డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ తొలగింపు.. కేరళ సీఎం సంచలనం
posted on Nov 11, 2022 6:13AM
వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ ఆ విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. మూడు దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు గవర్నర్, ఆ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య విభేదాలు ఘర్షణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శల స్థాయికి దిగజారాయి.
గవర్నర్ వ్యవస్థను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలు రోజు రోజుకూ తీవ్రమౌతున్న సంగతి విదతమే. పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి బీజేపీ యేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షాణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణలలో గవర్నర్ల తీరు పట్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో అయితే గవర్నర్ తమిళిసై, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. గవర్నర్ తమిళి సై విలేకరుల సమావేశాలు నిర్వహించి మరీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఇక తమిళనాడులో స్టాలిన్ సర్కార్ అయితే ఆ రాష్ట్ర గవర్నర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. కేరళ ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం వర్సటీ నియమనిబంధనలను కూడా మార్చింది. కేరళ గవర్నర్ మహ్మద్ ఆరిఫ్ ఖాన్ కొద్ది రోజుల కిందట రాష్ట్రంలోని వైస్ చాన్సలర్ లందరూ రాజీనామా చేయాలంటూ వర్సిటీల చాన్సలర్ హోదాలో ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని వర్సిటీలపై గవర్నర్ పెత్తనం అవసరం లేదని చెబుతూ వస్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపిన యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ బిల్లుపై సంతకం చేయకుండా తన వద్దే పెండింగ్ ఉంచుకుని ఈ బిల్లుపై క్లారిఫికేషన్ ఇవ్వాలనీ, రాజ్ భవన్ కు వచ్చి తనతో చర్చించాలని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై ప్రభుత్వానికి హుకుం జారీ చేశారు.
బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్ లు బీజేపీ ప్రతినిథులుగా పని చేస్తున్నారనీ, రాజ్ భవన్ లను కాషాయ కార్యాలయాలుగా మార్చేస్తున్నారనీ విమరలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ సీఎం పినరయ్ విజయన్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు యూనివర్సిటీ నిబంధనలను ప్రభుత్వం మార్చింది. వర్సటీ చాన్సలర్ గా గవర్నర్ ను తొలగిస్తున్నట్లు గురువారం ప్రభుత్వ ప్రకటన వెలువడింది. చాలా కాలంగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పినయర్ సర్కార్ మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రభుత్వం, గవర్నర్ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. బుధవారం ఈ విమర్శలు ఒకింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అంతే కేరళ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ను డీమ్డ్ వర్సిటీ పదవి నుంచి తొలగిస్తు గురువారం కేరళ సర్కార్ ప్రకటించింది. తాజాగా డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తొలగిస్తూ కేరళ సీఎం పినరయ్ విజయన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇదే ఒరవడిని అనుసరించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.