సీబీఐ ఎందుకు? సిట్ చాలు.. ఎమ్మెల్యేల కొనుగోలుబేరసారాల కేసుపై హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు దర్యాప్తునకు సిట్ చాలని హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.  రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విచారణ సీబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తికి అప్పగించాలన్న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సరిపోతుందని హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో సిట్ దర్యాప్తు పైన హైకోర్టు ఆంక్షలు విధించింది.  దర్యాప్తు పూర్తయ్యే వరకూ వివరాలు బయటకు పొక్కకుండా చర్యలు తీసుకోవాలని సిట్ కు సూచించింది.  ఈ దర్యాప్తు వివరాలు మీడియా, రాజకీయ నాయకులు సహా ఎవరికీ లీక్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తి కాగానే నివేదికను హైకోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశించింది. అదే సమయంలో దర్యాప్తు పారదర్శకంగా జరగాలని పేర్కొంది. అలాగే దర్యాప్తును ఈ నెల 29 లోగా పూర్తి చేయాలని నిర్ణీత కాల వ్యవధిని నిర్దేశించింది. 

కృష్ణ భౌతిక కాయానికి చంద్రబాబు నివాళి

ఈ తెల్లవారు జామున కన్నుమూసీని సూపర్ స్టార్ కృష్ణ బౌతిక కాయానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. నానక్ మామ్ గూడలోని కృష్ణ నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించన వారిలో ఉన్నారు. అలాగే చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్,  కల్యాణ్ రామ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, మంచు విష్ణు తదితరులు కూడా కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.  ఇలా ఉండగా కృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో బుధవారం (అక్టోబర్ 16) మహాప్రస్థానంలో జరగనున్నాయ. కృష్ణ భౌతిక దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు రేపు మహాప్రస్థానంలో జరగనున్నాయి. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వెల్లడించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమర్ ను ఆదేశించారని తెలిపింది.  మరోవైపు కృష్ణ మృతి పట్ల కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సొంత సినిమా సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత కృష్ణదేనని అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా జనాదరణ పొందారని కొనియాడారు. మరోవైపు నానక్ రామ్ గూడలోని నివాసం వద్దకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు. కృష్ణను కడసారి చూసుకుని, నివాళి అర్పిస్తున్నారు.

గులాబి గూటికి ఈటల.. ఘర్ వాపసీయేనా?

ఈటల రాజేందర్ విషయంలో పొరపాటు చేశానని కేసీఆర్ ఫీలౌతున్నారా? మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత కేసీఆర్ ఈటల విషయంలో పనురాలోచనలో పడ్డారా? అంటే తెరాస శ్రేణులు ఔననే అంటున్నాయి. మునుగోడులో బీజేపీ తెరాసకు అంత గట్టి పోటీ ఇవ్వగలిగిందంటే అందుకు ఈటలే కారణమని కేసీఆర్ భావిస్తున్నారని తెరాస శ్రేణులు చెబుతున్నాయి. అందుకే కేసీఆర్ ఈటలను తెరాసలోకి ఆహ్వానించారని చెబుతున్నాయి. ఈ విషయంలో నిజానిజాల సంగతి అలా ఉంచితే తెరాసలో మాత్రం ఈటల తెరాస గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. మరో వైపు ఈటల కూడా కమలం గూటిలో ఇరుకుగా ఫీల్ అవుతున్నారనీ, తన కష్టానికి తగ్గ గుర్తింపు కాషాయం పార్టీలో రావడం లేదన్న భావనలో ఉన్నారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల మళ్లీ గులాబి గూటికి చేరుతారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ స్వయంగా ఈటలకు ఫోన్ చేసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారనీ, మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారనీ కూడా చెబుతున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికల ఫలితం కేసీఆర్ ఈటల విషయంలో పునరాలోచనలో పడేలా చేసిందన్నది మాత్రం వాస్తవమేననీ, జాతీయ రాజకీయాలపై తాను పూర్తిగా దృష్టి కేంద్రీకరించే ముందు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఈటల వంటి నాయకుడి అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారంటున్నారు. మరో వైపు ఈటల వైపు నుంచి చూస్తే.. ఆయన గురించి తెలిసిన వారెవరూ కమలం గూటిలో ఈటల స్వేచ్చగా ఉన్నారని కలలో కూడా భావించరు. అసలు ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చ కమలం తీర్థం పుచ్చున్నప్పుడే ఆయన రాజకీయ నేపథ్యం తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల కమలం పార్టీలో చేరడమేమిటి? చేరినా అక్కడ ఇమడగలుగుతారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. వారి అనుమానాలకు తగ్గట్టుగానే ఈటల కమలంలో చేరిన అనతి కాలంలోనే ఆయన అక్కడ ఇమడ లేకపోతున్నారనీ, ఉక్కపోతకు గురౌతున్నారన్న వార్తలు వినవచ్చాయి. అప్పట్లోనే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టనున్నారన్న ప్రచారమూ జోరుగా సాగింది. అప్పట్లో ఈటల సన్నిహితులు ఈ ప్రచారాన్ని కొట్టిపారేసినా ఈటల కమలం పార్టీలో ఇబ్బందిగానే కదులుతున్నారన్న ప్రచారానికి మాత్రం ఎప్పుడూ ఫుల్ స్టాప్ పడలేదు. బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల ఘన విజయం సాధించినా.. అది బీజేపీ ఖాతాలో కాకుండా ఈటల వ్యక్తిగత ఖాతాలోనే పడింది. నియోజకవర్గ ప్రజలే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ హుజూరాబాద్ లో ఈటల విజయం వెనుక ఉన్నది బీజేపీ అని భావించలేదు. ఈటల వ్యక్తిగత విజయంగానే దానిని అభివర్ణించారు.  టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో  విభేదించి, బహిష్కృతుడై బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. ఆ విజయంలో బీజేపీ పాత్ర దాదాపుగా శూన్యం అనే పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు.  ఈటల చేరిక వల్లే బీజేపీకి తెలంగాణ అసెంబ్లీలో మరోక స్థానం వచ్చి చేరిందన్నది వారి విశ్లేషణల సారాంశం. అయితే  ఆ విజయం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అసూయకు, భయానికి దారి తీసిందనీ, దీంతో ఈటల టాలెంట్ ను, పలుకుబడిని అండర్ ప్లే చేయడం మొదలైందని అప్పట్లోనే పలువురు సోదాహరణంగా చెప్పారు.  ఆ నేపథ్యంలోనే ఈటల కమలం పార్టీలో ఇమడ లేకపోతున్నారని పెద్ద చర్చ కూడా జరిగింది.  వ్యూహాత్మకంగానే  కమలం పార్టీలో ఈటలను ఏకాకిని చేశారనీ, అందుకే అప్పట్లోనే  గుర్తింపు లేని చోట  మౌనంగా సర్దుపోవడం ఎదుకన్నభావనతో పార్టీకి గుడ్ బై చెప్పేయాలన్న యోచనను  ఈటల తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారనీ కూడా చెబుతారు.   సరే ఇమడ లేక పోయినా సర్దుకు పోతూ కాషాయం గూటిలో కొనసాగుతున్న ఈటలకు ఇప్పుడు గులాబీ గూటి నుంచే ఆహ్వానం వచ్చిందంటున్నారు. అదీ స్వయంగా కేసీఆర్ నుంచే ఫోన్ వచ్చిందన్న సమాచారం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న తెరాస ఇప్పుడు ఈటలను గూలాబీ గూటిలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీకి తేరుకోలేని దెబ్బ కొట్టాలని భావిస్తోందంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో బీజేపీ ఒకింత డిఫెన్స్ లో ఉంది. ఈటలను గులాబి గూటికి చేర్చుకుంటే ఆ పార్టీని మరింత డిఫెన్స్ లో పడేయడమే కాకుండా ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని కూడా దెబ్బ తీయడమే తెరాస వ్యూహంగా కనిపిస్తోంది.   

