యాంగర్.. ఎమోషన్.. ఇన్స పిరేషన్.. చంద్రబాబులో కొత్త డైమన్షన్స్!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సరికొత్త డైమన్షన్స్  తో జనం మధ్యకు వచ్చారు. ఇంతకు ముందు కన్నా చంద్రబాబు మాటల్లో మంచి ఫైర్ కనిపిస్తోంది. చెప్పాల్సిన విషయం జనం గుండెలను సూటిగా తాకేలా చెబుతున్నారు. సీఎం జగన్ రెడ్డిపై నిశితంగా విమర్శలు చేస్తూనే.. పదునైన మాటల తూటాలు పేలుస్తున్నారు. జగన్ పాలనా విధానాలను తూర్పారపడుతూనే.. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏమిచేస్తామనేది క్లియర్ గా చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో చంద్రబాబులో ఈ సరికొత్త యాంగిల్ స్పష్టంగా కనిపిస్తోందని జనం అంటున్నారు. చంద్రబాబు తాజాగా మాట్లాడుతున్న మాటల్ని చూస్తే.. ఆయనలో ఇంత ఫైర్ గతంలో ఎప్పుడూ చూడలేదని జనం ఆశ్చర్యపోతున్నారు.  జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపితే తప్ప ఏపీకి.. రాష్ట్ర ప్రజలకు మోక్షం లేదు. రాష్ట్రానికి వైసీపీ దొంగలు చేసిన అన్యాయం మర్చిపోతామా?  అంటూ   నిప్పులు చెరుగుతున్నారు.  నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే.. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే. రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించక తప్పదు. లేదంటే నేను అసెంబ్లీ వెళ్లలేను  అని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం ప్రజలకు ఎంత అవసరమో  సూటిగా ప్రజల హృదయాలకు హత్తుకునేలా చెబుతుండడం గమనార్హం.  నా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో నన్ను అవమానించే సాహసం ఎవరూ చేయలేదు. కానీ.. జగన్ సారథ్యంలోని వైసీపీ సభ్యులు అసెంబ్లీ సాక్షిగా నన్ను.. నా సతీమణిని అవమానించారు.   అది గౌరవసభ కాదు.. కౌరవసభ. మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ఆ రోజు చెప్పాను. నేను అసెంబ్లీ వెళ్లాలంటే.. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే.. రేపు జరిగే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నా’ అని చంద్రబాబు చేసిన అప్పీల్ ప్రజలను కదిలించేదిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించి కోలుకోకుండా చేస్తా.. పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇచ్చారనే కక్షతో రోడ్ల విస్తరణ పేరుతో గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లన్నీ కూలగొట్టారు. ఎంత కొవ్వెక్కితే.. ఇలాంటి దుర్మార్గాలకు దిగుతారు? నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డుపై తిరిగేవారా? ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందర్నీ కలుపుకుని వెళ్లాం. ఓట్లు వేయటం మీ ఇష్టం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సీనియర్ నాయకుడిగా నా బాధ్యత’ వచ్చే ఎన్నికల్లో టీడీపీని మీరు గెలిపించి, అసెంబ్లీకి పంపిస్తే సరి.. లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక’ అని చంద్రబాబు అంటూ.. ఎన్నడూ లేని విధంగా ఎమోషనల్ అవడంతో ప్రజలు కదిలిపోయారు. ‘జగన్ ఇచ్చేది గోరంత.. దోచేసేది కొండంత. జగన్ రెడ్డీ మీ నాన్నను చూశా.. మీ తాతను చూశా.. నీకు భయపడతానా..? నేను ఎవరికీ భయపడను’ అంటూ జగన్ కు చంద్రబాబు స్పష్టమైన హెచ్చరిక చేయడం విశేషం. ‘ఏపీలో భూ బకాసురుడిని, నరరూప రాక్షసుడిని కట్టడి చేయాలి.. లేదంటే ఎవరినీ వదిలిపెట్టడు’ అని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు స్పష్టమైన సూచన చేశారు. ‘రాష్ట్రంలో రోడ్ల గుంతల్లో గంపెడు మట్టి వేయని జగన్ రెడ్డి మూడు రాజధానులు కడతానంటే ఎలా నమ్మాలి?’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘జగన్ కు పాలించడం చేతకాదు. నియంతలా మారాడు. అండర్ వరల్డ్ డాన్ దావూడ్ ఇబ్రహీంను మించిపోయాడు. మద్యం తయారీ కేంద్రాలన్నీ జగన్ వే.. ఆరు వేల స్కూళ్లను మూసేశాడు. ఒక్క టీచర్ పోస్లు కూడా భర్తీ చేయలేదు. రాయలసీమకు ఒక్క పరిశ్రమను కూడా తేలేదు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడు’ అని చంద్రబాబు ప్రజలను హెచ్చరించడమే కాకుండా, ‘తన బాబాయ్ వివేకానందరెడ్డిని చంపి, నారాసుర రక్త చరిత్ర అని వాళ్ల పేపర్లో రాశారు. తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లింది. జగన్ ఏలుబడిలో ఉన్న ఏపీలో తనకు న్యాయం జరగదని, కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పోరాటం చేస్తోంది. ఆమెకు మనమంతా అండగా నిలబడదామ’ని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎప్పుడైనా.. ఎక్కడైనా సందర్భానికి అనుగుణంగా, వివరణాత్మకంగా మాట్లాడతారనే పేరుంది. అలాంటి చంద్రబాబులో కర్నూలు జిల్లా పర్యటనలో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకున్న తీరు, కొత్త తరహాలో మాట్లాడుతున్న వైనం బాగా ఆకట్టుకుంటోంది.

తెలంగాణలో ముందస్తు ఖాయం.. మార్చి తరువాత ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దు

‘ముందస్తు ముచ్చటే లేదు.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు’ ఇటీవల తెరాస విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు. అంటే రాష్ట్రంలో ముందస్తు ప్రశక్తే లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. పూర్తి కాలం మనం అధికారంలోకి ఉంటాం అని పార్టీ శ్రేషులకు విస్పష్టంగా చెప్పేశారు కేసీఆర్. ఆయన అంత స్పష్టంగా చెప్పినా ఆ మాటలను పార్టీ శ్రేణులు నమ్మడం లేదు. ఆ మాటల వెనుక ఉన్న అర్ధం వేరని రాజకీయ వర్గాలు సైతం భాష్యం చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్  ఒక మాట మాట్లాడారంటే, ఆ మాటకు అర్థాలు, అంతరార్ధాలు, టీకా  తాత్పర్యాలు ఇలా చాలానే ఉంటాయని పార్టీలో సీనియర్ నాయకులే అంటున్నారు. అలాగే ఇప్పుడు ముందస్తు లేదు అని ఖచ్చితంగా చెప్పేశారంటే.. ఆ మాటల వెనుక అర్ధాలు చాలానే ఉంటాయన్న చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. కేసీఆర్ చెప్పింది చేయరనీ, చేసేది చెప్పరనీ పార్టీ వర్గాలే కాదు రాజకీయ వర్గాలు కూడా అంటుంటాయి. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ముందస్తు ముచ్చటే లేదన్న కేసీఆర్ మాటల వెనుక నిగూఢార్థం ఉందని అంటున్నారు. వారి అంచనాకు తగ్గట్టుగానే కేసీఆర్  తీసుకుంటున్నచర్యలు, ప్రకటిస్తున్నపథకాలు, వేస్తున్న అడుగులూ అన్నీ కూడా ఎన్నికల దిశగానే వేగంగా సాగుతున్నాయి. ఆయన తాజాగా మరోసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు, వచ్చే జనవరి 18 నుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ల జోళ్లు అందించాలని నిర్ణయించారు. అలాగే ఇటీవల నూతన సచివాలయ నిరాణాన్ని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునే విధంగా సచివాలయానికి ఎదరుగా అమర వీరుల స్థూపం నిర్మాణం జరుగుతోందని చెప్పి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ను స్పృశించారు. ఇటువంటి పథకాలు, ప్రారంభోత్సవాలు, సెంటిమెంట్ రగిల్చే చర్యలను కేసీఆర్ సరిగ్గా ఎన్నికల ముందే చేపడతారని గత అనుభవాలు చెబుతున్నాయి. 2018 ఎన్నికల ముందు కూడా కేసీఆర్ ఆర్భాటంగా కంటివెలుగు వంటి కార్యక్రమాలను చేపట్టిన సంగతి విదితమే. అప్పట్లోనే విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పినప్పటికీ ఎన్నికల అనంతరం ఆ ఊసే ఎత్తేలేదు. ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా ఆయన కంటి వెలుగు రెండో విడతను తెరమీదకు తీసుకురావడంతో ఆయన ఎన్నికల సన్నాహాలు ప్రారంభించేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అలాగే సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం గురించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణం గురించి చెప్పడం ప్రజలలో ఉద్యమ సెంటిమెంట్ రగల్చడానికేనని చెబుతున్నారు. ఇక పరిశీలకులు కూడా కేసీఆర్ ముందస్తుకే అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తియన తరువాత మార్చిలో ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం వరకూ సాధ్యమైనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించి, ప్రారంభించి ప్రజాదరణను ప్రోది చేసుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ వ్యూహానికి అనుగుణంగానే తెరాస ఎన్నికల సన్నాహాలలో ముగినిపోయిందని చెబుతున్నారు. అంతే కాకుండా కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలపై ఇప్పటికే పూర్తి అవగాహన ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికల సన్నాహాలు మొదలెట్టేశాయి. అయితే బడ్జెట్ తరువాత ఏ క్షణంలోనైనా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు నగారా మోగించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అసెంబ్లీ రద్దైన వెంటనే ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది. అసెంబ్లీ రద్దైన ఆరు నెలల లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. సో ఎన్నికల నిర్వహణకు సీఈసీ ఆరు నెలల వ్యవధినీ పూర్తిగా ఉపయోగించుకుంటే సెప్టెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారు.  ఈ వ్యూహంతోనే కేసీఆర్ ముందకు వెళుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెరాస వర్గాలూ అదే చెబుతున్నాయి. ముందస్తు ముచ్చట లేదని కేసీఆర్ అనడం వెనుక అంతరార్దం ఇదేననీ రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 

