కేరళ సీఎంకు హైకోర్టు షాక్.. రాష్ట్ర వర్సిటీ చాన్సలర్ నియామకం రద్దు
posted on Nov 14, 2022 @ 4:22PM
కేరళలో గవర్నర్, సీఎం మధ్య విభేదాలు రోజు రోజుకూ తీవ్రమౌతున్నాయి. స్టేట్ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు సోమవారం(నవంబర్ 14) కొట్టివేసింది. దీంతో పినరయి విజయన్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలినట్టయింది. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ రిజి జాన్ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది.
ఈ నియమాకం చట్ట విరుద్ధమని, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కొత్త వైస్ ఛాన్సలర్ నియామకం చేపట్టాల్సిందిగా ఛాన్సలర్ ఆఫ్ యూనివర్శిటీస్ (అంటే గవర్నర్ )ను ఆదేశించింది. గత నెలలో ప్రభుత్వం చేపట్టిన తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్ల నియామకాలు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వారిని తమ పదవి నుంచి దిగిపోవాల్సిందిగా చాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ హోదాలో గవర్నర్ ఆదేశించిన సంగతి విదితమే.
దీంతో కేరళ యూనవిర్శిటీల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మొదలైంది. విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించి, దానిపై సంతకం చేయడానికి గవర్నర్‌కు పంపింది. ఇది తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ అని, తనకు తానుగా తీర్పు చెప్పలేనందున రాష్ట్రపతికి పంపిస్తానని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు.
అలాగే స్టేట్ వర్సిటీ చాన్సలర్ గా గవర్నర్ ను తొలగిస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి.. ఆ వెంటనే కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ రిజి జాన్ ను నియమించింది. ఇప్పుడు ఆ నియామకమే చెల్లదంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది.