తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు టీ కప్పులో తుపానులా చప్పున చల్లారిపోతాయా?
posted on Dec 22, 2022 @ 1:33PM
ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్ సీనియర్లు, జూనియర్ల మధ్య పొరపొచ్చాలను పరిష్కరించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలుగుతారా? అన్న ప్రశ్నకు జవాబు మరి కొద్ది సేపటిలో లభించే అవకాశాలు ఉన్నాయి. దిగ్విజయ్ సింగ్ బుధవారం (డిసెంబర్ 22) ఉదయం నుంచీ పార్టీ నేతలతో వరుస ఫేస్ టు ఫేస్ చర్చిస్తున్నారు.
తొలుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో, వీహెచ్ హనుమంతరావు, దామోదర రాజనర్సింహా, రేణుకాచౌదరితో ఫేస్ టు ఫేస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీలో ఇటీవల సంభవించిన పరిణామాలపై దిగ్గీ రాజాకు రహస్య నివేదికలను అందజేసినట్లు చెబుతున్నారు.
పార్టీలో గత కొంత కాలంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను దిగ్విజయ్‌కు వివరించినట్లు దామోదర రాజ నర్సింహ తెలిపారు. ఇలా ఉండగా జగ్గారెడ్డి మాతరం గాంధీ భవన్ లో కాకుండా ముందుగానే డిగ్గీరాజాను ఆయన బస చేసిన హోటల్‌లోనే కలిసి తాను చెప్పదలచుకున్న విషయాలను చెప్పారు. పార్టీలో సంక్షోభం సమసి పోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
సీనియర్లకు గౌరవం ఇవ్వాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఆపాలనీ తాను దిగ్విజయ్ కు చెప్పినట్లు వీహెచ్ అన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమనీ, ఏకాభిప్రాయ సాధన కోసం పార్టీ హైకమాండ్ దూతగా దిగ్విజయ్ ప్రయత్నిస్తున్నారనీ మల్లు రవి అన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకుఐక్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.