కేసీఆర్ చెబుతున్న తెలంగాణ ఎక్ నాథ్ షిండే హరీష్ రావేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో బయటకు కనిపించని ఏదో రాజకీయ సంక్షోభం ముదురుతున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలో తలదూర్చాలని నిర్ణయించుకున్నప్పటి నుంచే తెరాసలో బయటకు కనిపించని ముసలం పుట్టిందని పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ముసలం పుట్టడానికి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరే కారణమని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆ ముసలం హరీష్ రావు రూపంలో బయటపడబోతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. తెరాస రెండో సారి అధికారం చేపట్టినప్పటి నుంచీ కూడా కేసీఆర్ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చో బెట్టాలన్న వ్యూహంతో కేసీఆర్ వేసిన అడుగులు ఇప్పటి వరకూ తడబడుతూనే ఉన్నాయి. అయితే ఈ తడబాటుకు కారణం పార్టీలోని ఒక  వర్గం కేటీఆర్ ను సీఎం పీఠంపై  కూర్చో పెట్టడాన్ని బలంగా వ్యతిరేకిస్తుండటమే కారణమని అంటున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తరువాత నుంచీ ఇక ఇహనో ఇప్పుడో కేటీఆర్ ను సీఎం పీఠం మీద కూర్చో పెట్టేయడమే తరువాయి అన్నంతగా పార్టీలోనూ రాజకీయ వర్గాలలోనూ కూడా చర్చోపచర్చలు జరిగాయి. కానీ అది జరగలేదు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ముందు ముందు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందో, ఆ తరువాతో కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంటున్నారు. అందుకోసమే గత చాలా కాలంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తున్నారని కూడా అంటున్నారు. ఆ వ్యూహంతోనే.. ఆ ఎత్తుగడతోనే ఒక పద్ధతి ప్రకారం పార్టీలో కీలకంగా, కేటీఆర్ కు పోటీగా ఎదిగే అవకాశం ఉందని భావించిన వారిని ఒక్కొక్కరిగా పార్టీకి దూరం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే అత్యంత అవమానకరంగా ఈటలకు పార్టీ నుంచి ఉద్వాసనకు గురిచేశారు. అలాగే పార్టీలో మరో కీలక నేత హరీష్ రావును పకడ్బందీగా మెయిన్ స్ట్రీమ్ నుంచి పక్కన పెడుతూ వస్తున్నారంటున్నారు. అందుకే కేసీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత ఏర్పాటు చేసిన కేబినెట్ లో హరీష్ రావుకు స్థానం కల్పించలేదదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు పక్కన పెట్టిన ఇద్దరు నేతలలో హరీష్ ఒకరైతే, రెండో వ్యక్తి ఈటల. ఆ తరువాత అనివార్యంగా ఇరువురినీ కేబినెట్ లోకి తీసుకున్నప్పటికీ... ఆ తరువాత కాలంలో ఈటలపై భూ కబ్జా ఆరోపణల నెపంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కించారు. సరే ఆ తరువాత ఆయన కమలం గూటికి చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హరీష్ రావు వంతు వచ్చిందని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో హరీష్ ను పక్కన పెట్టాలని కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. హరీష్ నియోజకవర్గం అయిన సిద్ధిపేట నుంచి కేసీఆర్ తన అన్న కుమారుడు వంశీధరరావును అభ్యర్థిగా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు.ఒక వేళ అది సాధ్యం కాకుంటే.. మంత్రి కేటీఆర్ ను సిరిసిల్ల నుంచి సిద్ధిపేటకు తీసుకువచ్చి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిరిసిల్లలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత గూడుకట్టుకుని ఉండటంతో అనివార్యంగా ఆయన మరో  నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ విషయంపై హరీష్ రావు ఎలా రియాక్ట్ అవుతారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే కేసీఆర్ ను తన జాతీయ రాజకీయాల ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఉపయోగించుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ విషయాన్ని నేరుగా కాకపోయినా.. పార్టీ ముఖ్య నేతలు బీఆర్ఎస్ తరఫున ఇతర రాష్ట్రాలలో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఆవిర్బావ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హరీష్ రావును ఉద్దేశించి చేసినవేనని అప్పట్లోనే పార్టీ వర్గాలలో చర్చ నడిచిన సంగతి తెలిసింది. అంటే అప్పుడే కేసీఆర్ తన కుమారుడికి హరీష్ రావు పోటీకి రాకుండా జాతీయ బాధ్యతలు అప్పగించేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే ఇందుకు హరీష్ రావు అంగీకారం ఉంటుందా? ఉండదా? అన్న విషయం పక్కన పెడితే.. కేసీఆర్ నిర్ణయం తీసేసుకున్నారంటే అంగీకరించి తీరాలి? లేదా పార్టీ వీడి వెళ్లాలి. అంతే ఎవరికీ మరో గత్యంతరం ఉండదు. హరీష రావుకైనా అంతే.. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఇచ్చిన సంకేతాల మేరకు తన మేనల్లుడు ప్రస్తుత ఆరోగ్య మంత్రి హరీష్ రావుకు స్థాన చలనం తప్పదని పార్టీ వర్గాలలోనే కాకుండా, రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడే తెరాసలో ముసలానికి బీజం పడిందని అంటున్నారు. తనయుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కోసం పార్టీలో క్రీయాశీలంగా, కీలకంగా వ్యవహరిస్తున్న హరీష్ రావును పక్కన పెట్టడంపై ఒకింత అసంతృప్తి అంతర్గతంగా పార్టీలో రగులుతోందని అంటున్నారు. పైపెచ్చు తొలి నుంచీ కూడా కేటీఆర్ కు అగ్రపీఠం కట్టబెట్టేందకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనీ, కేసీఆర్ సీఎంగా ఉంటే ఎటువంటి అభ్యంతరం ఉండదనీ, అదే తనయుడు కేటీఆర్ కు ఆ బాధ్యతలకు కట్టబెడితే మాత్రం అంగీకరించేది లేదని హరీష్ రావు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు జాతీయ బాధ్యతల పేర రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఇందుకు హరీష్ రావు అంగీకరిస్తారా? లేక వేరు కుంపటి పెట్టుకుంటారా? అన్న చర్చ కూడా పార్టీలోనూ, రాజకీయ వర్గాలలోనూ జోరుగా సాగుతోంది. అన్నిటికీ మించి పార్టీలో ఉంటూనే మహారాష్ట్రలో ఏక్ నాథ్ షించే పోషించిన పాత్రను ఇక్కడ తెరాసలో హరీష్ రావు పోషిస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. పైగా సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టే విషయంలో కూడా అదే పంథాను అనుసరిస్తున్నారంటున్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో ఆరోగ్య మంత్రి రాజయ్య అవినీతి ఆరోపనలపై బర్త్ రఫ్ అయ్యారు. ఆ తరువాత రెండో సారి అధికారం చేపట్టిన తరువాత ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఈటలకు కట్టబెట్టారు. ఆయనను కూడా భూ కబ్జా ఆరోపణలపై పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడిక ఆ వంతు హరీష్ రావుది అని అంటున్నారు. ప్రస్తతం హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ బాధ్యతల పేరిట ఆయనను రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయాలన్న భావనతో కేసీఆర్ ఉన్నారు. అయితే అందుకు   సుముఖంగా లేని హరీష్ రావు.. పార్టీని చీల్చి ఏక్ నాథ్ షించే పాత్ర పోషించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలలోనే చర్చ నడుస్తోంది. తొలి నుంచీ కూడా పైకి అంతా బాగానే ఉన్నట్లుగా కనిపించినా.. హరీష్ రావు కేటీఆర్ ల మధ్య అంతగా సత్సంబంధాలు లేవన్న విషయం బహిరంగ రహస్యమేనని పార్టీ వర్గాలు చెబుతూవస్తున్నాయి. ఒక సమయంలో అయితే హరీష్ రావుకు సంబంధించిన ఏ చిన్న వార్తా కూడా మీడియాలో రాకూడదన్న పట్టుదలను కూడా కేటీఆర్ ప్రదర్శించారని చెబుతారు. ఇప్పుడు రాజకీయ సమీకరణలను సరిచూసుకుని కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు, జాతీయ రాజకీయ వ్యుహలకు సమాంతరంగా వ్యూహ రచన సాగుతోందంటున్నారు ఆ వ్యూహాలలో భాగంగానే హరీష్ రావుకు  జాతీయ బాధ్యలు అప్పగించి, పక్కకు తప్పించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు.   అదే నిజమైతే, అధికార మార్పిడి, అంత సులభంగా జరిగే అవకాశాలు లేవనీ,   ముఖ్యమంత్రే స్వయంగా  అనేక సందర్భాలలో  చెప్పిన  విధంగా తెలంగాణ షిండే గా హరీష్ రావు తెరమీదకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. 

పొట్టి ఫార్మట్ లో టీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్.. రవిశాస్త్రి

పొట్టి ఫార్మట్ లో టీమ్ ఇండియా ఆట తీరు మెరుగు పడాలంటే కొత్త కెప్టెన్ అవసరమని మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. టి20లో టీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్ ను నియమిస్తే ఆటతీరు గణనీయంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు ఇంగ్లాండ్ జట్టు మెరుగుపడిన తీరే ఉదాహరణ అని రవిశాస్త్రి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ కూడా టెస్ట్, వన్డే, టి20లకు సారథ్యం వహించే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే రోహిత్ మూడు ఫార్మట్లకూ కెప్టెన్ గా ఉన్నాడనీ, ఇక టి20 ఫార్మట్ కెప్టెన్ గా అతడికి ఉద్వాసన చెప్పడమే మేలనీ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సిరీస్ కు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ తో టి20 సిరీస్ కు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఐపీఎల్ లో సారథిగా తనను తాను నిరూపించుకున్న హార్థిక్ పాండ్యాకే టి20 సారథ్య బాధ్యతలు అప్పగిస్తే టీమ్ ఇండియాకు మేలు జరుగుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.  

