే చాన్సే లేదంటున్నారు విశ్లేషకులు. 2018 లో కూడా ముందస్తుగానే ఎన్నికల నగారా మోగించిన కేసీఆర్ అప్పట్లో ఆరు నెలలు ముందుగా ఎన్నికలు జరిగితే అవి ముందస్తు ఎందుకౌతాయని ప్రశ్నించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ గడువుకు ఆరు నెలలు ముందు ఎన్నికలు నిర్వహించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘమే చెబుతుంటే.. అందుకే షెడ్యూల్ కంటే ఆరు నెలలు ముందుగా ప్రభుత్వం ప్రజాతీర్పు కోరాలనుకోవడం ముందస్తుకు వెళ్లడం అవ్వదని ఆయన అప్పట్లో చెప్పారు. ఇప్పుడూ అదే చెప్పే అవకాశం ఉందంటున్నారు.  షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అని ఇటీవలి కార్యవర్గ సమావేశంలో ఆయన ఘంటా పదంగా చెప్పినా అదే ప్రసంగంలో ముందస్తు సంకేతాలు కూడా ఇచ్చారని వివరిస్తున్నారు. ఆయన ఎన్నికలకు పది నెలల సమయం మాత్రమే ఉంది అంటూ కార్యవర్గ సమావేశంలో కేడర్ ను అప్రమత్తం చేశారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అంటే వచ్చే ఏడాది డిసెంబర్ లో జరగాల్సి ఉంది. అంటే తక్కువలో తక్కువ పదమూడు నెలల సమయం ఉంది. కానీ కేసీఆర్ పది నెలలలోనే ఎన్నికలు అంటున్నారు. అంటే ఆయన ముందస్తుకు ప్రిపేర్ అయిపోవడమే కాకుండా క్యాడర్ ను కూడా అందుకు సంసిద్ధం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించేశారనే అర్ధమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచీ కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా ఆయన రాజకీయ పరిధి పెరిగిపోతుంది. జాతీయ పార్టీ అధినేతగా కేసీఆర్ ఒక్క తెలంగాణే కాకుండా దేశంలో తక్కువలో తక్కువ మరో ఐదారు రాష్ట్రాలపై కేంద్రీకృతం చేయాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలుగా జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రభావం చూపాలని ఆయన బలంగా నిర్ణయించుకున్నట్లు తెరాస వర్గాలే చెబుతున్నాయి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వాఘేలా వంటి వారి సహకారంతో అక్కడ కనీసం కొన్ని స్థానాలలోనైనా బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలోగా బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం అనుమతి రాకుంటే గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంలోని అన్ని స్థానాలలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టి అయినా సత్తా చాటాలని కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని చెబుతున్నారు. ఇక ఆ తరువాత సార్వత్రిక  ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటాలంటే అంతకంటే ముందుగా ఆయన ఇంట గెలవాల్సి ఉంటుంది. తెలంగాణలో తెరాస  ను ముచ్చటగా మూడో సారి అధికారంలోకి తీసుకువచ్చి అప్పడు రచ్చ గెలవాలని ఆయన భావిస్తున్నారు. వచ్చే నెలలో బీఆర్ఎస్ కు గుర్తింపు వస్తే ఇక టీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ మాత్రమే ఉనికిలో ఉంటుంది. అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చి..జాతీయ స్థాయిలో తన ఆగమనాన్ని ఘనంగా చాటాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ముందస్తు లేదని ఆయన నోటితో చెబుతున్నా.. చేతలన్నీ మాత్రం నిర్ణీత గడువు కంటే ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల కోసమే అన్నట్లు ఉంటున్నాయి. అందుకే నిర్ణీత గడువు కంటే ఆరు నెలలు ముందు కాకపోయినా కనీసం మూడు నాలుగు నెలల ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడం తథ్యమని రాజకీయవర్గాలు అంటున్నాయి. తెరాస శ్రేణులూ అలాగే భావిస్తున్నాయి.  

తాడేపల్లి ప్యాలెస్ కు జెట్ సెట్ గో సెగ?