సాహసానికి బ్రాండ్ అంబాసిడర్.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ హీరో కృష్ణ

కృష్ణ ఈ పేరు సాహసానికి బ్రాండ్ అంబాసిడర్. సంచలనాలకు మరో పేరు. అందరూ ఇప్పటికీ, ఎప్పటికీ ఆయనను సూపర్ స్టార్ అనే పిలుస్తారు. ఆయన నటుడిగా సాధించిన విజయాలకూ, తీసుకున్నసంచలన నిర్ణయాలకు జనం ఇచ్చిన బిరుదు. హీరో కృష్ణ తెలుగు చలన చిత్ర సీమకు, భారతీయ సినిమాకు చేసిన సేవలను పరిగణనలోనికి తీసుకుంటే.. ఆయన సినిమా నటుడు, నిర్మాత, స్టూడియో అధినేత, దర్శకుడు మాత్రమే కాదు.. అంతకు మించి అనిపించక మానదు. కృష్ణ సినీ రంగాన్ని సాంకేతికంగా పరిపుష్టం చేశారు. పరిశ్రమ పచ్చగా ఉండాలంటే సినిమాల షూటింగ్ లు నిర్విరామంగా సాగుతూనే ఉండాలని భావించారు. సినిమాల సంఖ్య పెరిగితేనే పరిశ్రమలో అందరికీ పుష్కలంగా పని దొరుకుతుందని విశ్వసించారు. ఆ విశ్వాసాన్నిఆచరణలో పెట్టి ఫలితం చూపించారు. అందు కోసం తాను స్వయంగా రోజుకు మూడు షిఫ్టులు పని చేసి పరిశ్రమ నిత్య కల్యాణం పచ్చ తోరణంగా పరిఢవిల్లేందుకు దోహదం చేశారు. సినీ పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణ. కౌబాయ్ చిత్రాలు, జేమ్స్ బాండ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది కృష్ణ. తొలి సినిమా స్కోప్ సినిమా నిర్మాత హీరో కృష్ణ, తొలి 70ఎంఎం సినిమా దర్శకుడు కృష్ణ. సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణ. రాజకీయంగా ఎన్టీఆర్ తో విభేదించి రాజకీయాలలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు.  ఒక కొత్త ప్రయోగం చేద్దామంటే ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ కృష్ణ మాత్రం అలా కాదు.. ఏదైనా అనుకున్నారంటే చేసి చూపించే వారు. ఆ విషయంలో ఎన్నికష్ట నష్టాలున్నా భరించేవారు. నిర్మాతల శ్రేయస్సే పరిశ్రమకు శ్రీరామరక్ష అని భావించిన కృష్ణ తనతో సినిమా చేసిన ఏ నిర్మాత అయినా నష్టపోతే.. ఆయనకు మరో సినిమాను ఉచితంగా చేసి ఆదుకున్న మంచి మనిషి.   తేనెమనసులు సినిమాతో తనతో పాటు చిత్ర పరిశ్రమకు పరిచయమైన  రామ్మోహన్ ను చివరి వరకూ ఆదుకున్న మంచి స్నేహితుడు ఆయన. కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అనడంలో సందేహం లేదు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతోంది తెలుగువన్.

జగన్ కు మోడీ అంటే వణుకు.. తెలంగాణ మంత్రి హేళన

సాధారణంగా పక్క రాష్ట్రం ప్రభుత్వంపై మరో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయదు. కానీ ఏపీ విషయంలో అలాంటి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణ మంత్రులకు తమ అభివృద్ధిని ఘనంగా చాటుకోవడానికి ఏపీ వైఫల్యాలను ఎత్తి చూపడం ఒక  అలవాటుగా మారిపోయింది. ఏపీలో జగన్ సర్కార్ నిష్క్రియాపరత్వం, పాలనా వైఫల్యాలపై వ్యాఖ్యలు చేయడంలో తెలంగాణ మంత్రులు పోటీలు పడుతున్నారు. ఎక్కడ లేని ఉత్సాహం చూపుతున్నారు.   ఇందుకు కారణం ఏపీ సర్కార్ పాలనా తీరు పట్ల వారికి ఉన్న చులకన భావనే కారణమని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ మంత్రులను విమర్శలకు దీటుగా సమాధానం చెబుదామంటే.. రోడ్ల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇక్కడ తమ ఘనతను చాటుకోవడానికి ఏమీ లేకపోవడం.. అదే సమయంలో పొరుగు రాష్ట్రం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలన్నీ వాస్తవాలు కావడంతో నోరెత్తడానికే ముందు వెనుకలాడే పరిస్థితి ఏపీ మంత్రులది పేర్కొంటున్నారు. అందుకే  తెలంగాణ మంత్రులకు ఏపీ అన్నా.. ఏపీ ప్రభుత్వమన్నా చులకనగా మాట్లడడానికి ఎక్కడ లేని ఉత్సాహం చూపుతున్నారు.    అయితే తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఏపీ పట్ల అత్యంత చులకన భావంతో వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఏపీ సీఎం జగన్ కు వణుకు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  .   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీకి వరుస షాకులు ఇస్తుంటే.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం మోడీకి భయపడి ఆయనక సాగిల పడుతున్నారని వ్యాఖ్యానించారు. మోడీ విశాఖలో పర్యటించినా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అదే మోడీ తెలంగాణ పర్యటనలో సింగరేణిని ప్రైవేటీకరించేది లేదన్నమాట అనాల్సిన పరిస్థితిని కేసీఆర్ తీసుకువచ్చారన్నారు.   సింగరేణి ప్రైవేటీకరణను మొదట్నుంచి వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో కేంద్రాన్ని ఎదుర్కొ న్నారని అందుకే ప్రధాని మోడీ తలొగ్గారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏపీలో అభివృద్ధి లేమి, ప్రజల కష్టాలను సర్కార్ పట్టించుకోకపోవడం, రోడ్ల దుస్థితి, పోలవరం నిర్మాణం వంటి పలు అంశాలపై తెలంగాణ మంత్రులు పలు సందర్భాలలో ఎగతాళి చేస్తూ మాట్లాడిన సంగతి విదితమే. అయితే ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలపైనా, నెలకొన్న సమస్యలపైనా హేళన చేస్తూ మాట్లాడటం తెలంగాణ మంత్రులకు ఇదే మొదటి సారి కాదు ఏపీలో రోడ్ల దుస్థితిపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు బదులు చెప్పలేక ఏపీ మంత్రులు నానా తంటాలూ పడ్డారు. అలాగే ఇటీవల హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తే.. ఏపీలో మాత్రం పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో.. అసలు పూర్తవుతుందో లేదో అన్న పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పొరుగున ఉన్న ఏపీ అన్ని రంగాలలోనూ తిరోగమనంలో పయనిస్తుంటే.. కొత్త రాష్ట్రం తెలంగాణ మాత్రం అన్ని రంగాలలోనూ పురోగమిస్తోందని తెరాస మంత్రులు పదే పదే చెబుతున్నారు. ఈ సారి అయితే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ నే టార్గెట్ చేస్తూ ఆయన వైఫల్యాలను ఎండగట్టారు. మోడీ అడుగులకు మడుగులొత్తుతూ రైతుల మెడకు ఉరితాళ్లు బిగించే లాంటి నిర్ణయం అయిన వ్యవసాయ మీటర్లకు మోటార్లను బిగించడానికి జగన్ సై అన్నారని వ్యాఖ్యనించారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడంలో కేసీఆర్ నిలువెత్తు ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటే మాత్రం జగన్ మోడీ అంటే వణికిపోతూ ఆయన ప్రజా వ్యతిరేక విధానాలకు వత్తాసు పలుకుతున్నారన్నారు.  తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకుండా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామనీ, అదే ఏపీలో  పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితి జగన్ సర్కార్ మోడీకి భయపడి  వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించిందని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు చకచక ఏర్పాట్లు జరుగుతుంటే అక్కడి జగన్ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుంటే.. తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకోవడమే కాకుండా ప్రైవేటీకరణ ప్రశక్తే లేదని మోడీ నోటితోనే అనిపించగలిగామని ధర్మాన చెప్పుకున్నారు. ఏపీలో ప్రభుత్వానికి కేంద్రం విధానాలను నిలదీసే దమ్ము లేదు కాబట్టే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మోడీ సర్కార్ ముందుకు వెళుతోందనీ, అదే తెలంగాణలో అయితే పార్లమెంటులో కేంద్ర బొగ్గు మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనకు భిన్నంగా సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని స్వయంగా మోడీ ప్రకటించాల్సి రావడమే.. కేంద్రం మెడలు వంచే తెరాస సర్కార్ సత్తాకు నిదర్శనమన్నారు.  