మీ అయ్యను చెప్పుతో కొట్టినవా కవితా.. ఎంపీ అర్వింద్ కౌంటర్

నిజామాబాద్ చౌరస్తాలో తనను చెప్పుతో కొడతానంటూ తెరాస అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ దీటుగా స్పందించారు. ఖర్గేకు కవిత ఫోన్ చేసిందని చెప్పినందుకే తనను చెప్పుతో కొడతానన్న కవిత.. ఆమెతో బీజీపీ నాయకులు మాట్లాడారంటే చెప్పిన తన తండ్రిని కూడా అలా కొట్టగలరా అని ప్రశ్నించారు. చెప్పుతో కొట్టడాలు, ఇళ్లపై దాడులు తరువాత ముందు ఖర్గేకు ఫోన్ కాల్ పై కవిత క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడాన్ని ఖండించిన అర్వింద్ ఇంట్లో ఆడవాళ్లపై కూడా దాడికి పాల్పడ్డారనీ, దాని గురించి పల్లెత్తు మాట అనని కవితపై అర్వింద్ విమర్శలు గుప్పించారు.    కవిత పార్టీ మారుతున్నట్లు తనకు తెలిసింది కాబట్టే మాట్లాడానని   అన్నారు. 'ఆమె తండ్రి కేసీఆర్ కూడా తన బిడ్డను పార్టీ మారాలని చెప్పారని వెల్లడించారు. మరి నీ అయ్యను కూడా చెప్పుతో కొట్టినవా అని నిలదీశారు. ముందు ఆయననుకొట్టి ఆ తరువాత తనను   కొట్టాలని అన్నారు. కవిత తనపై పోటీ చేస్తానంటే తనకు సంతోషమేననీ, దమ్ముంటే పోటీ చేయాలని సవాల్ విసిరారు.  

*చెప్పు తొ కోడతా.. ఎంపీ అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

‘ఇన్ని రోజులు సహనం పట్టిన.. అరేయ్ అరవింద్ మరోసారి నా గురించి పిచ్చి పిచ్చి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తా బిడ్డ’ ఇవీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు.   నోరు అదుపులో పెట్టుకోక పోతే నిజమాబాద్ చౌరస్తా లో చెప్పు తొ కోడతా.. ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడకు వెళ్లి అరవింద్ ను ఒడిస్తానని శపథం చేశారు.  కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేకు కవిత ఫోన్ చేశారనీ, ఆమె కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ప్రయత్నించారనీ నిజామాబాద్ ఎంపీ చేసిన వ్యాఖ్యలే కవిత ఆగ్రహానికి కారణం. కవిత బీఆర్ఎస్ ఆవిర్భావ సభకుడుమ్మా కొట్టడంనిజం కాదా  అని అర్వింద్ ప్రశ్నించారు. తాను ఖర్గేతో మాట్లాడినట్లుగా కవితే కేసీఆర్ కు చెప్పారని అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ ఏమో దానిని మార్చి బీజేపీ వాళ్లే కవితకు ఫోన్ చేశారంటూ అబద్ధాలు చెప్పారనీ అర్వింద్ అన్నారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ లోని అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి జరిగిన సమయంలో ఎంపీ అర్వింద్ నిజామాబాద్ లో ఉన్నారు. అసలేం జరిగిందంటే కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్ చేశారంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.  అర్వింద్‌ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లో ఆయన ఇంటిపై దాడి చేశారు టీఆర్‌ఎస్‌, జాగృతి కార్యకర్తలు.  వంద మంది  ఇంట్లోకి వెళ్లి కుర్చీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పులకుండీలను పగొలగొట్టారు. కర్రలు, రాళ్లతో ఇంటిపై దాడి చేశారు. ఇల్లంతా ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా అర్వింద్‌ వ్యాఖ్యలపై కవిత సీరియస్ అయ్యారు.  నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతామన్నారు. కొట్టి కొట్టి చంపుతామన్నారు. ఎక్కడ పోటీ చేసినా వెంటాడి వెంటాడి ఓడిస్తానని సవాల్‌ చేశారు కవిత. అంతే కాకుండా అర్వింద్ అనుకోకుండా ఎంపీ గా అయ్యారన్నారు. 186 మంది అభ్యర్థులను నిజామాబాద్‌లో బరిలో దింపారని,  కాంగ్రెస్ తో కుమ్మక్తై తననను ఓడించారని కవిత అన్నారు. పసుపు బోర్డు తెస్తానని అర్వింద్  రైతులను మోసం చేశారని మండిపడ్డారు. అరవింద్‌ది ఫేక్ డిగ్రీ అనీ,  దీనిపై తాను  రాజస్థాన్ యూనివర్సిటీ కి పిర్యాదు చేస్తాననీ కవిత పేర్కొన్నారు.  తనకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని కవిత వెల్లడించారు. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారని వివరించారు. తెలంగాణ లో షిండే మోడల్ నడవదని కవిత తేల్చి చెప్పారు. .జై మోడీ అన్న వారి పైన ఈడీ దాడులు ఉండవన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ..మోదీ అల్లుళ్లని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఎప్పుడో చెప్పారన్నారు.  తాము ఈడీ దాడులకు భయపడమని.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి తీరుతామని అన్నారు. ఇలా ఉండగా అర్వింద్ నివాసంపై దాడిని బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్,  చింతల రామచంద్రారెడ్డి తదితరులు ప్రజాక్షేత్రంలో ఈ దాడికి టీఆర్ఎస్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.  కాగా తన నివాసంపై జరిగిన దాడిపై ఎంపీ అర్వింద్ ప్రధాని మోడీ, పీఎంవోలకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తన నివాసంపై జరిగిన దాడిపై ట్విట్టర్ లో స్పందించిన అర్వింద్ టీఆర్ఎస్ గూండాలు దాడి చేసి వస్తువులు పగులగొట్టి బీభత్సం సృష్టించారనీ, తన తల్లిని బెదరించారనీ పేర్కొన్నారు.  

ట్విట్టర్ షట్ డౌన్!

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులు షట్ డౌన్ అయ్యాయి. సోమవారం (నవంబర్ 21)  వరకూ ఉద్యోగులు ఆఫీసుకు రావద్దని ఉద్యోగులకు ఎలాన్ మస్క్ ఈ మెయిల్.. ద్వారా అల్టిమేటమ్ జారీ చేశారు. అంతే కాకుండా ఇప్పటికే 3500మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ట్విట్టర్.. మిగిలిన ఉద్యోగులు కొనసాగాలంటే 12 గంటలు పనిచేయాల్సిందేనని హుకుం జారీ చేసింది.  వివాదాలు, కేసుల నడుమ   ‘ట్విట్టర్’ను ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వాక్ స్వాతంత్యానికి నిజమైన వేదికగా ట్విట్టర్ ను మార్పు చేస్తానంటూ టేకోవర్ చేసిన మస్క్ దానిలో మార్పులు తేవడం సంగతి అంటుంచి నిలువెత్తు లోతులో పాతరేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విట్టర్ లో అడుగు పెట్టిన రోజునే ఆ సంస్థలో టాప్ స్థాయిలో ఉన్న పలువురికి ఉద్వాసన పలికారు. సంస్థలో పనిచేస్తున్న సగం మందిని కూడా ఇంటికి సాగనంపుతానని ప్రకటించారు. ఇప్పటికే3500 మందిని ఊస్ట్ చేసి పారేశారు. ఉన్న సిబ్బంది కూడా రోజుకు 12 గంటలు ఊడిగం లేదా వెట్టి చాకిరీ చేసి  తీరాలన్నకండీషన్ పెట్టారు. ఇంకా  రకాల పని నిబంధనలతో వారి ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేశారు.  ఎలాన్ మస్క్ తుగ్లక్ నిర్ణయాలతో విసిగి వేసారిపోయిన వందలాది మంది ఉద్యోగులు ట్విట్టర్ కు గుడ్ బై చెబుతున్నారు. గురువారం సాయంత్రం మొదలైన ట్విట్టర్ ఉద్యోగుల రాజీనామాల పర్వం  కొనసాగుతోంది.  సంస్థను మెరుగు పరిచేందుకు కష్టపడి పని చేస్తారా..  వెళ్లిపోతారా  అంటూ మస్క్ ఇచ్చిన అల్టిమేటం మొదటికే మోసం తెచ్చినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్ అంతర్గత సమాచార వేదికల్లో ఉద్యోగులంతా ‘సెల్యూట్ ఎమోజీలు’ పోస్టు చేస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమంపై ‘రిప్ ట్విట్టర్’ అనే ట్యాగ్ లైన్ తో అనేక మంది ఎలాన్ మస్క్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.  ఇలా రిప్ ట్విట్టర్ ట్యాగ్ లైన్ తో వందల సంఖ్యలు ట్వీట్లు చేస్తున్న వారు ఆ సంస్థకు గుడ్ బై చెప్పిన వారే అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దాన్ని అత్యంత వేగంగా జనానికి తెలిసేలా చేస్తున్న బలమైన వేదిక ట్విట్టర్ పిట్ట అనడంలో సందేహం లేదు. ఇక ట్విట్టర్ లోని  ‘ట్రెండింగ్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విషయాలను సాధారణ యూజర్లకు కూడా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడంలో ముందుంటుంది. అలాంటి ట్విట్టర్ లో ఇప్పుడు ‘రిప్ ట్విట్టర్’  విపరీతంగా  ట్రెండింగ్ అవుతోంది. రిప్ ట్విట్టర్ అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మస్క్ తీరుతో విసిగిపోవడమే కాకుండా కొత్త కొత్తగా పెడుతున్న షరతులు, సంస్థలో మారిపోతున్న పరిస్థితులను తట్టుకోలేక వందలాది మంది రాజీనామాలు చేస్తుడడంతో ట్విట్టర్ భవిష్యత్ ఆందోళనకరంగా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.  పలువురు ఉద్యోగులు ట్విట్టర్ స్లాక్ లో శాల్యూట్ ఎమోజీలు, ఫేర్ వెల్ మెసేజ్ లు పెట్టడం సంచలనం రేకెత్తిస్తోంది. ‘వాలంటరీ లే ఆఫ్’ పేరుతో సుమారు 360 మంది ఓ చానల్ ఏర్పాటు చేసినట్లు ఒక ఉద్యోగి వెల్లడించాడు.  