ఢిల్లీ మద్యం కుంభకోణం మూలాలన్నీ ఏపీ సీఎం జగన్ సన్నిహితుల చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా మద్యం కుంభకోణంకు సంబంధించి కోట్లాది రూపాయలను బేగం పేట విమానాశ్రయం నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ద్వారా తరలించారని ఈడీ వెల్లడించిన నేపథ్యంలో ఈ సొమ్ము తరలింపునకు ఉపయోగించిన ప్రైవేట్ విమానాలు ఈ స్కాంలో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ భార్య కనికా టేక్రీవాల్ రెడ్డికి చెందిన జెట్ సెట్ గో సంస్థవేనని తేలడంతో ఇప్పుడు చూపులన్నీ జగన్ కు సన్నిహితులైన వారిపైకి మళ్లాయి. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి శరత్ చంద్రారెడ్డి సమీప బంధువు. విజయసాయి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి. ఆ శరత్ చంద్రారెడ్డి భార్యే కనికా టేక్రీవాల్ రెడ్డి. దీంతో మద్యం కుంభకోణం వ్యవహారంలో విజయసాయి పాత్రపై లోతైన విచారణ జరగాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. బేగంపేట విమానాశ్రం  నుంచి ప్రవేటు విమానాల రాకపోకలు, వాటిలో ప్రయాణించిన వారి గురించి ఆరా తీసిన విధంగానే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలు, వాటిలో ప్రయాణించిన వారి వివరాలనూ కూడా ఈడీ దర్యాప్తు చేయాలని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ చేశారు.   ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డికి వైసీపీ అగ్రనాయకత్వంతో అనుబంధం చిన్నదేమీ కాదు. శరత్ చంద్రారెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయితో చుట్టరికం ఉందని మాత్రమే ఇంత కాలం అనుకుంటూ వచ్చాం. కానీ విజయసాయితో చుట్టరికానికి ముందే ఆయనకు వైఎస్ జగన్ తో అనుబంధం ఉందన్నదీ వెలుగులోకి వచ్చింది. ఎలా అంటే  జగన్ అక్రమాస్తుల కేసులో శరత్ చంద్రారెడ్డి కూడా సహ నిందితుడు. ఆ అనుబంధంతోనే శరత్ చంద్రారెడ్డికి జగన్ ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి దక్కేలా చేశారు. ఔను పీనపాక శరత్ చంద్రరెడ్డి ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు. జగన్ తో అసోసియేషన్ కారణంగానే శరత్ చంద్రారెడ్డికి ఏపీ క్రికెట్ అసోసియేషన్ పదవి దక్కిందన్న విమర్శలు ఉన్నాయి. వీరిరువురి మధ్యా అసోసియేషన్ జగన్ అక్రమాస్తుల కేసులో శరత్ చంద్రారెడ్డి కూడా ఒక నిందితుడు అవ్వడంతోనే అర్ధమౌతుంది. ఆయనే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏపీలో అరబిందో ఎన్నో ప్రాజెక్టులు దక్కించుకుంది.  అలాగే అంబులెన్స్ కాంట్రాక్ట్ కూడా అరబిందోకే దక్కింది.   అలాగే అధికార బలం అండతో  ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌  అద్యక్ష పదవీ శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారు. తన అల్లుడి సోదరుడు అయిన శరత్ చంద్రారెడ్డి జగన్ అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఏసీఏ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన అధ్యక్షుడయ్యాకే  ఏసీఏ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.  దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఆ కుంభకోణానికి ఏపీతో లింకులు ప్రస్ఫుటమయ్యాయి.   ఈ స్కామ్ కు సంబంధించి   ఈడీ అరెస్టు చేసింది.  అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డిని, వినయ్ కుమార్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిరువురినీ  ఢిల్లీలో రెండు రోజుల పాటు విచారించి ఆ తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అరబిందో శరత్ చంద్రారెడ్డి, వినయ్ కుమార్ లకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారాలతో సంబంధాలున్నాయని ఈడీ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు కావడంతో ఆ సెగ తాడేపల్లి ప్యాలస్ కు తగిలింది. దీంతో సకల శాఖల మంత్రి సజ్జల రంగంలోకి దిగి శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడు కాదనీ, ఆయన సోదరుడనీ చెబుతూ.. సోదరుడి అక్రమాలతో విజయసాయి అల్లుడికి ఏం సంబంధం అని మీడియా ముఖంగా చెప్పారు. అయితే ఏ సంబంధం, అనుబంధం లేకుండానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పదవిని శరత్ చంద్రారెడ్డికి కట్టబెట్టారా?  ఏ సంబంధం లేకుండానే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ1, ఎ2తలో పాటు శరత్ చంద్రారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో లిక్కర్ స్కాం దర్యాపులో ఈ లింకులు ఎంత వరకూ ఉన్నాయో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మద్యం స్కాం సొమ్ముల తరలింపులో శరత్ చంద్రారెడ్డి భార్యకు చెందిన జెట్ సెట్ గో సంస్థ విమానాలను వినియోగించారని తమ దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. అంతే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల అండతోనే ప్రైవేటు ఛార్టర్డ్ విమానాల ద్వారా నగదు తరలింపు జరిగిందని భావిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. దీంతో బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల రాకపోకలను  నిలిపివేశారు. ఇక విజయవాడ నుంచీ ఈ సంస్థకు చెందిన ప్రైవేట్ విమానాల ద్వారా రాకపోకలు సాగించిన వారి వివరాలనూ ఈడీ సేకరిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఆ దిశగా ఈడీ అడుగులు వేయాలన్న డిమాండ్ జోరందుకుంది.

