కేంద్ర కేబినెట్ లోకిబీసీ నేత.. కిషన్ రెడ్డి కి చెక్ చెప్పేందుకేనా?
posted on Dec 22, 2022 @ 10:11PM
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు గంగాపురం కిషన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అవును. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజక వర్గంలో, స్థానిక కార్యక్రమాల్లో తప్పించి, రాష్ట్ర స్థాయి రాజకీయ, పార్టీ కార్యకలాపాలలో పెద్దగా ఎక్కడా కిషన్ రెడ్డి కనిపించడం లేదు. అలాగే తెలంగాణ రాష్ట్ర బీజీపీలో ఆయన వర్గంగా ముద్రపడిన ముఖ్య నాయకుల వాయిస్ కూడా ఎక్కడా అంతగా వినిపించడం లేదు.
అయితే ఇది యాదృచ్చికంగా జరుగుతోందా లేక పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నట్లుగా కేంద్ర నాయకత్వం ఉద్దేశపూర్వకంగానే కిషన్ రెడ్డి పవర్ కట్ చేసిందా? అంటే రెండవదే నిజమని అందుకే, ఆయన సైలెంటై పోయారని పార్టీ వర్గాల సమాచారంగా ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు ఎలా ఉన్నా భారాస నేతలతో ఆయన రహస్య సంబంధాలు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
మరోవంక తెలంగాణలో గెలుపు కోసం పటిష్ట వ్యూహంతో పావులు కదుపుతున్న బీజేపీ కేంద్ర నాయకత్వం బీసీ ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకుని ఆ వర్గాల ప్రజలను అక్కున చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీసి నాయకులకు పెద్ద పీట వేయలానే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజానికి, గత జులైలో హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు నుంచే బీజేపీ జాతీయ నాయకత్వం బీసీ ఓటు బ్యాంక్ టార్గెట్ గా పావులు కదుపుతోంది.
బండి సంజయ్ కి పార్టీ అధ్యక్ష బాద్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం, బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పాటుగా, ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్య సభకు పంపింది. అలాగే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటుగా, భవిష్యత్ లో ఆయనకు మరింత ‘ముఖ్య’ బాధ్యతను అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.
అదలా ఉంటే ఇప్పడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు వినిపిస్తున్న మరో టాక్ నిజమైతే తెలంగాణ నుంచి మరో బీసీ నేతకు కీలక పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త సంవత్సరం తొలి నెలలో సంక్రాంతి పండగకు కొంచెం అటూ ఇటూగా జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లేదా రాజ్య సభ ఎంపీ లక్ష్మణ్ లలో ఒకరికి బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది. నిజానికి, ఈ ఇద్దరితోనూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడివిడిగా చర్చలు జరిపారు. దీంతో ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ ఇచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదని అంటున్నారు.
అదలా ఉంటే బీజేపీ జాతీయ నాయకత్వం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారాస నాయకత్వంతో లోపాయికారీ, రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నరనే అనుమానంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యతను తగ్గించే నిర్ణయం కూడా తీసుకుందని అంటున్నారు.అందుకే ఢీ అంటే ఢీ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితపై మాటకు మాట తూటాకు తూటా అన్నట్లుగా డైరెక్ట్ గా ఎటాక్ చేస్తున్న ధర్మపురి అరవింద్ కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కలిపించే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇంత వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి కిషన్ రెడ్డి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. అయినా కేంద్ర పథకాలు,రాష్ట్రానికి వస్తున్న కేంద్ర నిధుల విషయంలో భారాస మంత్రులు, నాయకులు ప్రతి నిత్యం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో అయన విఫల మయ్యారని, అంతే కాకుండా కేసీఆర్, కేటీఆర్ తో రహస్య వ్యవహారాలు సాగిస్తున్నారనే పక్కా సమాచారంతోనే ఆయన ప్రాధాన్యతను తగ్గించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని అంటున్నారు.
అలాగే, ధర్మపురి అరవింద్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కలిపించడం ద్వారా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ చక్రం తిప్పగల సామర్ధ్యమున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) సేవలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగించుకునే ఆలోచన ఉందని పార్టీ వర్గాల సమాచారం. అలాగే కేంద్రంలో కీలక పదవులతో పాటుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా బీసీ నేత పేరును ప్రకటించే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అయితే చివరకు ఏమి జరుగుతుంది? ఎవరిని ఏ పదవి వరిస్తుంది అనేది వేచి చూడవలసిందే...రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చ అని కదా అంటారు.