ఏపీ సర్కార్ కు మరో సలహాదారు..!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కు ఎంత మంది సలహాదారులున్నా సరిపోవడం లేదు. రోజుకొక సలహాదారు చొప్పున నియామకాలు  జరుగుతున్నాయా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కనిపించిన వారందరికీ పదవులు కట్టబేట్టేయాలన్న తొందర జగన్ లో కనిపిస్తోంది. ఎవరిలోనైనా పదవి దక్కలేదన్న కించిత్ అసంతృప్తి పొడసూపుతోందన్న అనుమానం వస్తే చాలు వారకి ఓ సలహాదారు పదవి కట్టబెట్టేస్తున్నారు.  పార్టీలో రాజకీయ నిరుద్యోగం లేకుండా చేసేయాలన్న ఆత్రంతో సలహాదారు పదవుల పందేరంలో మరే విషయంలోనూ లేనంత వేగం చూపుతున్నారు ముఖ్యమంత్రి జగన్ . తాజాగా వైసీపీ అధికార ప్రతినిథి నారమల్లి పద్మజకు సలహాదారు పదవిని కట్టబెట్టేశారు. ఆమెకు మహిళాశిశుసంక్షేమ, దివ్యాంగ వృద్ధుల విభాగానికి సలహాదారుగా పదవిని కట్టబెట్టేసారు. ఈ పదవి దక్కిన ఆమెకు నెలకు లక్షల్లో వేతనం లభిస్తుంది. సలహాదారు పదవుల నియామకం విషయంలో జగన్ ఒక పద్ధతీ పాడూ పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా ఖాతరు చేయడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చే దిక్కు లేదు కానీ.. అయిన వారికి సలహాదారు పేరుతో లక్షల ప్రజాధనాన్ని వేతనాలుగా నిర్ణయించి నియామకాలు కానిచ్చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నాలుగళ్ల కిందట వైసీపీ గూటికి చేరిన నారుమల్లి  పద్మజారెడ్డి ఇంత కాలం వైసీపీ అధికార ప్రతినిథిగా మీడియా ముందుకు వచ్చి, లేదా సామాజిక మాధ్యమంలో విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ఉండటమే పనిగా పెట్టుకున్నారు. ఇంతగా నోరు చేసుకున్నందుకు ఏదో పదవి కావాలని ఆమె గత నాలుగేళ్లుగా జగన్ ను కోరుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల వేడి మొదలు కావడంతో  ఇప్పటికీ పదవి ఇవ్వక పోతే ఆమె నొచ్చుకుంటారనుకున్నారో ఏమో.. జగన్ మరో సలహాదారు పదవిని సృష్టించి ఆమెకు కట్టబెట్టేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఏయే శాఖలలో అయితేనేం దాదాపు 80 మంది సలహాదారులు ఉన్నారు. రానున్న రోజులలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

రోజాకు ఉద్వాసనేనా?

ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆ పదవీ బాధ్యతల్లో ఎంత సమర్ధంగా పనిచేస్తున్నారన్న విషయం అంతుచిక్కని అంశంగా ఉంది. పదవీ బాధ్యతల సంగతి ఎలా ఉన్నప్పటికీ నిరంతరం మంత్రి హోదాలో ఆమె గుళ్లూ, గోపురాలు తిరగడం, తీర్థయాత్రలు చేయడం, సొంత నియోజకవర్గం నగరిలో బలమైన తన వ్యతిరేక వర్గంతో ఏదో ఒక పేచీ పెట్టుకుంటుండడం, తాజాగా జనసేన శ్రేణులను  కెలికి మరీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. జిల్లా మొత్తంలో ఆయనకు మంచి పట్టుంది. అలాంటి జిల్లాలో తొలి నుంచి తనతో విభేదిస్తున్న రోజాకు జగన్ తన రెండో మంత్రివర్గంలో స్థానం కల్పించడం పెద్దిరెడ్డికి సుతరామూ ఇష్టం లేదంటారు. నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కోటరీలో అత్యంత ముఖ్యమైన వారు అంటారు. అలాంటి పెద్దిపెద్దితో పరోక్షంగా రోజా చిన్న చిన్న విషయాలకు కూడా గిల్లికజ్జాలు పెట్టుకోవడం.. ఆపైన వైసీపీ అధినేత వద్ద పంచాయతీగా మారుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. రోజాకు జగన్ పలుమార్లు సర్దిచెప్పినా.. ఆమె మళ్లీ మొదటికే వస్తుండడంతో ఆయనలో అసహనం పెరిగిపోతోందంటున్నారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి మంత్రి రోజా ఇటీవల సిద్ధమయ్యారు. అయితే.. పెద్దిరెడ్డి వర్గానికి చెందిన స్థానిక జెడ్పీటీసీ నేత ఆ భవనం ప్రారంభోత్సవానికి అడ్డుపడి రచ్చరచ్చచేశారు. ఆ భవనం నిర్మాణం బిల్లులు పెండింగ్ లో ఉండగా ఎలా ప్రారంభిస్తారంటూ దానికి తాళం వేసి మరీ వెళ్లిపోయారట ఆ జెడ్పీటీసీ. పంచాయతీ భవనాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆహ్వానించకుండా ఎలా ప్రారంభిస్తారని జెడ్పీటీసీ నిలదీశారని అంటున్నారు. అయితే.. రాజకీయాల్లో మంత్రి రోజా ఫైర్ బ్రాండ్ కదా..! పోలీసుల సాయం తీసుకుని మరీ ఆ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం అయిందనిపించారు. ఒకే జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఉంటే.. ఒకరంటే మరొకరికి పడే ఛాన్స్ ఉండదు. పైగా జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల నుంచీ కూడా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాకు పెదద్దిక్కుగా ఉంటున్నారు. జిల్లా అంతటా ఆయనకు మంచి పరిచయాలు, అనుచరులు ఉన్నారు. పెద్దిరెడ్డిని కాదని జగన్ కూడా ఏమీ చెయ్యరంటారు. అలాంటి పెద్దిరెడ్డితో రోజా ఢీకొనాలని చూడడం పార్టీలో కూడా చాలా మందికి నచ్చడం లేదంటారు. దాంతో పాటు నగరి నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి వర్గం ఆమకు కంటి మీద కునుకు లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మొన్నా మధ్య ఓ భవన నిర్మాణం కార్యక్రమానికి ప్రోటోకాల్ పట్టించుకోకుండా మంత్రిగా రోజాను ఆహ్వానించకుండా స్థానిక నేతలే చేశారు. రోజా ఏ కార్యక్రమం సజావుగా నిర్వహించకుండా చూస్తారు. ఆమెతో తగవు కూడా పెట్టుకుంటారు. దీంతో కంగుతిన్న రోజా ఎవరో మరో నేతతో ఫోన్ లో చాలా బాధగా మాట్లాడిన ఆడియో మీడియాలో వైరల్ అయింది. మరో పక్కన తన నగరి నియోజకవర్గంలో స్థానిక వ్యతిరేక వర్గం నుంచి ఎదురవుతున్నాయంటూ జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ వైసీపీ అధినేత ఆమె మొరను పట్టించుకోలేదు. రోజు ఏదో ఒక తలనొప్పి తీసుకొస్తున్న రోజా అంటే జగన్ విసుగెత్తిపోతున్నారని ఆ పార్టీ వర్గాల్లోనే ఓ చర్చ అయితే జరుగుతోందని తెలుస్తోంది. మరో పక్న రోజా పనితీరుపై జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయంటున్నారు. తాజాగా జనసేన శ్రేణులతో కూడా రోజా తలపడుతున్నారు. ఇది కూడా ఆమెకు మైనస్ అంటున్నారు. ఇవన్నీ కలగలిపి రోజా మంత్రి పదవి త్వరలోనే ఊస్టింగ్ అవుతుందని పెద్దిరెడ్డి వర్గం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రోజాకు వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్ కూడా వస్తుందో రాదో అనే అనుమానాలు స్థానికంగా వస్తున్నాయి.

టీడీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకా కుమార్తె సునీత పోటీ?

కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారా? కొన్ని సంఘటనలు, కొందరి మాటలను బట్టి చూస్తే.. నిజమే కావచ్చనే అంచనాలు రాజకీయ వర్గాలు, విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందులలో ఆయన నివాసంలోనే దుండగులు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారు. ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. ఆ హత్యతో అప్పటి సీఎం చంద్రబాబుకు ముడిపెట్టిన జగన్ రెడ్డి మీడియా ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ ఊరూవాడా గగ్గోలు పెట్టింది. అయితే.. సీబీఐ దర్యాప్తులో వివేకా హత్య కుట్ర వెనుక ప్రముఖుల హస్తం ఉందనే అంచానా వచ్చింది. తర్వాత 2019లో జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ ఏర్పాటైంది. జగన్ సర్కార్ వచ్చి నాలుగేళ్లవుతున్నా.. వివేకా హత్య కేసు కొలిక్కి రాకుండా సూత్రధారులతో పాటు ‘ముఖ్య నేత’ కూడా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. అంతేకాదు.. స్వయంగా వివేకా కుమార్తె సునీత అదే విధమైన అనుమానాలు వ్యక్తం చేశారు. దివంగత వివేకానందరెడ్డి సీఎం జగన్ కు సొంత బాబాయ్. పినతండ్రి హత్య కేసులో చిక్కుముడి విప్పించాలని సోదరి అయిన సునీత స్వయంగా జగన్ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, పైగా లైట్ తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన జగన్.. తానే సీఎం అయ్యాక ఈ కేసును నీరుగార్చేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను కొందరు బెదిరించడం, తిరిగి వారిపైనే కేసులు పెట్టడంతో విసిగిపోయిన సునీత సీబీఐ విచారణను ఏపీలో కాకుండా మరే ఇతర రాష్ట్రానికైనా బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పోరాడారు. కేసు పూర్వాపరాలు సమీక్షించిన సుప్రీంకోర్టు కేసు విచారణను మరో రాష్ట్రాన్ని బదిలీ చేయడానికి అంగీకరించింది. తండ్రి హత్య కేసులో నిందితులెవరో.. సూత్రధారులెవరో.. తేల్చేందుకు వివేకా కుమార్తె సునీతారెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా ధైర్యంగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. తండ్రి హత్య విషయంలో సీఎం స్థానంలో ఉన్న అన్న జగన్ నుంచి సహకారం అందకపోయినా ఆమె విశ్రమించడం లేదు. పులివెందుల గల్లీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా ఆమె కాలికి బలపం కట్టుకుని ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ సునీతకు అనూహ్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి మద్దతు లభిస్తోంది. సునీత పోరాటానికి మద్దతుగా నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితమే నిర్ణయించారు. కొన్ని సభల్లో చంద్రబాబు సునీత పోరాటాన్ని ప్రశంసించారు. తోడ్పాటుగా ఉంటామని కూడా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ‘బాదుడే బాదుడు’ పేరిట చేస్తున్న జిల్లాల పర్యటనల్లో సునీతకు మద్దతు గురించి బహిరంగంగా చెబుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఈ విషయం స్వయంగా ప్రకటించారు. సునీతకు మద్దతుగా నిలబడదామని టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల సందర్భంగా వచ్చే ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుండడం విశేషం. రాజకీయంగా తన ఆగర్భ శత్రువు జగన్ ను ఢీకొట్టే ఎన్నికల వ్యూహాన్ని ఈ అపర చాణక్యుడు రచించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ పై వైఎస్ సునీతను టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఎందుకంటే.. పులివెందులలో వైఎస్ రాజశేఖరరెడ్డికి, జగన్ కు మంచి పట్టు ఉంది. అయితే.. అంతే పట్టు హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డికి కూడా ఉందంటారు. ఒక సందర్భంలో వైఎస్ రాజశేఖరరెడ్డే ఈ విషయం చెప్పారంటారు. తండ్రి వివేకాకు ఉన్న పలుకుబడి, ఆపైన ఆయన దారుణ హత్యకు గురయ్యారనే సానుభూతి కూడా సునీత విజయానికి మార్గం వేస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారంటున్నారు. ఒకవేళ సునీత పులివెందులలో పోటీకి చేయడానికి ఒప్పుకోకపోతే.. కడప ఎంపీ స్థానంలో అయినా బరిలో దిగేలా ఒప్పించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ సునీత కడప ఎంపీ స్థానంలో పోటీకి ఒప్పుకుంటే.. తన తండ్రి హత్య వెనుక ఉన్నారనుకుంటున్న వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందంటున్నారు. కడప ఎంపీ సీటు విషయంలో వచ్చిన విభేదాలే వివేకానందరెడ్డి దారుణ హత్యకు కారణం అంటారు. సునీతారెడ్డిని చంద్రబాబు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో కలిశారని, ఆమెకు పులివెందుల నుంచి జగన్ పై బరిలో దింపాలనుకుంటున్నట్లు.. లేదా కడప ఎంపీ స్థానంలో పోటీ చేయించే ప్రతిపాదన గురించి చెప్పారని విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు ప్రతిపాదనకు సునీతను ఒప్పించేందుకు ఓ టీడీపీ ముఖ్య నేత సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలకు సునీత తొలుత కాస్త విముఖంగా ఉన్నా తర్వాత ఆలోచనలో పడ్డారని అంటున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో సునీత స్వయంగా టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారా? లేక తన ఫ్యామిలీ నుంచి మరొకరితో పోటీ చేయిస్తారా? అనేది స్పష్టం కావాల్సి ఉందంటున్నారు. వైఎస్ సునీత టీడీపీ అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేసినా.. కడప బరిలో దిగినా ‘వన్ షాట్ టూ బర్డ్స్’ సామెతను చంద్రబాబు మరోసారి నిరూపించినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దాడుల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వైసీపీ తీరు.. జనం తిరగబడతారు జాగ్రత్త అంటూ బాబు హెచ్చరిక

రాష్ట్రంలో ప్రభుత్వం అనేది అసలు ఉందా అనిపించేలా వైసీపీ శ్రేణుల దాడులు ఉంటున్నాయి. వ్యతిరేకించే వారిపై దాడులు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులపై దాడు..ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినా, కళమెత్తినా దాడులే అన్నట్లుగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి. ఆఖరికి విపక్ష నేత, తెలుగుదేశం అధినేత పర్యటనలలో కూడా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. కుప్పంలో  చంద్రబాబు పర్యటన సందర్బంగా చోటుచేసుకున్న సంఘటనలు మరువక ముందే ఆయన కర్నూలు పర్యటనలో కూడా దాడులు పునరావృతమయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనీ, ఎమ్మిగనూరులో రోడ్ షో సందర్బంగా సోమప్ప సర్కిల్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులే రోడ్ షోను భగ్నం చేయాలన్న ఉద్దేశంతోనే రాళ్ల దాడికి పాల్పడ్డాయంటూ తెలుగుదేశం శ్రేణులు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కర్నాలూ జిల్లా పర్యటనలో అడుగడుగునా జనం బ్రహ్మరథ పడుతున్నారు. ఆయన పర్యటన, రోడ్ షోలకు జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. జగన్ సర్కార్ పై జనాగ్రహం విపక్ష నేత పర్యటనకు జనం పోటెత్తడంలో ప్రస్ఫుటంగాకనిపిస్తోంది. అసంఖ్యాకంగా తరలివచ్చిన సన సముద్రాన్ని చూసి చంద్రబాబు సైతం మరింత ఉత్సాహంతో అధికార పక్షంపై ఈటెల లాంటి మాటల విమర్శలను సంధిస్తున్నారు. చంద్రబాబు ప్రతీ మాటకూ, ప్రతీ విమర్శకూ జనం నుంచి విశేష స్పందన వస్తోంది. దానిని చూసి రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు ముందుకు కదులుతున్నారు. జగన్ సర్కార్ నుంచి రాష్ట్రానికి తెలుగుదేశం అధికారంలోకి రావడం తోనే విముక్తి కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దుష్ట పాలనకు ఓటుతో బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. సోమప్ప సర్కిల్ లో తన కాన్వాయ్ పై జరిగిన రాళ్ల దాడిని ప్రస్తావిస్తూ నేరుగా ముఖ్యమంత్రినే సవాల్ చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రీ లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది.. నా కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఎక్కడికెళ్లినా దాడులకు పాల్పడుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నీది. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి నాపై రాళ్ల దాడులకు పాల్పడుతున్నావు. ప్రజలు తిరగబడితే నేను బాధ్యుడను కాను అని హెచ్చరించారు. ‘ఈ రోడ్‌ షోకు వచ్చిన జనాలను చూసి వైకాపా వారి కళ్లు తిరిగాయి. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఈ జన ప్రభంజనంతో ప్రస్ఫుటమౌతోంది ’ అని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘నేను ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు మీరందరూ ఆశీర్వదించాలన్నారు’ రాయలసీమలోనే మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ జనం స్వచ్ఛందంగా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. చంద్రబాబు తాను రాజకీయాలలో కొనసాగాలో లేదో మీరే నిర్ణయించాలని అని అనడం ఆఖరి అవకాశం లాస్ట్ చాన్స్ అని అడగడం కాదని తెలుగు దేశం నేతలు అంటున్నారు. రాష్ట్రం బాబుపడేందుకు ఆయన ఆఖరి అవకాశం ఇస్తున్నారని వివరిస్తున్నారు. కాదు మరో సారి జగన్ కే అవకాశం ఇద్దాం అనుకుంటే  రాష్ట్రం వల్లకాడు అయిపోవడం ఖాయమనీ, అప్పుడు వగచినా ప్రయోజనం ఉండదనీ వల్లకాడును ఏలడానికి ముందుకు ఎవరొస్తారని వారంటున్నారు. 

చంద్రబాబు పర్యటనలకు జన ప్రభంజనం దేనికి సంకేతం?

1982 నాటి ఎన్టీఆర్ ప్రభంజనం గుర్తుకు వస్తున్నదా? చంద్రబాబు కర్నూలు పర్యటనకు జనం ప్రభంజనంలా తరలి రావడంతో నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయా? అంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు ఔననే అంటున్నారు. ఒంగోలు వేదికగా జరిగిన తెలుగుదేశం మహానాడు నుంచి ఆ పార్టీ అధినేత ఎక్కడకు వెడితే అక్కడ జనం నీరాజనం పడుతున్నారు. జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విపక్షం వెనుక ర్యాలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మూడు రోజులుగా సాగుతున్న ఆయన పర్యటనలో ఆయన పర్యటన సాగిన దారంతా జన సముద్రంగా మారిపోయింది. అశేష జన సందోహం అడుగడుగునా నీరాజనం పడుతుండటంతో ఆయన పర్యటన షెడ్యూల్ టైం కంటే కనీసం ఎనిమిది తొమ్మిది గంటలు ఆలస్యంగా సాగుతోంది. అయినా జనం కదలకుండా ఓపిగ్గా నిరీక్షిస్తున్నారు. అదే జగన్ సభలకు జనాన్ని బలవంతంగా సమీకరించి తీసుకువచ్చినా వారు సభ లో కూర్చో లేక బయటకు వెళ్లిపోతున్నారు. పోలీసులు అడ్డుపడుతుంటే కూడా విదిలించుకుని వెళ్లిపోతున్నారు. అదే చంద్రబాబు కర్నూలు పర్యటనలో జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. చంద్రబాబు పర్యటనలో విపరీతమైన జాప్యం జరిగినా ఓపికగా వేచి చూశారు. ఆయన ప్రసంగం శ్రద్ధగా విన్నారు. సాధారణంగా ఒక పార్టీ అధినేత పర్యటనకు వస్తున్నప్పడు జనసమీకరణ ఉంటుంది. అలాగే చంద్రబాబు పర్యటనకూ తెలుగుదేశం జిల్లా నాయకులు జన సమీకరణ చేసే ఉంటారు. అయితే ఆ సమీకరణ చాలా పరిమితం. ఎందుకంటే జనాన్ని తరలించడానికి విపక్షానికి ఆర్టీసీ బస్సులను అద్దెకిచ్చే పరిస్థితి లేదు. డ్వాక్రా మహిళలు వచ్చే అవకాశమూ లేదు. ఎందుకంటే ఆర్టీసీ, డ్వాక్రా మహిళలూ కూడా ప్రభుత్వ బంధనాల్లో చిక్కుకుని ఉన్నాయి. దీంతో కర్నూలు పర్యటనలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన అశేష జనవాహిని అంతా స్వచ్ఛందంగానే వచ్చిందేనని చెప్పాలి. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన అనగానే వైసీపీ శ్రేణులు మూడు రాజధానుల పేరుతో ర్యాలీలు నిర్వహించారు. అయితే అవి ఎవరికీ పట్లని ర్యాలీలుగా మిగిలిపోయాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామన్న గంభీర ప్రకటనలు సైతం చేశారు. అయితే బాబు పర్యటనకు వచ్చిన అనూహ్య స్పందనతో నిరసనల ఊసెత్తడానికి కూడా వారు భయపడే పరిస్థితి వచ్చింది. కర్నూలు గడ్డపై మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అన్న నినాదాలు ప్రతిధ్వనించాయి. ఒక్క కర్నూలు అనే కాదు ఇటీవలి కాలంలో చంద్రబాబు ఎక్కడ పర్యటించినా జన స్పందన భారీగా ఉంటోంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు నిలిపేస్తారని వైసీపీ చేస్తున్న హెచ్చరికలను జనం విశ్వసించడం లేదనడానికి ఆయన పర్యటనలకు వస్తున్న విశేష స్పందనే నిదర్శనం.  