పోలవరం ముంపుపై తెలంగాణ తొండి వాదన..పిపిఎ సమావేశం బాయ్ కాట్

ఏపీకి జీవనాడి వంటి పోలవరం విషయంలో తెలంగాణ అభ్యంతరాలతో బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ముఖ్యంగా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపు ముప్పు ఉందని తెలంగాణ, అసలు ముప్పే లేదని ఏపీ అధికారుల వాదనతో సమావేశం హీటెక్కింది. ఇరు రాష్ట్రాల అధికారులు తమతమ వాదనలకే కట్టుబడి ఉండటంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది.    ముంపు ముప్పుపై చర్చకోసం తెలంగాణ పట్టుబట్టింది అలాగే వరద నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాల డిమాండ్ చేసింది. దీనికి ప్రతిగా ఏపీ  పోలవరంలో 150 అడుగుల ఎత్తులో నీటినిల్వ ఉన్నప్పుడు బ్యాక్‌వాటర్‌ ప్రభావం తెలంగాణపై ఇసుమంతైనా ఉండదని తేల్చి చెప్పింది.   పదే పదే ముంపుపై చర్చెందుకని నిలదీసింది. అలాగే ముంపు  అంశాన్ని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి శాఖకు నివేదించినప్పుడు ఇప్పుడీ సమావేశంలో చర్చ అనవసరమని పోలవరం ప్రాజెక్టు అధారిటీ చైర్మన్ పేర్కొన్నారు.   అయితే అందుకు ససేమిరా అన్న పోలవరం ప్రాజెక్టు వల్ల కిన్నెరసాని, ముర్రేడువాగుల ప్రవాహంపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఎన్జీటీలో దాఖలైన కేసులో ఆర్నెల్లలోపు ముంపు ముప్పుపై సర్వే చేపట్టాలని ఆదేశాలున్నాయనీ పట్టుబట్టింది.  అయితే తెలంగాణ వాదనను పోలవరం ప్రాజెక్టు అధారిటీ తిరస్కరించింది. దీంతో తెలంగాణ అధికారులు సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. 