30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్?

 తలుపులు మూసి కొడితే.. పిల్లి కూడా తిరగబడుతుంది  అంటారు. ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేలు పరిస్థితి కూడా  అదే మాదిరిగా మారిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిన ప్రతిసారీ   జగన్ వారిపట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, వారినే తప్పుపడుతుండడం, వారి పనితీరుపై వ్యతిరేక సర్వే నివేదికలతో భవిష్యత్తులో సీట్లు ఇచ్చేది లేదని బెదిరింపులకు దిగుతుండడంపై వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల్లో తీవ్ర అసహనం వ్యక్తమౌతోందని అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తమకు   జగన్ సీటు ఇచ్చే ఛాన్స్ లేదని గట్టిగా భావిస్తున్న సిటింగ్ లు, ఒకవేళ వైసీపీ నుంచి సీటు వచ్చినా.. జగన్ సర్కార్ పై ఏపీ వ్యాప్తంగా పెల్లుబుకుతున్న వ్యతిరేకత కారణంగా ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు కనిపించని వారు గోడ దూకేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. తద్వారా అయినా తమ రాజకీయ భవిష్యత్తును సజీవంగా ఉంచుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు ప్రణాళికలు వేసుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే వారు వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. ఏ పార్టీలో చేరితే తమ భవిష్యత్తు బాగుంటుంది.. విజయావకాశాలు మెరుగవుతాయి అనే లెక్కలు   వేసుకుంటున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే.. వచ్చే డిసెంబర్ లో జరిగే వైసీపీ శిబిరంలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేల భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో టికెట్లు రావనుకుంటున్న వారు, ఒకవేళ టికెట్ వచ్చినా గెలిచే ఛాన్స్ లు తక్కువని భయపడుతున్నవారు, వైసీపీలో కంటే ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్నాయనుకుంటున్నవారు వైసీపీ బంధనం నుంచి ఎలా బయట పడాలా అని దిక్కులు చూస్తున్నారని తెలుస్తోంది. అలా పక్కదార్లు వెతుక్కుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 25 నుంచి 30  వరకు ఉంటుందంటున్నారు. దాంతో పాటు టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు పొడిస్తే.. ఇక తమ ఉనికికి గండం తప్పదని భయపడుతున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారంటున్నారు. అయితే.. ఏయే ఎమ్మెల్యేలు వైసీపీని వదిలిపెట్టేస్తారు..? అలాంటి వారి కోసం ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేసే పార్టీలు ఏవి అనే అంశాలపై వైసీపీ అధినాయకత్వం గట్టి నిఘాయే పెట్టిందంటున్నారు.  వైసీపీ నుంచి ఎవరెవరు పార్టీ ఫిరాయిస్తారు అనే దానిపై జగన్ రెడ్డి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా కీలక సమాచారం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ గోడ దూకి బయటి పార్టీల వైపు చూసే ఎమ్మెల్యేలు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా ఉంటారని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఆ జిల్లాల్లో టీడీపీ, జనసేన పార్టీ దేనికదే బలంగా ఉండడమే కారణం అంటున్నారు. ఈ రెండు పార్టీ మధ్య పొత్తు కుదిరితే వచ్చే ఎలక్షన్ వార్ లో విజయం వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దాంతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి కూడా పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు ప్రత్యర్థి పార్టీలతో నిరంతరం టచ్ లో ఉంటున్నారని, వైసీపీని వదిలిపెట్టేసినా తమ స్థానానికి భంగం కలగకుండా చూసుకుంటున్నారంటున్నారు. మొత్తం మీద ఏపీలో రాజకీయాలు రసవత్తర ఘట్టానికి చేరుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర!

సింగరేణి నిర్వీర్యం చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక వైపు సింగరేణిని ప్రైవేటు పరం చేయబోమని చెబుతూనే మరో వైపు గనులు దక్కకుండా చేయడానికి కుట్రలు చేస్తోంది. సింగరేణికి బొగ్గుగనులు దక్కకుండా చేయాలన్న లక్ష్యంతోనే వాటిని వేలం ద్వారా కార్నొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రకు తెరతీసిందని తెరాస ఆరోపిస్తోంది. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానేఈ ఏడాది ఆగస్టు 10న  నిర్వహించిన వేలం పాటలో ఔరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సత్తుపల్లిలోని కోయలగూడెం – lll కోల్ బ్లాక్ ను అప్పగించిందని తెరాస మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేసి, నిర్వీర్యం చేసి చంపేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.   ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థకు కోల్ బ్లాక్స్ ఇవ్వకుండా వేలం పాట వేయడంలో దాగి ఉన్న మర్మం ఏమిటో స్పష్టం చేయాలని కేంద్రాన్ని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కోల్ బ్లాక్స్ లేకుండా సింగరేణి సంస్థ ఏం చేయాలి అని కేంద్రం భావిస్తోందని నిలదీశారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సుమారు 50,000 మంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డున పడవేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపన్నిందని వినోద్ కుమార్ విమర్శించారు. ప్రైవేటీకరణ లేదంటూనే  వ్యూహాత్మకంగా కోల్ బ్లాక్స్ వేలం వేసి సింగరేణి సంస్థను నీరు గార్చుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోల్ బ్లాక్స్ ను సింగరేణి సంస్థకు అప్పగించాలని.. కోల్ బ్లాక్స్ ను వేలం వేసే పనులకు స్వస్తి పలకాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయబోమని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూనే.. మరోవైపు కోల్ బ్లాకులను వేలం వేయడం ద్వారా సింగరేణి సంస్థకు ఆ కోల్ బ్లాకులు దక్కకుండా ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించుతున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు.   రాష్ట్రంలో 82 కోల్ బ్లాకులు ఉండగా, అందులో సింగరేణి సంస్థ 40 కోల్ బ్లాకులను వినియోగిస్తున్నదని వినోద్ కుమార్ తెలిపారు. మిగిలిన 42 కోల్డ్ బ్లాకులను కూడా సింగరేణి సంస్థకు అప్పగించాలని  డిమాండ్ చేశారు.మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం తాము కోల్ బ్లాకులను వేలం వేస్తున్నామని, బహిరంగ వేలంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో సింగరేణి సంస్థ పోటీపడి వాటిని దక్కించుకోవాలని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అటు పార్లమెంటు నిండు సభలో, ఇటు బహిరంగ ప్రకటన ద్వారా పదేపదే చెబుతున్నారని, దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర నాయకులు జవాబు చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. 

బలవంతపు మత మార్పిళ్లు సీరియస్ అంశమే.. సుప్రీం

బలవంతపు మత మార్పిళ్లు సీరియస్ అంశమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.  దేశంలో కొన్ని చోట్ల జరుగుతున్న బలవంతపు మత మార్పిళ్లపై   చాలా తీవ్రమైన అంశమని, వాటిని గుర్తించి నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని సూచించింది. బలవంతపు మతమార్పిళ్లను అరికట్టకపోతే  దేశంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొంది. .దేశంలో బలవంతపు, మోసపూరిత మత మార్పిళ్లను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన   జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.   దేశ భద్రత, మత స్వేచ్ఛను ప్రభావితం చేసే సమస్యగా బలవంతపు మత మార్పిళ్లను పేర్కొంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు చేపట్టాలి సుప్రీం సూచించింది. బలవంతపు మతమార్పిళ్లను అరికట్టేందుకు కేంద్రం చర్యలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

దర్యాప్తు సంస్థలతో రాజకీయ పబ్బం!