కందకు లేని దురద కత్తిపీటకా.. ఏపీకి లేని బెంగ కేసీఆర్ కా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ప్రస్తుతం గతంలో ఎన్నడూ ఎదుర్కొనటువంటి టెన్షన్ ను ఎదుర్కొంటున్నారు. ఒక వైపు.. జాతీయ రాజకీయాలలోకి అడుగు పెట్టేశారు. కొత్త పార్టీ బీఆర్ఎస్ ను ప్రకటించేశారు. టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుందనీ, జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తుందనీ, కేంద్రంలో మోడీ సర్కార్ పతనానికి బీఆర్ఎస్ నాంది పలుకుతుందనీ గంభీర ప్రసంగాలు సైతం చేసేశారు. అయితే ఆ తరువాతే ఆయనకు అసలు పరీక్షలు వరుసగా ఎదురౌతున్నాయి. తెలంగాణ ఉద్యమ పునాదులపైన ఏర్పడిన పార్టీ ఇప్పుడు ఆ ఉద్యమ చిహ్నాలను అనివార్యంగా వదిలించుకోవాల్సిన పరిస్థితి. మోడీ వ్యతిరేకత తప్ప కేసీఆర్ తన కొత్త జాతీయ పార్టీ ఆవిర్బావ సభ సందర్బంగా కొత్తగా చెప్పినదేమీ లేదు. ఇప్పుడు ఆయనకు సొంత రాష్ట్రంలో బీఆర్ఎస్ సత్తాను చాటాల్సిన పరిస్థితి ఉంది. అయితే మునుగోడు ఉప ఎన్నికలో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా సాధించిన విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకు విజయం సిద్ధిస్తుందా? అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్త మౌతున్న పరిస్థితి. సరే ఇక్కడ గెలిచినా సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ ఆశిస్తున్నట్లుగా వంద స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోగలిగే సత్తా బీఆర్ఎస్ కు ఉందా అంటే ఇప్పటికిప్పుడైతే ఔననే సమాధానం వచ్చే పరిస్థితి లేదు. సర్వేలను బట్టి చూస్తు హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మరో సారి బీజేపీ అధికార పగ్గాలు అందుకోవడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్న సమయంలో.. ఆ తరువాత ఓ నాలుగైదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ విస్తరణ సాధ్యమౌతుందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. అన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఆంధ్రప్రాంత ప్రజలపై, పాలకులపై చేసిన పరుష వ్యాఖ్యలు ఆయనక సాటి తెలుగు రాష్ట్రంలో కాలుపెట్టే పరిస్థితి లేకుండా చేశాయి. సాటి తెలుగు రాష్ట్రమే బీఆర్ఎస్ ను గుర్తించని పరిస్థితి ఉంటే.. ఇక దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఇది ఎలాంటి సందేశం ఇస్తుందన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు ఏపీ నుంచి మద్దతు అనివార్యంగా అవసరం అన్న పరిస్థితి ఏర్పడింది. ఏపీ సీఎం జగన్ తో ఆయనకు సత్సంబంధాలే ఉన్నా.. రాజకీయాలకు, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న జల వివాదాలకూ అతీతంగా ఇప్పటి వరకూ ఇరువురూ కూడా పరస్పర రాజకీయ సహకారం అందించుకుంటున్నారనే విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఒక సారి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా యుద్ధం ప్రకటించేసిన తరువాత గతంలోలా ఈ సహకారం ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. రాజకీయ పరిశీలకులైతే లోపాయికారీగా ఉన్నా బహిరంగంగా బీఆర్ఎస్ కు జగన్ మద్దతు ప్రకటించే అవకాశాలు ఇసుమంతైనా లేవనే చెబుతున్నారు. తెరాస అధినేత మొడీ విధానాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ యుద్ధ భేరి మోసిస్తుంటే.. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి మాత్రం మోడీ అడుగులకు మడుగులొత్తుతూ ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో తనకు మద్దతు కూడగట్టుకోవాలంటే కేసీఆర్ కు జగన్ కు మోడీతో ఉన్న బంధాన్ని తెగ్గొట్టక తప్పదన్న అంచనాకు వచ్చారు. అందుకే ఎమ్మెల్యేక కొనుగోలు బేరసారాలు తెలంగాణతో ఆగవనీ, అవి ఏపీకీ విస్తరిస్తాయనీ జగన్ ను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. బీజేపీ ఏపీలో జగన్ సర్కార్ ను కూలదోసేందుకు ప్రయత్నిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని మోడీ సర్కార్.. పడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయంలో స్పందించాల్సింది జగన్ కానీ, కేసీఆర్ కు ఎందుకు  అని పరిశీలకులే కాదు, ఇరత పార్టీల వారూ, స్వయంగా తెరాస నేతలే ప్రశ్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఊసెందుకన్న భావన ఏపీలో కూడా వ్యక్తమౌతోంది. కందను కోసిన కత్తిపీటకు దురదంటే ఎవరు నమ్ముతారని నెటిజన్లు సైతం సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ ఏపీ సర్కార్ ను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్న కేసీఆర్ వ్యాఖ్యలు జగన్ ను బీఆర్ఎస్ కు మద్దతుగా కూడగట్టే వ్యూహంతోనే తప్ప ఆయన వ్యాఖ్యలలో, ఆరోపణల్లో వాస్తవాలున్నాయని ఎవరూ నమ్మడం లేదంటున్నారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణ చీప్ పబ్లిసిటీ అన్నారు. కట్టుకథలు, కాల్పనిక విషయాలు సృష్టించి రాజకీయ సంచలనం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఆయన పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన కట్టు కథ అల్లుతున్నారని.. కేసీఆర్‌ను ఏమైనా వైసీపీ స్పోక్స్ పర్సన్‌గా నియమించారా అని ప్రశ్నించారు. వైసీపీకి లేని భయాలు కేసీఆర్‌కు ఎందుకు అని నిలదీశారు. కేసీఆర్ వైసీపీని నడిపిస్తున్నారా లేదా ఆ పార్టీకి ప్రతినిధిగా మాట్లాడుతున్నారా అని సూటి ప్రశ్న వేశారు. తన పార్టీకి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాలని కేసీఆర్ మీడియా కవరేజ్ కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. అబద్ధాలు, అవాస్తవాలు ద్వారా ప్రచారం పొందాలని చూస్తే విశ్వసనీయతకు భంగం వాటిల్లడం ఖాయమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తప్పుడు వ్యాఖ్యలు, కథనాలు మానుకుంటే మంచిదని సూచించారు. తెలంగాణలో జరిగిందే అవాస్తవమని.. ఆ విషయాన్ని తమ నాయకత్వం గట్టిగా చెప్పిందన్నారు. 2024లో భారతీయ జనతాపార్టీ, జనసేనతో కలిసి ప్రత్యామ్నాయంగా మారతామన్నారు. ఎన్నికల ముందు తమ పార్టీలోకి విస్తృతంగా చేరికలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు చేరికలను ప్రోత్సహిస్తామన్నారు. వైసీపీని అస్థిరపరుస్తున్నామనేది కేసీఆర్ కల్పించుకున్న కొత్త స్క్రిప్ట్ అని.. కథ, నిర్మాత అంతా కేసీఆరే అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాలలో, ఆమాటకొస్తే దేశంలో రాజకీయాలే కాదు, రాజకీయ చర్చలు,విశ్లేషణలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చిత్ర విచిత్రంగా వంపులు పోతున్నాయి. కొత్త కొత్త ఎత్తులు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.  ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాజకీయాల దారిలోనే రాజకీయ విశ్లేషకులు సాగుతున్నారు. వాస్తవాల కంటే ఉహాలకు, వ్యూహహాగానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ తీసుకున్న, ‘జాతీయ’ నిర్ణయం సహజంగానే రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. చర్చోపచర్చలు సాగుతున్నాయి. నిజానికి, కేసీఆర్ తీసుకున్న,పార్టీ పేరు మార్పు నిర్ణయం, ఇప్పటికిప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని,కేసీఆర్ సహా ఎవరు ఉహించడం లేదు.ఆశించడం లేదు.  నిజానికి ప్రాంతీయ వాదం పునాదిగా, రాజకీయంగా,(గిట్టని వాళ్ళు ఆర్థికంగా కూడా అంటారు) ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆయన అవసరాల కోసం, కాలం చెల్లిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని, పక్కన పెట్టి జాతీయ నినాదాన్ని అందుకున్నారు. అందుకోసంగా, ఆయన దసరా పండగ రోజున తెలంగాణ భవన్ వేదికగా, తెరాస పార్టీ పేరును మార్చారు. భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’ అనే పదాన్ని తెసీసి ‘భారతీయ’ అనే పదాన్ని చేర్చారు. నిజానికి, ఆ క్రతువుకు ఏమి పేరు పెట్టినా, ప్రొఫెసర్ కోదండ రామ్’  చెప్పినట్లుగా ఈ మొత్తం క్రతువు వెనక ఉన్న మూల మంత్రం తెలంగాణలో అధికారాన్ని, కుటుంబ పాలనను నిలుపుకోవడం. ఇదొక్కటే ఇప్పుడు కేసీఅర్ ముందున్న లక్ష్యం. ఇదొక్కటే ఆయన ముందున్నసవాలు. తెలంగాణ సెంటిమెంట్’ను అడ్డుపీతుకుని, 1200 యువకుల బలిదానాల బాటలో అధికార పీఠాన్ని అందుకున్న కేసేఆర్, ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నారు, అనే వాళ్ళున్నారు.  సరే, తెరాస పేరును కేసేఆర్ ఎందుకు బీఆర్ఎస్’గా మార్చారు,తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేస్తుంది.  జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే, దాయాది రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్’ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది? ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలను బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేస్తుంది? ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.  అయితే, ఇందుకు సంబంధించి ఎవరెన్ని విశ్లేషణలు చేసినా,తెలుగు దేశం పార్టీ  అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాటలు లేకుండా ఓ చిన్న చిరునవ్వుతో చేసిన విశ్లేషణ ముందు అవ్వన్నీ దిగతుడుపే. బీఆర్ఎస్పై సాధికారిక వ్యాఖ్య ఎవరైనా చేశారంటే , అది చంద్రాబాబు ఒక్కరే,  ఏపీ రాజకేయాలపై బీఆర్ఎస్ ప్రభావం గురించి మాత్రమే కాదు., అసలు బీఆర్ఎస్’ గురించి ఇంతవరకు వచ్చిన విశ్లేషణలు అన్నిట్లోకి చద్రబాబు ‘చిరునవ్వు’ ఒక్కటే  సాధికారిక విశ్లేషణ, అనుకోవచ్చును. అవును, బీఆర్ఎస్ గురించి చంద్రబాబు చేయని విశ్లేషణ, ఆయన అనుభవానికి, విజ్ఞతకు అడ్డపడుతోంది.  ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు, మోడీ, షా సిట్టంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆయన ముందు మరో ఆప్షన్ లేదు. మోడీ షా కూర్చోమంటే కూర్చోవాలి నుంచో మంటే నుంచోవాలి లేదంటే,ఏమిజరుగుతుందో వేరే చెప్పనక్కర లేదు.నిజానికి, జగన్ రెడ్డి, 2019 ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే, బీజేపీకి సరెండర్ అయిపోయారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ దయ మన ప్రాప్తం అని చేతులేత్తేసింది మొదలు ఇంతవరకు మళ్ళీ ఆయన ఎత్తిన చేతులు దించలేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎన్నికల విషయంలోనే కాదు, పార్లమెంట్’లో వివదాస్పద బిల్లుల ఆమోదం వరకు ఎక్కడా,  కేంద్రానికి రుచించని నిర్ణయం ఏదీ తీసుకోలేదు. ఎక్కడి వరకో ఎందుకు, కొద్ది రోజుల క్రితం, వైసీపీ ఎంపీ, విజయసాయి రెడ్డి, ఉప రాష్ట్రపతి జగదేష్ ధన్కర్’కు వంగివంగి దండాలు పెడుతున్న దృశ్యం చూస్తేనే, వైసీపీ స్టాండ్ ఏమిటో అర్థమవుతుంది. అయితే, బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై అసలే ఉండదా అంటే ఉంటుంది. నిజానికి, ఒక్కఎపీలోనే కాదు దేశంలో ఏ ఒక్క ఒక రాష్ట్రం నుంచి పేరున్న పార్టీలు ,వ్యక్తులు ఎవరు కూడా కేసేఆర్’తో చేతులు కలిపేందుకు, సిద్ధంగా లేరు. అయినా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీ పై అసలే ఉందని చెప్పలేము, కానీ ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం, ఇప్పుడే చెప్పే విషయం కాదు. అదలా ఉంటే బీఆర్ఎస్ ఏపీలో ఎంటర్ కావడానికి ముందు చాలా హార్డిల్స్ దాట వలసి ఉంటుంది. కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసేఆర్, అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటే, ఆరాష్ట్ర ప్రజలు అనుమతిస్తారా? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసేఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును మరిచి పోతారా? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్’కు ఆ రాష్ట్ర ప్రజలు రెడ్ కార్పెట్’ వేసి స్వాగతం పలుకుతారా?  కేసీఆర్, నేను మరిపోయానై అంటే, ఏపీ ప్రజలు నమ్ముతారా? కేసేఆర్ నమ్మించగలరా? అవును, ఆయనకు రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు అన్నీ కొట్టిన పిండి, ఆయినా  ఆయన ఏపీ ప్రజలను నమ్మించగల రని అనుకున్నా, అది పొరపాటే అవుతుంది.  నిజానికి, కేసేఆర్ ఏపీలో ఎంటర్ అవ్వాలంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక సారి కాదు, వెయ్యిసార్లు ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పవలసి ఉంటుందిని అంటున్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? ఏపీ ప్రజలకు క్షమాపణలు చెపుతారా? అది జరగని పని,అ దే జరిగితే, తెలంగాణ నూకలు చెల్లినట్లే అవుతుంది. సో .. అది జరగదు. నిజానికి, ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టినట్లు, ఏపీ రాజకీయాల్లో కేసేఆర్ వేలు పెట్టలేరు, అందుకే ఆయన ఇంతవరకు ఏపీ విషయంలో గుంభనంగా, మైదానాన్ని ఊహాగానాలకు వదిలేశారని అంటున్నారు.

