గుజరాత్ లో పుంజుకున్న కాంగ్రెస్.. బీజేపీకి గడ్డు కాలమేనా?
posted on Nov 14, 2022 @ 12:07PM
వరుసగా ఆరు దఫాలుగా గుజరాత్ లో అధికారాన్ని నిలుపుకుంటూ వస్తున్న బీజీపీకి ఈ సారి మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురు కాక తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందంటున్నాయి. రంగంలో ఆప్ ఉండటంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యమైన పరిస్థితుల్లో తాజాగా శ్రీ ఆత్మసాక్షి (ఎస్ఎఎస్) సర్వే ఫలితాలు పట్టణ ప్రాంతాలకే ఆప్ ప్రభావం పరిమితమైందని తేల్చింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల అంటే డిసెంబర్ 1,5 తేదీలలో రెండు ధఫాలుగా జరగనున్న సంగతి విదితమే. ఈ ఎన్నికలలో బీజేపీ- కాంగ్రెస్ ల మధ్య హోరా హోరీ పోరు జరగనుందని ఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. అయితే పట్టణ ప్రాంతాలలో కాంగ్రెస్ అవకాశాలపై ఆమ్ఆద్మీ పార్టీ తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నప్పటికీ గ్రామీణప్రాంతాలలో మాత్రం కాంగ్రెస్ పై చేయి సాధించడం ఖాయమని సర్వే తేల్చింది. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ కంటే కాంగ్రెస్ కు 4.5 నుంచి 5 శాతం ఓట్లు అధికంగా వస్తాయని పేర్కొంంది.
ప్రధానంగా సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ లలో బీజేపీ అభ్యర్థులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. నిరుద్యోగ యువత, రైతులు, మత్స్య కారులు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 94 నుంచి 98 స్థానాలలో బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నప్పటికీ.. ఎన్నికల ప్రక్రియ కొనసాగే క్రమంలో రాష్ట్రంలో బీజేపీ తన ఓట్ల శాతాన్ని గణనీయంగా కోల్పోయే అవకాశాలు ప్రస్ఫుటుంగా కనిపిస్తున్నాయని సర్వే పేర్కొంది.
బీజేపీలో మరో సారి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆకాంక్షసులభ సాధ్యం అయితే కాదని సర్వే ఫలితం వెల్లడించింది. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ పార్టీల వాగ్దానాలు జనంలోకి వెళ్లిపోయాయనీ, అయితే ఇతర పార్టీలతో పోలిస్తే క్షేత్ర స్థాయిలో బీజేపీ కేడర్ కు ప్రభావమంతమైన క్యాడర్ ఉండటం ఒక్కటే ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమనిసర్వే పేర్కొంది. అయితే గ్యాస్, పెట్రోల్, డీజిల్ధరలపెరుగుదల, నిరుద్యోగం, లోపభూయిష్టంగా విద్యా సంస్థల పని తీరు, 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 8 మంది మంత్రులకు టికెట్లు నిరాకరిండం వంటి అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం బీజేపీకి దాదాపు 6.25 శాతం మందిని ఓట్లను దూరం చేసే అవకాశం ఉందంటున్నారు.
కాగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య త్రిముఖ పొరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉండగా.. గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖీ పోరే జరుగుతుందని సర్వే వివరించింది. 48 అసెంబ్లీ స్థానాలున్న సౌరాష్ట్ర ప్రాంతంలో బీజేపీ కేవలం 11 నుంచి15స్థానాలలోనే విజయం సాధించే అవకాశాలున్నాయనీ, అదే కాంగ్రెస్22నుంచి23 స్థానాలలోనూ, ఆప్ మూడు నుంచి నాలుగు స్థానాలలోనూ గెలుపు అవకాశాలున్నాయనిఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. మరో 6స్థానాలలో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నట్లు సర్వే తేల్చింది.