మోడీ వల్లే టి20లో టీమ్ ఇండియా ఓటమా..ఇవేం విమర్శలు.. ఆపండ్రా!
posted on Nov 10, 2022 @ 11:22PM
మోడీ వల్లే టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా కప్ గెలుచుకోలేదట. అసలు మోడీ అధికారంలోకి వచ్చాకా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిందే లేదట. అదే కాంగ్రెస్ హయాంలో అయితే 1983,2007, 2011
లలో వరల్డ్ కప్, 2103లో చాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇండియా గెలిచిందంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
మోకాలికీ, బోడి గుండుకీ ముడిపెట్టి విమర్శలు చేయడం రాజకీయాలలో కొత్తేం కాదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చంద్రబాబు అధికారంలో ఉండగా వర్షాలు పడలేదనీ, వరుస కరువుతో రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయనీ విమర్శించడమే కాకుండా తమ ప్రభుత్వం రావడంతోనే పుష్కలంగా వర్షాలు పడుతున్నాయనీ వరుణ దేముడికి తమపై ప్రేమ ఉందనీ వ్యాఖ్యలు చేస్తూ కరువుకూ, చంద్రబాబు సర్కార్ కూ ముడి పెట్టి విమర్శలు చేయడం తెలిసిందే.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా అయిన దానికీ కాని దానికీ తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఆడ లేక మద్దలు ఓడు అన్నట్లు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఈ ఆర్థిక సంక్షోభానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకాల వల్లే ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తోందంటూ ఎదురుదాడికి దిగుతున్న సంగతీ విదితమే.
అయితే క్రీడల్లో జయాపజయాలకూ రాజకీయాలకూ ముడిపెట్టి విమర్శలకు దిగడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో అన్ని ఐసీసీ టోర్నీలలో విజేతగా నిలిచిన టీమ్ ఇండియా మోడీ హయాంలో మాత్రం ఒక్క ట్రోఫీని గెలవలేదంటూ మోకాలికీ బోడి గుండుకీ ముడిపెట్టి విమర్శలు చేస్తున్నారు.