అక్షర క్రమంలోనే కాదు.. అప్పుల్లోనూ నంబర్ వన్ ఏపీ.. ఇది జగన్ ఘనతేగా మరి!

అక్షరక్రమంలో నే కాదు... అభివృద్ధిలోనూ అగ్రగామే. విభజిత ఆంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి గతంలో  దేశం యావత్తూ అన్న మాట. ఇప్పుడు కూడా అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలోనే నిలిచింది. అయితే అభివృద్ధిలో మాత్రం కింది నుంచి మొదటి స్థానానికి పోటీ పడుతోంది. జగన్ పాలనలో ఈ మూడేళ్లలోనూ ఏపీ సాధించిన ఘనత ఇది. అదొక్కటే కాదు.. మరో విషయంలో కూడా ఏపీ దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కనీసం పోటీలో కూడా ఉండలేని విధంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అభివృద్ధిలో అధమ స్థానానికి పడిపోయిన ఏపీ.. ఈ మూడేళ్లలో ఏ విషయంలో నంబర్ వన్ గా నిలిచిందో తెలుసా.. అప్పుల్లో. అవును దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసి అప్పుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ తీసుకోన్ని రుణాలను ఆంధ్ర ప్రదేశ్ తీసుకుంది.    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద 48,724.12 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. సెప్టెంబరు నెలాఖరు నాటికే ఏకంగా 49,263.34 కోట్ల రుణాన్ని రాష్ట్రం వినియోగించుకుంది. అంటే అంచనాలను మించి వంద శాతం కంటే ఎక్కువ రుణాలను ఇప్పటికే ఏపీ తీసేసుకుంది. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంలో చెప్పుకునే బీహార్ కంటే ఏపీ పరిస్థితి అధ్వానమని కాగ్ నివేదికే వెల్లడించింది. బీహార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  25,885.10 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రతిపాదించి,  తొలి 6 నెలల్లో తీసుకున్న రుణం 30,407.14 కోట్లు మాత్రమే.  ఈ గణాంకాలను పరిగణనలోనికి తీసుకుని చూస్తే   ప్రతిపాదిత అప్పు, వినియోగించిన అప్పు విషయంలో ఆంధ్రప్రదేశ్‌  ఇప్పటికే ఏడాది మొత్తం అంచనాలను దాటేసి రుణాలు చేసేసింది. అదే తమిళనాడు అయితే 96,613.71 కోట్ల రుణం అవసరమని ప్రతిపాదించి ఇప్పటి వరకూ 18,726.34 మాత్రమే అప్పు చేసింది.  కర్ణాటక, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాలు కూడా అంచనాల రుణపరిమితిని దాటలేదు. అయితే ఏపీ మాత్రం అంచనా రుణన్ని దాటేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలలోనే పరిమితికి మించి వంద శాతం అధికంగా అప్పులు చేసింది. ఈ అప్పులు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా  తీసుకున్న రుణాలు అదనం.   వీటికి అదనంగా ఏపీఎస్‌డీసీ, బేవరేజస్‌ కార్పొరేషన్‌ ల ద్వారా తీసుకున్న రుణాలు ఉన్నాయి. బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న 8,300 కోట్ల రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నదే. ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థికశాఖ లెక్కల ప్రకారం ఈ రుణాన్ని ప్రభుత్వ రుణంగా పరిగణించాల్సి ఉంటుంది. రాష్ట్రం ఈ కార్పొరేషన్ల లెక్కలు కాగ్‌కు తెలియజేయడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం కాగ్‌కు సమర్పించిన 49,263 కోట్ల రుణం కన్నా ఇంకా ఎక్కువే ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అందిన కాడికల్లా అప్పులు చేస్తున్నా  ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేక.. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేక సతమతమవుతోంది. మరి ఈ రుణాలన్నిటీనీ దేనికి ఖర్చు పెడుతున్నట్లు.. ఉచితాలకే వ్యయం చేస్తున్నదా అంటే ఈ మొత్తంలో నాలుగో వంతు మాత్రమే ఉచితాలకు ఏపీ సర్కార్ వ్యయం చేస్తున్నది.  అప్పుల్లో అగ్రస్థానానికి ఏపీని చేర్చిన జగన్ సర్కార్ తీసుకున్న రుణాలను ఎందుకోసం వ్యయం చేస్తున్నదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతున్నది. తెలుగుదేశం, ఇతర విపక్షాలూ సొమ్ము దొంగ ఖాతాల ద్వారా తరలిపోతున్నదని ఆరోపిస్తున్నాయి. ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ఉదంతాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. ఒక్క బేగం పేట విమానాశ్రయం నుంచే కాకుండా గన్నవరం విమానాశ్రయం, విశాఖ పాత విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలపై కూడా దర్యాప్తు చేస్తే మరిన్ని సంచలన విషయాలు బయటపడతాయని తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి అంటున్నారు. మరి ఆ దిశగా ఈడీ దృష్టి సారిస్తుందా లేదా చూడాల్సి ఉంది.

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు..తప్పిన పెను ప్రమాదం

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అయితే స్టేషన్ కు సమీపంలోనే ప్రమాదం జరగడంతో వెంటనే రైల్వే అధికారులు వాటిని అదుపులోనికి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. గూడూరు రైల్వే జంక్షన్ కు రైతు చేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూడూరు జంక్షన్ కు రైలు రాగానే అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలులోని ప్యాంట్రీ కారులో ప్రమాద వశాత్తు మంటలు చెలరేగాయని చెబుతున్నారు. రైల్వో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. ఈ ఘటనతో దాదాపు గంటకు పైగా రైలును గూడూరులోనే నిలిపివేశారు. రైల్వే అధికారులు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సెల్ ఫోన్ లకే నేరుగా టీవీ ప్రసారాలు!