తెరాస, బీజేపీలు పోటీలు పడి మరీ రాజకీయాలు చేస్తున్నాయా? ఇందు కోసం దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడుగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ నేతలు టార్గెట్ గా ముందుకు సాగుతుంటే.. తెరాస సర్కార్ కూడా సిట్ ఏర్పాటు చేసి బీజేపీ నేతలను టార్గెట్ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు దర్యాప్తునకు తెలంగాష సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కూడా దూకుడు పెంచి బీజేపీ నేతలే టార్గెట్ గా ముందుకు సాగుతోంది. అదే సమయంలో ఐటీ దాడులకు దీటుగా తెలంగాణ సర్కార్ రాష్ట్ర జీఎస్టీ దాడులతో బదులిస్తోంది. ఔను ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తున్న చర్చ ఇదే. లిక్కర్ స్కాం విషయంలో ఐటీ, ఈడీ, సీబీఐ దాడులను, అరెస్టులను రాజకీయ కక్ష సాధింపు గానే భావిస్తున్న తెలంగాణ సర్కార్ తానూ అదే బాట పట్టిందా అనిపించేలా ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోనికి వచ్చిన వెంటనే బీజేపీ నేతలు కల్వకుంట్ల కుటుంబం లక్ష్యంగా విమర్శలు గుప్పించి.. కేసీఆర్ తనయ కవితను టార్గెట్ చేశారు.    ఆ కేసులో .. సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. కవితకు సన్నిహితుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఆమె మాజీ కార్యదర్శి అరెస్టయ్యారు.  దీంతో తెరాస సర్కార్ కూడా దూకుడు పెంచింది. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు వ్యవహారంలో బీజేపీ నేతలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు సాగుతోందని అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని తెలంగాణ సర్కార్ చాలా తీవ్రంగా తీసుకుందనడానికి  ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రాష్ట్రం దాటి వెళ్లి కూడా దర్యాప్తు సాగిస్తోంది.మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా హైలైట్ చేయాలన్న కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం కేసీఆర్ జాతీయ పార్టీకి దేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకువచ్చేందుకు దోహదం చేస్తుందంటున్నారు.   

ఐసీసీ బెస్ట్ టీమ్ లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచకప్‌ 2022 ముగిసిన మరుసటి రోజే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)  అత్యంత ఆటగాళ్లతో కూడిన బెస్ట్ టీమ్ ప్రకటించింది. ఆ జట్టులో భారత నుంచి కింగ్ కోహ్లీకి, 360 డిగ్రీల ఆటగాడిగా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్ కు చోటు లభించింది. మొత్తం ఆరు దేశాలకు చెందిన ఆటగాళ్లకు ఈ జట్టులో అవకాశం  దక్కింది.   ఐసీసీ బెస్ట్ టీమ్ కు ఇంగ్లండ్ కెప్టెన్ వికెట్ కీపర్ , ఓపెనర్ జోస్‌ బట్లర్‌ను కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. ఈ బెస్ట్ టీమ్ కు జొస్ బట్లర్‌, అలెక్స్ హేల్స్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌)లకు అవకాశం దక్కింది. అలాగే ఆల్‌రౌండర్లు  సికందర్‌ రజా (జింబాబ్వే), షాదాబ్‌ ఖాన్‌ (పాకిస్తాన్‌)లకు ఛాన్స్ లభించింది. ఇక బౌలర్లు  సామ్‌ కరన్, అన్రిచ్‌ నోర్జ్ (దక్షిణాఫ్రికా), మార్క్‌ వుడ్‌ (ఇంగ్లండ్), షాహీన్‌ అఫ్రిది (పాకిస్తాన్‌)లకు ఐసీసీ బెస్ట్ జట్టులో అవకాశం అభించింది. ఇక హార్ధిక్‌ పాండ్యా  12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు

సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూశారు.   శ్వాస సంబంధిత సమస్యలతో గత కొంత కాలంగా బాధపడుతున్న కృష్ణ ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్‌ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆదివారం నవంబర్ 14)ఆర్ధరాత్రి  దాటిన కృష్ణ ఆరోగ్యం విషమించడంతో  హుటాహుటిన ఆయన కుమారుడు మహేశ్​బాబు   కృష్ణను గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయన్ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్​ నిర్వహించారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.ఆ తర్వాత వైద్యులు ప్రెస్​మీట్​ పెట్టి.. కృష్ణ హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు. మరో రెండు రోజులు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమని స్పష్టత ఇచ్చారు. అయితే మంగళవారం(నవంబర్ 15) తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 1943, మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో  ఘట్టమనేని శివరామకృష్ణ (కృష్ణ) జన్మించారు. 1960లో ఏలూరు సి.ఆర్‌.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ డిగ్రీ పట్టాను అందుకున్నారు.  వెండి తెరపై నటుడిగా   ‘కొడుకులు కోడళ్ళు’ చిత్రంతో అవకాశం వచ్చినా ఆ సినిమా ఆగిపోయింది.  ‘తేనె మనసులు’ కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్‌ యాడ్‌ చూసి ఆడిషన్‌కి వెళ్ళి ఎంపికయ్యారు శివరామ కృష్ణ. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి చిత్రంతోనే నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత ఆయన చిత్రపరిశ్రమలో రికార్డులు సృష్టించే హీరోగా ఎదిగాు. ఒక్కో ఏడాది దాదాపు పదికిపైగా చిత్రాలు విడుదల అయ్యాయి. రోజుకి మూడు షిప్ట్‌ల చొప్పున బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. నిర్మాతల హీరోగా పేరొందిన కృష్ణని అభిమానులు  ‘సూపర్‌స్టార్‌’ అని పిలుచుకుంటారు. 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించిన సూపర్ స్టార్. ఆయన మృతితో తెలుగుచిత్ర సీమ శోక సంద్రంలో మునిగిపోయింది.

లింకులు బయటపడుతున్నాయి!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డికి వైసీపీ అగ్రనాయకత్వంతో అనుబంధం చిన్నదేమీ కాదు. శరత్ చంద్రారెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయితో చుట్టరికం ఉందని మాత్రమే ఇంత కాలం అనుకుంటూ వచ్చాం. కానీ విజయసాయితో చుట్టరికానికి ముందే ఆయనకు వైఎస్ జగన్ తో అనుబంధం ఉంది. ఎలా అంటే  జగన్ అక్రమాస్తుల కేసులో శరత్ చంద్రారెడ్డి కూడా సహ నిందితుడు. ఆ అనుబంధంతోనే శరత్ చంద్రారెడ్డికి జగన్ ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి దక్కేలా చేశారు. ఔను పీనపాక శరత్ చంద్రరెడ్డి ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు. జగన్ తో అసోసియేషన్ కారణంగానే ఆయనా పదవి దక్కిందన్న విమర్శలు ఉన్నాయి. వీరిరువురి మధ్యా అసోసియేషన్ జగన్ అక్రమాస్తుల కేసులో శరత్ చంద్రారెడ్డి కూడా ఒక నిందితుడు అవ్వడంతోనే అర్ధమౌతుంది. ఆయనే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏపీలో అరబిందో ఎన్నో ప్రాజెక్టులు దక్కించుకుంది.   అంబులెన్స్ కాంట్రాక్ట్ కూడా అరబిందోకే దక్కింది.   అలాగే అధికార బలం అండతో  ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌నూ అద్యక్షపదవీ దక్కివంది. తన అల్లుడి సోదరుడు అయిన శరత్ చంద్రారెడ్డి జగన్ అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఏసీఏ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన అధ్యక్షుడయ్యాకే  ఏసీఏ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.  దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఆ కుంభకోణానికి ఏపీతో లింకులు ప్రస్ఫుటమయ్యాయి.   ఈ స్కామ్ కు సంబంధించి   ఈడీ అరెస్టు చేసింది.  అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డిని, వినయ్ కుమార్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిరువురినీ  ఢిల్లీలో రెండు రోజుల పాటు విచారించి ఆ తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అరబిందో శరత్ చంద్రారెడ్డి, వినయ్ కుమార్ లకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారాలతో సంబంధాలున్నాయని ఈడీ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు కావడంతో ఆ సెగ తాడేపల్లి ప్యాలస్ కు తగిలింది. దీంతో సకల శాఖల మంత్రి సజ్జల రంగంలోకి దిగి శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడు కాదనీ, ఆయన సోదరుడనీ చెబుతూ.. సోదరుడి అక్రమాలతో విజయసాయి అల్లుడికి ఏం సంబంధం అని మీడియా ముఖంగా చెప్పారు. అయితే ఏ సంబంధం, అనుబంధం లేకుండానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పదవిని శరత్ చంద్రారెడ్డికి కట్టబెట్టారా?  ఏ సంబంధం లేకుండానే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ1, ఎ2తలో పాటు శరత్ చంద్రారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. లిక్కర్ స్కాం దర్యాపులో ఈ లింకులు ఎంత వరకూ ఉన్నాయో బహిర్గతమయ్యే అవకాశం ఉంి.

గుజరాత్ ఫలితంపై మోడీ భయానికి కారణమదేనా? చాపకింద నీరులా విస్తరిస్తోందన్న హెచ్చరిక అందుకేనా?

గుజరాత్ లో కాంగ్రస్ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోందా? మోడీని తిట్టకుండా, మొట్ట కుండా, ఒక మాటైనా అనకుండా, గ్రామీణ ప్రాంతాలలో సైలెంట్’గా ప్రచారం సాగిస్తోందా? అంటే, అవుననే అంటున్నారు. అది కూడా ఎవరో కాదు, స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలని తమ పార్టీ  నాయకులు, కార్యకర్తలను హెచ్చరించారు. అయితే ఆయన అలా ఎందుకు అన్నారు? మాటకు ముందు.. మాటకు వెనుకా కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అనే ప్రధాని మోడీ.. తన సొంత రాష్ట్రం గుజరాత్ విషయంలో కాంగ్రెస్ పుంజుకుంటోందని ఎందుకు గాభరా పడుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ కొత్త పంథాలో గ్రామీణ ప్రాంతాలో సైలెంట్’గా నిశ్శబ్ద విప్లవానికి పావులు కదుపుతోంది, తస్మాత్ జాగ్రత్త అని మోడీ హెచ్చరించారు. అయితే, నిజంగా గుజరాత్ లో కాంగ్రెస్ బలం పుంజుకుంటోందా? వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? లేక బీజేపీకి రియల్ త్రెట్ గా భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కు అక్ష్సిజన్ అందించే ప్రయత్నం మోడీ చేస్తున్నారా? ఎవరి వ్యూహం ఏమిటి అంటే, ఎవరి వ్యూహాలు వారికుంటాయి, అంటున్నారు విశ్లేషకులు.వివరాలోకి వెళితే ... రాజకీయ పార్టీల సిద్ధాంతాలు ఏవైనా, అధికారం తప్ప అసలు వేరే సిద్ధాంతాలే లేని పార్టీలే అయినా, ఎన్నికల వ్యూహాలు,వ్యూహ కర్తలు అయితే ఉంటారు. సహజంగానే,రాజకీయ పార్టీలు వ్యూహాలు, ఎత్తుగడలను ఎప్పటి కప్పుడు మార్చుకుంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతాయి. (అఫ్కోర్స్ పిడివాదం వదలని కమ్యూనిస్టులు ఉంటారనుకోండి అది వేరే విషయం.) అయితే   అందులోనూ,ఎన్నికలు జరుగుతోంది, ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ అయి ప్పుడు వ్యూహ ప్రతి వ్యూహాలు ఎంత పదునుగా ఉంటాయో వేరే చెప్పనక్కరలేదు.    డిసెంబర్ మొదటి వారంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే,   అక్కడ ఎన్నికల వేడి పతాక  స్థాయికి చేరుకుంది. కానీ అంతకు ముందే ప్రధాని మోడీ గుజరాత్ లో బీజేపీ హవా తగ్గందన్న సంగతిని గుర్తించేశారు. ఆప్ కాదు కాంగ్రెస్సే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి సవాల్ విసురుతున్నదని గ్రహించేశారు. అందుకే ఆయనతో సహా బీజేపీ అగ్ర నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల షెడ్యూల్ కు ముందే విమర్శలను లెక్క చేయకుండా వేల కోట్ల  రూపాయల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనాలు చేసేశారు.  రాష్ట్రంలో ఇప్పటికే వరసగా ఐదుసార్లు విజయ సాధించిన బీజేపీ ఆరో గెలుపుకోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతోంది. నిజానికి, గుజరాత్ లో మళ్ళీ గెలుపు బీజీపీదే అని ప్రీ పోల్ సర్వేలు, కోడై కూస్తున్నాయి.అంతే కాదు, కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన 77 సీట్లలో సగం కూడా ఈసారి రావని, బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి, స్పష్టమైన భారీ మెజారిటీతో  మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రీ పోల్ సర్వేలు చెప్పాయి.  అయినా, ప్రధాని మోడీ, పార్టీ క్యాడర్  ను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పని పోయిందని, అనుకోవద్దని, కొత్త పంథాలో,కొత్త వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ కదులుతోందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తనను దూషించడం మానేసిందని, గ్రామీణ ఓట్లను సొంతం చేసుకోవడం కోసం నిశ్శబ్దంగా పని చేసుకుంటోందని చెప్పారు. ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే, నిజంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే భయం మోడీని వెంతడుతోందా?అంటే, తాజాగా ఎస్ఏఎస్ గుజరాత్ లో  చేసిన సర్వే ఫలితం చూస్తే ఔననక తప్పదు. మరోవంక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకుందని,అందుకే రాహుల్ గాంధీ భారత్ జోడు యాత్రలో, గుజరాత్ ను చేర్చలేదని మీడియాలో కథనాలు వెలువడినా కాంగ్రెస్ పుంజుకుంటోంది తస్మాత్ జాగ్రత్త అని మోడీ క్యాడర్ ను   హెచ్చరించారు హెచ్చరించడానికి కారణమేమిటో ఇప్పుడు అందరికీ అర్ధమపోయింది.  ఇప్పడు రాజకీయ, మీడియా వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.  నిజానికి మోడీ,షా జోడీ మార్క్ రాజకీయాలను గమనిస్తే, ప్రత్యర్ధుల బలహీనత కంటే, బలం పైనే దృష్టి పెడతారని అంటారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూక్తిని పాటిస్తారని అంటారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ మోడీ జోలికి వెళ్ళక పోయినా, మోడీ మాత్రం కాంగ్రెస్’ పార్టీని  టార్గెట్ చేయడం వెనక,(మన కేసీఆర్ భాషలో చెప్పాలంటే, నువ్వు గోకినా గోకకపోయిన నేను గోకుతూనే ఉంటా అన్నట్లుగా) రాష్ట్రంలో చురుగ్గా అడుగులు వేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని కట్టడి చేసే వ్యూహం ఉందని గతంలో  పరిశీలకులు విశ్లేషించారు.అయతే మోడీ రాజకీయ ఎత్తుగడగా కాంగ్రెస్ పుంజుకుంటోందన్న అనలేదనీ, గుజరాత్ లో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను ఆయన అందరి కంటే ముందే గుర్తించారని ఎస్ ఎ ఎస్ సర్వే వెల్లడైన తరువాతే అందరికీ అర్ధమైంది. ఇంతకీ  వరుసగా  గుజరాత్ లో అధికారాన్ని నిలుపుకుంటూ వస్తున్న బీజీపీకి ఈ సారి మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురు కాక తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందంటున్నాయి. రంగంలో ఆప్ ఉండటంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యమైన పరిస్థితుల్లో తాజాగా  శ్రీ ఆత్మసాక్షి (ఎస్ఎఎస్)  సర్వే ఫలితాలు పట్టణ ప్రాంతాలకే ఆప్ ప్రభావం పరిమితమైందని తేల్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల అంటే డిసెంబర్ 1,5 తేదీలలో రెండు ధఫాలుగా జరగనున్న సంగతి విదితమే. ఈ ఎన్నికలలో బీజేపీ- కాంగ్రెస్ ల మధ్య హోరా హోరీ పోరు జరగనుందని ఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. అయితే పట్టణ ప్రాంతాలలో కాంగ్రెస్ అవకాశాలపై ఆమ్ఆద్మీ పార్టీ తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నప్పటికీ గ్రామీణప్రాంతాలలో మాత్రం కాంగ్రెస్ పై చేయి సాధించడం ఖాయమని సర్వే తేల్చింది. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ కంటే కాంగ్రెస్ కు 4.5 నుంచి 5 శాతం ఓట్లు అధికంగా వస్తాయని పేర్కొంంది.  ప్రధానంగా సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ లలో బీజేపీ అభ్యర్థులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ఎస్ఎఎస్ సర్వే పేర్కొంది.  నిరుద్యోగ యువత, రైతులు, మత్స్య కారులు,  ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 94 నుంచి 98 స్థానాలలో  బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నప్పటికీ.. ఎన్నికల ప్రక్రియ కొనసాగే క్రమంలో రాష్ట్రంలో బీజేపీ తన ఓట్ల శాతాన్ని గణనీయంగా కోల్పోయే అవకాశాలు ప్రస్ఫుటుంగా కనిపిస్తున్నాయని సర్వే పేర్కొంది. బీజేపీలో మరో సారి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆకాంక్షసులభ సాధ్యం అయితే కాదని సర్వే ఫలితం వెల్లడించింది. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ పార్టీల వాగ్దానాలు జనంలోకి వెళ్లిపోయాయనీ, అయితే ఇతర పార్టీలతో పోలిస్తే క్షేత్ర స్థాయిలో  బీజేపీ కేడర్ కు ప్రభావమంతమైన క్యాడర్ ఉండటం ఒక్కటే ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని సర్వే పేర్కొంది. అయితే గ్యాస్, పెట్రోల్, డీజిల్ధరలపెరుగుదల, నిరుద్యోగం,  లోపభూయిష్టంగా విద్యా సంస్థల పని తీరు,  33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 8 మంది మంత్రులకు టికెట్లు నిరాకరిండం వంటి అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం బీజేపీకి దాదాపు 6.25 శాతం మందిని ఓట్లను దూరం చేసే అవకాశం  ఉందంటున్నారు. కాగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య త్రిముఖ పొరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉండగా.. గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖీ పోరే జరుగుతుందని సర్వే వివరించింది.  48 అసెంబ్లీ స్థానాలున్న సౌరాష్ట్ర ప్రాంతంలో  బీజేపీ  కేవలం 11 నుంచి15స్థానాలలోనే విజయం సాధించే అవకాశాలున్నాయనీ, అదే కాంగ్రెస్22నుంచి23 స్థానాలలోనూ, ఆప్ మూడు నుంచి నాలుగు స్థానాలలోనూ గెలుపు అవకాశాలున్నాయనిఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. మరో 6స్థానాలలో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నట్లు  సర్వే తేల్చింది.

