కాంగ్రెస్ మాజీ ఎంపీ టీ. సుబ్బరామిరెడ్డిపై దివాళా పిటిషన్లు
posted on Nov 14, 2022 @ 1:40PM
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డిపై దివాళా పిటిషన్లు దాఖలయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మేరకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్ సిఎల్ టి) హైదరాబాద్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది.
గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరుమీద తీసుకున్న రుణానికి సంబంధించి హామీదారుగా టి.సుబ్బరామిరెడ్డి ఉన్నారు. దివాలా ప్రక్రియ ప్రారంభించి రుణాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎమ్) ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. అలాగే సుబ్బరామిరెడ్డి భార్య ఇందిరా సుబ్బరామిరెడ్డి, బంధువులు, సన్నిహితులు టి.సరితారెడ్డి, టి.వి.సందీప్ రెడ్డి, జె.సుశీలారెడ్డి, జి.సులోచన, జి.శివకుమార్ రెడ్డి తదితరులపై వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.600 కోట్లకుపైగా రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలమైంది. రుణాలు ఇచ్చిన సంస్థలు, కంపెనీ నిర్వహణకు రుణమిచ్చిన సంస్థలు వాటి రికవరీ కోసం ఎన్ సీఎల్ టీని ఆశ్రయించాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.400 కోట్లకుపైగా, ఎస్‌బీఐ నుంచి రూ.240 కోట్లకుపైగా ఈ సంస్థలు రుణాలు తీసుకున్నాయి.
ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐలు దాఖలు చేసిన పిటిషన్లపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ జ్యుడిషియల్ సభ్యులు డాక్టర్ బి.ఎన్.వి.రామకృష్ణ, సాంకేతిక సభ్యులు సత్యరాజన్ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది. అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఒకటైన గాయత్రి ప్రాజెక్ట్స్ ఇటీవలి కాలంలో ప్రభ కోల్పోయింది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. సుబ్బరామిరెడ్డి నిర్మాతగా సినీ రంగంలో కూడా ఓ వెలుగు వెలిగారు.
అగ్ర కథా నాయకులతో, నాయికలతో పలు సినిమాలు నిర్మించారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా సినీ పరిశ్రమ మొత్తం కదిలి వచ్చేది. అయితే ఇదంతా గతం. ఇటీవలి కాలంలో గాయత్రి ప్రాజెక్ట్స్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి.
అలాగే టీ. సుబ్బరామిరెడ్డి ఇటీవలి కాలంలో పెద్దగా బయట కనిపించడం లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. తాజాగా ఆయనపై (ఎన్ సిఎల్ టి) లో దివాళా పిటిషన్లు దాఖలయ్యాయి.