పడి లేచిన కెరటం తెలంగాణ టీడీపీ !
posted on Dec 22, 2022 @ 3:48PM
తెలంగాణలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) తుడిచి పెట్టుకు పోయింది. టీడీపీ ఎమ్మెల్యేలను కారు ఎక్కించి, అసెంబ్లీలో తెలుగు దేశం వాయిస్ వినిపించకుండా చేయడంలో నిన్నటి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేటి భారత్ రాష్ట్ర సమితి (భారాస)సక్సెస్ అయింది. సంబురాలు చేసుకుంది. అలాగే, బీజేపీ నాయకులు కూడా టీడీపీ నేతలను తమవైపుకు తిప్పుకుని, వాపు చూసి బలమని సంబురాల్లో మునిగిపోయారు. అయితే అటు భారాస ఇటు బీజేపీ సంతోషం మూడునాళ్ళ ముచ్చటగా తేలిపోయింది.
నిజానికి, తెలంగాణలో టీడీపీని ప్రజలు తిరస్కరించలేదు. విభజన నేపధ్యంగా, సెంటిమెంట్ ప్రభంజనంగా జరిగిన 2014 ఎన్నికల్లోనూ తెలుగు దేశం పార్టీని తెలంగణ ప్రజలు ఆదరించారు.మిత్ర పక్షం బీజేపీతో కలిపి 20 (టీడీపీ 15, బీజేపీ 5) అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత, అధికారంలోకి వచ్చిన తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్, రాజకీయ పునరేకీకరణ పేరిట, సెంటిమెంట్ ను జోడించి తెలుగు దేశం పార్టీ శాసన సభ్యులు ఒక్కొక్కరినీ చేరదీసి చివరకు తెలుగు దేశం శాసన సభా పక్షం టీడీఎల్పీని తెరాస ఎల్పీలో విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామల నేపధ్యంలో 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తుఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలు మాత్రమే గెలిచారు, గెలిచిన ఇద్దరూ తెరాస తీర్ధం పుచ్చుకోవడంతో తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి తెర పడిందనే అభిప్రాయం ఏర్పడింది.
అయితే ఎప్పుడూ ఓటమిని అంగీకరించని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక్కసారి తెలంగాణపై దృష్టిని కేంద్రీకరించడంతో సీన్ మారిపోయింది. బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఖమ్మంలో నిర్వహించిన శంఖారవం సభ తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. పడి లేచిన కెరటంలా పసుపు పచ్చ జెండా మళ్ళీ రెపరెప లాడింది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు సాగిన చంద్రబాబు శంఖారావం యాత్రకు గ్రామగ్రామాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హరతులిచ్చారు. దీంతో తెలంగాణ పొలిటికల్ నెరేషన్ మారిపోయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంతవరకు తెలుగు దేశం పార్టీ ఉనికిని గుర్తించేందుకు కూడా ఇష్టపడని భారాస నాయకత్వంలో ఒక విధంగా వణుకు మొదలైంది. సైకిల్ జోరు పెరిగితే కారుకు బ్రేకులు తప్పవని భారాస నాయకత్వం గుర్తించింది. అదే భయం మంత్రి హరీష్ రావు స్పందనలో వినిపించింది.
ఇంతవరకు తెలుగు దేశం పార్టీని ఆంధ్రా పార్టీగా ముద్రవేసి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి పబ్బం గడుపుకున్న తెరాస ఇప్పుడు భారాసగా రూపాంతరం చెందిన నేపధ్యంలో వ్యూహాత్మకంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం జాతీయ పార్టీగా అడుగులు వేస్తున్న భారాస నేతలకు మింగుడు పడడంలేదు. మింగలేక కక్కలేక, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఈ నేపధ్యంలోనే మంత్రి హరీష్ రావు తమ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, టీడీపీ ఖమ్మం సభ సక్సెస్ ను చులకన చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో భారాస జెండా ఎగరేసేందుకే రాష్ట్రంలో నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను తోలుకు పోయిన హరీష్ రావు నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గన్నట్లు ఖమ్మం సభకు పక్క రాష్ట్రం నుంచి జనాలను తరలించారని ఆరోపించారు. భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో సహచర మంత్రులు పువ్వాడ అజయ్, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన హరీష్ రావు చంద్రబాబు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారని.. తెలంగాణ ప్రజలు వాటిని నమ్మరని అన్నారు. తెలంగాణలో తమకు బలముందని చూపించి బీజేపీతో పొత్తు కోసమే ఆయన ఈవిధంగా డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
అయితే చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు సాగించిన రోడ్ షో, ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ అయిందని అందుకే భారాస నాయకులు ఉమ్మడి రాష్ట్రం ముచ్చట్లు, పొరుగు రాష్ట్రం ముచ్చట్లు తీస్తున్నారని అంటున్నారు.
నిజానికి, మొదటి నుంచి కూడా తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో మంచి క్యాడరుంది. అందుకే నాయకులు వెళ్ళిపోయినా క్యాడర్ మాత్రం టీడీపీ పునర్జీవనాన్ని గట్టిగా కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు సభ అనూహ్యంగా సక్సెస్ అయింది. అందుకే భారాస, బీజేపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. భయం వెన్నులో వణుకు పుట్టిస్తోందని, పరిశీలకులు అంటున్నారు.