తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరోలా.. మోడీ నాలుకకు రెండు వైపులా పదునే!
posted on Nov 14, 2022 @ 2:58PM
తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల పాటు పర్యటించిన ప్రధాని మోడీ తన రాజకీయ చతురతను చాటుకున్నారు. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా మాట్లాడి తన నాలుకకు రెండు వైపులా పదునేనని రుజువు చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ యేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం విధానాలతో విభేదిస్తోంది. విభజన చట్టంలోని హామీలను ఇంకా పరిష్కరంచకపోవడంపై నిలదీస్తోంది. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా గళమెత్తడమే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాలలో కూడా మోడీని ఢీ కొనేందుకు కసరత్తుతు చేస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓటమే ధ్యేయంగా అడుగులు వేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపి మోడీకి నేరుగా సవాల్ విసిరేందుకు సిద్ధమౌతున్నారు. ఇక ఏపీలో జగన్ సర్కార్ విషయానికి వస్తే.. విభజన హామీలను ప్రస్తావించదు.
అప్పులకు అనుమతులిస్తే చాలని వేడుకొంటోంది. అడుగులకు మడుగులొత్తుతోంది. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలకు జనం రాకపోయినా.. ప్రధాని మోడీ సభ కోసం శ్రమించి, బెదరించి మరీ జనసమీకరణ చేసింది. పోలవరం ప్రాజెక్టు గురించి నోరెత్తి అడిగిన సందర్భం లేదు. విశాఖ ప్రైవేటైజేషన్ కు అభ్యంతరం చెప్పదు. సరిగ్గా ఈ తేడాయే మోడీ తెలుగు రాష్ట్రాల పర్యటన సందర్బంగా ఆయన ప్రసంగంలో ప్రతిధ్వనించింది. తొలుత ఏపీలో పర్యటించిన ఆయన ఏపీ ప్రభుత్వంపై చిన్న పాటి విమర్శ కూడా చేయలేదు. అలాగని అంత సాగిలపడిన ప్రభుత్వంపై కూసింత జాలి చూపి రాష్ట్రానికి ఏమైనా వరాలు ప్రకటించారా? అంటే అదీ లేదు. ఆయన పర్యటన విశాఖ సెంట్రిక్ గా జరిగింది కనుక విశాఖ జనాలకు తెలిసిన విశాఖ చరిత్ర చెప్పి నగరాన్ని ప్రస్తుతించి.. ప్రస్తుతానికింతే అని చెప్పకనే చెప్పారు.
మోడీ ప్రసంగానికి ముందు జగన్ తెలుగులోనే మాట్లాడినా బోలెడు వినతులు, విజ్ణప్తులు చేశారు. ఆయన భాష మోడీకి అర్ధం కాదు. ఆంగ్లంలో మాట్లాడితే అర్ధమై నొచ్చుకుంటారేమోనన్న భయమే జగన్ తన ప్రసంగం తెలుగులో చేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తన ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. జగన్ సమక్షంలోనే తాను మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించానని చెప్పడానికే ఆ ప్రసంగం పనికొచ్చింది కానీ మోడీ నుంచి దానిపై ఎటువంటి స్పందనా రాలేదు. ఇదీ మోడీ పర్యటన ఏపీలో సాగిన తీరు.. రాష్ట్రానికి ఎటువంటి వరాలూ కురిపించలేదు, పన్నెత్తి మాట్లాడలేదు. వచ్చారు.. వెళ్లారు అంతే.
ఇక అదే తెలంగాణ విషయానికి వచ్చే సరికి ఆయన ప్రసంగం పూర్తిగా రాజకీయ విమర్శలకు నెలవుగా మారింది. తనపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తిట్లు తిని చాయ్ తాగండి అంటూ సెటైర్లు వేశారు. అవినీతికి, అవినీతి నాయకులకూ చరమగీతం తప్పదని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రస్తావించి బీజేపీ కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వాన్ని వణికించారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన ఫలితాలను సాధించడానికి ఇది నాంది పలికిందని పేర్కొన్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వ వైఖరికి ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల మధ్య కమలం వికసించడం ప్రారంభమవుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యామిలీ ఫస్ట్ అనే సూత్రంతో పని చేస్తోందని మండిపడ్డారు. తాము మాత్రం పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో పని చేస్తోన్నామని, ఈ రెండు పార్టీల మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు.
ఇక సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రశక్తే లేదని విస్పష్టమైన హామీ ఇచ్చారు. అదే ఏపీలో జనం పోరాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయవద్దని జనం కోరుతున్నా పట్టించులేదు. ఏపీలో రాజకీయ లబ్ధి లేదు కనుక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేనట్లుగా వ్యవహరించిన మోడీ... తెలంగాణలో అధికార ఆకాంక్ష తో సింగరేణిపై హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన ఆయన ఏపీ పట్ల ఏమీ పట్టని వైఖరిని ప్రదర్శించి.. తెలంగాణలో రాజకీయ లబ్ధి ఆకాంక్షించి విమర్శలు గుప్పించారు. హామీలిచ్చారు.