జగన్ ముఖ్యమంత్రా మద్యం వ్యాపారా.. రాష్ట్రంలో డిస్టిలరీలు..ఆయనవే పంపిణీ ఆయనదే.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా మద్యం వ్యాపారంలో మునిగి తేలుతున్నారా? ఆయనకు పాలన చాత కాదా? నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారా? ఔను నిజమే అంటున్నారు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన పత్తి కొండలో బాదుడే బాదుడు సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. ఒర్వకల్లు విమానాశ్రం వద్ద ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అంతకు ముందు  దేవనకొండ, కోడుమూరు లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అడుగడుగునా చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు. జగన్ సర్కార్ పై ఆయన విమర్శలకు జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ అని దుయ్యబట్టారు. జగన్ అసమర్థ పాలనతో జనం అష్టకష్టాలూ పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం చేశారనీ, జనాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారనీ విమర్శలు గుప్పించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు జగన్ విధానాలే కారణమన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పత్రికల్లో వార్తలు రాసినా దాడులు, కేసులు ఇదా ప్రజాస్వామ్యమంటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సీఐడీ తాడేపల్లి ప్యాలెస్ తాబేదారుగా మారిపోయిందని చంద్రబాబు విమర్శించారు.  జడ్జిలపై కూడా వదల్లేదు. సామాజిక మాధ్యమంలో  పోస్టులు పెట్టి అవమానపరుస్తున్నారన్నారు.   మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారనీ, దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు అన్నారు. తుగ్లక్ వ్యవహారం కాకపోతే దేశంలో ఏ రాష్ట్రానికైనా మూడు రాజధానులున్నాయా? అని ప్రశ్నించారు. అమరావతిలో ప్రభుత్వ, రైతులు ఇచ్చిన భూములు కలిపి 50వేల ఎకరాలు ఉన్నాయి. అన్ని నిర్మాణాలు పోనూ 10వేల ఎకరాలు మిగులుతాయి. ఎకరా రూ.10 కోట్లయినా లక్ష కోట్లు. రూ.30 కోట్లయితే.. మూడు లక్షల కోట్లు. ఈ ఆస్తిని జగన్‌ విధ్వంసం చేశారు.  మీకు ముద్దులు పెట్టాడు..ఒక్క చాన్స్‌ అని జగన్‌ వచ్చాడు..  ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ప్రజల జీవితాలను, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.  రాయలసీమకు తుగ్లక్ సీఎం ఒక్క పరిశ్రమనైనా తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు  తెలుగుదేశం హయాంలో  అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తెచ్చామని చెప్పారు. జగన్‌ గొప్పగా చెప్పుకుంటున్న నవరత్నాలు నిజానికి నవమోసాలని చంద్రబాబు అన్నారు. నవరత్నాలు పేరిట గోరంత ఇచ్చి కొండంత దోచుకుంటున్నారని విమర్శించారు.  నందిగామలో నాపై రాళ్లు వేస్తే.. సెక్యూరిటీ అధికారికి గాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే... పూలలో రాయి వచ్చిందన్నారు. రేపు పూలలో బాంబు కూడా ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు.  ఆనాడు బాబాయిని చంపి, నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారు.  ప్రభుత్వం వచ్చాక నిందితులను ఎందుకు పట్టుకోలేదు? తండ్రిని చంపిన హంతకులను శిక్ష పడాలని వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆమె చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలుద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.  నేను సీనియర్‌ నాయకుడిని.. నన్ను అవమానించే సాహసం ఎవరూ చేయరు. అసెంబ్లీకి వెళ్లిన నన్నే కాదు.. నా భార్యను కూడా అవమానించారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని బయటకు వచ్చా. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచి గౌరవ సభలో అడుగు పెడతా. నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే.. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే.. ఎన్నికల్లో మనమంతా కష్టపడి గెలవాలని చంద్రబాబు అన్నారు.  జగన్ మద్యం వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలన్నీ జగన్ వే. పంపిణీ మొత్తం ఆయనదే. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్లే అమ్ముతున్నారు.  డబ్బులన్నీ ఆయనకే చేరిపోతాయి.. ఢిల్లీలో మద్యం స్కాం జరిగింది. ఈడీ, ఐటీ దర్యాప్తు చేస్తున్నాయి. ఏపీలో ఢిల్లీ మద్యం స్కాంను మించిన మద్యం స్కాం జరుగుతోంది. మరి నిఘా సంస్థలు ఈ వైపు దృష్టి సారించవా అని నిలదీశారు.  

ఫిఫా వరల్డ్ కప్ లో డ్రెస్ కోడ్.. ఎక్స్ పోజింగ్ చేస్తే చర్యలే

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్ ఫిఫా వరల్డ్ కప్ 2022 నవంబర్ 29 నుంచి ఖతార్ వేదికగా ఆరంభం కానుంది. అయితే ఈ వరల్డ్ కప్ పోటీలను వీక్షించాలనుకునే మహిళా అభిమానులకు నిర్వాహకులు షాక్ ఇచ్చారు. స్టేడియంలకు వచ్చి పోటీలు వీక్షించాలంటే మాత్రం డ్రెస్ కోడ్ పాటించి తీరాలన్న కండీషన్ పెట్టారు. బిగుతుతుగా ఉండే దుస్తులు, ఎక్స్ పోజింగ్ డ్రెస్ లను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. భుజాలు కప్పుతూ, మోకాళ్లకు దిగువగా ఉండే దుస్తులనే మహిళలు ధరించాలని, అలా అయితేనే మ్యాచ్ లు వీక్షించడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ కే వేదివక అయిన ఖతార్ లో ఉండే చట్టాలను అనుగుణంగా ఈ నిబంధనలు విధించినట్లు చెప్పారు. నవంబర్ 20 నుంచి ప్రారంభం అయ్యే ఫిఫా వరల్డ్ కప్ 22 పోటీలను వీక్షించడానికి ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఖతార్ చేరుకున్నారు. ఈ వరల్డ్ కప్ లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చిన మహిళా అభిమానులు డ్రెస్ కోడ్ పై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖతార్ లో చట్టాలకు అనుగుణంగానే ఈ నిబంధన విధించామని నిర్వాహకులు చెబుతున్నారు. ఫిఫా వెబ్ సైట్ లో డ్రెస్ కోడ్ గురించి ఎలాంటి ఆంక్షలూ లేవని పేర్కొన్నప్పటికీ ఖతార్ చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఖతార్ చట్టాల ప్రకారం ఎవరైనా తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు.. కానీ బహిరంగ ప్రదేశాలను సందర్శించేటప్పుడు మాత్రం భుజాలు, మోకాళ్లు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.  ఖతార్‌లో ప్రయాణించే మహిళలు బిగుతైన దుస్తులు ధరించడం నిషేధం.  కాగా, డ్రెస్ కోడ్‌ను పాటించని వారికి కఠిన శిక్షలు ఉంటాయని, జైలుకి కూడా పంపొచ్చని స్థానిక అధికారులు హెచ్చరించారు.