కేరళ సీఎంకు హైకోర్టు షాక్.. రాష్ట్ర వర్సిటీ చాన్సలర్ నియామకం రద్దు

కేరళలో గవర్నర్, సీఎం మధ్య విభేదాలు రోజు రోజుకూ తీవ్రమౌతున్నాయి.  స్టేట్ యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు సోమవారం(నవంబర్ 14)  కొట్టివేసింది. దీంతో పినరయి విజయన్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలినట్టయింది. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ రిజి జాన్‌ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ నియమాకం చట్ట విరుద్ధమని, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్  నిబంధనలకు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కొత్త వైస్ ఛాన్సలర్‌ నియామకం చేపట్టాల్సిందిగా ఛాన్సలర్ ఆఫ్ యూనివర్శిటీస్‌ (అంటే గవర్నర్ )ను ఆదేశించింది.   గత నెలలో ప్రభుత్వం చేపట్టిన తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్ల నియామకాలు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వారిని తమ పదవి నుంచి దిగిపోవాల్సిందిగా చాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ హోదాలో గవర్నర్ ఆదేశించిన సంగతి విదితమే. దీంతో కేరళ యూనవిర్శిటీల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మొదలైంది.  విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించి, దానిపై సంతకం చేయడానికి గవర్నర్‌కు పంపింది. ఇది తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ అని, తనకు తానుగా తీర్పు చెప్పలేనందున రాష్ట్రపతికి పంపిస్తానని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు. అలాగే  స్టేట్ వర్సిటీ చాన్సలర్ గా గవర్నర్ ను తొలగిస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి.. ఆ వెంటనే కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ రిజి జాన్‌ ను నియమించింది. ఇప్పుడు ఆ నియామకమే చెల్లదంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ డిసెంబర్ 12కు వాయిదా

డ్రైవర్ డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ బెయిలు పిటీషన్ విచారణను సుప్రీం కోర్టు డిసెంబర్ 12కు వాయిదా వేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన అనంతబాబును వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అనంతబాబు తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ బెయిలు పిటిషన్ సోమవారం (జులై 14) విచారణకు వచ్చింది. అనంతబాబు బెయిలు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం, హతుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసు జారీ చేసి, విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. ఇప్పటికే అనంత బాబు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను రాజమహేంద్ర వరం కోర్టు, హైకోర్టు తిరస్కరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే అనంతబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన హత్య కేసుపై అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే అదే సమయంలో ఈ పిటిషన్ విచారణలో భాగంగా తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు... రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృత దేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు మే 23వ తేదీ నుంచి రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి విదితమే. అసలు ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం మృతదేహం చూడగానే అది హత్యేనని ఎవరికైనా ఇట్టే అర్దమైపోతుంది. కానీ పోలీసులకు మాత్రం పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకూ అది హత్యేనన్న అనుమానమే రాలేదు. అందుకే మృతదేహాన్ని అనంతబాబు స్వయంగా తన కారులో హతుడి ఇంటి వద్దకు తీసుకువచ్చి కారు వదిలేసి పరారైనా..పోలీసులకు ఆయనను అరెస్టు చేయాలన్న ఆలోచనే రాలేదు. కనీసం ఆయనను నిందితుడిగా ప్రకటించడానికి కూడా నోరు రాలేదు. చివరకు పోస్టుమార్టం రిపోర్టులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం అరెస్టుకు గురయ్యాడని తేలినా అరెస్టు జోలికి వెళ్లకుండా అనంతబాబు పరారీలో ఉన్నారంటూ ప్రకటించారు.   ఈ లోగా ఎమ్మెల్సీ అనంతబాబు మృతుడి కుటుంబ సభ్యులపై బెదరింపులకు పాల్పడ్డారు. ప్రలోభాలకు గురి చేశారు. వాటన్నిటికీ లొంగకుండా కుటుబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేినా పోలీసులు పట్టించుకోలేదు.చివరాఖరికి అనంతబాబు స్వయంగా లొంగిపోవడంతో ఆయన అరెస్టు చూపారు. ఆ తరువాత చార్జిషీటు దాఖలు చేయడంలోనూ పోలీసులు అలవిమాలిన జాప్యం చేశారు. 

తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరోలా.. మోడీ నాలుకకు రెండు వైపులా పదునే!

తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల పాటు పర్యటించిన ప్రధాని మోడీ తన రాజకీయ చతురతను చాటుకున్నారు. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా మాట్లాడి తన నాలుకకు రెండు వైపులా పదునేనని రుజువు చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ యేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం విధానాలతో విభేదిస్తోంది. విభజన చట్టంలోని హామీలను ఇంకా పరిష్కరంచకపోవడంపై నిలదీస్తోంది. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా గళమెత్తడమే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాలలో కూడా మోడీని ఢీ కొనేందుకు కసరత్తుతు చేస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓటమే ధ్యేయంగా అడుగులు వేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపి మోడీకి నేరుగా సవాల్ విసిరేందుకు సిద్ధమౌతున్నారు. ఇక ఏపీలో జగన్ సర్కార్ విషయానికి వస్తే.. విభజన హామీలను ప్రస్తావించదు. అప్పులకు అనుమతులిస్తే చాలని వేడుకొంటోంది. అడుగులకు మడుగులొత్తుతోంది. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలకు జనం  రాకపోయినా.. ప్రధాని మోడీ సభ కోసం శ్రమించి, బెదరించి మరీ జనసమీకరణ చేసింది. పోలవరం ప్రాజెక్టు గురించి నోరెత్తి అడిగిన సందర్భం లేదు. విశాఖ ప్రైవేటైజేషన్ కు అభ్యంతరం చెప్పదు. సరిగ్గా ఈ తేడాయే మోడీ తెలుగు రాష్ట్రాల పర్యటన సందర్బంగా ఆయన ప్రసంగంలో ప్రతిధ్వనించింది. తొలుత ఏపీలో పర్యటించిన ఆయన ఏపీ ప్రభుత్వంపై చిన్న పాటి విమర్శ కూడా చేయలేదు. అలాగని అంత సాగిలపడిన ప్రభుత్వంపై కూసింత జాలి చూపి రాష్ట్రానికి ఏమైనా వరాలు ప్రకటించారా? అంటే అదీ లేదు. ఆయన పర్యటన విశాఖ సెంట్రిక్ గా జరిగింది కనుక విశాఖ జనాలకు తెలిసిన విశాఖ చరిత్ర చెప్పి నగరాన్ని ప్రస్తుతించి.. ప్రస్తుతానికింతే అని చెప్పకనే చెప్పారు. మోడీ ప్రసంగానికి ముందు జగన్ తెలుగులోనే మాట్లాడినా బోలెడు వినతులు, విజ్ణప్తులు చేశారు. ఆయన భాష మోడీకి అర్ధం కాదు. ఆంగ్లంలో మాట్లాడితే అర్ధమై నొచ్చుకుంటారేమోనన్న భయమే జగన్ తన ప్రసంగం తెలుగులో చేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తన ప్రసంగంలో  మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. జగన్ సమక్షంలోనే తాను మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించానని చెప్పడానికే ఆ ప్రసంగం పనికొచ్చింది కానీ మోడీ నుంచి దానిపై ఎటువంటి స్పందనా రాలేదు. ఇదీ మోడీ పర్యటన ఏపీలో సాగిన తీరు.. రాష్ట్రానికి ఎటువంటి వరాలూ కురిపించలేదు, పన్నెత్తి మాట్లాడలేదు. వచ్చారు.. వెళ్లారు అంతే. ఇక అదే తెలంగాణ విషయానికి వచ్చే సరికి ఆయన ప్రసంగం పూర్తిగా రాజకీయ విమర్శలకు నెలవుగా మారింది. తనపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తిట్లు తిని చాయ్ తాగండి అంటూ సెటైర్లు వేశారు. అవినీతికి, అవినీతి నాయకులకూ చరమగీతం తప్పదని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రస్తావించి బీజేపీ కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వాన్ని వణికించారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన ఫలితాలను సాధించడానికి ఇది నాంది పలికిందని పేర్కొన్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వ  వైఖరికి ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల మధ్య కమలం వికసించడం ప్రారంభమవుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యామిలీ ఫస్ట్ అనే సూత్రంతో పని చేస్తోందని మండిపడ్డారు. తాము మాత్రం పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో పని చేస్తోన్నామని, ఈ రెండు పార్టీల మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు.   ఇక సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రశక్తే లేదని విస్పష్టమైన హామీ ఇచ్చారు. అదే ఏపీలో జనం పోరాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయవద్దని జనం కోరుతున్నా పట్టించులేదు. ఏపీలో రాజకీయ లబ్ధి లేదు కనుక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేనట్లుగా వ్యవహరించిన మోడీ... తెలంగాణలో అధికార ఆకాంక్ష తో సింగరేణిపై హామీ ఇచ్చారు.  తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన ఆయన ఏపీ పట్ల ఏమీ పట్టని వైఖరిని ప్రదర్శించి.. తెలంగాణలో రాజకీయ లబ్ధి ఆకాంక్షించి విమర్శలు గుప్పించారు. హామీలిచ్చారు. 

కాంగ్రెస్ మాజీ ఎంపీ టీ. సుబ్బరామిరెడ్డిపై దివాళా పిటిషన్లు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డిపై దివాళా పిటిషన్లు దాఖలయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మేరకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్ సిఎల్ టి) హైదరాబాద్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది.   గాయత్రి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పేరుమీద తీసుకున్న రుణానికి సంబంధించి హామీదారుగా టి.సుబ్బరామిరెడ్డి ఉన్నారు. దివాలా ప్రక్రియ ప్రారంభించి రుణాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎమ్) ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.  అలాగే సుబ్బరామిరెడ్డి భార్య ఇందిరా సుబ్బరామిరెడ్డి, బంధువులు, సన్నిహితులు టి.సరితారెడ్డి, టి.వి.సందీప్ రెడ్డి, జె.సుశీలారెడ్డి, జి.సులోచన, జి.శివకుమార్ రెడ్డి తదితరులపై వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. గాయత్రి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.600 కోట్లకుపైగా రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలమైంది.  రుణాలు ఇచ్చిన సంస్థలు, కంపెనీ నిర్వహణకు రుణమిచ్చిన సంస్థలు వాటి రికవరీ కోసం ఎన్ సీఎల్ టీని ఆశ్రయించాలి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.400 కోట్లకుపైగా, ఎస్‌బీఐ నుంచి రూ.240 కోట్లకుపైగా ఈ సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐలు దాఖలు చేసిన పిటిషన్లపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ జ్యుడిషియల్‌ సభ్యులు డాక్టర్‌ బి.ఎన్‌.వి.రామకృష్ణ, సాంకేతిక సభ్యులు సత్యరాజన్‌ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది.  అగ్రశ్రేణి నిర్మాణ  సంస్థల్లో ఒకటైన గాయత్రి ప్రాజెక్ట్స్ ఇటీవలి కాలంలో ప్రభ కోల్పోయింది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. సుబ్బరామిరెడ్డి నిర్మాతగా సినీ రంగంలో కూడా ఓ వెలుగు వెలిగారు. అగ్ర కథా నాయకులతో, నాయికలతో పలు సినిమాలు నిర్మించారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా సినీ పరిశ్రమ మొత్తం కదిలి వచ్చేది. అయితే ఇదంతా గతం. ఇటీవలి కాలంలో గాయత్రి ప్రాజెక్ట్స్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగే టీ. సుబ్బరామిరెడ్డి ఇటీవలి కాలంలో పెద్దగా బయట కనిపించడం లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. తాజాగా ఆయనపై (ఎన్ సిఎల్ టి) లో దివాళా పిటిషన్లు దాఖలయ్యాయి.

