సీబీఐ ఎందుకు? సిట్ చాలు.. ఎమ్మెల్యేల కొనుగోలుబేరసారాల కేసుపై హైకోర్టు
posted on Nov 15, 2022 @ 2:09PM
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు దర్యాప్తునకు సిట్ చాలని హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విచారణ సీబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తికి అప్పగించాలన్న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది.
ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సరిపోతుందని హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో సిట్ దర్యాప్తు పైన హైకోర్టు ఆంక్షలు విధించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకూ వివరాలు బయటకు పొక్కకుండా చర్యలు తీసుకోవాలని సిట్ కు సూచించింది.
ఈ దర్యాప్తు వివరాలు మీడియా, రాజకీయ నాయకులు సహా ఎవరికీ లీక్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తి కాగానే నివేదికను హైకోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశించింది. అదే సమయంలో దర్యాప్తు పారదర్శకంగా జరగాలని పేర్కొంది. అలాగే దర్యాప్తును ఈ నెల 29 లోగా పూర్తి చేయాలని నిర్ణీత కాల వ్యవధిని నిర్దేశించింది.