విమాన ప్రయాణాల్లో మాస్కులు ఇక మస్ట్ కాదు!

విమాన ప్రయాణాలలో మాస్క్ ఇక మస్ట్ కాదు. కోవిడ్ ప్రొటోకాల్ కు సవరణలు చేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నిరోధించేందుకు గతంలో విమానప్రయాణీకులు మాస్కులు వాడటం తప్పని సరి చేసిన సంగతి విదితమే. అప్పటి నుంచి అదే నిబంధన కొనసాగుతూ వస్తోంది. అయితే  కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం ఇకపై వ ప్రయాణాలలో మాస్కులు, ఫేస్ షీల్డులు వాడాల్సిన అవసరం లేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. అయితే  అయితే కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా ప్రయాణికులు ఫేస్ మాస్క్‌  లను వాడటం శ్రేయస్కరమని ఆ ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను సంప్రదించి, విమానాల్లో ప్రయాణించేటపుడు ప్రయాణికులు ఫేస్ మాస్క్‌లు, ఫేస్ కవర్ల వాడటంపై సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇకపై విమానాలలో ప్రయాణికులను ఉద్దేశించి  చేసే ప్రకటనల్లో ఫేస్ మాస్క్ వాడకపోతే జరిమానా, దండన చర్యల   ప్రస్తావన వద్దని  ఆదేశించింది. కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా ఫేస్ మాస్క్ వాడటం శ్రేయస్కరమని మాత్రమే చెప్పాలని తెలిపింది.

క్యాసినో కేసులో మంత్రి తలసాని సోదరులను విచారించిన ఈడీ

తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం(నవంబర్15) తెరాస విస్తృత స్థాయి సమావేశంలో ఈడీ దాడుల విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే అలా ఆరోపించి ఊరుకోలేదు. మరిన్ని దాడులు జరుగుతాయనీ, ఎమ్మెల్యేలు, తెరాస నాయకుల నివాసాలలో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించే అవకాశాలున్నాయనీ, అయితే వాటికి ఎవరూ భయపడొద్దనీ అన్నారు. అలా అని 24 గంటలు గడిచాయో లేదో ఇలా ఈడీ తెలంగాణ మంత్రి సోదరులను విచారణకు పిలిచింది. ఆ మంత్రి ఎవరో కాదు.. తలసాని శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ బుధవారం దాదాపు పది గంటల పాటు విచారించింది.  క్యాసినో కింగ్ పిన్ చీకోటి ప్రవీణ్ యాదవ్ తో కలిసి వీరు కాసినో నిర్వహణలో పాలుపంచుకున్నారని  దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. గతంలోనే ఈడదీ చీకోటి ప్రవీణ్ నివాసం, కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే చీకోటి ప్రవీణ్ ను రోజుల తరబడి విచారించి రాబ్టిన సమాచారం ఆధారంగానే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సోదరులను విచారించిందని చెబుతున్నారు.   ఐటీ , ఈడీ , సీబీఐ దాడులు జరిగే అవకాశం ఉందని ఎవరూ భయపడవద్దని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పిన గంటల వ్యవధిలోనే మంత్రి సోదరులను ఈడీ విచారించడంతో ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తమౌతోంది. ఇటీవలే టీఆర్ఎస్ నేతలకు చెందిన గ్రానైట్ పరిశ్రమపై  ఈడీ అధికారులు దాడులు నిర్వహించి అవకతవకలు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తంచామని చెప్పారు. ఆ తరువాత ఇప్పుడు క్యాసినో కేసులో తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించింది.  రాత్రి 9 గంటలకు ఈడీ విచారణ నుంచి తలసాని సోదరులు బయటకు వచ్చారు. గురువారం (నవంబర్ 17)న మరో సారి వారిని ఈడీ విచారించనుంది. మంత్రి తలసాని సోదరులు ఇద్దరు మీడియా కంటపడకుండా వెళ్లిపోయారు. రేపు మరోసారి వారు విచారణ కోసం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. క్యాసినో వ్యవహారానికి సంబంధించి ఈడీ నజర్ లో సుమారు వంద మంది వరకూ ఉన్నట్లు చెబుతున్నారు.   చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి కాల్ డేటా ఆధారంగా ఈడీ వివరాలను సేకరించిందంటున్నారు. కాగా ఇదే కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి ఈసీ బుధవారం (నవంబర్ 16) నోటీసులు ఇచ్చింది.   

ఢిల్లీ లిక్కర్ స్కాం.. తెలుగు రాష్ట్రాలలో డొంకలు కదులుతున్నాయి

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సంచలన వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు ఈ స్కాంతో లింకులు ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ స్కాంకు సంబంధించి బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ద్వారా భారీ ఎత్తున  నగదును ఢిల్లీ,  తదితర ప్రాంతాలకు తరలించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల అండతోనే ప్రైవేటు ఛార్టర్డ్ విమానాల ద్వారా నగదు తరలింపు జరిగిందని విశ్వసిస్తున్నాయి. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల రాకపోకలను  నిలిపివేశారు.   అంతే కాకుండా ఈ నగదు తరలింపునకు జెట్ సెట్ గో విమానాలను ఉపయోగించారని అనుమానిస్తున్న ఈడీ ఆ విమానాల ద్వారా ప్రయాణించిన వారి జాబితాను కోరుతూ ఈడీ లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక ప్రత్యేకంగా పేర్కొనాల్సిన విషయమేమిటంటే ప్రైవేటు చార్టర్డ్ విమానాలను అద్దెకిచ్చే సెట్ జెట్ గో కంపెనీ ఓనర్ కనికా టేక్రివాల్ రెడ్డి అనే మహిళ. ఈ కనికా టేక్రీవాల్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇటీవల అరెస్టయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి. కనికా టేక్రీవాల్ రెడ్డి జెట్ సెట్ గో కంపెనీ ద్వారా ప్రైవేట్ ఛార్టర్డ్ విమాన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈమె కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు, వాటిలో ప్రయాణించిన వారి వివరాలనే కోరుతూ ఇప్పుడు ఈడీ   ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. అక్టోబర్ 17న ఈడీ రాసిన లేఖను  ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  దేశంలోని అన్ని విమానాశ్రయ   డైరెక్టర్లకు పంపింది. కనికా టేక్రీవాల్ రెడ్డి చెందిన విమానాల్లో కీలక వ్యక్తులు, ప్రముఖులు ప్రయాణాలు సాగించినట్లు ఇప్పటికే ఈడీ నిర్ధారించింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా    తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు కనికా  టేక్రీవాల్ రెడ్డి కంపెనీకి చెందిన విమానాలను ఉపయోగిస్తున్నారని కూడా ఈడీ దర్యాప్తులో తేలిందని అంటున్నారు.  ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు   ఎవరికి ప్రైవేట్ ఛార్టరడ్డ్ ఫ్లైట్ అవసరమైనా సమకూర్చేది కనికా టేక్రీవాల్ రెడ్డేనని దర్యాప్తులో వెల్లడైనట్లు ఈడీ చెబుతోంది. చార్టెర్డ్ విమానాలకు అధిక అద్దెలు వసూలు చేసినట్లు ఇప్పటికే కనికా టేక్రీవాల్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌లో ఏపీకి చెందిన ఉన్నత స్థాయి నేతలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించిన నగదును కనికా టేక్రీవాల్ రెడ్డి కి చెందిన విమానాలలోనే తరలించారని ఈడీ అనుమానిస్తోంది. అందుకే ఈ కంపెనీకి చెందిన విమానాలు బేగంపేట నుంచి ఎక్కడెక్కడకు వెళ్లాయి.. ఈ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారన్న వివరాలను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసి మరీ సేకరించింది. ఈ వివరాలతో ఢిల్లీ లిక్కర్ స్కాం పాత్రధారులు, సూత్ర ధారులెవరన్నది పూర్తి ఆధారాలతో సహా బయటపడతాయని భావిస్తున్నారు.   

కాంగ్రెస్ లో లుకలుకలు.. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో శవిథరూర్ కు దక్కని చోటు

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే చేపట్టిన తరువాత కూడా పార్టీలో జి23 నేతల ప్రభావంపై పార్టీలో ఆందోళన ఇసుమంతైనా తగ్గలేదు.  పైపెచ్చు వారికి  పార్టీలో ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. తద్వారా పొమ్మన లేక పొగపెట్టిన చందంగా వారంతట వారే బయటకు వెళ్లే పరిస్థితి కల్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో.. అంటే సోనియా గాంధీ అధినేత్రిగా ఉన్న సమయంలో ఆమె నిర్ణయాలను ప్రశ్నించిన సీనియర్లను పక్కన పెట్టిన సంగతిని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వారిలో గులాం నబీ ఆజాద్ ఆయనంతట ఆయనగా పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి విదితమే. ఇప్పుడు కాంగ్రెస్ లో ఆ పరిస్థితి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కు ఎదురౌతున్నట్లుగా కనిపిస్తున్నది.  తాజాగా పార్టీ అధ్యక్ష ఎన్నికలో మల్లికార్జున్ ఖర్గేకు పోటీగా నిలబడి పరాజయం పాలైన శశిథరూర్ కు అవమానం ఎదురైంది. గుజరాత్ అసెంబ్లీ  ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ కూడా ఆ రాష్ట్రంలో బాగా పుంజుకుందని సర్వేలు చెబుతున్న   వేళ  గ్రాండ్ ఓల్డ్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్‌ నేత శశిథరూర్‌కు పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో స్థానం దక్కలేదు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ సీనియర్లు పార్టీ అధ్యక్షుడి తీరును తప్పుపడుతూ   పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో శశిథరూర్‌కు స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో స్థానం కల్పించకుండా అవమానించడం ద్వారా పార్టీ ఆయనకు బయటకు దారి చూపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో శిశిథరూర్ కు స్థానం కల్పించకపోయినా గుజరాత్ లో ప్రచారానికి రావాల్సిందిగా ఆ రాష్ట్ర విద్యార్థి సంఘం ఆయనను ఆహ్వానించింది. అయితే వారి ఆహ్వానాన్ని శశిథరూర్ మన్నించలేదు. ఇక, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 40 మందితో​ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల  జాబితాను విడుదల చేసింది.  ఆ జాబితాలో  పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌ సీఎం అశోక​్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, దిగ్విజయ్‌ సింగ్‌, కమల్‌నాథ్‌, సచిన్‌ పైలట్‌, కన్హయ్య కుమార్‌, అశోక్‌ చవాన్‌, తదితరులు ఉన్నారు. మరో వైపు రాజస్థాన్ లోనూ పార్టీలో లుకలుకలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవికి పార్టీ సీనియర్ నేత అజయ్ మకేన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ఆయన చెబుతున్న కారణం.. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు మద్దతుగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై   పార్టీ అధిష్ఠానం   చర్యలు తీసుకోకపోవడమే అంటున్నారు. తన రాజీనామా లేఖను మకేన్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపినట్లు చెబుతున్నారు.  గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్షు ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధపడిన అశోక్ గెహ్లాట్   స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకునేందుకు కీలక సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ గెహ్లాట్ విధేయులైన 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి గైర్హాజరై తన ధిక్కారాన్ని వ్యక్తం చేశారు. సీఎం పదవి నుంచి గెహ్లాట్‌ను తప్పించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్ వద్దకు వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు మహేష్ జోషి, ధర్మేంద్ర రాథోర్, శాంతి ధరివాల్‌ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అజయ్ మాకెన్ అధిష్ఠానానికి సిఫారసు చేశారు. అయితే, ఇంతవరకూ వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడంపై అజయ్ మాకెన్ కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు ఇప్పడు గెహ్లాట్ కు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించడంతో మాకేన్ రాజీనామా చేశారని అంటున్నారు. రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరతకు చరమగీతం పాడాలంటూ రెండు వారాల క్రితం సచిన్ పైలట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మకేన్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజస్థాన్‌లోని వచ్చే నెల ప్రారంభంలో భారత్ జోడో యాత్ర రానుండటం, డిసెంబర్ 4న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మకేన్ రాజీనామా పార్టీని సంక్షోభంలోకి నెట్టేసినట్లైంది. 

సూపర్ స్టార్ కృష్ణకు కన్నీటి వీడ్కోలు

మహాప్రస్థానంలో సూపర్‌స్టార్‌ కృష్ణ అంతిమ సంస్కారాలు  ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు బుధవారం ఉదయం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణ అభిమానులు పద్మాలయ స్టూడియోకు చేరుకుని  తమ అభిమాన నటుడి పార్థివదేహం వద్ద నివాళులర్పించి వద్ద పుష్పాంజలి ఘటించారు. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య పద్మాలయ స్టూడియోస్‌ నుంచి మహాప్రస్థానం వరకూ కృష్ణ అంతిమయాత్ర సాగింది.   తమ అభిమాన హీరోని కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చి అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. సూపర్‌స్టార్ కృష్ణ  మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి విదితమే.    కు పోటెత్తారు. పద్మాలయా స్టూడియోస్‌లో కృష్ణ పార్థివదేహానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్‌ బ్యాండ్‌ మధ్య అంతమ యాత్ర కొనసాగింది. పోలీసులు మహాప్రస్థానంలోకి అందరినీ అనుమతించలేదు. సన్నిహితులను మాత్రమే లోపలకు పంపి, ఇతరులందరినీ బయటే ఆపేశారు. మహాప్రస్థానం కు చేరుకున్న తర్వాత కృష్ణ పాడెను ఆయన చిన్ననాటి మిత్రుడు, సినీ నటుడు మురళీమోహన్‌, టీడీపీ నేత బుద్దా వెంకన్న మోశారు. కృష్ణ కుమారుడు హీరో మహేష్ బాబు కృష్ణ చితికి నిప్పంటించారు. 