బ్యాంకు, కెమెర, కేలిక్యులేటర్, సినిమా థియేటర్ ఇలా చాలా వరకూ అన్ని అవసరాలనూ సెల్ ఫోన్ తీర్చేస్తోంది. ఇప్పటికే ఓటీటీల ద్వారా చాలా వరకూ జనం బిగ్ స్క్రీన్ జోలికి వెల్లకుండా టీవీలలోనో, మొబైల్ లోనే చూసేస్తున్నారు. అలాగే దాదాపు అన్నిటెలివిజన్ షోలనూ మొబైల్ లోనే యూట్యూబ్ ద్వారా చూసేస్తున్నారు. ఇక ముందు అసలు టీవీ అవసరమే లేకుండా చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితి త్వరలో వచ్చేయ నుంచి. టీవీ ప్రోగ్రామ్స్ కూడా నేరుగా సెల్ ఫోన్ కే ప్రసారం చేసేస్తారు. ఆ విధానం త్వరలో అందుబాటులోకి వస్తోంది. ఈ విధానాన్ని తొలుత ప్రయోగాత్మకంగా ఢిల్లీలో అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రచార మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.   ఇందు కోసం బ్రాడ్ బ్యాండ్, బ్రాడ్ కాస్ట్ టెక్నాలజీలను జుగల్ బందీ చేసి మొబైల్ ఫోన్లలో టీవీ కార్యక్రమాలు నేరుగా ప్రసారమయ్యేలా చేస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.దేశంలో 120 కోట్ల మంది సెల్ ఫోన్ వినియోగస్తున్నారు. అయితే టీవీ వీక్షకుల సంఖ్య 20 కోట్ల మంది మాత్రమే. ఇప్పుడు సెల్ ఫోన్లలోనే నేరుగా టీవీ కార్యక్రమాలు వీక్షించే అవకాశం వస్తే వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

జగన్ దారెటు.. ముందస్తే దిక్కు!

ఏపీలో జగన్ ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచీ చిక్కులే ఎదురౌతున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. ఏ పని చేసినా చేదు అనుభవంగానే మిగులుతోంది. అసలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని సార్లు కోర్టుల చేత అక్షింతలు వేయించుకుని ఉండదు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయ్యింది. ఇంకా ఏడాదిన్నర గడువు ఉంది మరో సారి ప్రజా తీర్పు కోరడానికి. ప్రజలు మనవైపే ఉన్నారు.. ఈ సారి 151 కాదు.. 175కు 175 స్థానాలలోనే మనదే గెలుపు అంటూ జగన్ గంభీరంగా ప్రకనటలు గుప్పిస్తున్నా.. అదే మాట చెప్పి క్యాడర్ లో ఉత్సాహాన్నినింపాలని ప్రయత్నిస్తున్నా.. పరిస్థితులు చూస్తుంటే మాత్రం అది కేవలం మేకపోతు గాంభీర్యంతో చేస్తున్న ప్రకటనలేనని పార్టీ వర్గాలకే అర్ధమై పోతున్నది. మరో ఏడాదిన్న పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపడం అంటే మరింత ప్రజా వ్యతిరేకతను ప్రోది చేసుకోవడమేనన్న నిర్ణయానికి సీఎం జగన్ వచ్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ముందస్తు ప్రణాళికలు రచించడమే కాకుండా అమలులో పెట్టేస్తున్నారు. నియోజకవర్గ సమీక్షలంటూ హడావుడి చేస్తున్నారు. వర్క్ షాపులంటూ ఎమ్మెల్యేలలో ఈ సారి పార్టీ టికెట్ అనుమానమేనని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అన్నిటికీ మించి ఎన్నికల బదలీలకు శ్రీకారం చుట్టేసింది. ముఖ్యంగా పోలీసు శాఖలో బదలీల స్పీడ్ చూస్తుంటే ఈ విషయం క్లయర్ గా అర్ధమౌతుంది. కీలక స్థానాలలో అనుకూలమైన పోలీసు అధికారాల నియామకం దాదాపు పూర్తి చేసేసిందనే చెప్పాలి.సాధారణంగా ఇలాంటి బదలీలన్నీ ఎన్నికలకు ముందు జరుగుతాయి. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్ధం ఉండగానే చేసేస్తోంది.  షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వెళితే పరిస్థితి ఇప్పటి కంటే దారుణంగా ఉంటుందని అంచనా వేస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోతున్నది. అయితే ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చు అనే విషయంలో మాత్రం రెండు మూడు ఆప్షన్ ను పరిశీలిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ  ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లినా లేకున్నా మరో ఏడాదిలో   జరగాల్సి ఉంది. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి.. ఏపీ ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద వచ్చే ఆరు నెలలలో జగన్ సర్కార్ ఎప్పుడైనా ముందస్తు ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆలస్యం చేసే కొద్దీ  ప్రభుత్వ వ్యతిరేకత మరంత పెరగడమే కాకుండా.. ఇప్పటికే బలంగా పుంజుకున్న తెలుగుదేశం మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని కూడా జగన్ భావిస్తున్నారు. తెలుగుదేశం సభలకు వస్తున్న ప్రజాదరణ, అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజా నిరాసక్తత ఎన్నికలు జాప్యం అయ్యే కొద్దీ మరింత పెరుగుతాయని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

కమలం తీర్థం కోసం గులాబి నేతల క్యూ

ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇకపై ఒక లెక్కా అంటున్నాయి కమలం శ్రేణులు. బీజేపీపై విమర్శలు గుప్పించే జోరులో తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ చేసిన ఒక ప్రకటన తమకు కొత్త బలాన్ని తీసుకువస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ చేసిన ప్రకటన ఏమిటి? అది బీజేపీకి ఎందుకు బలం అవుతుంది? కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ సిట్టింగులెవరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, సిట్టింగులందరికీ టికెట్లు గ్యారంటీ అని ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటనే తమ నెత్తిన పాలు పోసిందంటున్నాయి కమల నాథుల. ఔను నిజంగానే సిట్టింగులకే మళ్లీ సీట్లిస్తామన్న తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విస్పష్టమైన హామీ బీజేపీకి వరంలా పరిణమించనుంది. సిట్టింగులపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే స్థాయి నేతలు ‘కారు’ దిగి కమలం గూటికి వరస కడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కించుకోవడం వల్ల టీఆర్ఎస్ పూర్తిగా నిండిపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో వర్గ పోరు నడుస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించడంతో ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత సిట్టింగ్ చేతిలో పరాజయం పాలైన వారందిరలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. కచ్చితంగా వారందరి చూపు బీజేపీ వైపే మళ్లుతుందని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికలలో విజయం మాదేనని ఎంత ధీమాగా చెబుతున్నా.. రాష్ట్రంలోని 119 స్థానాలలోనే నిలబెట్టేందుకు ఆ పార్టీకి గెలుపు ధీమ ఉన్న అభ్యర్థుల కొరత ఉందన్నది కాదనలేని వాస్తవం. అర్బన్ ప్రాంతాలలో ఒకింత ఫరవాలేదనుకున్న గ్రామీణ ప్రాంతాలలో మాత్రం బీజేపీని అభ్యర్థుల కొరత వేధిస్తోందన్నది సత్యం. ఇప్పుడు కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు అన్న ప్రకటన బీజేపీ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా వచ్చే వారికి కమల పుష్పాలతో స్వాగతం పలకడానికి చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ లో పలువురు నేతలతో ఇప్పటికీ ఈటలకు సత్సంబంధాలున్నాయి. అక్కడ అసంతృప్తితో ఉన్న నాయకులంతా ఇప్పటికే ఈటల టచ్ లోకి వచ్చారనీ అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ పార్టీ మారకుండా టీఆర్ఎస్ నే వారు అంటిపెట్టుకుని ఉండటం పార్టీ టికెట్ వస్తుందన్న ఆశేనంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా సిట్టింగులకు టికెట్ గ్యారంటీ అని చెప్పడంతో ఆశావహులలో అత్యధికులు ఇక కారులో ప్రయాణం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. అందుకే కేసీఆర్ సిట్టింగులకే టికెట్టన్న ప్రకటన బీజేపీకి నెత్తిన పాలు పోసినట్లుగా అయ్యిందంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న ఆశావహులకు టీఆర్ఎస్ ప్రకటన తీవ్ర నిరాశను మిగిల్చింది.  ఇప్పటికే టీడీపీ- కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల, తమ అవకాశాలు దెబ్బతిన్నాయని  అసంతృప్తితో రగిలిపోతున్నవారంతా.. ఇక తమ దారి తాము చూసుకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఈ పరిస్థితినే బీజేపీ రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతోంది. సిట్టింగులకే సీటు అంటూ కేసీఆర్ ఇలా ప్రకటించారో లేదో.. అలా రాష్ట్ర సీనియర్ నాయకులకు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలను గుర్తించాల్సిందిగా పార్టీ హైకమాండ్ రాష్ట్ర నాయకులను ఆదేశించిందంటున్నారు. సిట్టింగులను మారిస్తే తప్ప గెలుపు అవకాశాలు లేవంటూ పీకే చెప్పిన  దాదాపు 67 నియేజకవర్గాలలోని క్రియాశల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను గుర్తించి వారిని కమలం పార్టీలోకి ఆహ్వానించాలని కూడా హై కమాండ్ ఆదేశించినట్లు చెబుతున్నారు. అలాగే పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలి అన్న విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈటలకు చెప్పినట్లు తెలుస్తోంది.టికెట్లపై ఆశలు పెట్టుకుని, కేసీఆర్‌ ప్రకటనతో నిరాశకు గురయిన టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో మాట్లాడే బాధ్యతను మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి బీజేపీ హై కమాండ్ అప్పగించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో చేరే వారికి ఎమ్మెల్యే సీట్ల హామీ ఇవ్వడం ద్వారా, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని తిరుగులేనిశక్తిగా మార్చాలన్నదే బీజేపీ వ్యూహంగా పరిశీలకులు తాజా పరిణామాలను విశ్లేషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోని అన్ని నియోజకవర్గ నాయకులతో సత్సంబంధాలున్న ఈటల ద్వారా, వారిని బీజేపీలోకి తీసుకురావాలన్నలక్ష్యంతో బీజేపీ అడుగులు కదుపుతోందంటున్నారు.

రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీంలో కేంద్రం సవాల్

 రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు ఆరుగురినీ విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం సవాల్ చేసింది.  ఈ మేరకు దోషుల విడుదలకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేస్తూ తగిన వాదనలు వినిపించే అవకాశం లేకుండా ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనే అవుతుందని కేంద్రం తన పిటిషన్ లో పేర్కొంది. రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు- నళిని, మురుగన్, సంథాను, రాబర్డ్ పయాస్, జయకుమార్‌లకు జైలు నుంచి విముక్తి కల్పిస్తూ   సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఏ ఇతర   కేసులూ లేకుంటే దోషులందరినీ విడుదల చేయవచ్చునని పేర్కొంది.ఈ తీర్పుతో దాదాపు మూడు దశాబ్దాల  తర్వాత దోషులంతా జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.