జగన్ కు మోడీ అంటే వణుకు.. తెలంగాణ మంత్రి హేళన
posted on Nov 15, 2022 @ 11:20AM
సాధారణంగా పక్క రాష్ట్రం ప్రభుత్వంపై మరో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయదు. కానీ ఏపీ విషయంలో అలాంటి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణ మంత్రులకు తమ అభివృద్ధిని ఘనంగా చాటుకోవడానికి ఏపీ వైఫల్యాలను ఎత్తి చూపడం ఒక అలవాటుగా మారిపోయింది. ఏపీలో జగన్ సర్కార్ నిష్క్రియాపరత్వం, పాలనా వైఫల్యాలపై వ్యాఖ్యలు చేయడంలో తెలంగాణ మంత్రులు పోటీలు పడుతున్నారు. ఎక్కడ లేని ఉత్సాహం చూపుతున్నారు.
ఇందుకు కారణం ఏపీ సర్కార్ పాలనా తీరు పట్ల వారికి ఉన్న చులకన భావనే కారణమని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ మంత్రులను విమర్శలకు దీటుగా సమాధానం చెబుదామంటే.. రోడ్ల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇక్కడ తమ ఘనతను చాటుకోవడానికి ఏమీ లేకపోవడం.. అదే సమయంలో పొరుగు రాష్ట్రం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలన్నీ వాస్తవాలు కావడంతో నోరెత్తడానికే ముందు వెనుకలాడే పరిస్థితి ఏపీ మంత్రులది పేర్కొంటున్నారు. అందుకే తెలంగాణ మంత్రులకు ఏపీ అన్నా.. ఏపీ ప్రభుత్వమన్నా చులకనగా మాట్లడడానికి ఎక్కడ లేని ఉత్సాహం చూపుతున్నారు. అయితే తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఏపీ పట్ల అత్యంత చులకన భావంతో వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఏపీ సీఎం జగన్ కు వణుకు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీకి వరుస షాకులు ఇస్తుంటే.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం మోడీకి భయపడి ఆయనక సాగిల పడుతున్నారని వ్యాఖ్యానించారు. మోడీ విశాఖలో పర్యటించినా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అదే మోడీ తెలంగాణ పర్యటనలో సింగరేణిని ప్రైవేటీకరించేది లేదన్నమాట అనాల్సిన పరిస్థితిని కేసీఆర్ తీసుకువచ్చారన్నారు.
సింగరేణి ప్రైవేటీకరణను మొదట్నుంచి వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో కేంద్రాన్ని ఎదుర్కొ న్నారని అందుకే ప్రధాని మోడీ తలొగ్గారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏపీలో అభివృద్ధి లేమి, ప్రజల కష్టాలను సర్కార్ పట్టించుకోకపోవడం, రోడ్ల దుస్థితి, పోలవరం నిర్మాణం వంటి పలు అంశాలపై తెలంగాణ మంత్రులు పలు సందర్భాలలో ఎగతాళి చేస్తూ మాట్లాడిన సంగతి విదితమే.
అయితే ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలపైనా, నెలకొన్న సమస్యలపైనా హేళన చేస్తూ మాట్లాడటం తెలంగాణ మంత్రులకు ఇదే మొదటి సారి కాదు ఏపీలో రోడ్ల దుస్థితిపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు బదులు చెప్పలేక ఏపీ మంత్రులు నానా తంటాలూ పడ్డారు. అలాగే ఇటీవల హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తే.. ఏపీలో మాత్రం పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో.. అసలు పూర్తవుతుందో లేదో అన్న పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పొరుగున ఉన్న ఏపీ అన్ని రంగాలలోనూ తిరోగమనంలో పయనిస్తుంటే.. కొత్త రాష్ట్రం తెలంగాణ మాత్రం అన్ని రంగాలలోనూ పురోగమిస్తోందని తెరాస మంత్రులు పదే పదే చెబుతున్నారు.
ఈ సారి అయితే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ నే టార్గెట్ చేస్తూ ఆయన వైఫల్యాలను ఎండగట్టారు. మోడీ అడుగులకు మడుగులొత్తుతూ రైతుల మెడకు ఉరితాళ్లు బిగించే లాంటి నిర్ణయం అయిన వ్యవసాయ మీటర్లకు మోటార్లను బిగించడానికి జగన్ సై అన్నారని వ్యాఖ్యనించారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడంలో కేసీఆర్ నిలువెత్తు ధైర్యాన్ని ప్రదర్శిస్తుంటే మాత్రం జగన్ మోడీ అంటే వణికిపోతూ ఆయన ప్రజా వ్యతిరేక విధానాలకు వత్తాసు పలుకుతున్నారన్నారు. తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకుండా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామనీ, అదే ఏపీలో పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితి జగన్ సర్కార్ మోడీకి భయపడి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించిందని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు చకచక ఏర్పాట్లు జరుగుతుంటే అక్కడి జగన్ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుంటే.. తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకోవడమే కాకుండా ప్రైవేటీకరణ ప్రశక్తే లేదని మోడీ నోటితోనే అనిపించగలిగామని ధర్మాన చెప్పుకున్నారు.
ఏపీలో ప్రభుత్వానికి కేంద్రం విధానాలను నిలదీసే దమ్ము లేదు కాబట్టే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మోడీ సర్కార్ ముందుకు వెళుతోందనీ, అదే తెలంగాణలో అయితే పార్లమెంటులో కేంద్ర బొగ్గు మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనకు భిన్నంగా సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని స్వయంగా మోడీ ప్రకటించాల్సి రావడమే.. కేంద్రం మెడలు వంచే తెరాస సర్కార్ సత్తాకు నిదర్శనమన్నారు.