ఏపీలో పోటాపోటీ యాత్రలు

వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత.. జనవరి 27 నుంచి ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. దాదాపు ఏడాది పాటు పాదయాత్ర చేసి ప్రజలలో మమేకం కావాలని లోకేష్ కొనసాగే లోకేష్ పాదయాత్రను ఆయన తండ్రి, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో జనవరి 27న ప్రారంభిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 4 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను, రోడ్ మ్యాప్ ను లోకేష్  సిద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. జనం నుంచి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తులు, విపక్షాల నుంచి దూసుకు వస్తున్న విమర్శల నేపథ్యంలో పరువు మరింతగా దిగజారిపోకుండా ఉండాలంటే జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు తీసుకొస్తే.. ఆ పరిస్థితి వేరే. ఏపీలో రాజకీయ నేతలు పాదయాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలో ఉండి, కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి  ప్రజా ప్రస్థానం  పేరుతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  వస్తున్నా.. మీకోసం  పేరిట ఏపీలో పాదయాత్ర చేశారు. తర్వాత వైఎస్ జగన్ కూడా  ప్రజా సంకల్ప యాత్ర  యాత్ర చేశారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయి జైలులో ఉండడంతో ఆయన సోదరి షర్మిల  మరో ప్రజా ప్రస్థానం  అంటూ పాదయాత్ర కొనసాగించారు. అయితే.. తాజాగా నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్ర చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్, జనసేన, బీజేపీ పార్టీలు కూడా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం. తొలుత పాదయాత్ర చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నా.. తర్వాత దాన్ని బస్సు యాత్రగా మార్చుకున్నారు. వాస్తవానికి అయితే.. ఈ సంవత్సరం అక్టోబర్ లోనే జనసేనాని  యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. సంక్రాంతి తర్వాత ఏపీలో బస్సు యాత్ర చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అవడం గమనార్హం. మరో పక్కన ఏపీని అడ్డగోలుగా విభజించిందనే కోపంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పారు. అలాంటి పార్టీ ఒకటి ఉందనే ఏపీ లో ఆ పార్టీ పరిస్థితి తయారైంది.  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకునేందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కూడా పాదయాత్రకు  సిద్ధం అవుతున్నారు.   వచ్చే డిసెంబర్ నుంచి  రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్లు  శైలజానాథ్ ప్రకటించారు. ఏపీకి మేలు చేయడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అనేది శైలజానాథ్ చెబుతుండడం విశేషం. అందుకే తన పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు తాను అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళల్లో ఒక్కటంటే ఒక్క మేలు   కూడా చేయని బీజేపీ కూడా పాదయాత్ర చేసేందుకు ముందుకొస్తోంది. బీజేపీకి ఏపీలో ఓటింగ్ శాతం అతి తక్కువ.  గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సాయంతో కొన్ని అసెంబ్లీ సీట్లలో బీజేపీ గెలిచింది. అయినప్పటికీ ప్రజలకు ఆ పార్టీ వల్ల ఏమి ఒరిగింది అంటే గాల్లో లెక్కలు వేసుకోవాల్సిందే. అలాంటి బీజేపీ ఇప్పుడు ఏపీలో ఉనికి కోసం పాదయాత్ర చేస్తానంటోంది. కానీ.. మిగతా పార్టీల మాదిరి వ్యక్తిగత పాదయాత్ర కాదంటోంది. ఒక్కో ప్రాంతంలో కొందరు బీజేపీ నేతలు కలిసి రాష్ట్రం అంతా పాదయాత్రగా పర్యటిస్తామని ఆ పార్టీ నేత సత్యకుమార్ వెల్లడించారు. బీజేపీ పాదయాత్ర సంక్రాంతి తర్వాత ఆరు నెలల పాటు సాగుతుందని ఆయన తెలిపారు. ఏపీలో   పట్టణాల్లో అంతంత మాత్రంగా  బీజేపీకి ఉనికి ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ పెద్ద జీరో అని చెప్పొచ్చు. అందుకే పట్టణ ప్రాంత ఓటర్లను పాదయాత్ర సందర్భంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.ఈ ఏడాది చివరి నుంచి వచ్చే సంవత్సరం ఆఖరి దాకా ఏపీలో రాజకీయ పార్టీల పాదయాత్రలతో సందడిగా మారబోతోందనేది వాస్తవం.