పవన్ కళ్యాణ్ కు మోడీ రోడ్ మ్యాప్.. అదేనా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో రోడ్ మ్యాప్ అడుగుతున్నా మిత్ర పార్టీ బీజేపీ పెద్దల నుంచి పెద్దగా స్పందన కనిపించేది కాదు. ఇదే విషయాన్ని ఇటీవల జనసేన పార్టీ నేతలు, శ్రేణులతో మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ కాస్త గట్టిగానే ప్రస్తావించారు. అయితే.. ఇటీవల ప్రధాని మోడీ విశాఖలో పర్యటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పీఎంఓ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. అలాగే.. బీజేపీ కోర్ కమిటీ కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ కు కేవలం పది నిమిషాల సమయం ఇచ్చినప్పటికీ.. అరగంటకు పైగా ఆయనతో మోడీ చర్చలు జరపడం విశేషం. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేసేందుకు టీడీపీ-జనసేన-బీజేపీలతో కలిపి ఉమ్మడి విపక్షం ఏర్పాటు కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఉమ్మడి విపక్షానికి బదులు జనసేన-బీజేపీతో కూడిన పరిమిత విపక్షాన్ని బలోపేతం చేయాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చారని అంటున్నారు. అందుకేనేమో మోడీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విపక్షం విషయంలో మౌనం వహిస్తున్నట్లు కనిపిస్తోందని ఏపీలో తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. మోడీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో అరగంటకు పైగా చేసిన చర్చలే ప్రధాని విశాఖపట్నం పర్యటనలో కీలకంగా మారాయంటున్నారు. విశాఖలో తన తొలి రోజు పర్యటనలో పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. తర్వాతి రోజు మోడీ టూర్ లో గవర్నర్, సీఎం జగన్ కనిపించారు. విశాఖలో తొలిరోజు పర్యటనను మోడీ రాజకీయ చర్చలతో ప్రారంభించారు. తద్వారా తన ప్రాధాన్యతలు ఏమిటో మోడీ చెప్పకనే చెప్పారంటున్నారు. రెండో రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ గడిపారు. అంటే.. ఏపీలో మోడీ పర్యటనలో రాజకీయ పార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటన్నది స్పష్టం చేశారంటున్నారు. వైజాగ్ లో తన పర్యటనను పోలీసుల ద్వారా అడ్డుకున్న వైసీపీ సర్కార్ తీరుతో  పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రవేశాలకు గురయ్యారు. విశాఖ నుంచి మంగళగిరి వచ్చిన పవన్ కళ్యాణ్ వైసీపీ  నేతలు, మంత్రులకు చెప్పు చూపించి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ఏపీలో తీవ్ర సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సభ తరువాత విజయవాడలో బస చేసిన హొటల్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన-బీజేపీలతో బలమైన ఉమ్మడి ప్రతిపక్షం ప్రతిపాదన చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉత్సాహానికి ప్రధాని మోడీ తన రూట్ మ్యాప్ ద్వారా బ్రేక్ వేశారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. నిజానికి టీడీపీ-జనసేన-బీజేపీలతో ఏర్పడిన ఉమ్మడి విపక్షం అయితే.. అధికార వైసీపీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించవచ్చనే అభిప్రాయాలు  సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి టీడీపీతో పొత్తు గురించి ఆలోచించవద్దని, బీజేపీ-జనసేన మాత్రమే కలిసి ముందుకు వెళ్లాలని, వచ్చే ఎన్నికల నాటికి అవసరం, అవకాశాన్ని బట్టి టీడీపీతో పొత్తు విషయం చూద్దామని పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ చెప్పినట్లు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందువల్లే పవన్ కళ్యాణ్ నిరుత్సాహం కలిగిందంటున్నారు. మోడీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మాటల్లో ఆ నిరుత్సాహమే కనిపించిందంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండానే  వెళ్లిపోయారంటున్నారు. అందుకే మోడీతో సమావేశం సందర్భంగా తమ మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలు చెప్పకుండా పవన్ మౌనం వహించారంటున్నారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో మోడీ ప్రత్యేకంగా భేటీ అవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. జనసేనను ఓ రాజకీయ పార్టీగా గుర్తించబోమని చెబుతున్న వైసీపీ సర్కార్ కు పవన్ కు అంత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మోడీ గట్టి ఝలక్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గుజరాత్ లో పుంజుకున్న కాంగ్రెస్.. బీజేపీకి గడ్డు కాలమేనా?

వరుసగా ఆరు దఫాలుగా గుజరాత్ లో అధికారాన్ని నిలుపుకుంటూ వస్తున్న బీజీపీకి ఈ సారి మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురు కాక తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందంటున్నాయి. రంగంలో ఆప్ ఉండటంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యమైన పరిస్థితుల్లో తాజాగా  శ్రీ ఆత్మసాక్షి (ఎస్ఎఎస్)  సర్వే ఫలితాలు పట్టణ ప్రాంతాలకే ఆప్ ప్రభావం పరిమితమైందని తేల్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల అంటే డిసెంబర్ 1,5 తేదీలలో రెండు ధఫాలుగా జరగనున్న సంగతి విదితమే. ఈ ఎన్నికలలో బీజేపీ- కాంగ్రెస్ ల మధ్య హోరా హోరీ పోరు జరగనుందని ఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. అయితే పట్టణ ప్రాంతాలలో కాంగ్రెస్ అవకాశాలపై ఆమ్ఆద్మీ పార్టీ తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నప్పటికీ గ్రామీణప్రాంతాలలో మాత్రం కాంగ్రెస్ పై చేయి సాధించడం ఖాయమని సర్వే తేల్చింది. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ కంటే కాంగ్రెస్ కు 4.5 నుంచి 5 శాతం ఓట్లు అధికంగా వస్తాయని పేర్కొంంది.  ప్రధానంగా సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ లలో బీజేపీ అభ్యర్థులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ఎస్ఎఎస్ సర్వే పేర్కొంది.  నిరుద్యోగ యువత, రైతులు, మత్స్య కారులు,  ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 94 నుంచి 98 స్థానాలలో  బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నప్పటికీ.. ఎన్నికల ప్రక్రియ కొనసాగే క్రమంలో రాష్ట్రంలో బీజేపీ తన ఓట్ల శాతాన్ని గణనీయంగా కోల్పోయే అవకాశాలు ప్రస్ఫుటుంగా కనిపిస్తున్నాయని సర్వే పేర్కొంది. బీజేపీలో మరో సారి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆకాంక్షసులభ సాధ్యం అయితే కాదని సర్వే ఫలితం వెల్లడించింది. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ పార్టీల వాగ్దానాలు జనంలోకి వెళ్లిపోయాయనీ, అయితే ఇతర పార్టీలతో పోలిస్తే క్షేత్ర స్థాయిలో  బీజేపీ కేడర్ కు ప్రభావమంతమైన క్యాడర్ ఉండటం ఒక్కటే ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమనిసర్వే పేర్కొంది. అయితే గ్యాస్, పెట్రోల్, డీజిల్ధరలపెరుగుదల, నిరుద్యోగం,  లోపభూయిష్టంగా విద్యా సంస్థల పని తీరు,  33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 8 మంది మంత్రులకు టికెట్లు నిరాకరిండం వంటి అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం బీజేపీకి దాదాపు 6.25 శాతం మందిని ఓట్లను దూరం చేసే అవకాశం  ఉందంటున్నారు. కాగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య త్రిముఖ పొరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉండగా.. గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖీ పోరే జరుగుతుందని సర్వే వివరించింది.  48 అసెంబ్లీ స్థానాలున్న సౌరాష్ట్ర ప్రాంతంలో  బీజేపీ  కేవలం 11 నుంచి15స్థానాలలోనే విజయం సాధించే అవకాశాలున్నాయనీ, అదే కాంగ్రెస్22నుంచి23 స్థానాలలోనూ, ఆప్ మూడు నుంచి నాలుగు స్థానాలలోనూ గెలుపు అవకాశాలున్నాయనిఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. మరో 6స్థానాలలో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నట్లు  సర్వే తేల్చింది.