సామూహిక అత్యాచారం కేసులో ప్రభుత్వ మాజీ సీఎస్ అరెస్టు
posted on Nov 11, 2022 9:17AM
మృగళ్ల మగ దాష్టీకం సమాజంలో అంతకంతకూ పెరిగిపోతున్నది. మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో ఉన్నత విద్యావంతులూ, ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్లో ఉన్నవారూ కూడా ఉండటం విద్య వారికి నేర్పిన సంస్కారం ఏమిటన్న అనుమానాలకు తావిస్తోంది.
అండమాన్ నికోబార్ మాజీ సీఎస్ జితేంద్ర నారాయణ్ సామూహిక అత్యాచారం కేసులో అరెస్టు కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభ పెట్టి తనను ఇంటికి పిలిపించుకున్న నారాయణ్, మరి కొందరు ఉన్నతాధికారులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఈ కేసు దర్యాప్తు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ మూడు సార్లు మాజీ సీఎష్ నారాయణ్ ను ప్రశ్నించింది. అరెస్టు అనివార్యమని తెలుసుకున్న నారాయణ్ ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయతే సర్వోన్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టులోనే బెయిలు పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో ట్రయల్ కోర్టును బెయిల్ కోసం ఆశ్రయించిన నారాయణ్ కు అక్కడ చుక్కెదురైంది.